బ్రహ్మ మానసపుత్రుడయిన అంగిరసుడు తన ధర్మపత్ని శ్రద్ధ ద్వారా పొందిన కొడుకు సంవర్తుడు. సంవర్తుడు జ్ఞాని, యోగి, తపశ్శాలి, నిస్సంగి, నిర్మముడు, నిరుపమ శక్తి సంపన్నుడు.
సంవర్తుడు ప్రపంచ విషయాలకు విరక్తుడై విరాగియై యోగీశ్వరుడై బంధువులు, మిత్రులు, శిష్యులు తన దగ్గరకు రాకుండా ఉండటానికి దిగంబరత్వాన్ని అవలంబించి, అరణ్యాల్లో తిరగడం మొదలుపెట్టాడు.
పూర్వం మనువంశ రాజైన మరుదత్తుడు, ధర్మతత్పరతతో, దయాదాక్షిణ్యాలతో శక్తియుక్తుడుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు.
ఇది ఇంద్రుడికి అసూయ కలిగించింది.
మరుదత్తుడిపై అసూయ పెరిగిపోయి ఏం చేయాలని ఆలోచించసాగాడు.
అదే సమయంలో మరుదత్తుడు ఇంద్రుడిని మించిపోవడానికి ఒక మహాయజ్ఞం తలపెట్టాలని బృహస్పతిని కోరాడు.
అయితే అందుకు మొదట అంగీకరించిన బృహస్పతి అంతలోనే తనను ఇంద్రుడు పిలిచాడు కాబట్టి వెళ్లాలని చెప్పి వెళ్లిపోయాడు.
ఈలోగా నారదుడు కనిపించి బృహస్పతి తమ్ముడు సంవర్తుడు నీతో యజ్ఞం చేయిస్తాడని మరుదత్తుడికి చెప్పాడు. సంవర్తుడిని కలిసిన మరుదత్తుడు.. యజ్ఞం నిర్వహించాలని కోరగా, మొదట అంగీకరించి తరువాత నిరాకరించి బృహస్పతి ఇంద్రుడు పిలుస్తున్నాడని వెళ్లిపోయి తనను అవమానించాడని మరుదత్తుడు సంవర్తుడికి చెప్పాడు. అయితే, తన అన్న దగ్గర అనుమతి తీసుకుని వస్తేనే తాను కూడా యజ్ఞం చేయిస్తానని చెప్పాడు సంవర్తుడు.
మరుదత్తుడు సంవర్త మహర్షిని ఎలాగో బతిమాలి, ఇంద్రుడే తన యజ్ఞ సంకల్పాన్ని అడ్డుకుంటున్నాడని, ఎలాగైనా యజ్ఞం నిర్వహించాలని కోరి ఒప్పించాడు.
మరుదత్తుడితో సంవర్తుడు యజ్ఞం మొదలుపెట్టించాడు. ‘ఎందుకైనా మంచిది. ఒకసారి ఆలోచించుకో! ఈ యజ్ఞం తలపెట్టడం ద్వారా ఇంద్రుడికి, బృహస్పతికి శత్రువువి అవుతావేమో’ అన్నాడు సంవర్తుడు. ‘మునీంద్రా! మీరుండగా నేనెవరికీ భయపడను. సూర్యచంద్రులు ఉన్నంత వరకు మీరే నా గురువు’ అన్నాడు మరుదత్తుడు.
హిమవత్పర్వతానికి ఉత్తర భాగంలో ఉన్న ముంజవంతమనే పర్వతం మీద శివుడి దయతో యజ్ఞం మొదలుపెట్టడానికి ఎన్నో పసిడి మోపులు తెచ్చిచ్చాడు సంవర్తుడు.
ఇక్కడ మరుదత్తుడితో సంవర్తుడు యజ్ఞం చేయిస్తుంటే, అక్కడ బృహస్పతి కూడా ఇంద్రుడితో యజ్ఞం తలపెట్టాడు.
ఇంద్రుడు మరుదత్తుడు తలపెట్టిన యజ్ఞాన్ని ఎలాగైనా ఆపాలని మరింత పట్టుదలకు పోయాడు. అగ్నిహోత్రుడిని పిలిచి ఎలాగైనా సంవర్తుడు చేయిస్తున్న యజ్ఞాన్ని ఆపాలని పంపించాడు. అగ్నిహోత్రుడు మరుదత్తుడి వద్దకు వచ్చి, ఆయన ఆతిథ్యం స్వీకరించి, ‘రాజా! బృహస్పతి నీతో యజ్ఞం చేయించి ఇంద్ర పదవి వచ్చేలా చేయడానికి అంగీకరించి నన్ను స్వయంగా ఇక్కడికి పంపించాడు. సంవర్తుడి వల్ల నువ్వు తలపెట్టిన యజ్ఞకార్యం సఫలం కాదు’ అని చెప్పాడు. మరుదత్తుడు అందుకు అంగీకరించలేదు. ‘సంవర్తుడు నాతో ఎలా యజ్ఞం చేయించినా నాకు అంగీకారమే’ అని తెగేసి చెప్పాడు. ‘నీ రాయబారం పూర్తయింది కదా! ఇక వెళ్లిరా!’ అన్నాడు సంవర్తుడు అగ్నిహోత్రుడితో. అగ్నిహోత్రుడు జరిగినదంతా ఇంద్రుడికి చెప్పి మరుదత్తుడి యజ్ఞాన్ని ఆపడం తన వల్ల కాదని చెప్పాడు. ఇంద్రుడు గంధర్వపతయిన ధృతరాష్ట్రుడిని పిలిచి మరుదత్తుడిని ఎలాగైనా బృహస్పతితో యజ్ఞం చేయించుకునేలా ఒప్పించాలని చెప్పాడు.
