రామాయణంలో విభీషణుడిది వివాదగ్రస్త శీలం. కష్టకాలంలో ఆయన స్వార్థబుద్ధితో స్వజనులను వీడి, శత్రుపక్షం చేరి తిన్నింటికే నిప్పు పెట్టాడని నిందిస్తారు కొందరు. కాదు- అన్నగారి దుర్మార్గాన్ని గర్హించి, అతనికి మంచి చెప్పి చెడ్డ అయి, ఆ రాముని మహత్వాన్ని, రానున్న ప్రమాదాన్ని దర్శించి అధర్మపక్షం వీడి, ధర్మపక్షాన్ని స్వీకరించిన పరమ ధార్మికుడని ప్రశంసిస్తారు మరికొందరు. అందులో ఏది నిజం? రెండూ రెండు భిన్న దృక్పథాలు.
జీవితంలో పుట్టుకను బట్టి, ఉనికిని బట్టి, వృత్తిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి ఎన్నో ధర్మాలు మనిషి చుట్టూ పెనవేసుకుంటాయి. అయితే, మనిషి పెరిగేకొద్దీ అతనిదైన ఒక వ్యక్తిత్వం కూడా పెరుగుతుంది. వ్యక్తిత్వం ప్రధానంగా వ్యక్తి ఆలోచనాక్రమం. అదే అతనిని ఇతరుల నుంచి వేరు చేస్తుంది. అతడిని అతడిగా చేస్తుంది. దాని మీద జన్మాంతర సంస్కారం, పరిస్థితుల ప్రభావం బాగా పని చేస్తాయి. వ్యక్తిత్వం పక్వమయ్యే కొద్దీ స్వపర భేదాన్ని అధిగమించి ఆలోచించగల స్థితి ఏర్పడుతుంది. సత్త్వశుద్ధి కలుగుతుంది. ధర్మదృష్టి ప్రబలుతుంది. సత్యదర్శనం సాధ్యమవుతుంది. ఆయా పరిస్థితులను బట్టి ఆత్మీయతలను, బాంధవ్య బాధ్యతలను, వృత్తి ఉద్యోగ కర్తవ్యాలను కూడా అవతలికి నెట్టి తాను నమ్మిన ధర్మాన్ని లేదా తాను దర్శించిన సత్యాన్ని అన్నింటి కన్నా మిన్నగా ఆరాధించడం, అనుసరించడం జరుగుతుంది. ఒక్కొక్కప్పుడది ఎన్నో అపార్థాలకు, అనర్థాలకు దారితీయవచ్చు. లేక అనేక లాభాలకు, అపార కీర్తిప్రతిష్టలకు ఆలవాలం కావచ్చు. అయితే ఆయా సందర్భాల్లో వ్యక్తి ఆలోచన, ప్రవర్తన ధర్మదృష్టి ప్రధానంగా సాగాయా లేక స్వార్థ దృష్టి ప్రధానంగా సాగాయా లేక ఉభయతారకంగా ప్రవర్తిల్లాయా అన్నదే విచారింపదగిన అంశం.
రామాయణంలో విభీషణుడి ఆలోచన, ప్రవర్తన ధర్మదృష్టి ప్రధానంగా ప్రారంభమయ్యాయి. ఉభయతారకంగా పరిణమించాయి. విభీషణుడు స్వార్థపరుడని కొందరు వేలెత్తి చూపడానికి అవకాశమిచ్చాయి.
విభీషణుడి తండ్రి అనుగ్రహం వల్ల పుట్టుక నుంచే ధర్మదృష్టి ఏర్పడింది. విశ్రవసుడు కైకసి ప్రార్థనను మన్నించి నీ కడగొట్టు కొడుకు ధర్మాత్ముడు అవుతాడని వరమిచ్చాడు. అందువల్ల తొలి నుంచీ విభీషణుడిది రావణ కుంభకర్ణుల కంటే భిన్నమైన మనస్తత్వం. అన్నలతో పాటు అతను కూడా కఠోరమైన తపస్సు చేశాడు. అయితే, అతడు బ్రహ్మదేవుడిని అడిగిన వరాలే వేరు. అనవరతం తన మనసు ధర్మబద్ధంగానే ఉండాలని, అభ్యసించకుండానే తనకు బ్రహ్మాస్త్రం సిద్ధించాలని బ్రహ్మను అడిగాడు. అందుకు బ్రహ్మ అంగీకరించడమే కాకుండా ఇస్తున్నానన్నాడు.
