దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం వర్ణనాతీతం. ఏటా బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపై ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తాడు. తనను ఆశ్రయించిన భక్తకోటికి వరదహస్తుడై అభయమిస్తాడు. రథాన్ని అధిరోహించిన కేశవుడిని దర్శించుకుంటే మళ్లీ జన్మలెత్తాల్సిన అవసరమే లేదంటారు. ప్రతి మనిషీ జన్మజన్మల సాధనలతో అందుకోవాల్సిన పారమార్థికం.. రథంపై ఊరేగే స్వామి వారిని చూస్తేనే కలుగుతుందని నమ్ముతారు. ముక్తి ఫలాన్ని భక్తులకు అందించే ఉత్సవమే బ్రహ్మోత్సవం. వేంకటాచల సానువుల్లో కొలువైన శ్రీనివాస ప్రభువు వివిధ వాహనసేవలు గైకొంటూ ముందుకు సాగుతున్న వేళ భక్తులంతా గోవింద నామ స్మరణ చేస్తూ తన్మయులవుతారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన రథోత్సవం నాడు ప్రతి భక్తుడూ స్వామి వారి రథాన్ని లాగడానికి అర్హుడే. భక్తులు, అధికారులు, అర్చకులు.. అంతా కలిసి రథం మోకులు లాగుతూ ముందుకు సాగుతారు. ‘సర్వమానవాళీ సమానమే’ అనే సమతా సిద్ధాంతాన్ని ఈ బ్రహ్మోత్సవం ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ వేడుక భక్తులకు కన్నుల పండువ చేస్తుంది. శ్రీవారి వాహన సేవలు భక్తులకు పుణ్యాన్ని అందించడమే కాదు, జీవన మార్గాన్ని తీర్చిదిద్దుకునే జ్ఞానాన్నీ బోధిస్తాయి. సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం..
తిరుమల శ్రీవేంకటా చలపతి ఉత్సవ ప్రియుడే కాదు.. ఆబాలగోపాలాన్నీ ఉద్ధరించే ఉత్సవకరుడు కూడా! శ్రీనివాసుడి నిత్యోత్సవం సకల జనులకు నేత్రపర్వం. శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవం సర్వ లోకాలకు దివ్యోత్సవం. నిత్యసేవల్లో ఆ స్వామి ఆనంద నిలయాన ఆరాధనలు అందుకుంటే, బ్రహ్మోత్సవాల వేళ పురవీధుల్లో భక్తజనుల నీరాజనాలు అందుకుంటాడు. నిత్యపూజలను తిలకించి, తరించే భాగ్యం లేని భక్తుల మనోరథాన్ని ఆ బ్రహ్మాండ నాయకుడు మహా రథమెక్కి బ్రహ్మోత్సవ రూపంలో తీరుస్తాడు. మనుషులు చేసుకునే ఏ వేడుకలైనా ఆ మహితాత్ముడి వైభవం ముందు దిగదుడుపేనని ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తేటతెల్లం చేస్తాయి. ఆ విశ్వరూపుడి విభవం ఎదుట మనమెంత స్వల్పాతి స్వల్పమో విస్పష్టం చేస్తాయి. ఆ మహోత్సవాల్లో అన్ని వాహనాలపై అంత వైభవంగా ఊరేగుతున్న మహామూర్తిని చూశాక మన అహంకారం తొలగిపోవాలి. అభిజాత్యం తరిగిపోవాలి. అదే ఆ బ్రహ్మోత్సవాల దర్శన పరమార్థం.
శేషాద్రి నిలయుడికి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే విశిష్ట పూజలు, ఉపచారాల ఫలితంగా ప్రకృతిలో, జీవుల్లో ఆధ్యాత్మిక శక్తి ప్రేరేపితమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేగాక ఈ ఉత్సవాలు మానవులను లౌకికపరమైన దు:ఖం నుంచి విముక్తులను చేస్తాయని, పారమార్థిక ఉన్నతిని ప్రసాదిస్తాయని అపారమైన నమ్మకం. ఈ బ్రహ్మోత్సవాన్నే ‘మహోత్సవం’, ‘తిరునాళ్’, ‘కల్యాణోత్సవం’ అని పిలుచుకోవడం ఆనవాయితీ. తిరుమల కొండపై జనసంచారం లేని రోజుల్లో బ్రహ్మోత్సవాలను పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో నిర్వహించే వారు. తిరుమలలో ధ్వజారోహణం మాత్రం నిర్వహించి, మిగతా వాహన సేవలన్నీ తిరుచానూరులోనే జరిపేవారు.
