సంక్రాంతి వేళ ఏ రాశి వారు ఏ దానం చేయాలి?

పండగంటే.. పిండివంటలు
చేసుకుని తినడం మాత్రమే కాదు. ఉన్నది ఇతరులతో పంచు
కుని ఆనందాన్ని పంచుకోవడం కూడా మన పండుగల్లో దాగి ఉన్న ముఖ్య సందేశం. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే పూజలు, దానధర్మాలు మంచి ఫలితాలనిస్తాయి. అందుకే ఈ సమయంలో కొన్ని దానధర్మాలు చేయడం ద్వారా పుణ్యం సంపాదించు కోవాలని మన పెద్దలు నిర్దే శించారు. ఆయా రాశుల వారు ఆయా వస్తువులను దానం చేయాలి. దీనివల్ల పుణ్యం సంగతలా ఉంచితే.. అమితమైన ఆనందం మాత్రం కలగడం ఖాయం.
మేష రాశి: మకర సంక్రాంతి (పెద్ద పండుగ) నాడు నువ్వులు, బెల్లం దానం చేయాలి.
వృషభ రాశి: నువ్వులతో పాటు దుస్తులు దానం చేయాలి.
మిధున రాశి: గ్రహశాంతి కోసం నల్ల నువ్వులు దానం చేయాలి. కానీ, ఈ రాశి వారు సంక్రాంతికి తెల్ల నువ్వులను దానం చేయడం కూడా మంచిదని అంటారు. ఇంకా ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు వస్త్రాలను దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
కర్కాటక రాశి: నువ్వులతో పాటు సగ్గు బియ్యం, దుస్తులను దానం చేయాలి.
కన్య రాశి: మినుములు, నువ్వులు, నూనె దానం చేయడం ద్వారా గ్రహ బాధలు తీరుతాయి.
తులా రాశి: నూనె, నువ్వులతో పాటు పత్తిని కూడా దానం చేయడం మంచిది.
వృశ్చిక రాశి: నువ్వులు, బియ్యం దానం చేస్తే మంచిది.
ధనుస్సు రాశి: శనగలు, నువ్వులు దానం చేయాలి.
మకర రాశి: నూనె, నువ్వులు, దుస్తులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
కుంభ రాశి: దువ్వెన, నూనె, నువ్వులు, నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వాలి.
మీన రాశి: శనగలు, సగ్గు బియ్యం, నువ్వులు, వస్త్రాలను దానం చేస్తే ఈ రాశి వారు మంచి ఫలితాలను పొందుతారని అంటారు.
మీన రాశి: శనగలు, సగ్గు బియ్యం, నువ్వులు, వస్త్రాలను దానం చేస్తే మంచిదని పెద్దల మాట.
ఇంకా సంక్రాంతి నాడు రాశులతో నిమిత్తం లేకుండా గుమ్మడి కాయలు దానం చేసే ఆచారం కూడా ఉంది.