విభీషణుడు రాక్షస వంశంలో జన్మించినా, రాక్షసుల మధ్య నివసించినా అతడి అభిరుచులు, ఆలోచనలు వేరు. జీవన విధానమే వేరు. అన్యాయాలు, అక్రమాలు అతడికి గిట్టవు. అందువల్ల రావణుడి దృష్టిలో, రాక్షసజాతి దృష్టిలో శత్రువుగా కనిపించాడు. కాబట్టి ఆయన రాక్షసుడైనా కానట్టే. లంకలో ఉన్నా లేనట్టే. విభీషణుడి భార్య సరమ. కూతురు త్రిజట. వీరిద్దరూ కూడా సాధు స్వభావం గలవారే.
అయితే, విభీషణుడి ధర్మదృష్టిపై రావణుడికి కొంత గౌరవం లేకపోలేదు. రావణుడు హనుమంతుడికి మరణదండన విధించే సమయంలో తొలిసారి విభీషణుడు రావణ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు.
‘అన్నా! దూతను వధించడం అన్యాయం. నీకు హనుమను శిక్షించాలని ఉంటే వానరులకు వాలమే ప్రియమైనది కాబట్టి దానికి నిప్పంటించి వదిలెయ్’ అన్నాడు.
విభీషణుడి ఆనాటి ధర్మదృష్టిని రావణుడు గౌరవించడం చేతనే ఆనాడు మారుతికి మరణదండన తప్పింది.
ఆ తరువాత ఒక కోతి సముద్రం దాటి లంకలోకి వచ్చిందంటే చిన్న విషయం కాదని, త్వరలోనే రాముడు వానరసేనతో లంకపైకి దండెత్తి రాగలడని అన్నకు విభీషణుడు చెప్పాడు. కానీ, మూర్ఖ రాక్షసులు శత్రుబలాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ విభీషణుడిని గేలి చేశారు. ఆ రాముడిని, వానరసేనను ఇప్పుడే కడతేరుస్తామంటూ కొందరు రాక్షసులు ఆయుధాలు చేపట్టారు. విభీషణుడు వారందరినీ ఆపాడు. రాముడు ధర్మాత్ముడని, అపారశక్తి సంపన్నుడని చెప్పాడు. ‘అలాంటి రాముడి భార్యను నువ్వు అన్యాయంగా అపహరించి తెచ్చావు. లంకా పట్టణం ప్రమాదంలో మునగక ముందే సీతను రాముడికి అప్పగించి సఖ్యత కుదుర్చుకో. ధర్మాన్ని అవలంబించు. రాక్షసజాతిని రక్షించు’ అన్నాడు.
విభీషణుడు మళ్లీ మర్నాడు అన్నగారి వద్దకు వెళ్లాడు. ఆయనకు నమస్కరించి ఎదురుగా కూర్చున్నాడు. అనేక ప్రియోక్తులతో అన్నను ప్రసన్నం చేసుకున్నాడు. సీత లంక చేరింది మొదలు సంభవించిన అశుభాలన్నీ ఏకరువు పెట్టాడు. ‘అగ్నిహోత్ర గృహాల్లోకి, వేదాధ్యయన స్థలాల్లోకి విషసర్పాలు వస్తున్నాయి. ఆవుల పాడి తగ్గిపోయింది. కాకులు, గ్రద్దలు గుంపుకట్టి ఇళ్లపై తిరుగుతున్నాయి. నగర పరిసరాల్లో ప్రతి దినం నక్కలు అరుస్తున్నాయి. ఇవన్నీ లంకలో అందరికీ తెలిసినా నీకు భయపడి కొందరు చెప్పడం లేదు. మరికొందరు నీ మెప్పు కోరి చెప్పడం లేదు. ఇచ్చకాలు చెప్పడం నాకు చేతకాదు. లంకా నగరం నాశనం కాకముందే న్యాయదృష్టితో వ్యవహరించు’ అని చెప్పాడు.
