
ఒకప్పుడు బోధిసత్త్వుడు (బుద్ధుడు) బంగారు లేడిగా జన్మించి, ఒక మర్రిచెట్టు కింద నివసిస్తుండే వాడు. దాదాపు అయిదు వందల లేళ్ల మందకు అతడు పెద్దగా ఉండేవాడు. అక్కడకు దగ్గరలోనే ఉన్న రావిచెట్టు కింద ఉంటూ అది కూడా అయిదు వందల లేళ్ల మందకు నాయకుడిగా ఉండేది. కాశీరాజుకు వేట వ్యసనంగా ఉండేది. తనతో వేటకు రావాలంటూ ప్రజలకు నిర్బంధించే వాడు. ఇది భరించలేక ఒకసారి కొందరు ముఖ్యులు అడవిలోకి వెళ్లి ఈ రెండు బంగారు లేళ్లతో పాటు మరికొన్ని లేళ్లను తోటలోకి తరుముకుని పోయి అక్కడ బంధించారు. రాజు ఆ బంగారు లేళ్లను చూసి ముచ్చటపడి, వాటిని చంపకూడదని తన పరివారాన్ని ఆజ్ఞాపించాడు. మిగిలిన వాటిని యథేచ్ఛగా వేటాడేవాడు. బాణాల దెబ్బలకు ఎన్నో లేళ్లు ప్రతిరోజూ చనిపోతుండేవి.
దీనిని చూసి మర్రిచెట్టు కింద ఉండే బంగారు లేడి అనే బోధిసత్త్వుడు రావిచెట్టు కింద ఉండే బంగారులేడితో ఇలా అంది- ‘రోజూ ఒక లేడి అయినా చచ్చితీరాలి కాబట్టి వంతులవారీగా మనం వధశాలకు వెళ్లేలా నిర్ణయించుకుందాం’. దీంతో లేళ్లకు దినదినగండం తప్పి కొంత ఊరట లభించింది. ఏర్పాటు ప్రకారం ఓ రోజు చూలు లేడి వంతు వచ్చింది.
‘కొద్దిరోజులు పోతే నాకు బిడ్డ పుడుతుంది. అప్పటి వరకు వదిలి పెట్టండి’ అని తన యజమాని అయిన రావిచెట్టును లేడిని కోరింది. దానికి అది అంగీకరించలేదు. దీంతో అది మర్రిచెట్టు లేడితో మొరపెట్టుకుంది. చలించిన మర్రిచెట్టు లేడి.. తానే ఆ రోజు వంతు కింద వధశాలకు వెళ్లి కొయ్య కింద తలపెట్టి నిల్చుంది. ఇది తెలిసి రాజు అక్కడకు వచ్చాడు.
‘ఓ లేళ్ల రాజా! నీలాంటి కరుణామూర్తిని మానవజాతిలో కూడా నేను చూడలేదు. నిన్నూ, ఆ చూలు లేడిని వదిలేస్తున్నాను’ అన్నాడు. ‘మా ఇద్దరినీ వదిలేస్తే చాలా? మిగతా వాటి మాటేమిటి?’ అని మర్రిచెట్టు లేడి అడిగింది. దీంతో కాశీ రాజు మిగతా అన్ని లేళ్లను వదిలేశాడు.
Review బంగారు లేడి.