మహిళలైతే.. సంక్రాంతి నాడు పసుపు కుంకుమలు, పండ్లు దానం చేస్తే జీవితం ఫలప్రదమవు
తుందని అంటారు
సంక్రాంతి అంటేనే పుణ్యకాలం. ఆ సమయంలో దానధర్మాలు చేయడం వల్ల పండుగ వేళ ఆనందం మరింత శోభిల్లుతుంది. సాధారణంగా మనకు ఉన్న దానిని తోటి వారితో పంచుకోవడం వల్ల కలిగే ఆనందానికి మరేదీ సాటి రాదు. అటువంటి ఆనందాన్ని పొందడానికి సంక్రాంతి సరైన సందర్భం. పితృ దేవతలను స్మరించుకోవడానికి కూడా సంక్రాంతి మంచి సందర్భం. దీనివల్ల వారి శుభాశీస్సులు లభిస్తాయని అంటారు. పెద్ద పండుగగా పిలిచే ఈ పర్వం నాడు మహిళలు పువ్వులు, పసుపు-కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా ఐశ్వర్యాన్నీ, దీర్ఘసుమంగళీ ప్రాప్తం పొందుతారని విశ్వాసం. సంక్రాంతి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, పూజా మందిరం, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు-కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించాలి. సువాసినులు తెల్లవారుజామునే లేచి ఇంటి ముంగిటను రంగవల్లులతో తీర్చిదిద్దుకోవాలి. మకర సంక్రమణం వేళలో తిలా తర్పణాలు విడిచి గుమ్మడి పండ్లను దానం చేస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని అంటారు. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
ఉదయాన్నే తలస్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను సూర్యభగవానుడికి నైవేద్యంగా నివేదించి, పితృదేవతలను ప్రార్థించాలి. సంక్రాంతి నాడు ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి కొత్త బట్టలు పెట్టడం తెలుగు నాట సంప్రదాయం. భోగి, సంక్రాంతి, కనుమ.. ఈ మూడు రోజులూ బంధుమిత్రులతో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా గడపడం ఆచారంగా వస్తోంది.
అలాగే, సంక్రాంతి నాడు మహిళలు కొన్ని వ్రతాలను ఆచరించడం కూడా సంప్రదాయంగా ఉంది. వాటిలో గొబ్బిగౌరి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని భోగి నాడు ప్రారంభించాలి. ధనుర్మాసం నెల పట్టింది మొదలు సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో ముచ్చటగా కనిపిస్తాయి. ప్రతి ఇంటా ఆ ఇంటి అమ్మాయిలు ముగ్గుల మధ్య అందంగా గొబ్బెమ్మలను తీర్చిదిద్ది, గొబ్బి పాటలు పాడుతూ ఆనందోత్సాహాలను పంచుకుంటారు.
భోగి.. ఆనందానికి నాంది
సాధారణంగా మన తెలుగు పండుగలను చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాం. కానీ, సంక్రాంతిని మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకోవడం విశేషం. సంక్రాంతి మూడు రోజుల పండుగ. సంక్రాంతికి ముందు
నాటి రోజును భోగి అంటారు. భోగితోనే పండుగ సంబరాలు ఆరంభమవుతాయి. పాండిపంటలు సమృద్ధిగా పండి ఇంటికి చేరేది ఈ సమయంలోనే. అందుకే భోగభాగ్యాలను ప్రసాదించేది భోగి. ఈ రోజు ప్రతి ఇంటి ముందు లేదా గ్రామ ప్రధాన కూడలిలో భోగి మంటలు వేస్తారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి నాంది పలుకుతూ ఈనాడు భోగి మంటలలో పాత పనికిరాని బట్టలను, వస్తువులను వేసి పీడలు, అరిష్టాలు తొలగిపోయినట్టు భావిస్తారు. ఈ భోగి మంటలలో చిన్నారులు ఆవు పేడతో చేసిన పిడత దండలను వేస్తారు. మనలో ఉన్న అశ్రద్ధ, బద్ధకం, చెడు గుణాలు, తలంపులన్నీ భోగి మంటల్లో మాడిపోవాలని, మంచి కలగాలని సంకల్పం చేసు కోవడం ఈనాటి ఆచారం.