అయినా రావణుడు మారలేదు. తన పట్టు వీడలేదు. మర్నాడు రావణుడు మళ్లీ కొలువుదీరాడు.
అది లంకేశ్వరుని సభ. మహాసభ. ఒకవైపు వేదధ్వనులు, మరోవైపు భేరీనాదాలు, ఇంకోవైపు వందిమాగధ విజయధ్వానాలు.. ఎటుచూసినా ద్వార తోరణాలు, అగరుధూపాలు, వివిధ పరిమళాలు. రావణుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. అందరూ ఊపిరి బిగపట్టి ఆయన వైపే చూస్తున్నారు.
రావణుడు సీతాపహరణ విషయం చెప్పాడు. ఆమెపై తనకు గల వ్యామోహాన్ని తెలిపాడు. తన శాప విషయాలు ప్రస్తావించాడు. గతంలో తాను సాధించిన విజయాలు గుర్తుచేశాడు. స్వకీయశక్తి సామర్థ్యాలు వివరించాడు. రామలక్ష్మణుల రణ ప్రయత్నాలు సూచించాడు. ఆంజనేయుడి ఆగడాల గురించి చెప్పాడు. అయినా, సీతనివ్వకుండా శత్రు సంహార మార్గం ఆలోచించండన్నాడు. అందరూ ముక్తకంఠంతో రాముడిపైకి దండెత్తుదామని అన్నారు.
కుంభకర్ణుడు కోపోద్రిక్తుడై అన్నగారి అధర్మాన్ని, ఆయన సీతాపహరణాన్ని నిరసించాడు. కానీ చివరకు రావణుడి మాటననుసరించి రామలక్ష్మణులను వధిస్తానన్నాడు. వానరసేనను పిండి పిప్పి చేస్తానన్నాడు.
మహాపార్శ్వుడు మహా ప్రియంగా మాట్లాడాడు. సంశయం లేకుండా సీతను అనుభవించమన్నాడు. ప్రహస్తుడు కూడా అదే చెప్పాడు. రావణుడు పొంగిపోయాడు. ఒక్కఊపున శ్రీరాముడి శక్తియుక్తుల్ని తోసిపుచ్చాడు. ఆత్మస్తుతితో హర్షధ్వానాల మధ్య అట్టహాసం చేశాడు.
ఆ సభలో రాముడి శక్తిసామర్థ్యాలను గుర్తించిన వివేకి కానీ, రానున్న ప్రమాదాన్ని దర్శించిన దీర్ఘదర్శి కానీ ఒక్కరూ లేరు.
అప్పుడు లేచాడు విభీషణుడు. ‘ప్రభూ! సీతను కోరడం మహాసర్పం మీద మరులుగొనడం. వానరులు లంక మీదకు రాకముందే రామబాణాలు రాక్షస శిరసులను తుంచకముందే సీతను రాముడికి అప్పగించడం శ్రేయస్కరం’ అన్నాడు. అలా అంటూ ప్రహస్తుడి వైపు తిరిగి, ‘ప్రహస్తా! నువ్వా రాముడిని ఎదుర్కొనేది? కుంభకర్ణుడు కానీ, ఇంద్రజిత్తు కానీ, కడకు రావణుడు కానీ రాముడి ఎదుట నిలవలేరు. ప్రాణభీతితో పాతాళానికి పారిపోయినా రామబాణం నుంచి తప్పించుకోలేరు. మాటలు కట్టిపెట్టి, మంచితనం కొంతైనా మిగుల్చుకుని, మనం సీతను రాముడికి అప్పగించడం అన్ని విధాలా మేలు’ అనగానే ఇంద్రజిత్తు కల్పించుకున్నాడు.