బహ్మాండ నాయకుని ‘వాహన’ వైభవం
‘‘ఓ బ్రహ్మా! నాకు బ్రహ్మాండమైన ఉత్సవం ఏర్పాటు చేయించు. ధ్వజారోహణంతో మొదలై అనేక వాహనాల ఊరేగింపులతో కొనసాగి రథోత్సవంతో ముగియాలి’’ అని సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరుడే బ్రహ్మదేవుడితో చెప్పాడట. అలా భగవంతుడి ఆజ్ఞతో బ్రహ్మ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలయ్యాయి. మరి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ వాహనసేవల వైభవాన్ని స్మరించి తరిద్దామా!.
మొదట అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు శ్రీకారం చుట్టుకుంటాయి. ఆపై ధ్వజారోహణం.. గరుడ ధ్వజపటం ఎగురవేసి అన్ని లోకాల్లో ఉన్న అందరు దేవుళ్లనూ ఉత్సవాలకు ఆహ్వానించడమే ధ్వజారోహణం. ఆ రోజు నుంచే వాహనసేవలు మొదలవుతాయి. ఆదిశేషుని సేవతో ఇవి ప్రారంభమవుతాయి.
చిన్న శేషవాహన గోవిందా! చిన్మయరూపా గోవిందా!!
పెద్ద శేషవాహన గోవిందా!
పాహి మురారే గోవిందా!!
శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న కొండ పేరే శేషాద్రి. అంటే స్వామి నివాసార్థం ఆదిశేషుడు తానే స్వయంగా కొండరూపం దాల్చాడన్న మాట. ప్రపంచమంతా దేవుడికి శేషభూతం. అంటే దాసభూతమే. అలా శేషవృత్తి చేసే వారిలో ఆదిశేషుడు అగ్రగణ్యుడు. శేషుడు భూధరుడు. శేషాద్రి భూధరమే. నిత్యం ఆ భగవంతునికే ఆసనంగా, శయనంగా ఉండే భాగ్యం పొందిన శేషుడు ఎంతో పుణ్యాత్ముడు, ధన్యుడు. కైంకర్యాభిలాష ఆయనలో మెండు. అందుకే శేషుడనే పేరు ఆయనకు సార్థకమైంది. అందువల్లనే కాబోలు బ్రహ్మోత్సవాల్లో శ్రీవారు శేషవాహనంపై రెండు రోజులు.. అంటే మొదటి రోజు రాత్రి, రెండో రోజు ఉదయమూ తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తుల్ని కటాక్షిస్తారు.
హంస వాహన గోవిందా!
హింస నివారక !!
హంస శబ్దం అతి స్వచ్ఛం. శుద్ధ పరమసత్త్వ రూపం. అందుకే వేదాత్మకుడైన బ్రహ్మ హంసను తన వాహనంగా ఎంచుకున్నాడు. క్షీర నీర వివేకానికి ప్రసిద్ధి పొందింది హంస. అట్టి హంసను వాహనంగా చేసుకుని ఎంతో వైభవంగా ఊరేగుతారు శ్రీవారు.
సింహ వాహన గోవిందా! నరసింహరూపా గోవిందా!!
‘మృగాల్లో నేను సింహాన్ని’ అని శ్రీకృష్ణుని గీతావచనం. సింహం గాంభీర్య పరాక్రమాలకు ప్రతీక. అడవికి రారాజైన సింహమంటే భగవంతునికి ఎంతో ఇష్టం. అందుకేనేమో ఆయన నరసింహావతారం దాల్చారు. సింహ వాహనంపై ఊరేగే శ్రీవారి శోభ వర్ణనాతీతం. సింహ వాహనంపై ఉన్న స్వామిని దర్శించిన భక్తుల ఆనందం అనంతం.
శ్రీనివాసుడి వేడుకల ప్రస్తావన వరాహ, భవిష్యోత్తర, బ్రహ్మాండ, మార్కండేయ, వామన తదితర పురాణాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం తిరుమలలో ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు భవిష్యోత్తర పురాణంలో వర్ణించిన పద్ధతిలో, వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయి. తొలుత సాక్షాత్తూ బ్రహ్మదేవుడే తిరుమలకు వేంచేసి, ఆ పురాణ పురుషుడికి ఈ ఉత్సవాలు జరిపాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీనివాసుడి ఆజ్ఞ మేరకు చతుర్ముఖ బ్రహ్మ చతుర్వేదాలకు ప్రతీకగా ఉత్సవ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, సర్వాధిప శ్రీనివాసమూర్తి, లేఖక శ్రీనివాసమూర్తి అనే నాలుగు విధాలైన వేంకటేశ్వరుడి అర్చామూర్తులను ఆనంద నిలయంలో నెలకొల్పాడని చెబుతారు.
