యముడు.. ఆ పేరు తలుచుకోవాలని కానీ, ఆ రూపాన్ని చూడాలని కానీ ఎవరూ కోరుకోరు. ఎందుకంటే యముడంటే ప్రాణాలు హరించే దేవుడని అందరికీ భయం. అయితే ప్రాణాలను హరిస్తాడని నమ్మే యమధర్మరాజుకీ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేసే గుడి ఉంది. అదెక్కడో కాదు.. మన తెలుగు గడ్డ మీదే. అక్కడి ఆలయంలో యమధర్మరాజు ఎన్నో విశేష పూజలు అందుకుంటాడు. చదవడానికి, వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఈ ఆలయ విశేషాలు చాలా ఆసక్తికరం. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలకు సమీపంలోని ధర్మపురిలో లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఉంది కదా! ఈ ఆలయానికి అనుబంధంగా యముడి ఆలయం ఉంది.
తమ జాతకాలు బాగా లేవని, ఏం చేసినా కలిసి రావట్లేదని, గ్రహదోషాల నివారణకు, మానసిక ప్రశాంత కరువైందని.. ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారు ఈ ఆలయంలోని యముడిని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుందని భక్తుల విశ్వాసం.
అలాగే, శనిగ్రహ దోషాలు, జాతక దోషాలు ఉన్న వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే ఆ బాధల నుంచి ఉపశమనం లభిస్తుందట. ఇక్కడ మండపంలో గల గండదీపంలో నూను పోసి యముని విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
ప్రతి నెలా భరణి నక్షత్రం రోజున యముడి ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు హాజరై పూజలు నిర్వహిస్తారు. భరణి నక్షత్రం సందర్భంగా రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుసూక్తం, యమసూక్తంతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి.
దీపావళికి రెండు రోజుల తరువాత వచ్చే ‘యమ ద్వితీయ’ రోజు యముడు తన చెల్లెలు అయిన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లి, తిరిగి యమలోకం వెళ్లేముందు ‘ఈరోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవ’ని వరమిస్తాడని ప్రతీతి. ఆ రోజున (యమ ద్వితీయ) ఇక్కడ యముడికి విశేష పూజలు నిర్వహిస్తారు. యముడిని దర్శించే వారు ముందుగా గోదావరీ నదిలో స్నానం చేసి, యముడికి పూజలు నిర్వహిస్తారు. ఇలా పేరు తలచుకోవడానికే భయపడే యముడి అనుగ్రహం కోసం ఇలా పూజలు నిర్వహిస్తుండటం విశేషం.
ధర్మపురిలోని యముడి ఆలయం పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటిదని అంటారు. కార్తీక మాసంలో ఈ గుడికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మార్కండేయుడికి, సావిత్రికే కాదు.. మనకూ వరాలు ఇవ్వడానికి ధర్మపురిలో యమధర్మరాజు సిద్ధంగా ఉన్నాడన్న మాట!.
ఇదీ స్థల పురాణం..
ఒకానొక సమయంలో యమధర్మరాజు తన యమలోకానికి వస్తున్న పాపులను నిత్యం చూస్తుండటం వల్ల విచారగ్రస్తుడై మనశ్శాంతి కోల్పోయాడు. పాపులను చూడ్డం వల్ల పాప సంచయనం కలుగుతుందని భావించి పుణ్యక్షేత్ర సందర్శనకు బయల్దేరాడు. సమస్త క్షేత్రాలు తిరుగుతూ చివరికి గోదావరీ తీరాన గల ధర్మపురి చేరుకున్నాడు. నదిలో స్నానం చేయగానే ఆయనకు గొప్ప మనశ్శాంతి కలిగిందట. ఈ మేరకు బ్రహ్మాండ, స్కంద పురాణాల్లో వివరాలు ఉన్నాయి. సూతుడు శౌనకాది మునులకు, నారదుడు పృథు మహారాజుకు ఈ క్షేత్ర మహిమను తెలిపినట్టు పురాణ కథనం.
యముడు గోదావరిలో స్నానం చేసిన స్థలానికి ‘యమకుండము’ అని పేరు.
కోరలతో, యమ దండాన్ని ధరించిన భీకరాకార ఆరడుగుల భారీ విగ్రహం.. చూడగానే పాపాలు చేయరాదనే భయాన్ని కలిగిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ముఖ్య నగరాలు, పట్టణాల నుంచి కరీంనగర్‍కు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి సులభంగానే ధర్మపురికి చేరుకోవచ్చు.
Review యముడికీ ఓ గుడి.. చలో ధర్మపురి.