మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యాస్పరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.
పరుగెత్తి పాలుతాగేకన్నా నిలబడి నీళ్లుతాగుట మిన్న’
అనవసరపు ఆరాటం, తాపత్రయం పనికి రావని చెప్పేందుకు ఈ సామెతను ప్రయో గిస్తుంటారు. కొందరికి కొన్నింటిని దక్కించు కోవాలని ఒకటే ఆరాటం. దాన్ని దక్కించు కునేందుకు ఎంతకైనా పాకులాడతారు. దానివల్ల కలిగే ఉపయోగం ఏమిటి?, ప్రయోజనం ఎంత? అనేది ఆలోచించరు. ఎలాగైనా సరే, అనుకున్నది సొంతం చేసుకోవాలనుకునే స్వార్థం ఒక్కటే వీరి విషయంలో పని చేస్తుంది. ఒకవేళ అనుకున్నది దక్కించుకుంటే సరే.. లేదంటే ఓడిపోయినట్టు, దెబ్బతిన్నట్టు భావిస్తారు. కుంగిపోతారు. నిజానికి వస్తువులు, ఇతర అంశాల పట్ల అంత ఉబలాటం పనికి రాదని చెప్పేందుకే ఈ సామెతను వినియోగిస్తారు. ఉదాహరణకు మనం ధరించే దుస్తులపై ఒక్కోసారి ఆయా వ్యాపార సంస్థలు భారీ డిస్కౌంట్ను ప్రకటిస్తుంటాయి. ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకే విక్రయాలు ఉంటాయని ప్రచారం చేస్తాయి. సగానికి సగం రేటు తగ్గించారనే భావనతో కొందరు ఉదయమే వెళ్లి బారులు దీరుతుంటారు. తొక్కిసలాట, తోపులాట.. కొట్లాట.. ఎలాగో దుస్తులు దక్కించుకుంటారు. నిజానికి వాటి నాణ్యత కానీ, ధర కానీ పోలిస్తే ఎన్నో లొసుగులు బయటపడతాయి. ఇంత చేసీ మనకు మిగిలిందేమీ లేదనే భావనతో ఒక్కసారిగా నిరాశపడతారు. అవతలి వారు మోసం చేశారని, ఆలోచించకుండా తామే తాపత్రయపడ్డామని, తగిన శాస్తి జరిగిందని తమలో తామే కుమిలిపోతారు. ఇటువంటి ఆరాటాన్నే పరుగెత్తి పాలు తాగడం.. అనే అర్థంలో వాడతారు.
‘పెద్దలమాట పెన్నిధిమూట’
మన తెలుగు సామెతల్లో ‘విలువైన సంపద’ అనదగిన సామెత ఇది. మన ఇంటింటా ఏదో సమయంలో, సందర్భంలో పలికే సామెత ఇది. పెద్దలు ఎప్పుడూ పిల్లలకు మంచినే చెబుతారు. మంచినే ఆచరించాలని, మంచిగా ఉండాలని, మంచిని పెంచాలని మరెన్నో సుద్దులు నేర్పుతారు. పెద్దలు చెప్పే మాటలు ఎప్పుడూ విలువైనవే. వాటిని ఆచరించడం వల్ల మేలే తప్ప కీడు జరగదు. పైగా మనం క్షేమంగా, భద్రంగా కూడా ఉండగలుగుతాము. పెద్దలు ఇటువంటి మంచి మాటలు ఊరకనే చెప్పరు. వాళ్లు తమ జీవితానుభవాన్ని కాచి వడపోసి.. ఇటువంటి సుద్దులు పిల్లలకు నేర్పుతుంటారు. తమ జీవితసారాన్ని రంగరించి చెబుతారు కాబట్టి వాటిలో ఎల్లప్పుడూ మంచి మాత్రమే ఉంటుంది. పిల్లల క్షేమాన్ని కోరే గుణమే అందులో ప్రధానమై ఉంటుంది. ఇదే సామెతను ‘పెద్దల మాట.. చద్ది మూట’ అనే ప్రయోగంతో కూడా వాడుతుంటారు. చద్ది మూట చాలా పోషక విలువ గలది. ఉదయాన్నే పరగడుపున చద్దన్నం తింటే గనుక మళ్లీ సాయంత్రం దాకా ఆకలి అనేదే ఉండదు. పెద్దల మాట కూడా అంతే నైతిక విలువలనే పోషకాల విలువ గలది. అది ఆచరిస్తే ఆదర్శ జీవనానికి హేతువు అవుతుంది. కాబట్టే పెద్దల మాట పెన్నిధి మూట.
Review పెద్దల మాట విందాం !.