సమ్మోహనం.. జగన్మోహనం

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల ఆలయంలోనూ, ఇతర అనుబంధ ఆలయాల్లోనూ అక్కడ కొలువై ఉన్న దేవతాగణానికి ప్రతి సంవత్సరం అంఖండంగా బ్రహ్మోత్సవం పేరిట అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. అందులో ‘మోహినీ అవతారం’ అనే వాహనసేవ ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ సేవలోని ‘మోహిని’ కొలువై ఉన్న ర్యాలీలోని ‘శ్రీజగన్మోహినీ కేశవస్వామి’ ఆలయం గురించి తెలుసుకుందాం.

ఆంధప్రదేశ్‍లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుతం కోనసీమ జిల్లా) కొత్తపేట తాలూకా రావులపాలెంకు ఆరు కిలోమీటర్ల దూరంలో ర్యాలీ గ్రామం ఉంది. అక్కడ ముక్తి ప్రధాన క్షేత్రంగా అలరారుతోంది శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం. ఇటువంటి ఆలయం ప్రపంచంలోనే ఎక్కడా లేదనే చెప్పవచ్చు.

ఇదీ స్థలపురాణం..
పూర్వం దేవతలు, దానవులు పాలసముద్రాన్ని మథించగా అమృతం పుట్టింది. దాని కోసం దేవతలు, దానవులు కయ్యానికి కాలుదువ్వారు. అప్పుడు విష్ణువు మాయా మోహినీ రూపాన్ని దాల్చి అమృతభాండాన్ని తీసుకున్నాడు. అమృతాన్నంతా దేవతలకే పంచిపెట్టి దానవులకు ఏమీ లేకుండా చేశాడు. ఆ సమయంలో విష్ణువు దాల్చిన సుందర సుకుమార ముగ్ధ మోహినీ రూపాన్ని దర్శించిన ఈశ్వరుడు.. ఆమె రూప లావణ్యాలకు, హావభావ చేష్టలకు ముగ్ధుడయ్యాడు. ఆమెను కౌగిలించుకోబోయాడు. అందుకు మోహిన భయపడి పరుగెత్తనారంభించింది. ఈశ్వరుడు ఎలాగైనా మోహినిని ఒక్కసారి ఆలింగనం చేసుకోవాలనే పట్టుదలతో ఆమెను వెంబడించాడు. ఇద్దరూ లోకాలన్నీ తిరిగి తిరిగి అలసి చివరకు రత్నపుర ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడకు చేరగానే మోహిని జడలోని ఒక పువ్వు రాలి కిందపడిందట. వెంటనే ఈశ్వరుడు ఆ పువ్వును అందుకుని, దాని సువాసనను పీల్చి, తన్మయుడై మోహినీ రూపాన్ని చూశాడు. ఎదురుగా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అలా విష్ణువును చూడగానే ఈశ్వరుడు సిగ్గుపడ్డాడు. అవమానభారంతో తలదించుకున్నాడు. ‘కైలాసానికి ఎలా వెళ్లేది?’ అంటూ అక్కడే లింగ స్వరూపుడై ఆవిర్భవించబోయాడు. అప్పుడు బ్రహ్మ తన కమండలం ఆధారంగా ‘ఉమా కమండలేశ్వరస్వామి’ అనే పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠింపచేశాడు. అదే నేటి ర్యాలీ గ్రామంలో మనం చూసే శివాలయం.

చారిత్రక నేపథ్యం..
పూర్వం దంతచోళుడనే రాజు ఒకసారి అడవికి వెళ్లాడు. వేటాడుతూ అలసిపోయి ఒక చెట్టు నీడన విశ్రమించాడట. అప్పుడు ఏవేవో వింత శబ్దాలు వినిపించాయట. లేచి చూడగా ఏమీ కనిపించలేదు. రాజు తిరిగి నిద్రకు ఉపక్రమించగా, కలలో విష్ణువు కనిపించి, ‘ఓ రాజా! నువ్వు ఒక రథాన్ని తయారుచేయించు. ఆ రథాన్ని ఈ ఊళ్లో ఊరేగించు. ఆ సమయంలో రథానికి ఉన్న ఒక చీల ఊడి ఏ ప్రాంతంలో అయితే పడుతుందో అక్కడ తవ్వించు. అక్కడ నా విగ్రహం నీకు కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి గుడి కట్టించు’ అని చెప్పాడట. ఆ ప్రకారమే రాజు చేసి, చీల ఊడిపడిన చోట తవ్వించి చూడగా విగ్రహం కనిపించిందట. దాన్నలాగే అక్కడే ప్రతిష్ఠించి, ఆలయం నిర్మించాడట. ఆ ఆలయమే శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం’గా ప్రసిద్ధికెక్కింది.

