ఉజ్జయినీ నగర సమీపంలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. దానిపై ఒక కాకి, ఒక హంస కాపురం ఉంటున్నాయి. దుష్ట స్వభావం, అల్పబుద్ధి గల కాకి సంగతి తెలిసి కూడా హంస పొరుగున ఉంటున్నదని దానితో స్నేహంగానే మసలుతోంది.
ఒకనాడు ఒక వేటగాడు అడవిలో వేట యేమీ దొరకక తిరిగి యింటికి పోతూ ఆ చెట్టు కింద నిద్రపోయాడు. అది వేసవికాలం ఎక్కడా గాలి లేదు. అతనికి శరీరం అంతా చెమట పట్టింది.స్వభావం చేత మంచిదయిన హంస కొమ్మపైన నిలిచి అతనికి తన రెక్కలతో విసరసాగింది. ఇంతలో అల్పబుద్ధి గల కాకి వచ్చింది. హంస చేస్తున్న పరోపకారం చూసి నవ్వింది.‘‘వాడు వేటగాడు ! మనల్ని బాణాలతో కొట్టి వేటాడుతాడు, వాడికి సేవ చేస్తున్నావు ఎంత పిచ్చిదానవు?’’ అని పరిహసించి ఆ కాకి అతనిపై రెట్ట వేసి ఎగిరిపోయింది. వేటగానికి మెలుకువ వచ్చి పైకి చూస్తే, హంసే తనపై రెట్ట వేసిందనుకొని బాణంతో దానిని కొట్టి చంపాడు. ‘అల్పులు, కుటిల బుద్ధి గల వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహం – కుందేలు
అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి రాజు సింహం. ఒకరోజు దానికి బాగా ఆకలివేసింది. అది ఎక్కడికి కదలలేక తన గుహ దగ్గరే దాక్కుంది. ఏదైనా జంతువు ఇటు రాకపోతుందా! ఆహారం దొరకకపోతుందా! అని ఎదురు చూడసాగింది.
ఒక చిన్న కుందేలు ఆడుతూపాడతూ అటువైపు వచ్చింది. కుందేలును తినటానికి సింహం ముందుకు దూకింది. తెలివైన ఆ కుందేలు, ‘‘ఓ మృగరాజా ఆగు! నీవు చాలా ఆకలి మీదున్నావు. నేను చాలా చిన్న ప్రాణిని. నన్ను తింటే నీ ఆకలి తీరదు. దూరంగా అటుచూడు. ఆ జింక నీ ఆకలికి సరిపోతుంది. నన్ను వదలిపెట్టు’’ అంది.సింహానికి ఈ మాటల నచ్చాయి. కుందేలును వదలిపెట్టింది. అంతే కుందేలు పారిపోయింది. సింహం జింకవైపు పరుగులు తీసింది. జింక సింహాన్ని దూరాన్నుంచే చూసింది. వెంటనే గెంతుతూ పరుగులు తీసింది. మృగరాజు ఆ జింకను వెంబడించింది. కానీ పరుగులరాణి జింక తప్పించుకుంది. సింహం బాగా అలసిపోయింది.
నీతి ‘‘అత్యాశకు పోయి కష్టాలు పడకు.’’
Review వేటగాడూ.