ముఖ్యంగా భోగి నాడు పన్నెండేళ్ల లోపు వయసు గల పిల్లల తలపై రేగు పండ్లు పోస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీమహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని, పిల్లలపై పండ్లు పోయడం వల్ల వాళ్లపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు. తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని అంటారు. ఈ ఆచారం వెనుక ఒక కథ కూడా ఉంది. రేగి పండ్లను బదరీఫలం అనీ అంటారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికా వనంలో ఘోర తపస్సు చేశారు. ఆ సమయంలో దేవతలు వారి తలలపై బదరీ ఫలాలను కురిపించారు. అలా చేయడం ద్వారా నరనారాయణులకు సోకిన దృష్టి దోషం తొలగిపోయి.. శివుడి అనుగ్రహం లభించింది. నాటి నుంచి పిల్లలకు దృష్టి దోషాలు తొలగిపోవడానికి భోగి పండ్లను వేసే సంప్రదాయం ఏర్పడిందని అంటారు. భోగి (రేగు) పండ్లనే అర్కఫలం అని కూడా పిలుస్తారు. అర్క అంటే సూర్యుడు. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్త రాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే మకర సంక్రమణం. సంక్రాంతి సూర్యుడి పండుగ. కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా రేగు పండ్లకు అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే ఆకాంక్షతో ఈ భోగి పండ్లను పోస్తారు. కొన్ని ప్రాంతాలలో భోగి నాడే బొమ్మల కొలువు తీరుస్తారు. ముత్తయిదువులతో పేరంటం కూడా చేస్తారు. మరికొన్ని చోట్ల కనుమ నాడు బొమ్మల కొలువును తీర్చిదిద్దుతారు.
పెద్ద పండుగ సంక్రాంతి
సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారే సమయాన్ని సంక్రమణం అంటారు. ఇలా సూర్యుడు ఏడాదిలో పన్నెండు రాశులలోనూ సంచరిస్తాడు. అయితే, ఆయన ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించే సమయానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఇలా సూర్యుడి గమనం మారడం వలన అప్పటి వరకు ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోతుంది. సంక్రాంతి సౌరమానం ప్రకారం చేసుకునే పండుగ. కాబట్టే ఈ పండుగ తేదీలు ప్రతి ఏటా పెద్దగా మారవు.
సంక్రాంతి నాటికి ప్రకృతిలో పూర్తిగా మార్పు వస్తుంది. నక్షత్ర గ్రహ మండలాలు ఈ రోజు ధనుస్సు ఆకారంలో గోచరిస్తాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం ద్వారా చీకటి తొలగి వెలుగు వస్తుంది. కొత్త పంట చేతికి రావడం ద్వారా కొత్త కుండలో పాయసం వండి అందరూ తిని ఆనందంగా గడుపుతారు. గతించిన పెద్దలను ప్రత్యేకంగా పూజించి ఆశీస్సులు పొందుతారు.
సంక్రాంతి నాడు పెద్దలకు తర్పణం విడవడం ఆచారం. శాస్త్రాల ప్రకారం ప్రతి మనిషి ఐదు రకాల రుణాల నుంచి విముక్తి పొందాలి. అవి- దేవ రుణం, పితృరుణం, మనుష్య రుణం, రుషి రుణం, భూత రుణం. మనకు రక్తమాంసాలు పంచి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. అయితే పితృ తర్పణాలు, పిండోదక దానాలు, శ్రాద్ధకర్మలు ఆచరించడం ద్వారా మన పెద్దల రుణం కొంతైనా తీరుతుందని శాస్త్ర ఉవాచ. మకర సంక్రాంతి నాడు నువ్వుల పిండిని నలుగు పెట్టుకుని ఒంటికి రాసుకుని స్నానం చేసి, ఆ తరువాత పితృ దేవతలకు తర్పణాలు వదలాలని చెబుతారు. మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్య కాలంలో తమ పెద్దలకు సద్గతులు కలగాలని కోరు కుంటూ ఇలా తర్పణాలను విడుస్తారు. తమకు చక్కటి జీవితాన్ని అందించి, మార్గదర్శకులుగా నిలిచిన పెద్దలకు ఇలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అందుకే సంక్రాంతి పెద్ద పండుగ మాత్రమే కాదు.. పెద్దల పండుగగా కూడా ప్రతీతి.