అద్భుత నిర్మాణశైలి..
జగన్మోహినీ కేశవస్వామి ఆలయం ఎత్తయిన రాజగోపురంతో, అంతరాలయంతో, గర్భగుడి మున్నగు వాటితో అలరారుతోంది. వెన్న వలే నునుపుగా, మృదువుగా చెయ్యి వేస్తే జారిపోయే సాలగ్రామ శిలతోనూ, అద్భుతమైన శిల్పసంపదతోనూ విరాజిల్లుతూ చూడముచ్చటగా ఆశ్చర్యచకితులను చేసే రీతిలో ఈ దేవాలయం ఉంటుంది. ఇంతటి నునుపైన శిల్పం ప్రపంచంలోనే మరెక్కడా చూడలేము. ఈ ఆలయంలోని విష్ణుమూర్తి శంఖ, చక్ర, గదా, పద్మములతో నిలిచి ఉంటాడు. విగ్రహ శిల్పరీతిని బట్టి ఇది కాకతీయుల కాలం నాటిదని చెప్పవచ్చు. ఈ విగ్రహాన్ని చక్కని నల్లరాతిపై మలిచారు. ఈ శిలనే సాలగ్రామ శిల అంటారు. ఇటువంటి శిల ఈ ప్రాంతంలో ఎక్కడా దొరకదు. కాబట్టి దీనిని ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ చెక్కించి ఉంటారు.
విగ్రహం వెనుక వైపు స్త్రీమూర్తి కనిపిస్తుంది. ఆమెయే జగన్మోహిని. దేశంలోని ఇతర కాకతీయ శిల్పాలతో పోలిస్తే ఈ విగ్రహ శిల్ప చాతుర్యం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అన్ని భాగాలు ‘మానసార’ ప్రమాణాన్ని అనుసరించి ఉంటాయి. ఈ ఆలయం ఎదురుగా ర్యాలీ గ్రామంలోనే ఒక శివాలయం ఉంది. ఇది కూడా చాలా పురాతనమైనదే. ఇది చోళుల కాలం నాటిదని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.

కళ్లుచెదిరే శిల్ప సౌందర్యం
ఈ దేవాలయం రాజగోపురమంతా సుందరశిల్పమయం. అంతరాలయంతోనూ, గర్భగుడితోనూ, ప్రహరీగోడతోనూ అందంగా తీర్చిదిద్దారీ ఆలయాన్ని. రాజద్వారం నుంచి లోపలికి ప్రవేశించగానే ముఖమండపంలో ఎడమ వైపున శ్రీదేవి ప్రతిమ, కుడివైపున భూదేవి ప్రతిమ వెండి తొడుగులతో పాటు మకర తోరణాలతో ఉత్తరం వైపు శ్రీరమాసత్యనారాయణ స్వామి ప్రతిమలు చక్కగా అలంకరించి ఉన్నాయి. ముఖ మండపం నుంచి లోనికి వెళ్లే ద్వారానికి ఇరువైపులా జయవిజయులు అనే ద్వారపాలకుల విగ్రహాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఈ మండపంలో నాలుగు భూగర్భ గృహాలు ఉన్నాయి. ముఖ మండప ద్వారానికి పైభాగాన శేషపాన్పుపై లక్ష్మీనారాయణుల విగ్రహాలను చెక్కారు. అంతరాలయం నుంచి లోనికి వెళ్లగానే గర్భగుడి సాక్షాత్కరిస్తుంది. అందులోనే శ్రీజగన్మోహినీ కేశవస్వామి వారి దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు.

