రామాయణంలో తొలి నుంచీ రాముడిని అనుసరించిన తమ్ముడు లక్ష్మణుడు. భరతుడిని అనుసరించిన తమ్ముడు శత్రుఘ్నుడు.
శత్రుఘ్నుడు మితభాషి. తేజస్వి, మహా పరాక్రమశాలి. వైరమన్నా, దుర్మార్గమన్నా ఆయనకు ఎక్కడ లేని ఆవేశం. వాటిని అంతం చేస్తే కానీ నిద్రపట్టదు. భరతుడంటే మొదటి నుంచీ శత్రుఘ్నుడికి ఒక ఆత్మీయత. ఆ అన్నతో కలిసి భుజిస్తే కానీ ఆయనకు ఆహారం రుచించేది కాదు. కలిసి తిరిగితే కానీ తృప్తి ఉండేది కాదు. అన్నగారి మనసును గ్రహించి శత్రుఘ్నుడు మసులుకునే వాడు.
పెద్దన్న రాముడన్నా శత్రుఘ్నుడికి ఎంతో గౌరవం. ఆ అన్నగారి ఎదుటికి రావాలంటేనే ఎందుకో ఒక విధమైన జంకు. రాముడు ఎప్పుడు ఎదురుపడినా శత్రుఘ్నుడు శిరసు వంచి నిలిచేవాడు. నిలువెల్లా భక్తితో చేతులెత్తి మొక్కేవాడు.
సోదరుడు లక్ష్మణుడంటే శత్రుఘ్నుడికి చెప్పలేనంత స్నేహభావం. ఎప్పుడు కలిసినా ఇద్దరూ హార్ధికంగా కౌగిలించుకునే వారు. అటు కేకయ రాజ్య విశేషాలను, ఇటు అయోధ్య రాజ్య విశేషాలను ఆకస్తిగా చెప్పుకునే వారు.
బాల్యంలోనే భరతుని వెంట కేకయ దేశం వెళ్లాడు. అక్కడే పెరిగాడు. పెళ్లికి కూడా అక్కడి నుంచే భరతుని వెంట మిథిలకు వచ్చాడు.
శ్రుతకీర్తిని వివాహం చేసుకున్నాడు. అయోధ్యలో రామాభిషేక భంగం కానీ, రామ వనగమనం కానీ శత్రుఘ్నుడికి తెలియదు. అయోధ్య నుంచి అనుకోకుండా ఒకనాడు దూతలు వచ్చారు. అతి ముఖ్యమైన పనిపై పెద్దలు రమ్మన్నారని భరతుడికి చెప్పారు. భరతుడి వెంట తానూ బయల్దేరాడు. తీరా అయోధ్యకు వచ్చి చూస్తే అంతా అశుభం. తీవ్ర విషాదం. తండ్రి మరణించాడు. అన్న అడవులకు వెళ్లాడు. అంతటికీ కారణం ఆ కైకమ్మ.
పాపం! శత్రుఘ్నుడు ఎంతో బాధపడ్డాడు. అయినా ఎవరిని ఏమని అనగలడు? అన్న భరతుడే అమ్మ కైకను అమితంగా నిందిస్తున్నాడు. అది చూస్తూ తానూ తలవంచుకుని నిలుచున్నాడు. తండ్రి మరణానికి తీవ్రంగా దు:ఖించి అన్నగార్లతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేశాడు.
అది పదమూడవ రోజు. దశరథుని అస్థి సంచయనం జరగాలి. ఆ తరువాత భరతుడి రాజ్యాభిషేకం. శత్రుఘ్నుడు భరతుడి మందిరానికి వెళ్లాడు.
