బంగారం పంట

ఒకరోజు తైమూర్‍ పొరుగూరికి వెళ్తున్నాడు. దారిలో ఊరి బయట నసీరుద్దీన్‍ నేలను తవ్వుతూ కనిపించాడు. తైమూర్‍ అతడిని పిలిచి ‘‘అక్కడేం చేస్తున్నావ్‍?’’ అని అడిగాడు.
నసీరుద్దీన్‍ గొప్ప చమత్కారి. మాటకారి. అందరినీ ఆటపట్టిస్తూ
ఉంటాడు. తైమూర్‍ని కూడా ఆట పట్టించాలి అనుకున్నాడు.
‘‘పాదుషా గారూ! నేను బంగారు నాణేలను పొలంలో నాటుతున్నాను. ఇవి నావి కూడా కావు. అప్పు తెచ్చి నాటుతున్నాను’’ అన్నాడు.
‘‘ఎందుకలా చేస్తున్నావ్‍!’’ అని అడిగాడు తైమూర్‍.
‘‘నేను నాటే ఈ బంగారు నాణేలు నాలుగైదు రోజుల్లో మొలుస్తాయి. బంగారం పంట పండుతుంది. వచ్చి బంగారు పంటను కోసుకొని పోతాను’’ అన్నాడు నసీరుద్దీన్‍. తైమూర్‍ ఆశ్చర్యపోయాడు. ఎట్లాగైన ఈ ఉపాయంతో ఎక్కువ బంగారం సంపాదించాలి అనుకున్నాడు.
‘‘ఈ కొద్ది బంగారం నాటితే ఎంత బంగారం వస్తుంది? రాజ మందిరానికి వెళ్లి నీకు కావాల్సినన్ని బంగారు నాణేలు తెచ్చుకో. పండిన బంగారు పంటలో నాకూ వాటా ఇవ్వు. మనిద్దరం కలిసి నాటామను కుందాం!’’ అని పొరుగూరికి వెళ్లాడు తైమూర్‍. నసీరుద్దీన్‍ వెంటనే రాజ భవనానికి వెళ్లి పెద్దసంచి నిండా బంగారు నాణేలు తెచ్చి దాన్నంతా పేదలకు పంచి పెట్టాడు. వారం రోజుల తరువాత ఖాళీ చేతులతో పాదుషా దగ్గరికి వెళ్లాడు. ‘‘బంగారం ఏది?’’ అన్నాడు తైమూర్‍.
‘‘ప్రభూ! ఘోరం జరిగిపోయింది. ఇన్ని రోజులూ వానలు కురవలేదు. బంగారం చేనంతా ఎండిపోయింది. పంటంతా నేలపాలైంది. నాటింది కూడా దక్కలేదు’’ అన్నాడు నసీరుద్దీన్‍.
‘‘బంగారం ఎండిపోయిందా ? ఇదెక్కడన్నా జరుగుతుందా?’’ అని గద్దించాడు తైమూర్‍. ‘‘ప్రభూ! తమరికి ఈ విషయం విచిత్రంగా కనిపిస్తుంది కదా ! బంగారం ఎండిపోయిందని నమ్మనివారు పంట పండుతుందని ఎలా నమ్మారు?’’ అన్నాడు నసీరుద్దీన్‍. తైమూర్‍కి ఏం చేయాలో దిక్కుతోచలేదు. నసీరుద్దీన్‍ తన గాడిద మీద ఎక్కి దర్జాగా వెళ్లిపోయాడు.

Review బంగారం పంట.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top