క్రీస్తు శకం 1561 నుంచి శ్రీవారి వేడుకల్లో వాహనసేవలను చేర్చారని అంటారు. చూసేవారికి నేత్రపర్వంగా, పుణ్యమూర్తులకు ధన్యభాగ్యంగా ఆ ధరణీ నాయకుడు సతీసమేతంగా బ్రహ్మోత్సవాల్లో దర్శనమిస్తాడు. శ్రీవారి దర్శనభాగ్యంతో పులకించిన భక్తజనం ‘గోవింద గోవిందయని కొలువవో మనసా..’ అంటూ స్వామి వారిని కీర్తిస్తూ, ఆ వైభవాన్ని కనులారా వీక్షిస్తూ తరిస్తారు. ‘ఈ జన్మకు ఈ భాగ్యము చాలదా..’ అంటూ తన్మయత్వం పొందుతారు.
శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోక వైకుంఠమైన వెంకటాద్రిపై కన్యా మాసం (ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రంతో కూడిన దివ్యమైన ముహూర్తంలో అర్చారూపంలో స్వయం వ్యక్తమూర్తిగా శ్రీవేంకటేశ్వరునిగా వెలిశారు. శ్రీవారు ఉత్సవ ప్రియుడు. అలంకార ప్రియుడు. నైవేద్య ప్రియుడు. అత్యంత భక్తి ప్రియుడు. కోరిన వారి కొంగు బంగారమై కోర్కెలు తీర్చే ఆ శ్రీవేంకటేశ్వరుని వైభవం న భూతో న భవిష్యతి.
వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి
కల్పవృక్ష వాహన గోవిందా!
కామితఫలదా గోవిందా!!
కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చే శక్తి గల మహా మహిమాన్విత వృక్షం. భగవంతుడు కూడా భక్తుల కోరికలు తీరుస్తాడు. కాబట్టి భగవంతుడు భక్తుల పాలిట కల్పవృక్షం. ఒక కల్పవృక్షం ఒడిలో మరో కల్పవృక్షం కూర్చున్నట్టుండే ఈ కల్పవృక్ష వాహనం ఒక అపురూప దృశ్యం. భగవంతుడి కామితఫలదాయతని తెలపడమే ఈ వాహన సేవ అంతరార్థం.
సర్వభూపాల వాహన గోవిందా!
సర్వాంతర్యామీ గోవిందా!!
భూపాలకులందరూ భగవంతుని వాహన సేవకులే. విష్ణ్వంశ కలిగిన వారే పృథ్వీ పాలకులవుతారని ఆర్యోక్తి. నారాయణుడు అంశ.. భూపాలురందరూ అంశభూతాలు. అంశ యొక్క అనుగ్రహం వల్లనే వారు ఏలుబడి సాగిస్తున్నారు. కాబట్టి భూపాలురందరూ కృతజ్ఞతాసూచకంగా ఒక వాహనరూపం పొంది స్వామి వారిని ఊరేగించి జన్మ సాఫల్యం పొందుతారు.
మోహినీ అవతార గోవిందా!
ఇహపరదాయకా గోవిందా!!
శ్రీవేంకటాచలపతికి ఈ వేషధారణ బహు భావగర్భితం. మహానందసంధాయకం. ఈ వేషంలో పరమాత్మను చూడ్డానికి వేయికన్నులైనా చాలవు. అమృతాన్ని దుష్టులైన రాక్షసులకు చెందనివ్వకుండా దేవతలకు మాత్రమే పంచడం కోసం విష్ణువు మాయా మోహినీరూపం దాల్చి లోకాలకు మహోపకారం చేశాడు. ఈ ఐతిహ్యానికి చిహ్నంగా శ్రీవారు ఈ ఉత్సవాల్లో ఒకనాడు ఈ మోహినీరూపం ధరించి విహరిస్తారు. ఈ రూపాన్ని చూసిన వారి జన్మ ధన్యం.
గరుడ వాహన గోవిందా!
కరుణాసాగరా గోవిందా!!