‘అన్నా! రాముడు సర్వ సమర్థుడు. కేవలం ఒక స్త్రీ వల్ల అడవుల పాలయ్యాడు. అపకీర్తి భయంతో ఆయన తండ్రి మాటకు తలవంచి వెళ్లి ఉండవచ్చు. మహావీరుడైన మన లక్ష్మణుడున్నాడే! అతడైనా తండ్రిని ఎదిరించి ఆ కైకేయి దుర్నీతికి పాల్పడకుండా అడ్డుపడకూడదా? అన్యాయాన్ని ఎదిరించ కూడదా?’ అని ఆవేశంగా భరతుడితో అంటుండగానే మంథ••ర అద్భుతంగా అలంకరించుకుని, ఆనందంగా చేతులు ఊపుకుంటూ అంత:పురం తూర్పు ద్వారాన ప్రవేశించింది. వెంటనే ద్వారపాలకులు మంథరను పట్టుకున్నారు. వారు శత్రుఘ్నుడిని ఆవలికి పిలిచి, ‘ప్రభూ! రాముని అరణ్యవాసానికి, దశరథుని మరణానికి ఈ పాపిష్టురాలు, క్రూరురాలు మంథరే కారణం’ అని అప్పగించారు.
శత్రుఘ్నుడిలో కోపావేశం అగ్నిపర్వతంలా బద్దలైంది. అన్ని అనర్థాలకు ఈ గూనిదే కారణమని, దాన్ని జుత్తు పట్టుకుని కింద పడవేసి బడబడా ఈడ్చుకుంటూ పోయాడు. ఆ దెబ్బకు మంథర ఆభరణాలన్నీ ముక్కలు ముక్కలై నేలరాలి ఆ ప్రదేశమంతా నక్షత్ర ఖచితమైన ఆకాశంలా కనిపించిందట.
శత్రుఘ్నుని కోపావేశాన్ని చెలికత్తెలు చూసి, ‘అమ్మా! మంథర చచ్చిపోతుందం’టూ కౌసల్య వద్దకు పరుగెత్తారు. కైక కోసం ఇంకొందరు పరుగెత్తారు. అంతలో మంథర, ‘అమ్మా! కైకా!’ అని చావుకేక పెట్టింది. ఆ కేక విని కైక పరుగెత్తుకుంటూ వచ్చింది.
‘నాయనా! శత్రుఘ్నా! మన మంథర చస్తుందిరా!’ అంటూ అడ్డం నిలిచింది.
అయినా శత్రుఘ్నుడు ఆగలేదు. కైకను ఒకసారి కళ్లురుమి చూశాడు. పిడుగు పడినట్టు పరుషంగా హుంకరించి అవతలికి నెట్టాడు.మంథర కిందపడి గిలగిలా కొట్టుకుంటోంది. నోరు లబలబా మొత్తుకుంటోంది. పెద్దగా ఏడుస్తూ ఉంది.
భరతుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు.
‘తమ్ముడూ! స్త్రీ హత్య మహాపాతకం’ అని గట్టిగా శత్రుఘ్నుడి చేయి పట్టుకున్నాడు. అప్పుడు శత్రుఘ్నుడు పట్టు విడిచాడు. మంథర అటుఇటు పొరలి ఎలాగో పైకి లేచి బతుకు జీవుడా అంటూ పరుగెత్తిపోయింది. గూని వీపుతో మంథర గోడుగోడున ఏడుస్తూ, గునగునా పరుగెత్తి పోతుంటే ద్వారపాలకులంతా పకపకా నవ్వారు. ‘పట్టుకోండ్రా మళ్లీ’ అంటూ పరిహాసమాడారు.
అప్పుడు భరతుడు అడ్డుపడకుంటే శత్రుఘ్నుడి చేతిలో మంథర చచ్చిపోయేదే. ఆ దుర్మార్గురాలికి ఇంకా ఆయుష్షుంది. అందుకే భరతుడు అడ్డుపడ్డాడు. దశరథుడి అంత్యక్రియలు ముగిశాయి. ఇక, భరతుడికి పట్టాభిషేకం జరగాలి. అయితే భరతుడు తనకు రాజ్యం అక్కర్లేదన్నాడు. అన్న రాముడే అయోధ్యకు అభిషిక్తుడు కావాలన్నాడు. అన్ని విధాలా అదే ధర్మమన్నాడు. అడవులకు వెళ్లి అన్నను ప్రార్థించి అయోధ్యకు పిలుచుకు వస్తానని బయల్దేరాడు.
