ప్రగల్బాల రుక్మి

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో ఉంటుంది.
భీష్మక మహారాజు కుమారుడు రుక్మి మహా రాజు. ఈయన మహా పరాక్రమవంతుడు. పైగా దేవతలకు రాజు అయిన ఇంద్రుడికి ప్రాణ స్నేహితుడు. రుక్మిణీదేవికి స్వయానా అన్న. గంధమాదన పర్వతం మీద ఉన్న ద్రుముడనే కింపురుషుడి అనుగ్రహం వలన ‘విజయం’ అనే దివ్య ధనుస్సును రుక్మి సంపాదించాడు.లోకంలో శ్రేష్టమైన దివ్య ధనుస్సులు మూడే ఉన్నాయట. వాటిలో ఒకటి విష్ణుమూర్తి చేతిలో ఉంది. దాని పేరు ‘సారంగం’ అనే ధనువు. శ్రీకృష్ణుడు దానిని ధరించాడు. మరొక ధనుస్సు పేరు ‘గాండీవం. ఖాండవ వన దహన సందర్భంలో అగ్నిదేవుడు అర్జునుడికి ఈ ధనుస్సు ఇచ్చాడు. ఇక, మూడవది ‘విజయం’. ద్రుముడిని ఆరాధించి రుక్మి విజయ నామక చాపాన్ని అతని నుంచి సంపాదించాడు.
రుక్మిణీదేవికి వివాహం చేసుకోవడానికి శ్రీకృష్ణుడు ఆమెను రథం మీద తీసుకుని పోతుంటే రుక్మి బలగర్వితుడై డాంబికాలు పలుకుతూ కృష్ణుడిని ఎదిరించి నిందారోపణలు చేశాడు. తీరా కృష్ణుడు రథం నిలిపి బలాబలాలు చూసుకుందాం రమ్మని పిలిస్తే ఎదుర్కోలేక అవమానాల పాలయ్యాడు.
కురు పాండవ సంగ్రామం జరగబోతోందని తెలిసి ఒక అక్షౌహిణి సేనతో పాండవుల వద్దకు వెళ్లాడు రుక్మి. పాండవులు అతనిని సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. అతిథి సత్కారాలు అందుకున్న అనంతరం రుక్మి అందరూ వింటూ ఉండగా, పార్థుడి (అర్జునుడు)ని పిలిచి-
‘అర్జునా! రాబోయే సంగ్రామం గురించి బాధపడుతున్నావేమో! నేను నీకు అండగా
ఉంటాను. నా అండదండల వల్ల నీకు విజయం తథ్యం. నన్ను మించిన పరాక్రమవంతుడు ఈ లోకంలో లేడు. పైగా నా దగ్గర తేజోమయమైన ధనుస్సు ఉంది. దానితో ద్రోణ, భీష్మ, కృపా చార్యాది కౌరవులను క్షణాల్లో మట్టి కరిపిస్తాను. ఈ రాజ్యం నీ వశం చేస్తాను. సరేనా?’ అన్నాడు.
అర్జునుడు అతని ‘పరాక్రమం’ గురించి ఎరింగి తనలో తానే నవ్వి ఊరుకున్నాడు. అంతట రుక్మిని ఉద్దేశించి..
‘మాకు సాయం చేస్తానని ముందుకు వచ్చి నందుకు రుక్మి మహారాజుకు ధన్యవాదాలు. అయితే, కృష్ణుడు మాకు ఎల్లవేళలా సాయంగా ఉంటాడన్న సంగతి మాత్రం మరిచిపోకు. ఆయన సాయం ఉంటే ఇంకెవరి సాయం, అండదండలు మాకు అక్కర్లేదు. పైగా నా చేతిలో గాండీవం ఉంది. సాక్షాత్తూ ఇంద్రుడే వజ్రా యుధం ధరించి వచ్చినప్పటికీ నేను భయపడను’ అన్నాడు అర్జునుడు రుక్మితో.
అర్జునుడి మాటలు రుక్మికి కోపం తెప్పించాయి. వెంటనే తన సైన్యాన్ని తీసుకుని సుయోధనుడి దగ్గరకు వెళ్లాడు.
‘రాబోయే కురు పాండవ యుద్ధంలో నేను మీ పక్షం ఉంటాను. మీ విజయానికి తోడ్పడుతాను. పాండవుల పొగరు అణుద్దాం. నా చాపంతో వాళ్లందరినీ యమపురికి చేరుస్తాను. నా ప్రతాపం చూపిస్తాను’ అన్నాడు.
అయితే, సుయోధనుడు (దుర్యోధనుడు) లోకంలోనే అత్యంత ‘అభిమానం’ కలవాడు కదా!. పైగా అహంకారి. మొదట అతను పాండవులను కలిసిన విషయం తెలిసి మరింత అభిమానానికి గురయ్యాడు. దీంతో ‘నీ సాయం మాకు అవసరం లేదు’ అని రుక్మిని తిప్పి పంపాడు.రుక్మి సిగ్గుపడ్డాడు. దుర్యోధనుడు కూడా తిరస్కరించాక వచ్చిన దారినే తన నగరానికి తిరిగి వెళ్లాడు.
తన శక్తియుక్తుల్ని అధికంగా ఊహించు కోవడం, ఎదుటి వారి తెలివితేటల్ని, శక్తినీ తక్కువగా అంచనా వేయడం ఎవరికీ మంచిది కాదు. రుక్మి అటువంటి వాడే. అటువంటి లక్షణాలు ఉన్న వారు రుక్మి కథను తప్పక చదవాలి. రుక్మి మహారాజుకు ఇటువంటి ‘అతి’ మొదటి నుంచీ అలవాటుగా ఉండేదట. అందుకే ఆయన అనేకసార్లు పరాభవాలు పొందాడు

Review ప్రగల్బాల రుక్మి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top