‘పినతండ్రీ! నువ్వు పిరికితనంతో శత్రువును పొగుడుతున్నావు. పులస్త్య వంశంలో పొరపాటున పుట్టావు. నా బలపరాక్రమాలు నీకు తెలియవా? నా ముందు రాముడొక లెక్కా?’ అన్నాడు.
‘ఇంద్రజిత్తూ! నువ్వు చిన్నవాడివి. బుద్ధి పక్వం కానివాడివి. రామబాణం బ్రహ్మాండం. రామబాణం మృత్యుపాశం’ అని విభీషణుడు బదులిచ్చేసరికి రావణుడు అగ్రహోదగ్రుడయ్యాడు.
‘విభీషణా! నువ్వు జ్ఞాతివి. శత్రుపక్షపాతివి. నా వైభవం చూసి ఓర్వలేని వాడివి. నా యెదుట శత్రు ప్రశంస చేసేవాడివి. అయినా సోదరుడవని సహించాను. మరొకడివైతే ఈ పాటికి మరణించే వాడివే’ అంటూ పళ్లు పటపటా కొరికాడు.
విభీషణుడి మనసు విరిగిపోయింది. అందరి క్షేమం కోరి మంచి చెబితే తననే అనుమానించారు. అవమానించారు. ఇక విభీషణుడికి మిగిలిన మార్గాలు మూడు. జీవచ్ఛవంలా అన్న పక్షాన ఉండి అందరితో పాటు తానూ రాముడి చేతిలో హతం కావడం. అలాకాక అన్నను వదిలి ఏ అరణ్యాలకో వెళ్లడం. లేదా అన్నింటిని మించి ధర్మాన్ని అనుసరించి ఆ రాముడి శరణు వేడటం.
విభీషణుడు ఆ క్షణంలోనే తన ధర్మబుద్ధితో రాక్షసనాశాన్ని, రామ విజయాన్ని దర్శించాడు. ఆ రాముడినే ఆశ్రయించాలని నిర్ణయించాడు. నలుగురు సహచరులతో కలిసి ఆకాశానికి ఎగురుతూ, ‘అన్నా! నువ్వు పితృసమానుడవు. పూజార్హుడవు. నీ మేలు కోరి హితం చెప్పాను. నీకది రుచించలేదు. లోకంలో అందరూ ప్రియవాదులే. ఆ ప్రియవాదుల పలుకులే అందరూ వింటారు. అవే వినాలని కోరుకుంటారు. అప్రియమైనా హితం చెప్పే వారు కానీ, చెప్పినా వినేవారు కానీ ఎవరూ దొరకరు. ఇల్లు కాలుతుంటే చూసి ఊరకుండలేక నీళ్లు చల్లినట్టు నీకింత వరకు హితం చెప్పాను. అయితే అదంతా వ్యర్థమైంది. రామబాణానికి నువ్వు, రాక్షసులు, లంక దగ్ధం కాక తప్పదు. అయినా ప్రయత్నించు. నిన్ను నువ్వు రక్షించుకో. రాక్షసులను రక్షించు. లంకను రక్షించు. నీకు మేలగు గాక! నన్ను క్షమించు. నేవెళ్లి వస్తా’ అని విభీషణుడు చివరిసారిగా చెప్పాడు.
రావణుడు అతని వైపే చూడలేదు. అతని మాటలు వినిపించుకోలేదు.
విభీషణుడు రావణుడిని వదిలి రాముడిని చేరాలనుకున్నది రాజ్యకాంక్షతో కాదు. అన్నగారి అధర్మానికి భయపడి. రాముని గుణగణాలకు మురిసి, రానున్న ప్రమాదాలకు జడిసి రాముడి వైపు నిలబడాలని అనుకున్నాడు కానీ, రాజ్యం పొందడానికి కాదు.
విభీషణుడు రాముడి ఆశ్రయం పొందడం అంత సులభమైన పనికాదు. పైగా అది ప్రమాదంతో కూడుకున్నది. శత్రుపక్ష ప్రవేశం ఏమాత్రం అనుమానానికి తావిచ్చినా అది ప్రాణాంతకమవుతుంది. అందుచేత విభీషణుడు చేసింది గొప్ప సాహసం. అయితే, అతడు ఎంతో వివేకి కాబట్టి ఆ సాహసం సఫలమైంది.