భరతుని భ్రాతృభక్తికి, ధర్మరక్తికి శత్రుఘ్నుడు పులకించాడు. ఆయన వెంట తానూ అడవులకు వెళ్లాడు. ఆ రామపాదాలకు ప్రణమిల్లాడు. అయోధ్యకు రమ్మని ప్రార్థించాడు. ఆయన పాదుకలు తలదాల్చి తిరిగి వచ్చే భరతుడి వెంట తానూ వచ్చాడు. పద్నాలుగేళ్లు గడిచాయి. భరతశత్రుఘ్నుల జీవితంలో అది పండుగ రోజు. పద్నాలుగేళ్ల తరువాత రోజు. రాముడు రావాల్సిన రోజు. హనుమంతుడు ముందుగా వచ్చాడు. సతీసమేతంగా రాముడు వస్తున్నాడని చెప్పాడు. భరత శత్రుఘ్నుల ఆనందానికి అంతులేదు. భరతుని ఆజ్ఞ మేరకు శ్రీరాముని స్వాగత సన్నాహాలన్నీ స్వయంగా శత్రుఘ్నుడే చేశాడు. నంది గ్రామం నుంచి అయోధ్య దాకా మార్గాన్ని చదును చేయించాడు. నీళ్లు చల్లించాడు. పూలు పరిపించాడు. పందిళ్లు వేయించాడు. స్వాగత తోరణాలు కట్టించాడు. అయోధ్యా మహా నగరాన్ని అందంగా అలంకరించాడు. అన్నగారి రాజ్యాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. రామాభిషేకం జరిగింది. రామరాజ్యం వెలిసింది. ధర్మం నాలుగు పాదాలపై నడిచింది. అందరూ సుఖసంతోషాలతో, భోగభాగ్యాలతో హాయిగా జీవిస్తున్నారు.
ఆ సమయంలో సీతా పరిత్యాగం. అది అందరినీ కంటతడి పెట్టించిన ఘట్టం. శ్రీరాముని అంతరంగంలో ఆ బాధ ఇంకా పచ్చిగానే ఉంది. ఆనాడాయన కొలువుదీరాడు. భరతలక్ష్మణ శత్రుఘ్నులు పక్కనే నిలుచున్నారు. యమునా తీరం నుంచి వంద మంది మహర్షులు వచ్చారు. వారందరికీ పెద్ద భార్గవచ్యవనుడు. ఆయన శ్రీరాముడికి లవణాసుర వృత్తాంతం చెప్పాడు. రావణాసురుడిని సంహరించినట్టే ఈ లవణాసురుడిని కూడా సంహరించి తమ బాధలు తీర్చాలని కోరాడు. రాముడు, ‘మహర్షీ! మీ ఆజ్ఞ శిరసావహిస్తా’నన్నాడు. ఈ లవణాసుర సంహార బాధ్యతను ఎవరు స్వీకరిస్తారన్నట్టు తమ్ముళ్ల వైపు చూశాడు రాముడు. ‘భరతా!’ అనగానే భరతుడు ‘అవశ్యం’ అన్నట్టు చేతులు జోడించాడు. అంతలోనే శత్రుఘ్నుడు చివాలున లేచి, ‘ప్రభూ! భరతుడు ఇప్పటికే అనేక ఘనకార్యాలు చేశాడు. చాలా కష్టాలుపడ్డాడు. కఠోర నియమాలు పాటించాడు. ఈ అవకాశం నాకు ఇప్పించండి’ అని అర్థించాడు. శ్రీరాముడు చిరునవ్వు నవ్వాడు. ‘శత్రుఘ్నా! అలాగే కానీ. నువ్వు శూరుడివి. యుద్ధతంత్ర విశారదుడివి. లవణాసురుడిని జయించు. ఆ రాజ్యానికి నిన్నే అభిషిక్తుడిని చేస్తాను’ అన్నాడు. రాముడి మాటలతో శత్రుఘ్నుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. నిజానికి శత్రుఘ్నుడు లవణాసురుడిని సంహరిస్తానన్నది స్వార్థబుద్ధితో