అన్ని వాహనాల్లోనూ గరుడ వాహనసేవకు చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. మూర్తీభవించిన వేదస్వరూపుడు గరుడుడు. విష్ణుమూర్తికి ధ్వజాధిదేవత గరుడుడే. అటువంటి గరుడుడు స్వామికి మిక్కిలి అనుంగ సేవకుడయ్యాడు. కనుకనే ఈ ఉత్సవాల్లో గరుడ వాహనసేవకు అంతటి ప్రాముఖ్యత కలిగింది. మొత్తం వాహనసేవలను చూడలేకపోయినా గరుడ వాహనసేవను తిలకిస్తే చాలు.
జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆ ప్రకారం బ్రహ్మ శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడట. తొలిసారిగా ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి.
బ్రహ్మోత్సవ విశేషాలు..
ల దసరా నవరాత్రులు, కన్యా మాసం (ఆశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణా నక్షత్రం శుభ సమయాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం.
ల సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, నవరాత్రుల (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం కూడా సంప్రదాయంగా వస్తోంది.
ల వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయడం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహా రథోత్సవం, శ్రవణా నక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తారు.
ల నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా అలంకారప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదివ రోజు మహా రథానికి (చెక్క రథం) బదులు వెండిరథాన్ని ఊరేగించే వారు. 1996 నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై స్వామి ఊరేగుతున్నారు. 2021లో దాని స్థానంలో మరో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది.
హనుమద్వాహన గోవిందా!
అనాథరక్షకా గోవిందా!!
త్రేతాయుగంలో తనను ఎంతో భక్తితో సేవించిన హనుమంతుడిని తన సేవకుడిగా ఎంచుకున్నాడు నారాయణ స్వరూపమై శ్రీవేంకటేశ్వరుడు. స్వామి శ్రీరామ రూపంతో ధనుర్ధారియై హనుమద్వాహనాన్ని అధిరోహించి విహరించే శోభ అపూర్వం. అది కాంచిన వారి జన్మ ధన్యం.
స్వర్ణరథాధిష్ఠాన గోవిందా!
ముక్తిప్రదాయకా గోవిందా!!
అదేరోజు సాయంకాలం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి బంగారు తేరులో సింహాసనాన్ని అధిష్టించి, ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఘనంగా ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించి భక్తులు పునీతులవుతారు.
గజవాహన గోవిందా!
నిజభక్త రక్షకా గోవిందా!!
ఏనుగు సామవేదం నుంచి పుట్టింది కనుక దీనిని ‘సామజము’ అంటారు. సాగరమథనం సందర్భంలో శ్రీమహాలక్ష్మితో పాటు సాగరం నుంచి ఉద్భవించింది కనుక ఐశ్వర్యానికి, ఠీవికి, గాంభీర్యానికి, ఘనతకు ప్రతీక అయింది ఏనుగు. నారాయణుడిని ఆర్తితో స్మరించి మొసలి పట్టు నుంచి విముక్తి పొందింది. అదే పురాణాలలో ‘గజేంద్ర మోక్ష’ ఘట్టంగా ప్రతీతి. పద్మావతీ శ్రీనివాసుల ప్రణయానికి కూడా నాంది పలికింది ఏనుగేనట!. ఇలా ఏనుగు భగవంతునితో అవినాభావ సంబంధం కలిగి ఉంది. కాబట్టి ఈ వాహనంపై స్వామి ఊరేగి భక్తులను కటాక్షిస్తాడు.
సూర్యప్రభ వాహన గోవిందా!
స్వయంప్రకాశా గోవిందా!!
సూర్యుడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణ స్వరూపుడు. అందుకే ‘సూర్యనారాయణా’ అని కీర్తనలందుకుంటున్నాడు. అటువంటి సూర్యుడిని వాహనంగా స్వీకరించి సూర్యుని ఒడిలో కూర్చున్నట్టుగా సూర్యప్రభ వాహనంపై ఆసీనుడై విహరించే స్వామి వారి చిద్విలాస రూపాన్ని వీక్షించిన వారి జన్మయే ధన్యం. ఈ వాహన సేవ సమయంలో శ్రీవారు కోటిసూర్య సమప్రభలతో జగజ్జేయమానంగా వెలుగొందుతారు. ఆ వైభవాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు.