సహచరులతో కలిసి విభీషణుడు వెంటనే రాముడి చెంత వాలలేదు. ఏం జరుగుతుందో ఏమోనని ఆకాశంలోనే కొద్దిసేపు నిలిచాడు. అంతలో సుగ్రీవాదులు రానే వచ్చారు. వాళ్లతో తాను రావణుడి సోదరుడినని, పేరు విభీషణుడని, సీతమ్మను రాముడికి అప్పగించాలని హితం చెప్పినందుకు తన అన్న అవమానించాడని, అందుచేతనే భార్యాపిల్లలను వదిలి సర్వలోక శరణ్యుడైన రాముడిని శరణువేడటానికి వచ్చానని, ఆ సంగతి రాముడితో చెప్పి సహాయం చేయాలని కోరాడు.
సుగ్రీవుడు లక్ష్మణుడితో కలిసి రాముడి సమక్షానికి వెళ్లాడు. విభీషణుడి విషయం చెప్పాడు. అతడికి ఆశ్రయం ఇవ్వడం ప్రమాదకరమని హెచ్చరించాడు.
రాముడు తన చుట్టూ ఉన్న వానర ప్రముఖులను సంప్రదించాడు. అందరూ తలో మాట చెప్పారు. అందరిలో ఆంజనేయుని మాట, ఆలోచన రాముడి మనసుకు నచ్చాయి. ఆంజనేయుడు, ‘స్వామీ! విభీషణుడి ముఖం ప్రసన్నంగా ఉంది. చిత్తశుద్ధి ప్రతిఫలిస్తోంది. ద్రోహబుద్ధి ఉంటే ఇంత ధైర్యంగా ఇక్కడకు వస్తాడా! అన్న దుర్మార్గానికి భయపడి, నీ గుణగణాలకు మెచ్చి నిన్ను శరణు వేడటానికి వచ్చాడు. బహుశా నువ్వు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యమిచ్చిన సంగతి కూడా అతడి మనసులో ఉండవచ్చు’ అన్నాడు. ఆ మాటలతో రాముడు విభీషణుడికి అభయమిచ్చాడు.
విభీషణుడు రాముడి పాదాలకు నమస్కరించాడు. లంక సంగతులు, రావణుడి స్వభావం అంతా ఏకరువు పెట్టాడు. అతడి జీవితంలో ఇది పెద్ద మలుపు. ఇది అతనికెంతో అనుకూలించింది. రాముడికి కూడా ఎంతో ఉపయోగపడింది. అయితే రావణుడికి మాత్రం ప్రమాదకరంగా పరిణమించింది. రావణుడి ఆయువుపట్టు రాముడికి చిక్కినట్టయింది.
రాముడు విభీషణుడిని ప్రియమార కౌగిలించుకున్నాడు. లక్ష్మణుడినిపంపి సముద్ర జలం తెప్పించి విభీషణుడిని భావి లంకాధిపతిగా అభిషేకించాడు.
యుద్ధంలో విభీషణుడు అనేక విధాలుగా రాముడికి ఉపకరించాడు. ససైన్యంగా సముద్రం దాటడానికి సముద్రోపాసనమే సరైన మార్గమని శ్రీరాముడికి చెప్పిన వాడు విభీషణుడు. వానర రూపం దాల్చి, వంచనతో వానరసేన రహస్యాలు కనిపెట్టాలని వచ్చిన రావణచారులు, శుకసారణులను రాముడికి పట్టిచ్చాడు విభీషణుడు. శార్దూలుని నాయకత్వంలో రెండోసారి వచ్చిన రావణచారులను పట్టించిన వాడు కూడా విభీషణుడే. తన సహచరులైన అనల, శరభ, సంపాతి, ప్రఘసులను పక్షుల రూపంలో రావణుడి సైన్యంలో ప్రవేశపెట్టి అక్కడి వ్యూహ రహస్యాలన్నీ సేకరించి రాముడికి ఇచ్చాడు. ఇంద్రజిత్తు వధించిన మాయా సీతను నిజమైన సీతగా నమ్మి మానసికంగా కుంగిపోయిన రామలక్ష్మణులకు ఆమె మాయాసీత అని చెప్పి వారిని తిరిగి కోలుకునేలా చేశాడు. ఇంద్రుజిత్తు తలపెట్టిన హోమాన్ని లక్ష్మణుడితో భగ్నం చేయించాడు.