కాదు. తమ్ముడినైన తానుండగా, ఆ పనికి అన్నగార్లు వెళ్లవలసిన అవసరం ఏమిటనే ఉద్దేశంతో. అందుకు రాముడు రాజ్యం మాటెత్తాడు. శత్రుఘ్నుడు మనసు చిన్నబుచ్చుకుని చేతులు జోడించి, ‘మహారాజా! పెద్దలు మీరు ముగ్గురుండగా, నాకు రాజ్యాభిషేకమా! అది న్యాయమా? భరతుడి మాటకు నేను అడ్డువచ్చాను. అధిక ప్రసంగం చేశాను. పెద్దల సంభాషణకు పిన్నలు అడ్డుతగలకూడదు. అది పెద్ద తప్పు. క్షమించండి. ఇంకెన్నడూ ఇలాంటి పని చేయను. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి’ అన్నాడు ఎంతో ఆవేదనగా. తమ్ముడి వినయానికి, హృదయనైర్మల్యానికి రాముడు ఎంతో సంతోషించాడు. వెంటనే భరతలక్ష్మణులను పంపి, కావాల్సిన ద్రవ్యాలన్నీ తెప్పించి, వశిష్ఠుడిని పిలిపించి, సర్వజన సమక్షంలో శత్రుఘ్నుడిని మధు నగరాధిపతిగా అభిషేకించాడు. శ్రీరాముడు శత్రుఘ్నుడిని ప్రియమార తన తొడపై కూర్చుండబెట్టుకున్నాడు. అతడి ప్రతాపాన్ని ప్రశంసించి ప్రోత్సహించాడు. లవణాసుర సంహారానికి అవసరమైన ఉపాయాలన్నీ ఉపదేశించాడు. అంతటి అన్నగారు తొడపై కూర్చుండబెట్టుకుని తనను గురించి ప్రశంసా వాక్యాలు పలుకుతుంటే శత్రుఘ్నుడు చెప్పలేని ఆనందం అనుభవించాడు. జన్మతరించినట్టు భావించాడు. లవణాసుర యుద్ధం శత్రుఘ్నుని జీవితంలో ఒక ప్రసిద్ధ ఘటన. లవణాసురుడు సామాన్యుడు కాదు. మహాబలుడు. పైగా అతడికి శివుడిచ్చిన శూలం ఉంది. అందుచేత అతడిని సంహరించడం ఎంతో కష్టమైన పని. అందుకు శక్తి మాత్రమే కాదు.. యుక్తి కూడా కావాలి.
శత్రుఘ్నుడు సైన్యాన్ని సమాయత్తం చేశాడు. సైన్యాన్ని ముందుగా పంపాడు. నెల తరువాత తాను తల్లులకు, అన్నలకు, వశిష్ఠుడికి నమస్కరించి యుద్ధానికి బయల్దేరాడు. దారిలో వాల్మీకి ఆశ్రమంలో ఒకరోజు విశ్రమించాడు. ఆ మహర్షి ఆతిథ్యం స్వీకరించాడు. ఆ రాత్రే సీతాదేవి కుశ•లవులను గన్నది. శత్రుఘ్నుడు మహదానందంతో వదిన గారిని దర్శించి, కుశలమడిగి, మరునాటి ఉదయమే బయల్దేరి భార్గవచ్యవనుని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ మహర్షి చెప్పగా లవణాసురుని శక్తిసామర్థ్యాలు, అతని శూలం వల్ల మాంధాత మహారాజు మరణించిన విధం అంతా విన్నాడు. మహర్షుల సలహా మేరకే మరునాడు ఆ రాక్షసుడు ఆహారానికి అరణ్యాలను వెళ్లిన సమయంలో అతని మధుపుర ద్వారాన్ని శత్రుఘ్నుడు ముట్టడించాడు. లవణుడు వివిధ మృగాల మాంసాలు మోసుకుంటూ ఇంటికి వచ్చి వాకిటికి అడ్డంగా ఉన్న శత్రుఘ్నుడిని చూశాడు. ఒక్కసారిగా అతడిపై