సంక్రాంతి సందర్భంగా ఊరంతా రథం ముగ్గులు వేసే సంప్రదాయం ఉంది. దీని వెనుక ఓ ఆంతర్యం ఉంది. మకర సంక్రాంతి వేళ ఆరోగ్య ప్రదాత, శుభాన్నిచ్చే సూర్యుడిని కొలుస్తారు. ఇళ్ల ముందు వేసే రథం ముగ్గులు.. ఆ సూర్యనారాయణుడి రథానికి ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాదు, ఒక ఇంటి ముందు వేసిన రథం ముగ్గును మరో ఇంటి ముందున్న రథం ముగ్గుతో కలుపుతారు కూడా. సూర్యభగవానుడి రథం ఊరూరా, వీధి వీధినా తిరగాలని, ప్రత్యక్ష నారాయణుడి వెలుగురేఖలు ప్రతి ఇంటిపై ప్రసరించాలని ఇలా రథాలను ముగ్గలతో కలుపుతుంటారు. అంతేకాదు మకర సంక్రాంతి నాటి సూర్యశక్తికి సంక్రాంతి పురుషుడని పేరు. ఈ సంక్రాంతి పురుషుడిని పండుగ మూడు రోజుల అనంతరం ఘనంగా సాగనంపడానికే సంక్రాంతి చివరి రోజు రథం ముగ్గును వేస్తారని అంటారు. అలాగే, పై లోకాలలో ఉన్న పితృదేవతల ప్రీత్యర్థం.. వారికి పుణ్యలోకాల గతి ప్రాప్తించాలని కోరడమే ఈ రథం ముగ్గుల వెనుక ఉన్న ఆంతర్యమని మరికొందరు పండితులు అంటారు.
సంక్రాంతి ముగ్గుల్లో గొబ్బెమ్మల ఆంతర్యం
సంక్రాంతి సందర్భంగా వేసే ముగ్గుల్లో గొబ్బెమ్మలను పెట్టడం కూడా ఆచారం. మన సంప్రదాయంలో గొబ్బెమ్మ అంటే లక్ష్మీదేవి. అంతేకాదు గొబ్బెమ్మ అంటే గోపెమ్మ (గోపిక) అనీ, గోదాదేవి అని కూడా అంటారు. అందువల్ల ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి శుభసూచకంగా ఇంటి ముంగిట వేసే ముగ్గులను గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ఈ గొబ్బెమ్మలను ఆవుపేడతో తయారు చేస్తారు. అవి రోగనిరోధక శక్తి కలిగి ఉండి, రోగకారక క్రిములను ఇంటిలోకి ప్రవేశించకుండా నివారిస్తారు. ముగ్గులోని సున్నపు ఘాటు వాసన క్రిమి నిరోధకంగా పనిచేస్తుంది. ఈ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ధనుర్మాసం నుంచి సంక్రాంతి పూర్తయ్యే వరకు ముగ్గుల్లో గొబ్బెమ్మలను ఉంచుతారు
సంక్రాంతి విశేషాలు..
- మకర సంక్రాంతి నాడు ప్రధానంగా పూజలందుకునే దైవం సూర్యభగవానుడే. ఈయనకు బియ్యం, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని ప్రసాదంగా నివేదించార్యు
- మకర సంక్రాంతి నాడు పెద్దలకు పొత్తర్లు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది.
- హరిదాసు కీర్తనలు.. గంగిరెద్దు ఆటలు సంక్రాంతి పండుగకు వన్నెతెస్తాయి. ఇంకా కొమ్మదాసుడు, బుడబుక్కలు, ఇతర జానపద కళారూపాలకు చెందిన కళాకారులు ఈనాడు కానుకలు అందుకుంటారు.
- స్త్రీలు తమ ఇళ్ల ముంగిట తీర్చిదిద్దే ముగ్గులు, గొబ్బెమ్మలు పండుగ శోభను పెంచుతాయి.
- గాలిపటాలు (పతంగులు) ఎగురవేయడం ద్వారా పిల్లల ఆనందం ఆకాశాన్ని తాకుతుంది.
- ఊరి శివార్లలో జరిగే కోడిపందేలు మరికొందరికి వినోదాన్ని పంచుతాయి. మకర సంక్రాంతి నాడు చేసే దానాల వల్ల జన్మజన్మల దారిద్య్రం పోతుందని అంటారు.
- మకర సంక్రాంతి నాడు వివాహితలు పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లను దానం చేయడం వల్ల మాంగల్య సౌభాగ్యం కలుగుతుంది.
- సంక్రాంతి నాడు గుమ్మడిపండును దానం ఇస్తే మహా విష్ణువుకు ప్రీతి కలుగుతుంది.
- మన హిందూ పండుగలు, పర్వాలన్నీ చాంద్రమానం ప్రకారం నిర్ణయమైనవే. ఒక్క సంక్రాంతి మాత్రం ఏటా సౌరమానం ప్రకారం నిర్వహించుకుంటారు.
Review సంక్రాంతికి రథం ముగ్గు ఎందుకు?.