ఈ పెద్ద పండుగ రోజున విరివిగా దానాలు చేయాలి. మన దగ్గర ఉన్న దాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ అని చెబుతోంది సంక్రాంతి. కానీ ఒకరికి ఇచ్చే ముందు మన వద్ద ఉండాలి కదా! పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకునే ఈ సమయంలో దానం చేసేందుకు సరైన సందర్భంగా నిలుస్తుంది. హరిదాసులు, బుడబుక్కల వారు, పగటి వేషగాళ్లు, గంగిరెద్దుల వారు, జంగమదేవరలు, పిట్టలదొరలు.. ఇలా పలువురు తమ విన్యాసాలతో పండుగ శోభను పెంచుతారు. తమ స్థోమతను బట్టి వీరికి బియ్యాన్ని కొలిచి పోయడం సంక్రాంతి నాడు రైతు కుటుంబాల విధాయ కృత్యం.
ముచ్చటైన ముక్కనుమ
సంక్రాంతి తొలి రెండు రోజులూ (భోగి, సంక్రాంతి) మన కోసం నిర్వహించుకునే పండుగ అయితే, చివరి రోజైన కనుమ నాడు మాత్రం మన చుట్టూ ఉన్న పశుపక్ష్యాదులనూ స్మరించుకోవడం, వాటికి వివిధ రూపాల్లో కృతజ్ఞత తెలుపుకోవడం ఆచారంగా వస్తోంది. అలాగే, ఈనాడు పితృదేవతలనూ స్మరించుకుంటారు. వ్యవసాయాధారితమైన మన దేశంలో రైతుకు చేదోడువాదోడుగా ఉండేవి ఎద్దులు. అవి మనకు చేసే సాయానికి ప్రతిగా వాటికి ఎంత చేసినా తక్కువే. అందుకే ఉన్నంతలో తమ కృతజ్ఞతను తెలుపుకునేందుకు కనుమ రోజు పశువులను ఇతోధికంగా పూజిస్తారు. సంక్రాంతి నాటికి పొలం పనులన్నీ పూర్తయి ఉంటాయి. కనుక, పశువులు కూడా అలసిపోయి ఉంటాయి. ఇలా నిస్త్రాణంగా ఉన్న పశువులకు కాస్త బలాన్ని చేకూర్చేందుకు ఉప్పు చెక్క పేరుతో వాటికి ఔషధాలతో కూడిన పొట్టును తినిపిస్తారు. మరోవైపు పశువులనీ, వాటి కొట్టాలను శుభ్రపరుస్తారు. కొట్టాలను గోమయంతో, పూలదండలతో అలంకరిస్తారు. కనుమ నాడు పశువులను అలంకరించే తీరు అవర్ణం. కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకు చిరుగంటల గజ్జెలు, మెడలో దండలు.. ఇలా తనివితీరా రైతులు తమ పశువులను అలంకరిస్తారు. ఈ క్రమంలోనే సాయంత్రం వేళ వీటికి పందేలు నిర్వహించడం మొదలైంది. ఇంట్లో ఉండే జీవులనే కాదు ఇంటి నిండా ధాన్యపు రాశులు నిండిన ఈ పుణ్య కాలంలో ఇంటి చూర్లకు ధాన్యపు కంకులను కుచ్చుగా కట్టి వేలాడదీస్తారు. పిచ్చుకలు, ఇతర చిన్న పక్షులు వీటిని తిని కడుపు నింపుకొంటాయి.
కనుమ నాడు రథం ముగ్గు వేసి ఆనాటితో సంక్రాంతి సంబరాలకు ముగింపు పలకడం రివాజు. సంకురుమయ్య (సూర్య దేవుడు/ సంక్రాంతి దేవుడు) ఉత్త రాయణం వైపుగా మరలే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను సాగనంపేందుకా అన్నట్టు ఇలా రథం ముగ్గును వేయడం ఆచారం. ఈ ముగ్గుకు ఉన్న కొసను మాత్రం ఇంటి బయటకు వెళ్లేలా దిద్దుతారు.
