భారతీయ సాహిత్యంలో ప్రేమదేవతగా పరివేష్టితురాలైన పాత్ర.. రతీదేవి. ఆమె ప్రజాపతి పుత్రిక అని కొందరు, దక్షుని కుమార్తె అని ఇంకొందరు అంటారు.
మన్మథుడు లోకాలన్నిటినీ మోహింప చేయగల శక్తి ఉన్న వాడు. అటువంటి మన్మ థుడినే మోహింప చేయగల శక్తి ఉన్న అతిలోక సౌందర్యవతి రతీదేవి. ఈ ఇద్దరికీ వివాహం ఎప్పుడు ఎలా అయ్యిందనే విషయాన్ని ‘కామ వివాహం’ అనే పేరున శివ పురాణం రుద్రసంహితలోని మూడు, నాలుగు అధ్యాయాలు వివరిస్తున్నాయి.
మన్మథుడు బ్రహ్మ మనసు నుంచి జన్మించిన తరువాత ఆ బ్రహ్మదేవుడు తనతో సహా అందరినీ మోహింప చేయ గల శక్తిని మన్మథుడికి అనుగ్రహించాడు. ఆ శక్తిని తానొకసారి పరీక్షించి చూసుకోవాలని అనుకున్నాడు మన్మథుడు. వెంటనే అక్కడే ఉన్న బ్రహ్మ మానసపుత్రిక అయిన సంధ్య, మరీచి, దక్షుడు లాంటి వారితో సహా బ్రహ్మదేవుడి మీద కూడా తన పూలబాణాలను ప్రయోగించాడు. అందరి మనసులు అల్లకల్లోల మయ్యాయి. ఎంతో కఠినమైన ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వారంతా తమకు కామ వికారం కలగడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అంతలో అక్కడ శంభుడు ప్రత్యక్షమైఆ వికారానికి కారణం మన్మథుడని తెలుసుకుని కోపాన్ని వహిం చాడు. శివుడి కోపాన్ని తట్టుకోలేక మన్మ థుడు పక్కకు తొలిగాడు. ఇంతలో బ్రహ్మ కూడా వాస్తవ స్థితికి వచ్చి తనను సైతం వికారానికి గురిచేసిన మన్మథుడు శివుడి మూడో కంటి అగ్ని జ్వాలలకు అంతమవు తాడని శపించాడు. ఆ తరువాత శివుడు, బ్రహ్మవంటి వారంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నులయ్యారు. అనంతరం శివుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని గ్రహించిన మన్మథుడు మెల్లగా బ్రహ్మ దగ్గరకు వచ్చి, తనకిచ్చిన శాపాన్ని ఉపసంహరించు కోవాలని అర్థించాడు. బ్రహ్మ మన్మథుడికి ధైర్యం చెబుతూ దైవ ప్రేరణతోనే అలా జరి గిందని అంటాడు. శివుడి కోపాగ్నికి నువ్వు దహనం కావడంలో కుమార జననం అనే దివ్య సంఘటన ఇమిడి ఉంది. శివుడి మూడో నేత్రానికి దహనమైనా ఆ తర్వాత మళ్లీ నీకు మేలే జరుగుతుందని అని బ్రహ్మ.. మన్మ థుడిని అనునయిస్తాడు.
ఇది జరిగిన మరికొన్నాళ్లకు దక్ష ప్రజాపతి మన్మథుడి దగ్గరకు వచ్చి తన స్వేదం నుంచి పుట్టిన తన కుమార్తెను వివాహమాడాలని కోరాడు. ఆమె పేరు రతీదేవి అని, సర్వలోక సౌందర్యవతి అని చెప్పి రతికి, మన్మథుడికి దక్ష ప్రజాపతి వివాహం చేయిస్తాడు. మన్మథుడు రతి అనే శోభాయుక్తమైన తన భార్యను చూసి అనురాగం నిండిన మనసు కలవాడయ్యాడు. ఆ క్షణంలో మన్మథుడి బాణాలు మన్మథుడినే కొట్టాయి. దీంతో మదనుడు సహితం మోహానికి గురయ్యాడు.
బంగారు వన్నె శరీరంతో, లేడికళ్ల వంటి ఓరచూపులు చూస్తూ ఉన్న రతీదేవి తన భర్తకెంతో ఉత్సాహాన్ని కలిగించింది. కందర్పుడు ఆ మోహ విభ్రాంతిలో ఆమె కనుబొమలను చూసి, ఇదేమిటి బ్రహ్మ నా ధనుస్సును లాక్కుని ఆమె కనుబొమ్మల స్థానంలో ఉంచాడా అనుకున్నాడు. వేగవంతమైన ఆమె చూపులను చూసి తన బాణాల కన్నా ఆమె చూపులే వేగవంతంగా ఉన్నాయని ఆశ్చర్య పోయాడు. ఆమె పూర్ణిమ నాటి చంద్రుని కళను పోలి ఉంది. చిన్న మచ్చతో శోభించే ఆమె ముఖాన్ని చూసి ఏది చంద్రబింబమో, ఏది రతీదేవి ముఖమో తేల్చుకోలేని స్థితిలో పడ్డాడు. ఇలా ఆ రతీదేవి సర్వావయవ సౌందర్యం మన్మథుడిని సైతం నిశ్చేష్టుడిని చేసింది. మన్మథుడు రతీదేవితో వివాహానంతరం అలా ఆనంద సాగరంలో మునిగి తేలసాగాడు. బ్రహ్మ ఇచ్చిన శాపం వంటివి ఏవీ అతనికి గుర్తు లేకుండా పోయాయి. రతి కూడా భర్తకు తగిన ఇల్లాలుగా నడుచుకుంటూ ఆనందాన్ని అనుభవించసాగింది. దక్ష ప్రజాపతి తన కుమార్తె, అల్లుడు ఆనందంగా ఉండటంతో ఆయన కూడా ఆనందించసాగాడు. ఒక యోగి ఆత్మవిద్యను తన హృదయంలో ధరించిన విధంగా రతీదేవిని మన్మథుడు తన హృదయంలో నిలుపుకుని ప్రకాశిస్తూ పరవశించసాగాడు. ఇలా రతీ మన్మథుల వివాహ ఘట్టాన్ని గురించి శివ పురాణం వివరించి చెబుతోంది.
రతీదేవి ఆయుధం ఖడ్గం. ఆమె వాహనం చిలుక. ఆమెను దేవీ రూపాల్లో ఒకటిగా ఎంచి పూజించడం కూడా ఉంది.
Review ప్రేమ దేవత … రతీదేవి.