మహాలయ అమావాస్య ఎప్పుడు?

అమావాస్య రోజులు మంచివి కావని అంటారు కదా! కానీ మహాలయ అమావాస్య మాత్రం విశేషమైనదని చెబుతారు? దీనికున్న ప్రాధాన్యం ఏమిటి? ఈ రోజు ఏంచేయాలి? ఈ ఏడాది 2025లో మహాలయ అమావాస్య ఎప్పుడు వస్తుంది?
ప్రతి నెలా కృష్ణ (బహుళ) పక్షంలో వచ్చే ఆఖరి రోజు అమావాస్య. అలాగే, ఏడాదికి ఒకసారి వచ్చే మహాలయ అమావాస్య మాత్రం పితృదేవతలకు ప్రీతికరమైనది. ఈ ఏడాది 2025లో ఇది సెప్టెంబరు 21, సోమవారం (భాద్రపద బహుళ అమావాస్య) నాడు వస్తోంది. ఈ రోజు పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. అందుచేత ఈ రోజు మంచిది. అమావాస్య అంటే సూర్యచంద్రులు ఇద్దరూ కలిసి ఒకేచోట ఉండటం. మనకు సాధారణంగా చీకటి అంటే భయం. అది అజ్ఞానానికి చిహ్నం. సూర్యుడు జ్ఞానానికి, చంద్రుడు మనసుకు అధిపతులు. చీకటి నుంచే వెలుగు పుడుతుంది. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించాలని ఉపనిషత్తులు తెలియచేస్తున్నాయి. అమావాస్య శక్తిమంతమైన సమయం. మంత్రాలతో మహా శక్తులను ఈనాడు సాధించవచ్చని అంటారు. లయం అంటే ఆలింగనం. ఒకరిలో ఒకరు లీనం కావడం. ఓకేచోట విశ్రమించడం అన్నమాట. ఇది జీవాత్మ, పరమాత్మల సంయోగంగా పరిగణిస్తారు. అమావాస్య తరువాత శుక్ల పాడ్యమి నుంచి చంద్రుడు దినదినం వృద్ధి చెందుతూ పౌర్ణమి నాడు పదహారు కళలతో ప్రకాశిస్తాడు.
మనకు ప్రతి ఏడాది చైత్ర మాసంలో శుక్ల పాడ్యమితో ఆరంభం అవుతుంది. ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే ఆత్మకారకుడైన సూర్యుడి వల్ల జ్ఞానాన్ని, మనోకారకుడైన చంద్రుడిపైన నియంత్రణను సాధించుకోగల సదవకాశం అమావాస్య అందిస్తోంది. ఈ కలయిక యోగ సాధన ద్వారా సుస్థిరమైనపుడు సాధకులు స్థితప్రజ్ఞతను పొందుతారు. ధ్యానావస్థలో యోగి సమాధి స్థితిలోకి వెళ్లగానే మనసు ఆత్మ రతిలో నిరతిశయ ఆనందం పొందుతుంది. సుషుప్తిలో సామాన్యులు ఈ అనుభూతిని తాత్కాలికంగా పొందితే, ధ్యానయోగులు ఈ అనుభూతిని శాశ్వతంగా పొందుతారు. పితృదేవతలకు తర్పణం వదలడం ద్వారా వారికి ముక్తి లభిస్తుంది. భక్తిశ్రద్ధలతో మనసును మౌనపరిచి, పితరులను పుణ్యలోకాలకు చేర్చడం పుత్రధర్మం. ఇలా మనోలయం చెందడమే మహాలయం. ఇదే మహాలయ అమావాస్య పరమార్థం.