సంక్రాంతి.. సంప్రదాయాలు.. విశ్వాసాలు
సంక్రాంతిలో తొలి రోజైన భోగిని కీడు పండుగగానూ, రెండో రోజైన సంక్రాంతిని పెద్దల పండుగగానూ, మూడో రోజైన కనుమను పశువుల పండుగ గానూ చేసుకునే ప్రజలు.. నాలుగో రోజున గ్రామ దేవతలను తల్చుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కూడా ఉంది. అందుకనే ముక్కనుమను ముక్కల పండుగగా కూడా పిల్చుకుంటారు.
కనుమ నాడు పొలిమేర దాటకూడదనే నియమం ఉంది. కాబట్టి ఈనాడు ఇంటికి వచ్చిన ఆడపడుచులను సత్కరించుకుని, మనసారా బహుమతులు ఇచ్చుకుని ముక్కనుమ నాడు (నాలుగో రోజు) వీడ్కోలు పలుకుతారు. కొంతమంది ముక్కనుమను కూడా పండుగగా భావించి, ఆనాడు కూడా బయల్దేరకూడదని చెబుతారు. కానీ, శాస్త్రపరంగా ఈ విషయమై ఎలాంటి నియమం లేదు.
ముక్కనుమ రోజున కొత్త వధువులు ‘సావిత్రీ గౌరీ వ్రతం’ అనే వ్రతాన్ని ఆచరిస్తారు. ఇందుకోసం మట్టి ప్రతిమలను ప్రతిష్టించుకుని, వాటికి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పిండివంటలు నివేదిస్తారు. చివరకు బొమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. బొమ్మలతో చేసే వ్రతం కాబట్టి దీనికి బొమ్మల నోము అని కూడా అంటారు.
సూర్యుడు దక్షిణాయణంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది. కాబట్టి భోగి మంటలు వేస్తారు. భోగి నాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మంటలు వాతావరణంలో వెచ్చదనాన్ని నింపుతాయి. సంక్రాంతి నాటికి పంట కోతలు పూర్తయి, పొలాల నుంచి పురుగూ పుట్రా కూడా ఇళ్ల వైపుగా వస్తాయి. వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి.
సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్లింది మొదలు వాతావరణంలో ఒక్కసారిగా వేడి పెరిగి చురుకుదనం మొదలవుతుంది. పరిసరాల్లోని ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పును తట్టుకునేందుకు శరీరం ఇబ్బంది పడుతుంది. దీంతో జీర్ణ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. భోగి మంటలతో రాబోయే ఈ మార్పునకు శరీరాన్ని సన్నద్ధం చేసినట్టవుతుంది.
భోగిమంటలంటే చలిమంటలు కాదు. అగ్ని ఆరాధనకు ఇదో సందర్భం. కాబట్టి భోగిమంటల విషయంలో పెద్దలు కొన్ని సూచనలు చేస్తుంటారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటనూ అంతే పవిత్రంగా రగిలించాలి. ఇందుకోసం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. శుచిగా తయారైన వ్యక్తి చేతనే భోగి మంటను వెలిగింప చేయాలి. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది.
భోగిమంటల్లో ఒకప్పుడు చెట్టు బెరడులు, పాత కలప వేసే వారు. ధనుర్మాసమంతా ఇంటి ముందు పెట్టుకున్న గొబ్బిళ్లను, పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించే వారు. ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించే వారు. ఇలా పిడకలు, ఆవు నెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.
ప్రస్తుతం భోగిమంటల పేరుతో ఇంట్లోని పనికిరాని చెత్తను, రబ్బర్లు, టైర్లు వంటివి మంటల్లో పడేస్తున్నారు. వీటి వల్ల పర్యావరణం కలుషితం కావడంతో పాటు ఈ మంటల నుంచి వెలువడే వాయువుల వల్ల ఆరోగ్యాలూ దెబ్బతింటాయి.