మండిపడుతూ, ‘ఓ మూర్ఖా! మీ అన్న మా పినతల్లి కొడుకు రావణుడిని సంహరించి అతడి వంశాన్ని నాశనం చేశాడు. అయినా నేను సహించి ఊరుకున్నాను. ఇప్పుడు నీ అంతట నీవే నా మీదికి వచ్చావు. నీ అంతం చూస్తాను’ అంటూ ఆ మాంస పదార్థాలను ఆవల పెట్టి శత్రుఘ్నుడి మీదికి విజృంభించాడు. లవణ శత్రుఘ్నుల ద్వంద్వ యుద్ధం భయంకరంగా సాగింది. లవణుడు ఒక మహా వృక్షాన్ని పెరికి శత్రుఘ్నుడి తలపై కొట్టాడు. ఆ దెబ్బకు శత్రుఘ్నుడు మూర్ఛబోయాడు. మూర్ఖుడైన లవణుడు శత్రువు మరణించాడని అనుకున్నాడు. తన సౌధంలోకి ప్రవేశించిన శీఘ్రమే తన శూలాయుధం తెచ్చుకోకుండా పక్కన పెట్టిన మాంస పదార్థాలను మోసుకు వెళ్లాలని ప్రయత్నించాడు.
అంతలోనే శత్రుఘ్నుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. ద్వారానికి అడ్డుగా నిలిచాడు. అగ్నిమయమైన దివ్య బాణాన్ని వింట సంధించి విడిచాడు. అది లవణాసురుడి హృదయాన్ని ఛేదించి వెంటనే శత్రుఘ్నుడికి తిరిగి చేరింది.
లవణాసురుడు మరణించాడు. అతడి శూలాయుధం తిరిగి రుద్రుడిని చేరుకుంది.
మహర్షులంతా శత్రుఘ్నుడిని శ్లాఘించారు. దేవతలు హర్షించారు. అందరూ ఆ మహావీరుడిని ఆశీర్వదించారు. శత్రుఘ్నుడు మధుపురాన్ని ఆక్రమించాడు. ఆ నగర పునర్నిర్మాణానికి పన్నెండేళ్లు పట్టింది. అలా మధుపురాన్ని దేవేంద్ర నగరంలా మార్చి.. పుష్కర కాలం తరువాత అయోధ్యకు బయల్దేరాడు.
మార్గమధ్యంలో మళ్లీ వాల్మీకి ఆశ్రమం వద్ద ఆగాడు. ఆ సమయంలో రామ కథాగానం వినిపిస్తోంది. శత్రుఘ్నుడితో పాటు అతడి సైన్యం ఆ రామకథా గానామృతంలో తేలియాడారు. అనంతరం శత్రుఘ్నుడు తన శిబిరానికి చేరాడు. నిద్రలోనూ రామకథ వినిపిస్తూనే ఉంది. తరువాత అయోధ్యకు వెళ్లి నేరుగా శ్రీరాముడి పాదాలపై పడ్డాడు. శత్రుఘ్నుడు సవినయంగా నమస్కరించి, ‘అన్నా! నీ ఆజ్ఞ ప్రకారం అంతా జరిపించాను. లవణాసురుడు హతుడయ్యాడు. మధుపురం సురక్షితంగా ఉంది. మిమ్మల్ని వదిలి పన్నెండేళ్లు ఉన్నాను. ఇక ఈ ఎడబాటు సహించలేను. ఇక్కడే ఉంటాను’ అన్నాడు. ‘తమ్ముడూ! ప్రజాపాలన క్షత్రియ ధర్మం. ఎడబాటు అనివార్యం. రాజైన వాడు రాజ్యాన్ని వదిలి దూరంగా ఎక్కువ రోజులు ఉండకూడదు. ఏడు రాత్రులు ఇక్కడ ఉండటానికి నీకు అనుమతిస్తున్నాను. ఆ తరువాత నువ్వు అయోధ్య వదిలి మధుపురం వెళ్లక తప్పదు. అయితే అప్పుడప్పుడు నువ్వు అయోధ్యకు రావచ్చు’ అన్నాడు రాముడు. శత్రుఘ్నుడు ఏడు రాత్రులు అయోధ్యలో గడిపి మధుపురానికి బయల్దేరాడు.