శరన్నవరాత్రుల్లో ఆచరించాల్సిన నియమాలేమిటి? ఈ కాలంలో అమ్మవారిని ఎలా పూజించాలి?
శరన్నవరాత్రుల వేళ అమ్మవారిని కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకూ వివిధ రూపాలూ, పద్ధతుల్లో ఆరాధిస్తారు. అమ్మవారిని ఎలా ఆరాధించాలని మార్కండేయ మహర్షి అడిగితే, ‘ఉపవసేన నక్తేన చైవ ఏక భుక్తేన వాపున: శరన్నవరాత్ర దీక్షాం ఆచరేత్‍’ అంటూ బ్రహ్మ వివరించాడట. దేవీ నవరాత్రుల నియమాల్లో ముఖ్యమైనది- ఉపవాస దీక్ష. చేయగలిగిన వాళ్లు ఈ తొమ్మిది రోజులూ పాలు, పండ్లు మాత్రమే తీసుకోవాలి. అలా చేయలేని వాళ్లు ఏకభుక్తం (పగలు పూజానంతరం తినడం) లేదా నక్తం (రాత్రి తినడం) చేయాలని బ్రహ్మ చెప్పిన దానికి భావం.
సాత్విక, రాజస, తామస అనే మూడు గుణాలూ సృష్టికి మూలం. వీటినే త్రిగుణాత్మక శక్తులని అంటారు. వీటికి మూలశక్తి- ఆదిశక్తి అయిన పరమేశ్వరి. విశ్వ ప్రణాళికలన్నీ ఆ శక్తి స్వరూపిణి ఆధీనంలోనే ఉంటాయి. అందుకే ఆ శక్తిని జగన్మాత, త్రిశక్తి స్వరూపిణి అంటారు. దీక్షతో నిర్వహించే నవరాత్రులను పూజల ఆధారంగా సాత్విక, రాజస, తామస అని మూడు రకాలుగా నిర్వహిస్తారు. సాత్విక పూజ మోక్షాన్ని, రాజస పూజ పదవులు, సంపదలను, తామసిక పూజ కామితాలను నెరవేరుస్తుందని చెబుతారు. అలాగే దేవిని ‘ఐం’ బీజాక్షరంతో సరస్వతి రూపిణిగా, ‘హ్రీం’ బీజాక్షరంతో పార్వతిగా, ‘శ్రీం’ బీజాక్షరంతో లక్ష్మీదేవిగా ఆరాధించాలి. ఈ మూడూ విద్య, శక్తి, సంపదలకు ప్రతీకలు.
ఆశ్వయుజ మాసంలో విశ్వసృష్టికి మూలమైన పరబ్రహ్మ స్వరూపం అవ్యక్త, అద్వితీయ శక్తులతో అలరారుతుంది. అందువల్లే హరిహర బ్రహ్మాదులంతా ఆ శక్తిని ఆరాధిస్తుంటారు. విష్ణు నామాన్ని వెయ్యిసార్లు జపించడం కంటే, శివనామం వందసార్లు జపించడం శ్రేష్టం. శివనామాలు వంద కంటే దేవీ నామం ఒక్కటైనా మేలని అంటారు. అంత విశిష్టమైన అమ్మవారికి శరన్నవరాత్రుల్లో స్మరిస్తే ఎంత విశేష ఫలితం ఉంటుందో వేరే చెప్పాలా!.

సాధారణంగా ఆలయానికి వెళ్లే స్త్రీలు తలలో పూలు పెట్టుకుంటారు కదా! కానీ, తిరుమల కొండపై ఎవరూ పూలు ధరించరాదట కదా! ఎందుకు? ఈ నియమం వెనుక ఏదైనా కారణం ఉందా?
తిరుమల కొండపై ఎవరూ పూలు ధరించరాదన్న నియమం ఉంది. అక్కడ భక్తుల పుష్పాలంకరణ అనాదిగా నిషిద్ధం. తిరుమలకు ‘పుష్పమండపం’ అనే పేరుంది. ఎన్నెన్నో రకాల విరులుంటాయి. అయితే, కొండపై పూసిన ఆ కుసుమాలన్నీ శ్రీనివాసుడికే చెందాలన్నది నియమం. ప్రచారంలో ఉన్న కథనాన్ని బట్టి- పూర్వం స్వామి వారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. ఒకసారి శ్రీశైలపూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామి వారికి అలంకరించాల్సిన పుష్పాలను తాను అలంకరించుకుని ఆనందించాడు. ఆ రాత్రి ఏడుకొండలస్వామి శ్రీశైలపూర్ణుడికి కలలో కనిపించి, ‘నీ శిష్యుడు పరిమల ద్రోహం చేశాడు’ అని చెప్పాడట. అందుకు శ్రీశైలపూర్ణుడు ఎంతగానో చింతించాడు. ఆనాటి నుంచి స్వామివారికి అలంకరించిన సుమాలను కూడా భక్తులకు ఇవ్వకుండా అక్కడి పూలబావిలో వేయాలనే ఆచారం ప్రారంభమైంది. నిజానికి అలంకార శోభితుడైన ఆ ఏడుకొండలస్వామి ముందు మన అలంకరణలు ఏపాటివి? భగవంతుడి ఎదుట భక్తులు అతిసాధారణంగా ఉండాలని గుర్తుచేసేందుకే తిరుమల కొండపై కుసుమాలు ధరించకూడదన్న నియమం ఏర్పడింది. ఆలయాల దర్శనానికి వెళ్లేటపుడు ఆడంబరాలకు, ఆకర్షణలకు ఎంత దూరంగా ఉంటే, ఆ పరమాత్ముడిపై అంత ఏకాగ్రత కుదురుతుంది. దేహభ్రాంతి తగ్గుతుంది. ఇటీవల తిరుమల పూలబావిలో వేసిన పూలతో అగరువత్తులను తయారు చేస్తున్నారు.