పెద్ద పండుగ (సంక్రాంతి)తో పాటు కనుమ నాడు కూడా పితృదేవత లకు తర్పణాలు విడిచే ఆచారం కొందరిలో ఉంది. పెద్దల పేరుతో ఈ రోజుల్లో ఆరుబయట అన్నం ముద్దలుగా చేసి ఉంచుతారు. పితృదేవతల ప్రీత్యర్థం వారికి ఇష్టమైనవి కూడా వండి బయట ఉంచి కాకులను ఆహ్వానిస్తారు. అవి వచ్చి తింటే పితృదేవతలు తిన్నట్టే భావిస్తారు. సంక్రాంతి మూడు రోజులు ఊళ్లో ఎటు చూసినా తనకు సమృద్ధిగా ఆహారం లభిస్తోంది కాబట్టి, కాకి ఎటూ కదలాల్సిన అవసరం ఉండదు. ఈ కారణంగానే కాబోలు.. ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత ఏర్పడింది.
సంక్రాంతి పర్వదినం మూడు రోజులూ మన ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం, నగదు రూపంలో ఎంతోకొంత సాయం చేయాలి. ఉత్త్తి చేతితో పంపకూడదు. నువ్వుల లడ్డూలను పంచాలి.
సంక్రాంతికి గాలిపటాలను ఎగరవేయడం సంప్రదాయం. అప్పు డప్పుడే వేడెక్కే ఎండల్లో గాలిపటాలను ఎగరేయడం ద్వారా సూర్యరశ్మి శరీరానికి తగినంత సోకి డి-వి•మిన్ లభిస్తుంది. దీనివల్ల చర్మవ్యాధులు దరిచేరవు.
సంక్రాంతికి నువ్వుల వాడకం పెంచాలని అంటారు. ఈ పండుగ రోజుల్లో చలి ఎక్కువ ఉంటుంది కనుక ఈ కాలంలో నువ్వులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే నువ్వులతో చేసిన లడ్డూలను తప్పక తినాలని అంటారు.
సంక్రాంతి.. ఆరోగ్యకాంతి
పండుగల వెనుక ఎంతో పరమార్థం ఉంది. అవి వట్టి ఆచారాలు, సంప్రదాయాలు మాత్రమే కాదు.. ఆయాకాలాలకు తగినట్టుగా మన పండుగలు రూపొందించబడ్డాయి. హిందూ సంప్రదాయంలోని ప్రతి ఆచారం వెనుక ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఆరోగ్య, సామాజిక రహస్యాలు దాగి ఉన్నాయి. అవన్నీ మన శ్రేయస్సు కోసం ఉద్దేశించినవే.
భోగి శిశిర రుతువులో వస్తుంది. ఇది ఆకులు రాలే కాలం. ఉపయోగపడని పాత వస్తువులు, రాలి పడే చెట్ల ఆకులు, కొమ్మలను మం•లో వేయడం ద్వారా పరిసరాలు శుభ్రమవుతాయి. అలాగే, పాత వస్తువులను త్యజించి, వస్తువులపై వ్యామోహం పెంచుకోకూడదనే సంకేతాన్ని భోగిమంటలు తెలియ చెబుతాయి.
మహిళలు ధనుర్మాసం పట్టిన నెల రోజులూ సూర్యోదయానికి ముందే లేచి ఇంటి ముందు ముగ్గులు వేయడం ద్వారా, వారి శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. అలాగే శరీరంలో వేడి పుట్టి, ఆరోగ్యం కలుగుతుంది.
ధనుర్మాసం నెల రోజులూ ఆవుపేడతో కల్లాపు చల్లి, బియ్యపు పిండితో ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బిళ్లు పెట్టి, గుమ్మడి పూలు వాటి మధ్య ఉంచడం ద్వారా వ్యాధికారక సూక్ష్మక్రిముల నివారణ జరుగుతుంది. దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అలాగే, అత్యంత శక్తినిచ్చే ఆహార పదార్థం గుమ్మడి.