మళ్లీ అన్నలను శత్రుఘ్నుడు చూసింది అశ్వమేధ యాగ సమయంలోనే. అది నైమిశారణ్యంలోని గోమతీ నదీ తీరాన జరిగింది. ఆ యాగ సమయంలోనే సీతాదేవి భూ ప్రవేశం చేసింది. ఆ సంఘటన అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఆ తరువాత జరిగిన లక్ష్మణ దేశ బహిష్కారం గురించి చాలా కాలం వరకు శత్రుఘ్నుడికి తెలియదు. ఒకనాడు అయోధ్య నుంచి దూతలు వచ్చారు. శత్రుఘ్నుడిని దర్శించారు. లక్ష్మణ దేశ బహిష్కారం గురించి చెప్పారు. కుశలవుల పట్టాభిషేకం గురించి తెలిపారు. రాముని సరయూ నది ప్రవేశ ప్రయత్నాన్ని ప్రస్తావించారు. కులక్షయానికి శత్రుఘ్నుడు కుమిలిపోయాడు. తలపంకించి తానూ సరయూ నది ప్రవేశానికి నిర్ణయించుకున్నాడు. వెంటనే మంత్రులు, పురోహితుడు కాంచనుడిని, పౌరులను పిలిచాడు. అయోధ్యలో జరిగినదంతా వివరించాడు. తన కుమారులిద్దరినీ పట్టాభిషిక్తులను గావించాడు. మధుపురికి అభిషిక్తుడైన సుబాహుడికి, వైదిశా పాలకుడైన శత్రుఘాతికి సమానంగా తన సైన్యాన్ని, సంపదను పంచాడు. అందరి దగ్గర సెలవు తీసుకుని, ఒంటరిగా రథం ఎక్కి హుటాహుటీన అయోధ్య చేరాడు. అప్పటికే రాముడు తెల్లని పట్టుబట్టలు కట్టుకున్నాడు. చేత దర్భలు పట్టుకున్నాడు. సరయూ పదీ ప్రవేశానికి బయల్దేరబోతున్నాడు. శత్రుఘ్నుడు సత్వరం రథం దిగి, ‘అన్నా! నా కుమారులకు పట్టం గట్టాను. నిన్ను అనుసరించాలనే ఆశతో వచ్చాను. అనుమతించు’ అన్నాడు ఆవేశంగా. అలాగే అన్నట్టు తలాడించి ముందుకు నడిచాడు రాముడు. అన్నతో పాటు శత్రుఘ్నుడూ సరయూ నదిలో లీనమైపోయాడు. స్వర్గం చేరుకున్నాడు.





































































































































































































































































































































































Review ముగ్గురన్నల ముద్దుల తమ్ముడు.