అంకురార్పణతో శ్రీకారం
వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో మొదలవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామి వారి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మత్సం గ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికల (కుండలు)లో శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలైన నవధాన్యాలను పోసి ఆ మట్టితో వాటిని మొలకెత్తించే పనిచేస్తారు. ఈ కార్యక్రమానికి సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రుడిలా పాలికలలో నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీళ్లు పోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనిని ‘అంకురార్పణ’ అంటారు.
ధ్వజారోహణం
న భూతో న భవిష్యత్ అనేలా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతా మూర్తులను ఆహ్వానిస్తారు. స్వామి వాహనం గరుడుడు కాబట్టి ఒక కొత్త వస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీనినే ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు పటాన్ని కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభంపై ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండ మీదే ఉంటూ ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
ఇలా తొమ్మిది రోజుల పాటు తనకు ప్రియమైన భక్తుల వాహనాలపై మాడవీధుల్లో ఊరేగే స్వామి వారు తొమ్మిదో నాడు చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. దీనినే ధ్వజావరోహణం అంటారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.
చందప్రభ వాహన గోవిందా!
శ్రీముద్రాంకిత గోవిందా!!
సాగరమథనం సమయంలో శ్రీమహాలక్ష్మితో పాటు ఉద్భవించి లక్ష్మీ సోదరుడయ్యాడు చంద్రుడు. చంద్రుడు అమృత కిరణుడు. మనసుకు అధిదేవత. చల్లని వెన్నెలలను ప్రసరింపచేసి జీవులకు ఆహ్లాదకరమైన ఆరోగ్యాన్ని అందిస్తాడు. లక్ష్మీ సహోదరుడైన చంద్రుడిని వాహనంగా స్వీకరించి ఆ చందప్రభ మధ్యన ఆసీనుడై విహరించే
స్వామి వారి చిద్విలాస రూపాన్ని వర్ణించలేము.
రథోత్సవదేవా గోవిందా!
ఆద్యంతరహితా గోవిందా!!
ఐశ్వర్యానికి, ఆధిపత్యానికి, వైభవానికి, ఘనతకు ప్రతీక రథం. రథంతోనే ఉత్సవానికి పూర్ణత్వం వస్తుంది. ఈ రథోత్సవంలో స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై దర్శనమిస్తాడు. దీనిని దర్శించిన వారికి అష్టైశ్వర్యాలు, విజయాలూ సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
అశ్వవాహన గోవిందా!
విశ్వంభరాశ్రీ గోవిందా!!
సేవా చతురంగ బలాల్లో గుర్రం ప్రముఖమైనది. అశ్వం కూడా సాగర మథనం సమయంలో ఉద్భవించింది. అదే ఉచ్చైశ్శ్రవం. వీరత్వానికి, విజయానికి ప్రతీక ఇది. కాబట్టి ఇది స్వామికి వాహనమయ్యే భాగ్యం పొందింది. అశ్వారూఢుడైన అచ్యుతుడిని కళ్లారా గాంచి ఆనందించడం భక్తుల భాగ్యం.
శ్రీ చక్రధారి గోవిందా!
శత్రుభంజకా గోవిందా!!
‘బ్రహ్మోత్సవాలు’ అనే ఈ మహాయజ్ఞానంతరం స్వామికి జరిగే అవభృథ స్నానమే చక్రస్నానం. బ్రహ్మోత్సవాల చివరి రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి, శ్రీవారి చక్రానికి స్వామి పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. అప్పుడు భక్తులందరూ స్వామివారి చక్రంతో పాటు పుష్కరిణిలో మునిగి పునీతులవుతారు. పాపవిమోచనం పొందుతారు. ఆ తర్వాత ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.





































































































































































































































































































































































Review బహ్మ కడిగిన పాదము.