పిల్లల ఆటపాటలు ఆట.. పాట..

పిల్లలకు పాటల ద్వారా నైతికత, మంచీచెడూ, జీవనశైలి నేర్పడం అనేది తెలుగు సంస్క•తీ సంప్రదాయాల్లో శిశుదశ నుంచే ప్రారంభం అయిపోతుంది. అందుకు నిదర్శనాలే మన ఉగ్గుపాటలు, జోలపాటలు, లాలిపాటలు..
జోలపాటలు తెలుగుతల్లి పాటలు. తెలుగు నాట ఏ తల్లీ వీటిని పాడకుండా పిల్లలను ముద్దుచేయదంటే అతిశయోక్తి కాదు. వీటిని ‘దాది పాటలు’ అని కూడా అంటారు. ఈ పాటల్లోని పదాల ద్వారానే తల్లి బిడ్డకు అన్ని విషయాలూ నేర్పుతుంది. తల్లి హృదయానికి దర్పణంగా, ముగ్ధ మనోహరంగా జోలపాటలు ఉంటాయి. ప్రధానంగా ఇవి తల్లుల రచనలు. ఆ నోటా ఈ నోటా పాడి.. పాడి అనేక మార్పుచేర్పులకు గురయ్యాయి.
తల్లి తన ముద్దుల బిడ్డను దేవతలు ఆశీర్వదించాలని వేడుకుంటూ-
శ్రీరమ్య దేహ లాలీ! మా ముద్దూ
చిన్నారి కూన లాలీ
గారాల కూచి లాలీ! మాయప్ప!
కంజాతనయన లాలీ।।
దేవేశుడా విధాతా నీకు తా
దీర్ఘాయు వొసగుగాక•।।
అని కోరుకుంటుంది. ఇది పిల్లల కోసం రాసిన పాట కాదనే అభిప్రాయం ఉన్నా.. ఇవి పిల్లల పాటలుగానే ఏళ్లుగా చలామణి అవుతున్నాయి.
తల్లికి బిడ్డను జోకొట్టి జోలపాడి నిద్రపుచ్చి తాను ఆనందించడమనేది ఒక చర్య మాత్రమే కాదు.. అవ్యక్తానందాన్నిచ్చే మధురానుభూతి. అది మాటలకు అందనిది. తెలుగు జోల పాటల్లో తాళ్లపాక అన్నమయ్య గారి ‘జో అచ్యుతానంద జో జో ముకుందా’ చాలా ప్రసిద్ధమైనది. పల్లెలలో, పట్నాలలో ప్రతి ఇంటా ఈ పాట ప్రాచుర్యం పొందింది.
ఆ బిడ్డ తల్లికి కేవలం బిడ్డ మాత్రమే కాక అచ్యుతమైన ఆనంద సంధాయకమైన ముకుందుడుగా కనిపిస్తాడు. తల్లి అలా ఊహిస్తుందన్న మాట. ఆ తల్లి ఊహలన్నీ అమృతధారలుగా రసవద్గంగలా ఆశువుగా ఆమె నోటి నుంచి పాటలుగా జాలువారడం మనం చూస్తుంటాం.
తొలుత బ్రహ్మాండంబు
తొట్టె గావించి
నాలుగు వేదాలు గొలుసు లమరించీ
అని పాడుతూ తన బిడ్డను సాక్షాత్తూ బాలకృష్ణుడిగా భావించి-
లాలనుచు పాడరమ్మా బిడ్డ
లక్ష్మీ విలాసుడమ్మా
పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ
వేదాంత వేద్యుడమ్మా
వేణునాదంబుతోను ఈ బిడ్డ
అని గొప్పగా అవ్యక్తానందంతో ఊహించుకుంటుంది ఆ అమాయకపు తల్లి అమృతవల్లి. ఈ విధంగా తెలుగు తల్లులు పాడే జోలపాటలలో మన సంస్క•తీ సంప్రదాయాలు వెల్లివిరుస్తూ ఉంటాయి.
