మహా శివరాత్రి.. మహా సందేశం

శివపూజతో చతుర్విధ ముక్తిలు
మనిషి శివుడిని నిష్కల్మషంగా పూజించా లనుకుంటే, తన ఆత్మ అంతా శివుడే నిండి ఉన్నట్టు భావించాలి. మనిషి శివారాధనలో చతు ర్విధ ముక్తిలూ పొందుతాడని భగవత్పాదుల ఉపదేశం.
భక్తుడు తానే శివుడై చేసే పూజలో శివుడి సారూప్యం (సమాన రూపం) ఉంటుంది. అందుకే ఇది ‘సారూప్య ముక్తి’.
శివభక్తులతో సాహచర్యం చేస్తూ శివా లయాలను సందర్శించడం వల్ల శివుడి సమీ పానికి చేరుకున్నట్టు అవుతుంది. కనుక ‘సామీప్య ముక్తి’.
ఈ ప్రపంచం అంతా శివమయమే కాబట్టి, ఈ లోకంలో తానూ ఉన్నందుకు మనిషికి ‘సాలోక్య ముక్తి’ లభిస్తుంది.
శివారాధన వల్ల శివుడితో మానసికమైన అనుసంధానం ఏర్పడుతుంది. ఈ కార ణంగా ‘సాయుజ్య ముక్తి’ లభిస్తుంది.
ఇలా శివుడి పూజ వల్ల చతుర్విధ ముక్తు లనూ ఇహలోకంలోనే పొందు తున్న మనిషి ధన్యుడు.

మానవ జీవనం భోగమయంకాదు.. త్యాగమయం కావాలి
శివుడి అర్చనలోని వస్తువులన్నీ మనకు ఆయన ప్రసాదించినవే.
శివ జటాజూటంలోని గంగానది నీళ్లను అనుగ్రహిస్తుంది.
శివుడి నేత్రమైన సూర్య కిరణాల వల్ల పూలు లభిస్తున్నాయి.
శివుడి తలపైన గల చంద్రుడి దయతో పండ్లు లభిస్తున్నాయి.
బిల్వ దళాలు చేతికి అందుతున్నాయి. ఇవన్నీ శివ ప్రసాదాలే..
ఇలా శివుడు మనకు ఇచ్చిన సంపద లన్నింటినీ ఆయనకే అర్పించడం శివార్చన. దీని పరమార్థం ఏమిటంటే- ఈ ప్రపంచంలోని సంపదలన్నీ స్వార్థం కోసం కాదనీ, అవి సమస్త ప్రాణుల సుఖ సంతోషాల కోసం పరమేశ్వరుడు సృష్టించినవని గ్రహించడం. మానవ జీవనం భోగమయం కారాదని, త్యాగమయం కావాలని తెలియ చేసే మహా పర్వమే- మహా శివరాత్రి.
అను నిత్యం మంగళకరమైన భావాలను మనిషి తన ఎదలో పదిలం చేసుకోవాలి. జీవితాన్ని ఒక పూజా కుసుమంగా రూపొం దించాలి. తనలో అందరినీ, అందరిలో తననూ చూసుకుని ఈ ప్రపంచాన్ని శివుడిగా భావిం చడమే మనిషి కర్తవ్యం.
మహా శివరాత్రి పర్వదినం అందచేసే సందేశం ఇదే. ఈ శివ భావనతో పరమశివుడిని ఆరాధిస్తేనే లోకమంతా శివ (మంగళ)
మయం అవుతుంది
పరమేశ్వరుడే సాక్షాత్తూ శివరాత్రి వ్రత ప్రభా వాన్ని గురించి పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు.
పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక బోయ వాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్లడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించుకోవడం అతని వృత్తి. అయితే, ఒకరోజు ఉదయమే వెళ్లిన ఆ బోయకు చీకటి పడే వేళకైనా ఒక్క జంతువూ దొరకలేదు. దాంతో అతను నిరాశగా ఇంటిముఖం పట్టాడు. అలా వస్తుండగా దారిలో అతనికి ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడకు నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, అప్పుడు దాన్ని తాను సంహరించవచ్చునని అనుకుని, ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. ఈ క్రమంలో తన కంటి చూపునకు అడ్డంగా వస్తున్నాయనే భావనతో ఒక కొమ్మ ఆకు లను తుంచి కిందపడేశాడు. పైగా ఆ బోయవాడు ఊతపదంగా ‘శివ.. శివ’ అంటుండే వాడు. అలా అనడం మంచో చెడో అతనికి తెలియదు. కానీ, ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా ఆ బోయకు తెలియదు.
