ఒక రాజ్యంలో ఇద్దరు పేదవాళ్లు ఉండేవారు. ఇద్దరూ కూడా కడు నిరుపేదలు. అందుచేత నిత్యం రాజుగారి వద్దకు వచ్చిపోయి, ఆయనను యాచించి పోతుండేవారు.
అందులో ఒకడు, ‘తమరు ప్రభువులు! తమ రాజ్యం చల్లగా ఉండాలి. తమకు కలదాంట్లో మాబోటి పేదలకు ఇంత పెట్టాలి. అంతా రాజాధీనం!’ అనేవాడు.
రెండో వాడు, ‘తమ మీద భగవంతుడి కటాక్షం ఉండాలి. తమ చేత భగ•వంతుడు మా బోటివాళ్లకింత ఇప్పించాలి. అంతా దైవాధీనం!’ అనేవాడు.
రాజుగారు ఇద్దరికీ తోచినది ఇచ్చేవాడు కానీ, ఆయనకు మొదటి వాడి మీదే అభిమానం జాస్తిగా ఉండేది.
ఆయన ఒకనాడు మంత్రితో అన్నాడు కదా- ‘నేను రాజును. నా ప్రజలకు ఏం చేసినా నేను చేయాలి కాని మధ్యలో భగవంతుడేమిటి? అయినా, దైవాధీనం ఎంతవరకో చూద్దాం! ఒక గుమ్మడికాయ తెప్పించి దాని తొడిమ తీయించి లోపల డొల్ల చేసి అందులో వజ్రాలూ, వైడూర్యాలూ, మరకతాలూ, మాణిక్యాలూ పోయించి ఆ విషయం ఎవరికీ తెలియరాకుండా దాని తొడిమను అంటించు. దాన్ని రేపు ఉదయం మొదట వచ్చిన వాడికి ఇద్దాం. ఇద్దరిలో అది ఎవరికి దక్కుతుందో చూద్దాం’ అన్నాడు.
రాజుగారు చెప్పినట్టే గుమ్మడికాయను తయారు చేయించాడు మంత్రి. తెల్లవారక ముందే, ‘రాజాధీనం’ అనే పేదవాడు వచ్చి, ‘తమరు ప్రభువులు. తమ రాజ్యం చల్లగా ఉండాలి. తమకు గల దానిలో మాబోటి వాళ్లకు ఏదో అంత ఇప్పించాలి. అంతా రాజాధీనం!’ అన్నాడు.
అతడికి మంత్రి గుమ్మడికాయ ఇచ్చి పంపేశాడు.
‘చూశావా! ఇప్పుడేమంటావు?’ అన్నాడు రాజు గర్వంగా మంత్రితో.
గుమ్మడికాయ తీసుకుని వెళ్తున్న పేదవాడు, ‘ఇదేమిటి? రాజు గారు ఇన్ని నాణేలు ఇప్పించక ఈ దిక్కుమాలిన గుమ్మడికాయ ఇప్పించారు. దీన్ని ఎవడికన్నా ఇచ్చి బియ్యం పట్టుకుపోదాం. చెడ్డ బరువు ఉంది కూడా’ అనుకున్నాడు.
దారిలో ఒక వర్తకుడి దగ్గర ఆ గుమ్మడికాయను అమ్మేసి తనకు కావాల్సిన బియ్యాన్ని పట్టుకుని ఇంటికి చక్కా వెళ్లాడు మొదటి పేదవాడు.
తరువాత కాసేపటికి ‘దైవాధీనం’ అని నిత్యం పలికే రెండో పేదవాడు ఆ వర్తకుడి వద్దకు వచ్చాడు.
‘అయ్యా! ఈ పూట మా ఇంటికి అతిథులు వచ్చారు. కూర లేదు. ఆ గుమ్మడికాయ ఇప్పించండి’ అన్నాడు.
వర్తకుడు ‘సరే, పట్టుకుపొమ్మ’ని గుమ్మడికాయ ఇచ్చాడు.
రెండో పేదవాడు ఆ గుమ్మడికాయను ఇంటికి పట్టుకెళ్లి పెళ్లాం చేతికిచ్చి తరిగిస్తే లోపల దాని నిండా రత్నాలు బయటపడ్డాయి.
‘ఇదే కదా దైవాధీనమంటే’ అనుకున్నాడు పేదవాడు.
మర్నాడు యథా ప్రకారం మొదటి పేదవాడు రాజు గారి వద్దకు యాచనకు వెళ్లాడు.
‘అన్ని రత్నాలిచ్చినా మళ్లీ ముష్టికొచ్చాడేమిటీ పేదవాడు?’ అని రాజుగారికి ఆశ్చర్యం కలిగింది.
‘నిన్న నేను ఇచ్చిన గుమ్మడికాయ భోంచేశారా?’ అని అడిగాడు అతడి•ని రాజుగారు.
‘ఆహా! మహా రుచిగా ఉన్నది. అంతా రాజాధీనం’ అన్నాడు పేదవాడు.
‘అంతా మీరే భోంచేశారా? కొంత ఎవరికైనా ఇచ్చారా?’ అని ప్రశ్నించాడు రాజు.
‘అంతా మేమే భోంచేశాం ప్రభూ! తమరిచ్చిన ప్రసాదం పైకి పోనిస్తామా! అంతా రాజాధీనం’ అని బదులిచ్చాడు పేదవాడు.
‘ఈ అబద్ధాలకోరు వీపు పగలగొట్టండి’ అని ఆజ్ఞాపించాడు రాజుగారు.
దెబ్బ అనగానే దయ్యం వదిలి ఆ పేదవాడు జరిగినదంతా చెప్పేశాడు. గుమ్మడికాయను వర్తకుడికి అమ్మేసినట్టు చెప్పడంతో రాజుగారు ఆ వర్తకుడిని పిలిపించారు.
‘నిన్న ఆ పేదవాడు ఇచ్చిన గుమ్మడికాయను ఏం చేశావు?’ అని అడిగాడు. ‘పేదవాడి సొత్తు నాకెందుకు మహారాజా! అది మరో పేదవాడికి దానం చేసేశాను’ అన్నాడు వర్తకుడు.
రాజుగారు ఆ రెండో పేదవాడిని పిలిపించి, ‘నిన్న వర్తకుడి వద్ద పుచ్చుకున్న గుమ్మడికాయ మీ ఇంట్లో వండుకున్నారా?’ అని అడిగాడు.
‘వండుకోవడానికి ఎక్కడిది మహారాజా! దాన్ని కోసి చూద్దుము కదా! దాని నిండా రత్నాలూ, కెంపులూనూ! అంతా దైవాధీనం. భగవంతుడి అనుగ్రహం చేత నా దారిద్య్రం తీరిపోయింది’ అన్నాడు రెండో పేదవాడు.
తాను మేలు చేయదలచింది మొదటి పేదవాడికి. కానీ, మేలు జరిగింది రెండో పేదవాడికి. అంతా దైవాధీనమే కాని తన ఆధీనంలో ఏమీ లేదని రాజుగారు బుద్ధి తెచ్చుకుని తన అహంకారాన్ని తగ్గించుకున్నాడు.
మాటిమాటికీ ‘రాజాధీనం’ అంటూ తనకు పొగరెక్కడానికి పరోక్షంగా కారణమైన మొదటి పేదవాడిని మరెప్పుడూ తన వద్దకు రావద్దని తరిమేశాడు రాజుగారు.





































































































































































































































































































































































Review రాజాధీనం – దైవాధీనం.