మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. ఆయా పురాణ పాత్రల్లో ప్రముఖమైన పాత్రలు మహర్షులవి కూడా ఉన్నాయి. మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు. మన నైతికతకు, మనం నడిచే దారి చూసే మార్గదర్శకత్వానికి వారే దిక్సూచులు. అటువంటి మహర్షుల చరిత్ర పఠనం పరమ పావనం.
వ్యాఘ్రపాదుడు మన భారతీయ మహర్షులలో ఒకరు. ఈయనది విచిత్రమైన రూపం. ఈయనను వ్యాఘ్రపాద లేదా వ్యాఘ్రపాదుడు అనే పేర్లతోనూ పిలుస్తారు. వ్యాఘ్రము అనగా పులి. లేదా మృగము. మృగాలు నిత్యం సంచరిస్తూనే ఉంటాయి. మృగము వలే చరిస్తుండే వాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. అందుకు తగినట్టుగా ఆయన పాదాలు పులి పాదాల వలే ఉంటాయి. పరమశివుడే ఒక సందర్భంలో ఈయనకు ఈ విధంగా పులి పాదాలను ప్రదానం చేశాడని అంటారు.
వ్యాఘ్రపాదుడు కృత యుగానికి చెందిన మహర్షి. ఈయన ధర్మ ప్రవచన దక్షుడు. వేద వేదాంగ విదుడు. ఆయనకున్న పులి పాదాల కారణంగా జంతువుల యెడల భయంకరంగా సంచరించేవాడు. అందుకే ఆయనకు వ్యాఘ్ర పాదుడు అనే పేరు వచ్చింది.
పురాణాలలోనూ ఈ మహర్షి గురించి ఘనమైన ప్రస్తావనలే ఉన్నాయి. లభిస్తున్న ఆధా రాలను బట్టి ఈయన భారతదేశంలోని తమిళ నాడుకు చెందిన వారు. అక్కడి చిదంబరం ఆలయ ప్రాంగణంలో గల నటరాజ స్వామి (శివుడు)కి వ్యాఘ్రపాదుడు పరమ భక్తుడు. ఆయనకు నిత్యం భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరించేవాడు. ఈ క్రమంలో నటరాజును అర్చించేందుకు.. తేనె టీగలు తాకని పూలను సేకరిస్తుండే వాడు ఈ మహర్షి. అయితే, పుష్పాలు కోసి, సేకరించే సమ యంలో వ్యాఘ్రపాదుడు ముళ్లు మరియు కఠిన మైన బండరాళ్ల కారణంగా గాయాలకు గురయ్యే వాడు. ఈ మహర్షి తన పట్ల చూపిస్తున్న భక్తి శ్రద్ధలకు, తనను పూజించడం కోసం సేకరిస్తున్న పూల కోసం పడుతున్న కష్టాలకు చలించిన శివుడు.. ఈ మహర్షికి పులి పాదాలను ప్రదానం చేశాడు. దీంతో పువ్వులు కోసేటప్పుడు పాదాలు కఠినమైన పరిస్థితులకు గురయ్యే బాధ తప్పింది. శివుని వర ప్రభావంతో పులి పాదాలను పొందిన కారణంగా అప్పటి నుంచి వ్యాఘ్రపాదుడు అనే పేరు స్థిరపడింది.
తమిళనాడులోని చిదంబరం వెళ్లినపుడు, అక్కడి నటరాజ స్వామి పక్కన సర్ప పాదాలతో, పులిపాదాలతో నిల్చుని ఉన్న ఇద్దరు మహర్షులు నటరాజ స్వామిని ప్రార్థిస్తున్న చిత్రాలను చూడ వచ్చు. అందులో పాము పాదాలతో ఉన్న మహ ర్షిని పతంజలి మహర్షి అనీ, పులి పాదాలతో ఉన్న మహర్షిని వ్యాఘ్రపాదుడని అంటారు.
వ్యాఘ్రపాదుడు సగం పులి శరీరం, మిగతా సగం మానవ శరీరం కలిగి ఉంటాడు.
వ్యాఘ్రపాదుడు ఒక ముని కన్యను వివాహం చేసుకున్నాడు. అనంతరం గృహస్థ ధర్మాలను ఆచ రించాడు. ఈయనకు ఇద్దరు కుమారులని అంటారు. పెద్ద కుమారుని పేరు ఉపమన్యుడు. రెండో కుమారుని పేరు ధౌమ్యుడు. వీరిద్దరూ కూడా తల్లిదండ్రుల ఆశీర్వాద బలంతో మహా యోగిగా, మహర్షిగా భారతీయ రుషి పరంపర చరిత్రలో నిలిచిపోయారు. ఉపమన్యుడు శివుని యొక్క కటాక్షం పొంది మహా జ్ఞాని, మహా యోగి అయ్యాడు. బాల్యంలో ఒకనాడు ఉపమన్యుడు తల్లిని పాలు అడుగుతాడు. ఆమె లేదని చెప్పి చింతిస్తుంది. మనకన్నీ ఇచ్చే వాడు శివుడేనని, అతనినే అడగాలని తల్లి అంటుంది. దీంతో ఉపమన్యుడు శివధ్యానం చేసి ఏకంగా పాల సముద్రాన్నే పొందుతానని ప్రతిన చేస్తాడు. వెయ్యేళ్లు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. పట్టుదలలో అంతటి మేటి ఉపమన్యుడు. ఉప మన్యుని కథ మహా భారతంలోని అనుశాసనిక పర్వంలో ఉంటుంది. అయితే, ఇది తిక్కన భారతంలో లేదు.
అలాగే, రెండవ కుమారుడు ధౌమ్యుడు మహర్షి అయ్యాడు. అనంతర కాలంలో పాండవు లకు పురోహితుడిగానూ వ్యవహరించాడు.
విశ్వనాథాష్టకాన్ని వ్యాఘ్రపాదుడే రచించాడనే వాదన కూడా ఉంది. ఒకనాడు ఈయన కాశీ విశ్వేశ్వరుడిని దర్శించి, అనన్య నిరుపమానమైన భక్తితో ఈ విశ్వనాథాష్టకాన్ని స్తుతించాడని అంటారు. ‘‘గంగా తరంగ కమనీయ జటా కలాపం..’’ అంటూ 8 పాదాలతో సాగే అష్టకం చివరిలో ‘‘వ్యాఘ్రోక్త మష్టక మిదం పఠతే మనుష్య:..’ అని ముగుస్తుంది. కాశీ విశ్వేశ్వరుడు వ్యాఘ్రపాదుని భక్తిప్రపత్తులతకు సంతోషించి, అతనికి సాక్ష్యాత్కరించి కోరిన వరాలను ఇచ్చాడు.
Review పులి పాదాల వ్యాఘ్రపాదుడు.