రాత్రి వేళ మొదటి జాము గడిచాక ఒక ఆడ జింక నీళ్లు తాగేందుకు సరస్సు వద్దకు వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయ. అయితే, ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపడం అధర్మమని, వదిలిపెట్టాలని బోయవాడిని ప్రాధేయపడింది. ఒకవేళ మరే జంతువూ నీకు దొరక్కపోతే, తానే ఆహారంగా మారతానని అంది. మామూలుగా అయితే అతని మనసు క్రూరంగా ఉండేదే. కానీ, ఆ జింకను చూడటం, పైగా అది మానవ భాష మాట్లాడే సరికి బోయవాడు దాన్నేమీ చేయలేకపోయాడు. అలా రెండోజాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపలే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతు కుతూ విరహంతో కృశించి ఉన్నానని, పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో నీ కుటుంబానికి ఆకలి కూడా తీరదంటూ తనను విడిచి పెట్టాలని కోరింది. ఒకవేళ మరికాసేపటి దాకా ఏ జంతువూ నీకు దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు సంహరించుకో అని కూడా అంది. జింక మానవ భాషలో ఇదంతా మాట్లాడేసరికి బోయవాడు ఆశ్చర్య పోయాడు. సరేనని వేచి చూస్తుండగా, మూడో జాము గడిచే సరికి ఒక మగ జింక అతనికి కని పించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునే లోగానే, ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది.
రెండు ఆడ జింకలు ఇటుగా వచ్చాయా? అని ఆ జింక బోయవాడిని అడిగింది.
‘వచ్చాయి. నాకు ఏ జంతువూ
దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని
కూడా నాతో అన్నాయి’ అని బోయవాడు ఆ మగ జింకకు చెప్పాడు.
‘అయితే, ఆ రెండు జింకలను ఒకసారి చూసుకుని వస్తాను. అప్పుడు నన్ను సంహరిద్దువు గానీ..’ అని అంటూ ఆ మగ జింక వెళ్లింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గరపడింది.
బోయవాడు తనకు మాటిచ్చి వెళ్లిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరో జింక.. దాని పిల్ల అటుగా రావడం అతనికి కనిపించింది. విల్లు ఎక్కుబెట్టపోయిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని, అప్పటి దాకా ఆగాలని చెప్పి వెళ్లింది.
మరికొద్దిసేపటికి నాలుగు జింకలూ బోయవాడి వద్దకు వచ్చాయి. తామిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో వాడి ముందుకొచ్చి, ముందుగా తనను చంపమంటే తనను చంపాలని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తన తెచ్చింది. ఆ రాత్రంతా అతను కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతను తెలియకుండానే ‘శివ.. శివా’ అనే ఊతపదంతో రాత్రంతా స్మరణ చేయడం, ఏమీ తినకుండా, పచ్చి మంచినీళ్లయినా ముట్టకుండా రాత్రంతా జాగరణ ఉండటం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి కిందపడేయడం.. ఆ చెట్టు కిందనే ఏనాటిదో ఉన్న శివలింగంపై మారేడు దళాలు పడటం ఇదంతా అతనికి తెలియకుండానే పుణ్యాన్ని ప్రసాదించింది. శివలింగంపై మారేడు దళాలు పడిన ఫలితంగా పూజా ఫలం, నాలుగో జాము వరకూ మెలకువగానే ఉన్నందున జాగరణ ఫలం దక్కాయి.
క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల బోయవాని మనసు నిర్మలమెనది. పైగా జింకల సత్యనిష్ట అతని మనసును పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతనిలో పరివర్తన కలిగింది. అందుకే హింసను ఆనాటి నుంచి విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంతో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ, లుబ్ధక అనే నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలని అనుకున్నప్పుడు క్షణ కాలం పాటు ఆగి ఆలోచిస్తే.. మనసు దాని నుంచి మరలుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతనిని చివరకు అహింసా ధర్మాచరణ మూర్తిగా నిలిపింది. సత్యధర్మ పరాయణులు, అహింసా మార్గాన్ని అనుసరించిన వారు, సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది.
అందుకే తెలిసి కానీ, తెలియక కానీ మహా శివరాత్రి నాడు ఎవరైతే దానం, స్నానం, ఉపవాసం, జాగరణం చేస్తారో వారికి శివ సాయిజ్యం, కైలాస ప్రాప్తి కలుగుతాయని అంటారు.
గుణనిధి.. శివ సాయిజ్యం..
మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని గురించి తెలిపే మరో కథ ఇది. గుణనిధి అనే బ్రాహ్మణుడు ఆచారాలు పాటించే వాడు కాదు. దుర్గుణాలు అలవర్చుకున్నాడు. అన్ని విధాలా పతనమైన అతను మహా శివరాత్రి నాడు తినడానికి అన్నం లేక అనుకోకుండా ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. ఆ వెలుగులో జాగారంలో ఉన్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి.. అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా అతను శివ సాయిజ్యాన్ని పొందాడు.
లింగోద్భవ రాత్రే.. శివరాత్రి
శివుడు లింగాకృతిలో స్వర్గ మర్త్య పాతాళాల్లో ఉద్భవించిన పర్వదినమే మహా శివరాత్రి. ఇది ప్రతి ఏడాదీ మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి (ఫిబ్రవరి 21, 2020) నాడు అర్ధరాత్రి వేళ సంభవిస్తుంది. ఆ రాత్రి జగత్తు అంతటికీ ఆరాధ్య వేళ. పుణ్యాల పంట. అంతులేని సిరుల మూట. ఉపాసనలకు నెలవు. పూజలకు కొలువు. శివుడు లింగాకృతిలో ఆవిర్భవించడానికి ఒక నేపథ్యం ఉంది.
పూర్వం- బ్రహ్మ, విష్ణువు ఆధిపత్యం గురించి వాదించుకున్నారట. ఇంతలో వారి ఎదుట ఒక శివలింగం ఉద్భవించింది. వారు ఆశ్చర్యంతో చూస్తుండగానే, అది పెరగడం ప్రారంభిస్తుంది. క్రమంగా భూమిని చీల్చుకుని పాతాళానికి, నింగిని ఛేదించుకుంటూ వూర్ధ్వ లోకాలకు విస్తరిస్తుంది. అప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ ఆ శివలింగం ఆద్యంతాలు చూడటానికి సిద్ధమవుతారు.
బ్రహ్మ దేవుడు హంసలా మారిపోయి, ఆకాశంలోకి ఎగిరి వెళతాడు. విష్ణువు వరాహంగా మారి, నేలను చీల్చుకుంటూ పాతాళానికి చేరతాడు. వారిద్దరూ అలుపూ సొలుపూ లేకుండా ఎంత దూరం వెళ్లినా, శివలింగం ఆది, అంతాలను చూడలేకపోతారు. తిరిగి యథా పూర్వ స్థానానికే చేరుకుంటారు. అప్పుడు వారి ఎదుట పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. తాను శివలింగం అంతాన్ని చూశానని బ్రహ్మదేవుడు అసత్యం పలుకుతాడు. విష్ణువు మాత్రం తాను చూడలేకపోయానని నిజం చెబుతాడు. అసత్యం మాట్లాడిన బ్రహ్మకు లోకంలో పూజార్హత ఉండదని శివుడు శపిస్తాడు. బ్రహ్మదేవుడు దీనిని నిరసిస్తాడు. శివ దూషణకు పాల్పడతాడు. ఈ దూషణను కాలభైరవుడు సహించలేకపోతాడు. శివుడి జటాజూటం నుంచి ఆవిర్భవించి, బ్రహ్మ అయిదో తలను ఖండిస్తాడు. ఆనాటి నుంచి ఆయన నాలుగు తలల వాడయ్యాడని, అనంతరం బ్రహ్మ విష్ణువులిద్దరూ శివ మహిమను అంగీకరించారని పురాణ గాథలు చెబుతున్నాయి. కాగా, బ్రహ్మ అసత్యం పలకడంతో పాటు.. తన అసత్యానికి బలం కోసం కామధేనువు, మొగలి పువ్వు (కేతకి పుష్పం) చేత కూడా అబద్ధం ఆడిస్తాడు. శివుడు ఆగ్రహం చెంది వాటిని కూడా పూజలు అందుకోరని శపిస్తాడు. ముఖంతో అబద్ధం, తోకతో నిజం చెప్పాను కాబట్టి తనను క్షమించాలని కామధేనువు ప్రాధేయపడుతుంది. దీంతో అప్పటి నుంచి గోముఖము పూజార్హము కాదని, దాని వెనుక భాగం పూజా పునస్కారాలకు అర్హమైనదని శివుడు శాప విమోచనం కలిగిస్తాడు. అలాగే మొగలి పువ్వు సైతం బ్రహ్మ పలికిన అసత్యానికి వత్తాసు పలికి పూజకు పనికిరాని పువ్వుగా మిగిలింది. అది మహాదేవుడిని స్తుతించిన మీదట- కేతకి పుష్పాన్ని తన భక్తులు ధరించవచ్చని, అలాగే కేతకీ పుష్పం ఛత్ర రూపంలో తనపై ఉంటుందని శాపాన్ని తగ్గిస్తాడు.
