మర్యాద రామన్న

మర్యాద రామన్న.. ఈ పేరు విన్నారా? ఎటువంటి చిక్కు సమస్య అయినా చిటికెలో ఇట్టే విప్పి చూపే తెలివితేటలు గలవాడు మర్యాద రామన్న. మరి పంచతంత్రం కథల గురించి తెలుసా? పిల్లలూ పెద్దలూ అందరూ నీతి నిజాయితీ, నైతిక ప్రవర్తన, సూక్ష్మబుద్ధి కలిగి
ఉండాలని చాటే కథలివి. ఇంకా కాశీమజిలీ కథలు, నసీరుద్దీన్‍ కథలు.. పిల్లల కోసం ఎన్నో కథలు చెప్పడానికి ‘తెలుగు పత్రిక’ సిద్ధంగా ఉంది. ప్రతి మాసం ఒక్కో నీతి కథ.. పిల్లలూ సిద్ధమేనా?

ఒకరోజు రామన్న మేకల మందను తోలు కెళుతున్నాడు. దారిలో పూటకూళ్ళ అవ్వ ఏడుస్తూ కన్పించింది. ‘‘అవ్వా! ఎందుకు ఏడుస్తున్నావ’’ని రామన్న అడిగాడు. నాయనా! నా ఇంటికి నలుగురు బాటసారులు భోజనానికి వచ్చారు.
వారు ఒక డబ్బు సంచి దాయమని ఇచ్చారు. మేము నలుగురు కలిసి వస్తేనే ఈ సంచి ఇవ్వమన్నారు. ఏ ఒక్కడు వచ్చి డబ్బు సంచి అడిగినా ఇవ్వవద్దని షరతుపెట్టి వెళ్ళారు.
మర్నాడు ఆ నలుగురు వచ్చారు. అవ్వ ఇంటి ముందున్న దేవాలయం అరుగుపై కూర్చున్నారు.
వారు నాలుగోవాడ్ని అవ్వ దగ్గరడబ్బు సంచి తెమ్మనమని పంపారు. వాడు అవ్వని డబ్బు సంచి ఇవ్వమని అడిగాడు. అవ్వకు వారు చెప్పిన షరతు గుర్తుకొచ్చింది. మిగిలిన ముగ్గురూ ఏరని అడిగింది.
అదిగో! గుడి అరుగుపై కూర్చున్నారని మిగిలిన ముగ్గురిని చూపించాడు. ఇవ్వనా సంచి అని అవ్వ ఆ ముగ్గురుని కేకేసి అడిగింది. వారు సంచి ఇచ్చి పంపమని అవ్వతో చెప్పారు.
అవ్వవాడికి సంచి ఇచ్చింది. నాల్గోవాడు సంచి తీసుకున్నాడు. దొడ్డి దోవన పారిపోయాడు.
గుడి అరుగు మీద కూర్చున్న ముగ్గురూ నాల్గవ వాడి కోసం ఎదురు చూసి ఎంతకీ రాకపోవడంతో అనుమానపడ్డారు. నాల్గవ వాడి కోసం వెతికారు. వాడు కనబడలేదు. వాడు చేసిన మోసంగ్రహించారు.
మిగిలిన ముగ్గురూ అవ్వ దగ్గరకు వచ్చారు ‘‘మేం నలుగురం వస్తేనే కదా సంచి ఇమ్మన్నాం! ఒక్కడికే సంచి ఎందుకిచ్చావ్‍? మా డబ్బు ఇవ్వు అంటూ పట్టు పట్టారు. అవ్వను న్యాయాధికారి దగ్గరకు తీసుకొని వెళ్ళారు.
న్యాయాధికారి ముగ్గురు చెప్పిందీ విన్నారు. అవ్వ తప్పు చేసిందని న్యాయాధికారి భావించాడు. అవ్వను ఆ ముగ్గురికీ డబ్బు చెల్లించమని తీర్పు చెప్పాడు. ఈ సంగతంతా రామన్నకు అవ్వ చెప్పింది.
రామన్న అవ్వను రాజు గారి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. రాజా! మీ న్యాయాధికారి తప్పుడు తీర్పు ఇచ్చాడని రామన్న అన్నాడు. విషయం వివరించాడు.
రాజుగారు రామన్నను ఎగాదిగా చూశాడు. నువ్వు సరైన తీర్పు ఇస్తావా ? అని అడిగాడు. ఇస్తానని రామన్న నిర్భయంగా చెప్పాడు.
రాజు న్యాయాధిపతిని పిలిపించాడు. ఈ విషయం ఊరంతా గుప్పుమంది. పల్లెటూరు యువకుడైన రామన్న రాజుగారి సభలో చెప్పే తీర్పు వినాలని ప్రజలంతా సభకు వచ్చారు.
రామన్న ముగ్గురినీ పిలిపించి విచారణ ప్రారంభించాడు. అవ్వను జరిగిన సంగతి చెప్పమన్నాడు. అవ్వ ఆ సభలో విషయం చెప్పింది. షరతులు కూడా చెప్పింది.
రామన్న ముగ్గురితో ఇలా అన్నాడు. నలుగురు వచ్చి అడిగినప్పుడే అవ్వను డబ్బు సంచీ ఇవ్వమన్నారు కదా! అవునన్నారు ఆ ముగ్గురు.
మరి నాల్గవవాడు లేకుండా ముగ్గురే డబ్బు అడుగుతున్నారేంటి? నాల్గవవాణ్ణి తీసుకురండి. అప్పుడే అవ్వ మీకా డబ్బు ఇస్తుంది అని తీర్పు చెప్పాడు.
రామన్న తీర్పుకు రాజు మెచ్చుకున్నాడు. నేటి నుంచి నువ్వు రామన్నవుకాదు. మర్యాద రామన్నవు. నా ఆస్థానంలో నీవే న్యాయాధి కారివని రాజు ప్రకటించాడు.
ఆ రాజు గారి సభలో రామన్న మర్యాద రామన్నగా ఎన్నో తీర్పులు చెప్పాడు. ప్రజల మన్ననలు అందుకున్నాడు.

Review మర్యాద రామన్న.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top