మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. ఆయా పాత్రల పేర్లు, వాటి ఔచిత్యం, వాటి లక్షణం క్లుప్తంగా తెలియ చెప్పే ప్రయ•
మత్స్య యంత్రం
ద్రౌపదీ స్వయంవరంలో పైన ఒక మత్స్య యంత్రాన్ని నిర్మించి దాని కింద ఉన్న నీటిలో ఆ యంత్ర ప్రతిబింబాన్ని చూస్తూ ఆ యంత్రాన్ని ఛేదించగలిగిన వాడే తన కుమార్తెకు తగిన వరుడని ద్రుపద మహారాజు ప్రకటిస్తాడు. దానిని అర్జునుడు ఛేదించి ద్రౌపదిని పరిణయమాడుతాడు. ఇక, ద్రౌపది విషయానికి వస్తే ఈమెది.. మహాభారతంలో అత్యంత కీలకమైన మహిళా పాత్ర. ఈమె ద్రుపదుని కుమార్తె. పాంచాల రాజు. ద్రుష్టద్యుమ్నుడు, శిఖండి ద్రౌపది సోదరులు. ద్రౌపది మహా పతివ్రత. మత్స్య యంత్రాన్ని ఛేదించిన అనంతరం పాండవులు ద్రౌపదితో కలిసి ఆశీర్వాదం పొందేందుకు తల్లి వద్దకు వెళ్తారు. ‘అమ్మా.. నీకో కానుక తెచ్చాం.. వచ్చి చూడు’ అంటారు. పాండవుల తల్లి అయిన కుంతీదేవి బయటకు రాకుండానే- ‘ఏం తెచ్చినా.. ఐదుగురూ సమానంగా పంచుకోవాల’ని సూచిస్తుంది. దీంతో ద్రౌపది ఆ విధంగా పాండవులకు భార్య అయ్యింది. ఆమె పంచ పాండవుల పత్ని కాబట్టి పాంచాలి అని కూడా అన్నారు. ప్రతివింధ్య, శతానిక, సుతసోమ, శ్రుతసేన, శ్రుతకర్మ ఈమె సంతానం. ఇక, మత్స్య యంత్రం విషయానికి వస్తే.. కింద నీళ్లు ఒక పాత్రలో ఉంచుతారు. దానికి నిలువుగా పైన చేప ఉంటుంది. ఈ నీళ్లలోకి చేప కదలికలను చూస్తూ బాణాన్ని గురిపెట్టి పైనున్న చేపను కొట్టాలి. విలువిద్యలో మేటిగాడైన అర్జునుడు ఈ మత్స్యయంత్రాన్ని ఆవలీలగా ఛేదిస్తాడు. ఈ ఘట్టం తరువాతే కౌరవులు, పాండవుల మధ్య వైరం మరింతగా పెరిగిపోతుంది. స్త్రీ ఔన్నత్యా నికి ప్రతీక ద్రౌపది.
మన్మథుడు
విష్ణువుకు మానసపుత్రుడు. రతీదేవి ఈయన భార్య. పుష్పధన్యుడు. మంచి రూపం గలవాడు. కామదేవుడిగానూ పిలుస్తారు. ఆకర్షణ, ప్రేమ, శృంగార భావాలకు ఈయన అధిదేవత. రామచిలుక ఈయన వాహనం. చెరుకుగడల బాణం.. పూల విల్లంబులు ఈయన ఆయుధాలు. మన రుగ్వేద, అథర్వణ వేదాల్లో మన్మథుడి గురించి ప్రస్తావన ఉంటుంది. అలాగే, విష్ణు, శివ, కృష్ణ కథలు, లీలల్లో కూడా మన్మథుడి ప్రస్తావన ఉంటుంది. ఒకసారి శివుడు తీవ్ర తపోదీక్షలో ఉంటే మన్మథుడు పూల బాణాలు విసురుతాడు. తన తపోదీక్షకు భంగం కలిగించిన మన్మథుడిని శివుడు తన త్రినేత్రంతో భగ్నం చేస్తాడు. అందమైన నవ యువకుల్ని మన్మథుడితో పోలుస్తుండటం కద్దు. మన్మథుడు ఆకుపచ్చని శరీరఛాయతో ఎంతో అందమైన వాడు. ఇతని చేతిలోని బాణం చెరుకుగడలతో తయారైనది. ఆ బాణానికి కట్టిన దారం తేనెటీగలతో అల్లి ఉంటుంది. బాణాలు ఐదు రకాల పుష్పాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అశోక వృక్ష పుష్పాలు, తెలుపు-నీలం తామర పువ్వులు, మల్లెపూలు, మామిడిపూలు.. ఇవే ఆయన బాణానికి శరాలు. ఈయన వేషధారణ, అలంకరణను బట్టి వసంతానికి రాజుగా కూడా మన్మథుడిని పరిగణిస్తారు. ఇక, మన్మథుడికి భారతీయ పండుగలు, పర్వాలలోనూ పెద్దపీట లభిస్తోంది. ముఖ్యంగా హోలీ పర్వం వసంతానికి సంబంధించినదే. ఈనాడు వసంతాగమనానికి స్వాగతం పలుకుతూ యువత, పిల్లలు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తారు. ఇది మన్మథ సంబంధ పర్వమే. మొత్తం భారతదేశంలోనే ఇది అత్యంత ఆనందోత్సాహాలతో నిర్వహించుకునే పర్వమిది. అలాగే, దీపావళి, దసరా ఇతర సందర్భాల్లో కామ దహనం నిర్వహిస్తుంటారు. ఉత్తర భారత దేశంలో ఈ ఆచారం ఎక్కువగా వ్యవహారికంలో ఉంది. ఈ పర్వంలోని కాముడికి, కామదేవుడిగా పిలువబడే మన్మథుడికి ఏదైనా సంబంధం ఉందో లేదా తెలియాల్సి ఉంది.
Review మత్స్యయంత్రం… మన్మధ తంత్రం.