ఐదు రకాల శివరాత్రులు
మాఘ మాసం, కృష్ణ పక్షంలో అర్ధరాత్రి ఉండే చతుర్దశి తిథి నాడు వచ్చేదే మహా శివరాత్రి. ఈ తిథి శివపూజకు ఉద్ధిష్టమైనది. అమావాస్య ముందు వచ్చే కృష్ణ చతుర్ధశి తిథి ఇంకా పవిత్రమైనది. ఈ కారణంగానే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణ చతుర్దశి తిథులు మహా శివరాత్రులుగా ఉంటాయి. సంవత్సరంలోని పన్నెండు శివరాత్రులతో మాఘ మాసంలో వచ్చే శివరాత్రి శివుడికి బాగా ఇష్టమైనది. కాబట్టే దీనిని మహా శివరాత్రి అన్నారు. స్కంద పురాణంలో శివరాత్రులు ఐదు రకాలని చెప్పారు.
1. నిత్య శివరాత్రి: ప్రతి రోజూ రాత్రి పూట చేసే శివారాధన.
2. పక్ష శివరాత్రి: ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శివార్చన కోసం నిర్దేశించిన రాత్రి.
3. మాస శివరాత్రి: ప్రతి మాసంలోనూ శివపూజకు ఉద్దేశించిన రాత్రి.
4. మహా శివరాత్రి: మిగతా శివరాత్రులు ఏవి కుదిరినా, కుదరకపోయినా ఏడాదికి ఒకసారి వచ్చే మహా శివరాత్రి నాడు శివపూజ చేయడం పుణ్యప్రదం.
5. యోగ శివరాత్రి: యోగి అయిన వాడు తన యోగ బలం చేత యోగనిద్రలోకి వెళ్లే రాత్రిని యోగ శివరాత్రి అంటారు.
శివ‘రాత్రి’పూటే శివపూజ ఎందుకు?
సాధారణంగా రాత్రి పూజ దేవీపూజను, పగటి పూట దేవ పూజను చేయడం ఒక ఆచారం. కానీ, శివరాత్రి విషయంలో మాత్రం ఇది భిన్నంగా కనిపిస్తుంది. శివరాత్రి రోజున రాత్రిపూటే శివపూజ జరుగుతుంది. త్రిమూర్తులలో మూడో వాడు శివుడు. బ్రహ్మ సృష్టికర్త. విష్ణువు సంరక్షకుడు. శివుడు లయకారకుడు. ఇలా శివారాధన రాత్రి పూట జరగడానికి ఒక కారణం కూడా ఉంది.
పూర్వం ఒకసారి ప్రళయం వచ్చినపుడు అంతా కటిక చీకటిగా మారిపోయింది. ఆ సమయంలో లోక కల్యాణం కోసం పార్వతీదేవి శివుడిని గురించి తపస్సు చేసింది. ఆనాటి పార్వతి తపస్సును మెచ్చి శివుడు ఆ చీకటిని పోగొట్టి, మళ్లీ మామూలుగా రాత్రి – పగలు ఏర్పడేలా చేశాడు. దాంతో జీవులన్నీ మళ్లీ ఆనందించాయి. తాను చేసిసట్టుగా అంతా రాత్రివేళ శివుడికి పూజలు చేసిన వారికి సర్వ సుఖాలు కలిగేలా అనుగ్రహించాలని పార్వతి శివుడిని కోరింది. శివుడు అందుకు అంగీక రించాడు. పార్వతి చేసిన శివపూజకు గుర్తుగా ఆనాటి నుంచి మహా శివరాత్రి పూజా పర్వదినం ఏర్పడింది.
ఈశాన సంహితలో వివరించిన ప్రకారం- శివుడు ఒకసారి అర్ధరాత్రి సమయంలో తేజో లింగంగా ఆవిర్భవించాడు. అదే లింగోద్భవ కాలం. అలా పరమశివుడు లింగాకారంలో పుట్టిన రోజు కావడం చేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం మంచిదని శైవం చెబుతోంది. వినాయక చవితి, శ్రీరామ నవమి వంటి పండుగలలో దేవుళ్లను పగటి పూట పూజిస్తారు. శివరాత్రి నాడు మాత్రం శివుడిని రాత్రి పూటే పూజిస్తారు. మిగిలిన పండుగల్లా పంచభక్ష్య పరమాన్నాల తో కాక ఉపవాస దీక్షతో శివరాత్రి పండుగను జరుపుకోవడం ఒక విశేషం.
