
ఒక ఊరిలో ఆశపోతు రామన్న అని ఒకడు ఉండేవాడు. వాడు డబ్బులిస్తామంటే ఏ పనికైనా సిద్ధపడేవాడు. ఈ కీలకం తెలిసిన ఒక పొరుగూరి వాడు అతని వద్దకు వచ్చి, ‘ఏమండి రామన్న గారూ! ఇక్కడికి రెండు క్రోసుల దూరంలో బ్రహ్మాండమైన పుట్ట ఒకటి ఉంది. ఆ పుట్టలో మహిమ గల నాగుమయ్య (పాములు) లున్నాయి. వాటి మహిమ వల్ల మేలు పొందడానికి జనం మొక్కులు తీర్చుకుంటూ దక్షిణలు సమర్పిస్తూ ఉంటారు. నేను పుట్టి బుద్ధెరిగినప్పటినుంచి అందులో భక్తుల కానుకలు పడుతూనే ఉన్నాయి. నేను చూస్తూనే ఉన్నాను’ అన్నాడు. ‘మరైతే ఆ పుట్ట తవ్వి ఆ ధనమంతా తీసుకోకపోయావా?’ అని అడిగాడు రామన్న.అందుకు పొరుగూరి వాడు ‘ అమ్మయ్యో! ఆ పుట్ట తవ్వడమే? నాగుల జోలికి వెళ్తే రెండు కళ్లూ పోవూ’ అన్నాడు.
‘మన వాళ్ల పిచ్చి నమ్మకాలంటే ఇవే. ఆ పుట్ట ఎక్కడుందో నాకు చూపించు. నేను తవ్విపెడతాను. కానీ, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు సుమా!’ అన్నాడు రామన్న.
పుట్టలోని ధనమంతా తనకే దక్కాలన్న ఆశతో ఒక వంద రూపాయలను రామన్న ఆ పొరుగూరి వాడి చేతిలో పెట్టి వాడి నోరు మూయించాడు. రాత్రికి రాత్రి పది మంది కూలీలను వెంటబెట్టుకుని వెళ్లి రామన్న ఆ పుట్టను తవ్వించాడు. అందులో ఉన్న పాముల్ని తరిమి కొట్టించాడు. వాటిలో ఒక పాము వచ్చి ఒక కూలీని కాటువేసింది. దాంతో అతడు మరణించాడు. తీరా పుట్టను అడుగుకంటా తవ్వించగా కేవలం రెండు వందల చిల్లర పైసలు దొరికాయి. రామన్న ఉసూరుమన్నాడు. కూలీ చనిపోయినందుకు రెండు వందల రూపాయలపైనే ఆ కుటుంబానికి భరణం ఇవ్వాల్సి వచ్చింది. పైసా కూడా దక్కకపోగా వంద రూపాయలు పొరుగూరి వాడికి, పుట్టలో దొరికిన దానికి అదనంగా కూలీ కుటుంబానికి పోగా చేతి చమురు వదిలి రామన్న లబోదిబోమన్నాడు. అయాచితంగా వచ్చే డబ్బుకి ఆశపడకూడదని బుద్ధితెచ్చుకున్నాడు.
Review రామన్న అత్యాశ.