పాపం శరణార్థులు

అనగా అనగా ఒక ఉడత. ఆ ఉడత అడవిలోని ఒక మర్రిచెట్టు తొర్రలో కాపురం ఉంటూ ఉండేది.
ఒకనాడు అది చెట్టు కింద కూర్చుని కాయలు తింటూ ఉండగా, సుడిగాలి వచ్చి చిన్న కొమ్మ విరిగి దాని మీద పడింది.
ఇదివరలో, అప్పుడప్పుడు దాని మీద ఆకులు రాలుతూ ఉండేవి కానీ, కొమ్మ ఎప్పుడూ విరిగి పడలేదు. అందువల్ల, ఆ కొమ్మ పడగానే ఆకాశం విరిగి తన మీద పడబోతుందని అనుకుని, గాభరాతో అక్కడి నుంచి గబగబా పరుగెత్తి పారిపోసాగింది.
అలా పారిపోతుండగా, దారిలో ఒక కోడిపెట్ట ఉడతను చూసింది. దాన్ని, ఆపి-
‘ఎక్కడికి అంత గాభరాగా పరుగెత్తుకు పోతున్నావు?’ అని అడిగింది.

‘అయ్యో! ఇంకేముంది? పరుగెత్తు.. పరుగెత్తు.. ఇప్పుడే ఆకాశం విరిగి ఒక చిన్న ముక్క నా మీద పడింది. ఇక్కడుంటే మన మీద మళ్లా పడుతుంది’ అంది ఉడత కోడిపెట్టతో కంగారుగా.
ఆ మాటలు వినేసరికి కోడిపెట్టకు కూడా కంగారు పట్టుకుంది. ఉడత వెంట తాను కూడా పరుగెత్తడం మొదలుపెట్టింది.
రెండూ అలా పోతూ ఉండగా, దారిలో కుందేలు కనబడింది.

‘అంత భయంతో పారిపోతున్నారు ఎక్కడికి? ఏమిటి సంగతి?’ అని వాటిని అడిగింది కుందేలు.

‘అయ్యో! ఇంకేముంది! పరుగెత్తు! పరుగెత్తు! ఇప్పుడిప్పుడే ఈ ఉడత మీద ఆకాశం విరిగి ఓ చిన్న ముక్క పడిందట. ఆ సంగతి అది నాతో చెబితే నేనూ భయపడి పారిపోతున్నాను. ఇక్కడ ఉంటే మన మీద మళ్లా ఆకాశం విరిగిపడుతుంది’ అంది కోడి రొప్పుతూ.
ఆ మాటలు వినేసరికి, కుందేలుకు కూడా గాభరా పుట్టి, వాళ్లతో కలిసి పరుగెత్తడం మొదలుపెట్టింది. మూడూ కలిసి అదే పరుగున పోతూ ఉన్నాయి.
పోతూ పోతూ ఉండగా దారిలో వాటికి ఒక బాతు ఎదురువచ్చింది. వాటి కంగారు చూసేసరికి దానికి కూడా గాభరా పట్టుకుంది. రెక్కలు టపటపా కొట్టుకుంటూ, తొట్టి పడవలాగా నడుస్తూ, వచ్చి, ‘ఎందుకలా పరుగెత్తుకుని పోతున్నారు? ఏమిటి మీ హడావుడి? ఏమైంది?’ అని అడిగింది.
‘అయ్యో! ఇంకేముంది! పరుగెత్తు! పరుగెత్తు! ఇప్పుడిప్పుడే ఆకాశం విరిగి ఒక చిన్న ముక్క ఈ ఉడత మీద పడిందట. ఆ సంగతి కోడితో చెబితే, కోడి నాతో చెబితే నేనూ పరుగెత్తుకు పోతున్నాను. ఇక్కడ ఉంటే మళ్లీ మన మీద ఆకాశం విరిగి పడుతుంది’ అన్నది కుందేలు బాతుతో.
అదంతా వినేసరికి బాతుకు కూడా కంగారు పట్టుకుంది. తను కూడా వాళ్లతో పరుగెత్తడం మొదలుపెట్టింది.
ఈ నాలుగూ కలిసి ఎక్కడా ఆగకుండా పారిపోతున్నాయ్‍. పోతూ ఉండగా ఒక నక్క చూసింది.

‘ఎందుకంత కంగారు? ఆగండి’ అని వాటిని ఆపింది.

జరిగిన సంగతంతా బాతు నక్కకు చెప్పింది.

నక్క పక్కున నవ్వి, ‘ఓస్‍! ఇందుకా మీ భయం! నాకేమీ భయం లేదు. ఇంక ఏది ఊడి మీదపడ్డా నాకు పరవాలేదు. హాయిగా నా ఇల్లు ఈ భూమిలో కట్టుకున్నాను. ఏదైనా విరిగిపడితే చప్పున దాంట్లోకి దూరి దాక్కుంటాను’ అని గర్వంగా చెప్పింది.
ఆ మాటలు విని, ‘నక్క బావా! దేవుడిలాగా దొరికావు. మేం శరణార్థులం. నీ శరణు కోరాం. కాస్త మాకు కూడా నీ ఇంట్లో చోటిస్తే నీకెంతో పుణ్యం ఉంటుంది’ అని ఆ నాలుగూ అతి దీనంగా అడిగాయి.

నక్క తనలో తాను పొంగిపోతూ ఉంది.. ఒకేసారి నాలుగు విందుకు దొరికాయని. కానీ, పైకి మాత్రం, ‘అబ్బే! నా ఇల్లు చాలా చిన్నది. ఇంతమందికి చోటులేదు. ఇంకెక్కడన్నా చూసుకోండి’ అని అంది.

పాపం! బాతు, కుందేలు, కోడి, ఉడత దిగులుపడ్డాయి. అయితే చేసేది ఏమీ లేక నక్కని మళ్లా మళ్లా బతిమ లాడాయి. అప్పుడు నక్క అతి కష్టం మీద ఒప్పుకున్నట్టు నటించి, ‘సరే! రండి. ఏం చేస్తాం? చూస్తూ చూస్తూ శరణార్థుల్ని ఎలా కాదనగలను? కష్టాలు ఎవరికైనా వస్తాయి’ అని వరసగా అన్నింటినీ తన సొరంగంలోకి తీసుకుపోయింది.
ఆరోజుకూ, ఈరోజుకూ ఆ శరణార్థులు బయటికి రాగా ఎవరూ చూడలేదు.

Review పాపం శరణార్థులు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top