మహా శివరాత్రి వ్రతాచరణ..
లింగ పురాణంలో మహా శివరాత్రి వ్రతాచరణ గురించి ఉంది. వ్రత ఉద్యాపన గురించి స్కంద పురాణంలో వివరించారు. శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం, రాత్రిపూట లింగార్చన, జాగరణం చేస్తారు. లింగార్చన తరువాత పార్వతీ పరమేశ్వరుల కల్యాణం చేయడం కూడా ఓ ఆచారంగా ఉంది. శివరాత్రి నాటి లింగోద్భవ సమయంలో చేసే అభిషేకాలలో కూడా కొన్ని పద్ధతులున్నాయి. రాత్రి జాగరణం చేస్తూ నాలుగు జాములలోనూ నాలుగు సార్లు నాలుగు రకాలుగా అభిషేకాలు చేస్తుంటారు.
మొదటి జాములో పాలతో అభిషేకించి, పద్మాలతో పూజ చేసి పెసరపప్పు, బియ్యం కలిపి పులగం వండి శివుడికి నైవేద్యం పెడతారు. రుగ్వేద మంత్ర పఠనం జరుపుతారు.
రెండో జాములో పెరుగుతో అభిషేకం, తులసీ దళార్చన చేసి, పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రాలను చదువుతారు.
మూడో జాములో నేతితో అభిషేకించి, మారేడు దళాలతో అర్చించి, నువ్వుల పొడి కలిపిన తినుబండారాలను నివేదిస్తారు. సామవేద మంత్ర పఠనం చేస్తారు.
నాలుగో జాములో తేనెతో అభిషేకం చేసి, నల్ల కలువలతో పూజించి అన్నం నివేదిస్తారు. అధర్వణ వేద మంత్రాలను చదువుతారు.
పై విధాలుగా అలా అభిషేకాలు చేసే శక్తి లేని వారు అభిషేకం చేసేటప్పుడు శివదర్శనం చేసుకున్నా పుణ్యమేనని అంటారు. నాలుగో జాము ముగిశాక ఉదయం పూట శివుడిని ఊరేగిస్తారు. ఇలా ఊరే గించడం వెనుక ఓ సామాజిక అంతరార్థం ఉంది. ఎవరైనా ఏ కారణం చేతనైనా ఆలయాలకు వెళ్లి శివ దర్శనం చేసుకోలేకపోతే వారికి ఈ ఊరేగింపును చూసి పుణ్యం పొందే భాగ్యం కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. అలాగే బిల్వదళ ప్రియుడు. అందుకే అభిషేకాలు, బిల్వార్చనలను శివరాత్రి నాడు విధిగా చేస్తుంటారు. తెలిసైనా, తెలియకైనా కొన్ని నీళ్లు శివలింగం మీద పోసి, మరికొన్ని మారేడు దళాలు ఆ శివలింగం మీద పెడితే బోళా శంకరుడు పరవశించి అలా చేసిన వారిని అనుగ్రహించిన కథలు ఎన్నెన్నో మన పురాణాల్లో ఉన్నాయి.
శివుడు.. బిల్వదళ ప్రియుడు
శివుడికి ఇష్టమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి. ఇవి ఆరోగ్యపరంగా దివ్యౌషధ పత్రాలు. అందుకే బిల్వ పత్రానికి ‘మృత్యు వంచనము’ అనే పేరు కూడా ఉంది. మహా శివరాత్రి నాడు శివుడికి బిల్వ పత్రాలతో పూజించాలి. మూడు కొసలుగా చీలి, చూడగానే త్రినేత్రుడిని గుర్తుకు తెచ్చే బిల్వం (మారేడు) మన దేశంలోనే పుట్టిన ఒక ఔషధ వృక్షం. బిల్వ వృక్షం ఎదిగేందుకు ఎటువంటి ప్రత్యేక వాతావరణం అవసరం లేదు. కోసిన తరువాత కూడా సుదీర్ఘ కాలం నిల్వ ఉండే ఈ దళాలు ఆరోగ్యాన్నీ చేకూర్చుతాయి. సుదీర్ఘ కాలం పాటు శివలింగం చెంతనే ఉన్నా.. ఈ పత్రాలు చుట్టు పక్కల వాతావరణాన్ని శుద్ధి చేస్తాయే కానీ, గాలిని కలుషితం చేయవు. అటువంటి విశిష్ట పత్రాలు కాబట్టే శివుడి పూజకు ఇవి అర్హత సంపాదించాయి.

Review మహా శివరాత్రి.. మహా సందేశం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top