మాట వినకపోతే ఇంద్రుడి వజ్రాయుధం నిన్ను యముడి వద్దకు పంపిస్తుందని చెప్పమన్నాడు.
మరుదత్తుడి వద్దకు వెళ్లి ఇంద్రుడు చెప్పమన్నట్టు చెప్పాడు ధృతరాష్ట్రుడు.
‘గంధర్వరాజా! నేను మొదట యజ్ఞం తలపెట్టాలని బృహస్పతినే కోరాను. ఆయన మొదట అంగీకరించి, తరువాత మాట తప్పాడు. ఇప్పుడు సంవర్తుడు యజ్ఞకార్యాన్ని తలకెత్తుకుని ఆ పని ప్రారంభించాక మధ్యలో వెళ్లిపొమ్మనడం న్యాయమేనా? మీరే చెప్పండి’ అన్నాడు మరుదత్తుడు.
అదే సమయంలో ఇంద్రుడి వజ్రాయుధం వేగంగా దూసుకువచ్చింది. దాన్ని చూసి మరుదత్తుడు భయపడ్డాడు. ‘అది నీ దాకా రాదు. భయపడకు’ అని ధైర్యం చెప్పిన సంవర్తుడు- ‘నాకు ‘సంస్తంభ’ విద్య వచ్చు. దానివల్ల దేవతలు కూడా నా ముందు ఆగలేరని ఇంద్రుడికి తెలుసు. నా శక్తి ముందు దేవతల ఏ ఆయుధాలైనా పనిచేయవు’ అని భరోసా ఇచ్చాడు. అప్పటికే సంవర్తుడి మంత్ర మహిమతో వజ్రాయుధం శక్తిహీనమై గాలిలో తిరుగుతోంది. మరుదత్తుడు ఆశ్చర్యంతో సంవర్తుడి కాళ్లపై పడి నమస్కారం చేశాడు.
‘నీకేం కావాలో కోరుకో!’ అన్నాడు సంవర్తుడు.
‘మునీంద్రా! ఇంద్రుడితో విరోధం నేను కోరుకోవడం లేదు. కాబట్టి నాతో విరోధం మాని యజ్ఞంలో తన హవ్య భాగం తీసుకొమ్మని చెప్పండి’ అని ప్రార్థించాడు మరుదత్తుడు. సంవర్తుడు ఎట్టకేలకు తన యజ్ఞం పూర్తి చేసి తన మంత్ర బలంతో ఇంద్రాది దేవతలందరినీ సేవకుల్లా యజ్ఞ స్థలానికి రప్పించాడు.
సంవర్తుడు, మరుదత్తుడు వాళ్లకు ఎదురెళ్లి తీసుకువచ్చి వారిని ఆసనాలపై కూర్చోబెట్టారు.
మరుదత్తుడు ఇంద్రుడికి నమస్కరించి, ‘నీ రాక వల్ల నా జననము, జన్మము రెండూ సఫలమయ్యాయి. సంవర్తుడు నీకు గురువైన బృహస్పతికి స్వయానా తమ్ముడు. కాబట్టి ఆయన నీకు కూడా గురు సమానుడు. నాకు అన్నీ ఆయనే! కనుక కోపం మాని యజ్ఞం సవ్యంగా పూర్తయ్యేలా చూడు’ అని కోరాడు.
ఇంద్రుడు సరేనన్నాడు.
సంవర్తుడు రెండవ అగ్నిలా ప్రకాశిస్తూ, యజ్ఞం పూర్తి చేయించి దేవతలందరినీ తృప్తి పరిచాడు.
తరువాత మరుదత్తుడిని దీవించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు.
మరుదత్తుడు ఆనందంతో ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేసి షట్చక్రవర్తుల్లో ఒకడిగా నిలిచాడు.





































































































































































































































































































































































Review సంవర్త మహర్షి.