ఒక ఊరిలో ఒక భక్తుడు ఉన్నాడు. ప్రత్యేకించి అతనికి దేవుడిపై ఎలాంటి ప్రేమాభిమానాలు, భక్తిశ్రద్ధలు లేవు. కానీ సాటి మనిషిని ప్రేమించడం మాత్రం అతనికి తెలుసు. ఒకసారి అతను గాఢనిద్రలో ఉండగా, అక స్మాత్తుగా మెలకువ వచ్చేసింది. కళ్లు తెరిచి చూస్తే అద్బుతమైన కాంతివలయం కనిపించింది. దానిని ఛేదించుకుని చూస్తే ఒక పరమ పురుషుడు కనిపించాడు. పుస్తకంలో ఏదో రాస్తూ కనిపించాడాయన.
భక్తుడు ఆయన వద్దకు వెళ్లి-
‘స్వామీ! మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఏమిటి రాస్తున్నారు?’ అని అడిగాడు.
‘నేను దేవదూతను.. లోకంలో భగవంతుడిని ప్రేమించే వారిని, ఆయన ప్రేమకు పాత్రులైన వారి పేర్లను ఇంటింటికీ తిరిగి రాస్తున్నాను’ అని బదులిచ్చాడు.
భక్తుడికి ఆసక్తి కలిగింది. ‘నా పేరు ఎలా ఉందా?’ అని అడగాలని అనిపించింది. కానీ భావ్యం కాదని ఆగిపోయాడు. తనలో తాను- ‘అయినా నేనేం భగవంతుడిని ప్రేమించడం లేదు కదా! నా పేరెందుకు ఉంటుంది’ అనుకున్నాడు.
తెల్లారింది. రాత్రి జరిగిన విషయం అతనికి గుర్తు లేదు. యథావిధిగా తన దినచర్యలో పడిపోయాడు. రెండ్రోజుల తరువాత మళ్లీ భక్తుడి గదిలో దేవదూత ప్రత్యక్షమయ్యాడు. భక్తుడితో ఆయన ఇలా అన్నాడు-
‘భగవంతుడి ప్రేమకు పాత్రులైన వారి పేర్ల సేకరణ పూర్తయ్యింది. ఇదిగో జాబితా. అందులో నీ పేరే మొదట ఉంది’.భక్తుడు ఆశ్చర్యపోయాడు. తొలుత నమ్మలేదు. పుస్తకం తెరిచి చూశాడు. నిజమే! తన పేరే తొలుత ఉంది. అతనికి ఆనందం కంటే ఆశ్చర్యమే ఎక్కువ కలిగింది. మనసులో ఎన్నెన్నో ఆలోచనలు. మనసాగక దేవదూతతో ఇలా అన్నాడు.‘స్వామీ! నా తల్లిదండ్రులు భక్తులే కానీ, నేనెప్పుడూ భగవంతుడికి దణ్ణం పెట్టలేదు. దేవుడిపై నాలో ఏ కోశానా సేవా నిరతి లేదు. నియమనిష్టలతో ఏనాడూ పూజలు చేయలేదు. మరి నేనెలా భగవంతుడి ప్రేమకు పాత్రుడిని అవుతాను?’.
‘నువ్వు పైవేవీ చేయకున్నా.. సాటి మనుషుల్ని ప్రేమించావు. వారి కష్టసుఖాలు పంచుకున్నావు. ఎదుటి వారికి సాయం చేయడానికి కలిగిన ఏ ఒక్క అవకాశాన్నీ నువ్వు వదులుకోలేదు. నిజానికి నీ సేవలు భగవంతునికి అవసరం లేదు. సాటి మనుషులకే కావాలి. భగవంతుడికి సేవలు చేయడానికి మేమంతా ఉన్నాం కదా! సర్వజన హితమే లక్ష్యంగా, ఉపకారం ఆశించని నీ సేవ దేవుని అనుగ్రహానికి పాత్రమైంది. నువ్వు విశ్వమానవుడివి. నీది విశ్వ ప్రేమ. దానితో నువ్వు విశ్వవిభుడిని గెలిచావు. నీ దృష్టిలో మనుషులంతా సమానం. అదే దేవుడిని ప్రేమించడం అంటే’ అని దేవదూత వివరించి అదృశ్యమయ్యాడు.
భగవంతుని అనుగ్రహం ఇలాగే ఉంటుంది. తనను ప్రేమించకున్నా పర్వాలేదు. సాటి మనుషుల్ని ప్రేమించే వారిని మాత్రం భగవంతుడు తనకు తానుగా ప్రేమిస్తాడు.
Review ప్రేమిస్తే పోయేదేముంది?.