జోలపాటల తరువాత స్థానం ఉగ్గుపాటలదే
వీటినే పాల పాటలని కూడా అంటారు. లాలి పాటలు కూడా కొంత వరకు ఈ కోవకు చెందినవే. పిల్లలకు ఉగ్గు పట్టడం అనేది తల్లికి ఓ అందమైన అనుభవం. ఉగ్గుపాటలు తెలుగుతల్లి సంప్రదాయపు పాటలు. ఉగ్గు పడుతూ తల్లి బిడ్డను ఆశీర్వదిస్తుంది. బిడ్డ పెరుగుదలను ఆశిస్తుంది.
ఊ.. ఊ.. ఉంగన్న
ఉగ్గుపాలు ఇందన్న..
అంటూ-
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుర్రాల్‍ తిన్న గుగ్గిళ్లరిగి
ఏనుగుల్‍ తిన్న వెలక్కాయ లరిగి
అబ్బాయి తాగిన పాలు ఆముదం అరిగి..
ఈ గేయంలోని భావం బిడ్డకు అర్థం కావాలని లేదు. కానీ, ఈ గేయం పాడుతూ తల్లి అవ్యక్తమైన ఆనందానుభూతిని పొందుతుంది.
రోజు రోజుకూ పాపాయిలో వచ్చే మార్పు మన సంస్క•తీ స్రవంతిలో మిళితం చేయడానికి ఈ పాల గేయాలు మధురమైన ఆలంబనాలుగా నిలుస్తాయి. ఈ గేయాలలో సాధారణంగా రెండే పాత్రలుంటాయి. అవి- తల్లి, బిడ్డ. చిట్టిపొట్టి మాటలతో తల్లి బిడ్డను అలరిస్తుంది. ఇక్కడ భాష భావానికి అతీతంగా ఉరకలు వేస్తుంది. తనకు తెలిసిందల్లా బిడ్డకు తెలియజెప్పాలనే ఒక అభిలాషతో తల్లి బిడ్డ చేయిని ఊపుతూ..
చేయి ఊచమ్మ చేయి వూచు
సంతకు పోదాం చేయి వూచు
శనగలు తిందాం చేయి వూచు
చల్లగ తిందాం చేయి వూచు
అంటుంది. ఇలా చేయడం తల్లికీ, పిల్లకూ సరదా మాత్రమే కాక ఆ పాటలోని పదాలకు అనుగుణంగా బిడ్డడి చేతులు, కాళ్లను ఊపడం బిడ్డకు మంచి వ్యాయామం కూడా. ఈ పాట పాడుతూ తల్లి చేసే కదలికలకు అనుగుణంగా శిశువు ‘ఊ.. ఊ..’ అంటూ వెనుక ముందుకు ఊగుతుంది. దీనివల్ల శిశువు శరీరానికంతటికీ కావలసినంత పరిశ్రమ కలుగుతుంది. ఊపుతో శరీరమంతటా రక్త ప్రసారం జరుగుతుంది. ఆ పాట ఇదీ..
ఊగూ ఊగూ గంగెద్దా
ఉగ్గూ పాలే గంగెద్దా
సోలీ ఊగే గంగెద్దా
సోలెడు పాలే గంగెద్దా
తాళీ ఊగే గంగెద్దా
తవ్వెడు పాలే గంగెద్దా
మారీ ఊగే గంగెద్దా
మానెడు పాలే గంగెద్దా
ఆగీ ఊగే గంగెద్దా
అడ్డెడు పాలే గంగెద్దా..
ఇలా సాగిపోతుందీ పాట. బిడ్డలో ఉత్సాహం రావడానికి తల్లి ఈ పాట పాడుతూ గిలిగింతలు పెడుతుంది.

Review పిల్లల ఆటపాటలు ఆట.. పాట...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top