ఆత్మీయతలు, అనుబంధాలు మరణ సమయాల్లో పెల్లుబుకుతాయి. రావణుడు రాముడి చేతిలో మొదలు విరిగిన మహా వృక్షంలా యుద్ధభూమిలో పడిపోయేసరికి విభీషణుడిలో భాతృదు:ఖం కట్టలు తెంచుకుంది. రాముడి అనుమతితో రావణుడి అంత్యక్రియలను శాస్త్రోక్తంగా పూర్తి చేశాడు. అనంతరం రాముడి ఆశీర్వాదంతో లంకా రాజ్యానికి ప్రభువయ్యాడు.
ఆ పదవి, ఆ రాజ్యం కోరి విభీషణుడు రాముడిని ఆశ్రయించలేదు. పరిస్థితుల ప్రభావం వల్ల అవి దక్కాయి.
రాముడితో విభీషణుడిది రాజ్య సంబంధం మాత్రమే కాదు. ఆత్మ సంబంధం. అందుచేతనే రాముడు సరయూ నదీ ప్రవేశం చేస్తున్నాడని తెలిసి, తానూ తనువు త్యజించడానికి వచ్చాడు విభీషణుడు.
అయితే, అందుకు రాముడు అనుమతించ లేదు. ‘విభీషణా! ఎంత వరకు ప్రజలుంటారో అంతవరకు నువ్వు లంకలో జీవించి ఉంటావు. ఎంత వరకు సూర్యచంద్రులుంటారో, ఎంత వరకు భూమి ఉంటుందో, ఎంతవరకు నా చరిత్ర లోకంలో వ్యాపించి ఉంటుందో అంతవరకు నువ్వు రాజ్యం చేస్తావు. ధర్మబద్ధంగా ప్రజలను పాలించు. జగన్నాథుని పూజించు’ అని రాముడు చెప్పి పంపాడు.
అనంతరం విభీషణుడు ఎంత కాలమో లంకను పాలించాడు. ధర్మ ప్రభువుగా పేర్గాంచాడు. ఆనాడు రాముడిని ఆశ్రయించబట్టే విభీషణుడు అంతటి వాడయ్యాడు. రావణుడి వెంటే ఉండి ఉంటే అతడు ఏమయ్యే వాడో!.
ఇంత జరిగినా, రావణుడి భార్య మండోదరి విభీషణుడిని కించిత్తు కూడా నిందించలేదు. పైగా అతడి ధార్మికతను, అన్నకు అతడు చేసిన హితబోధను ప్రశంసించింది.
మొత్తానికి రామాయణంలో విభీషణుడిది ఒక విశిష్ట పాత్ర. రామాయణాన్నే పెద్ద మలుపు తిప్పిన పాత్ర. లోకం మరువలేని పాత్ర.





































































































































































































































































































































































Review విభీషణుడు.