ఆలయాల్లో ఇచ్చే తీర్థం ప్రాముఖ్యత ఏమిటి?
ఆలయానికి వెళ్లినపుడు తీర్థం తీసుకోవడం పరిపాటి. నీరే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. అలాంటి నీటిని తీసుకుంటే వాతపిత్త దోషాలు పోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. దానివల్ల శక్తి, పుష్టి సైతం కలుగుతాయనేది పెద్దల మాట. ఆలయంలోని స్వామి వారి తీర్థాన్ని తీసుకునే వారు ఆరోగ్యంగా ఉంటారని, పరమేశ్వర సాయుజ్యాన్ని పొందుతారని పరమ పురుష సంహిత వివరిస్తోంది. తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రోగాలనూ పోగొడుతుంది. అకాల మృత్యువు సంభవించకుండా రోగాలను, పాపాలను హరించాలనే ప్రార్థనతో తీర్థం తీసుకోవాలి.

శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం బయట అగరవత్తులు, సాంబ్రాణి ధూపానికి బదులు సిగరెట్లు, చుట్టలను వెలిగించే ఆచారం ఉందట! నిజమేనా? ఈ ఆచారం వెనుక ఏదైనా కారణం ఉందా?
సాధారణంగా ఆలయాల్లో దీపధూపాలు వేయడంతో ఆలయ పరిసరాలన్నీ సుగంధ భరితమవుతుంటాయి. అదే సాక్షాత్తూ విష్ణుమూర్తి రంగనాథస్వామిగా కొలువుదీరిన శ్రీరంగం ఆలయం వెలుపల మాత్రం సిగరెట్లు, చుట్టల నుంచి వెలువడే ధూమపానం వాసన వస్తుంటుంది. అయితే, భక్తులు పొగ తాగడం వల్ల వెలువడే వాసన కాదిది. ఆలయం బయట వీటిని వెలిగించడం ఎప్పటి నుంచో ఒక ఆచారంగా కొనసాగుతోంది. ఈ ఆలయ క్షేత్రపాలకుడి వద్ద అగరవత్తులకు బదులు సిగరెట్లు, చుట్టలు వెలిగిస్తారు. వాటి తాలూకు పొగ నుంచి వెలువడే వాసన శ్రీరంగం క్షేత్రం బయట అలముకుంటుంది. దీని వెనుకో ఆసక్తికరమైన విశేషం ఉంది. శ్రీరంగం క్షేత్ర పాలకుడి పేరు మునియప్పన్‍ స్వామి. ఆలయం వెలుపల ఈయనకు కూడా ఒక గుడి ఉంది. రంగనాథస్వామిని దర్శించుకున్న వారంతా మునియప్పన్‍ను కూడా దర్శించుకుంటారు. అక్కడే వాకిట్లో ఉన్న ఓ మట్టికుండలో సిగరెట్లనీ, చుట్టలనీ వెలిగిస్తారు. అలా చేయడం వల్ల ఆ పొగ రూపంలో తమ సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శతాబ్దాలుగా శ్రీరంగంలో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. అందుకే మునియప్పన్‍ గుడి వద్ద ఉండే పూజారులు ఎప్పుడూ మాస్కులు ధరించి ఉంటారు.

Review మహాలయ అమావాస్య ఎప్పుడు?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top