భోగి రోజున పిల్లలకు భోగి పండ్లు పోయడం అనే సంప్రదాయం వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. వీటిలో ఎన్నో ఔషధ గుణా లున్నాయి. చలికాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువవుతాయి. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడానికిరేగి పండ్లలో ఉండే జిగట పదార్థం తోడ్పడుతుంది. కనుక సంక్రాంతి సమయంలో వీటిని తగినన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్య ఫలితాలు పొందవచ్చు. ఆధ్యాత్మిక కోణంలో రేగు పండ్లు యోగిత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు.
చలి కాలంలో పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. చలి కాలంలో మనకు లభించేవన్నీ పీచు పదార్థాలే. వాటిలో తేగలు ఒకటి. అలాగే, పిండి పదార్థాలను ఈ కాలంలో ఎక్కువగా వాడతారు. పీచు, పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల అజీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
సంక్రాంతికి తప్పక తీసుకోవాల్సిన ఆహారం నువ్వులు. నువ్వులతో కలిపిన బెల్లం సత్వగుణం కలిగినవి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చలిని తగ్గించి వేడిని కలిగిస్తాయి. వీటితో తయారు చేసిన తీపి పదార్థాలను ఇతరులకు పంచడం ద్వారా సత్వగుణం వృద్ధి చెందుతుంది.
సంక్రాంతి.. వివిధ రాష్ట్రాల సంస్క•తి
తెలుగు రాష్ట్రాల్లోని గోదావరీ తీర ప్రాంతాల్లో కనుమ నాడు ప్రభల తీర్థం నిర్వహిస్తారు. వీటిని వీరభద్రుడికి ప్రతీకగా భావిస్తారు.
మహారాష్ట్రలో సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. బంధుమిత్రులకు నువ్వుల లడ్డూలు పంచుతారు.
తమిళనాడులో ఇది నాలుగు రోజుల పర్వం. అక్కడ సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు. ఇక్కడ నాలుగో రోజున ఘనంగా జరుపుకుంటారు. నాలుగో రోజును కరినాళ్ అంటారు. ఈ రోజు చుట్టాలను కలుసుకోవడం తప్పనిసరి. ఈ రోజున కుటుంబ సమేతంగా వన భోజనాలకు వెళ్లే సంప్రదాయం కూడా తమిళనాట ఉంది.
కర్ణాటకలో పిల్లలంతా కొత్త బట్టలు ధరిస్తారు. బాలికలు ఇతర కుటుంబ సభ్యుల బాలికల ఇళ్లకు వెళ్లి ప్లేట్లు మార్పిడి చేసుకోవడం ఇక్కడి సంక్రాంతి ఆనవాయితీ. ఈ సంప్రదాయానికి ‘ఎల్లు బిరోదు’ అని పేరు. ఎల్లు అంటే నువ్వులు. పళ్లెంలో నువ్వులు, బెల్లం, వేరుశెనగలు, ఎండుకొబ్బరి పెట్టి ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ మిశ్రమాన్నే ఎల్లు బెల్లం అంటారు.
అసోంలో సంక్రాంతిని భొగాలి బిహు పేరుతో నిర్వహించుకుంటారు.
గుజరాత్లో ఉత్తరాయణ్ పేరుతో పండుగ జరుపుకుంటారు. గాలిపటాలు ఎగురవేసే (కైట్ ఫెస్టివల్) పోటీలు ఇక్కడ బాగా జరుగుతాయి.
ఉత్తరప్రదేశ్లో ‘కిచెరి’ పేరుతో నిర్వుహించుకునే పండుగ ఆకట్టు కుంటుంది. ఉదయాన్నే తల స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి నువ్వుల లడ్డూలు తింటారు.

Review సంక్రాంతి వేళ ఏ రాశి వారు ఏ దానం చేయాలి?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top