జీవకళ ఉట్టిపడే మూర్తి..
ఈ దివ్యమూర్తి విగ్రహం ఐదడుగుల ఎత్తు, మూడడుగుల వెడల్పుతో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇది ఏకశిలా విగ్రహం. సాలగ్రామ శిల. ఈ విగ్రహం ముందు భాగాన పురుషరూపం, వెనుక స్త్రీ రూపం ఉంటాయి. విష్ణువు శిరసున కిరీటం, నుదుటన ఎరుపు-తెలుపు నామం, చెవులకు మకర కుండలాలు, మెడలో కౌస్తుభమణిహారం, వనమాల, రత్నహారాలు ఉన్నాయి. స్వామి చతుర్బాహువులలో ఒకప్పుడు శంఖం, చక్రం, గద, పద్మం ఉండేవి. ఎడమచేతిలో చక్రం, అభయహస్తంలోని పద్మం ప్రస్తుతం లేవు. అలాగే ఇక్కడ విష్ణువు ముక్కు కూడా కొంచెం దెబ్బతగిలి ఉంది. నాభిస్థానంలో ధోవతికట్టు, ఉత్తరీయం, భుజాలలో అంగద, కేయూర, కంకణ, రత్నాంగుళీయకాలు, నిగనిగలాడే పట్టుబట్టలపై చిరుగంటల మొలత్రాడు మనోహరంగా చెక్కి ఉంటాయి. అభయహస్తంలో రేఖలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఎడమ చేయి కింది భాగంలో గద, నాలుగు వేళ్లకు నాలుగు ఉంగరాలు, మనిషిని పోలిన గోళ్లు అద్భుతంగా చెక్కారు. హస్తంలోని ప్రతి భాగం సజీవకళ ఉట్టిపడుతూ విశ్వంలోని లావణ్యమంతా అందులో ఇముడ్చుకున్నదా అని ఆశ్చర్యం కలిగిస్తుంది.

చుట్టూ దేవేరులు.. దశావతార ప్రతిమలు
ఇక్కడ కొలువైన విష్ణువుకు కుడివైపు కింది భాగంలో శ్రీదేవి, ఎడమ వైపు భూదేవి, శ్రీదేవి పక్కన కుడి వైపున రుక్మిణీదేవి, భూదేవి పక్కన సత్యభామ, పాదాల వద్ద గరుత్మంతుడు చేతులు జోడించి నమస్కరిస్తున్న భంగిమలో స్పష్టంగా కనిపిస్తారు. విష్ణువు రెండు పాదాల మధ్యన ఎప్పుడూ నీరు స్రవించడం ఇక్కడి మహాద్భుతం. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో, ఆ మహాత్మ్యమేమిటో ఎవరికీ తెలియదు. విష్ణుపాదోద్భవిగా గంగ పుట్టిందని ప్రతీతి. పాదాల కింది భాగంలో భక్తులు పాదసేవ చేస్తున్నట్టుగా, ఉభయ పార్శ్యములలో దేవాలయం శిఖరం పొన్న వృక్షం మీద ఉన్నట్టు, గోవర్ధన పర్వతం ఎత్తుతున్నట్టు, వాటి పై భాగంలో తోరణం వలే మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కల్కి మూర్తులు, దశావతారాలను అద్భుతంగా మలిచారు. పై భాగాన తుంబురుడు, నారదుడు వీణాగాణం చేస్తున్నట్టుగా, కిన్నెర కింపురుషులు స్వామికి పూలమాల వేస్తున్నట్టుగా, ఆదిశేషుడు పడగ విప్పి స్వామిని సేవిస్తున్నట్టుగా అతి చక్కగా, ముద్దుగా, అందంగా మలిచారు.

అద్భుతం.. మోహినీరూపం
స్వామి వెనుక వైపు మోహినీ రూపంతో స్త్రీరూపం ఎంతో సహజంగా, సుందరంగా కన్నులు చెదిరేలా ఉంటుంది. వయ్యారంగా చీరకట్టు, రవిక, పవిట చెంగు వెనుకభాగాన వేలాడుతున్నట్టు, చేతులకు దండపట్టీలు, శిఖ చుట్టి పారిజాత పువ్వును అలంకరించుకున్నట్టు ఉంటాయి. ఈ విగ్రహం కుడి కాలు తొడ మీద పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తూ కించిత్‍ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. ఇది పద్మినీ జాతి స్త్రీల శుభలక్షణమని శాస్త్రాలు చెబుతున్నాయి. పాదాలకు అందెలు అలంకారయుతంగా ఉంటాయి. ఏదేమైనా ఈ శిల్ప చాతుర్యం అద్వితీయం. అతి రమ్యం. సుందరపూరితమైన ఈ శిల్ప కౌశలం భారతదేశ చరిత్రలోనే అపూర్వం.

జగన్మోహిని ఎదురుగా శివుడు..
జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి ఎదురుగా కొద్దిదూరంలో పురాతన శివాలయం ఉంది. దీనినే ఉమా కమండలేశ్వరస్వామి ఆలయమనీ పిలుస్తారు. ఆలయం గర్భగుడి అంతరాలయం, ముఖమండలం, రాజద్వారాలతో అలరారుతుంటుంది. ద్వార ముఖానికి ఇరువైపులా ద్వారపాలకులు విజయేశ్వరుడు, భృంగీశ్వరుడు ఉంటారు. అంతరాలయం, కుడివైపున అర్ధనారీశ్వురుని శిల, గణపతి ప్రతిమ మనోహరంగా ఉంటాయి. ఎడమ పక్కన శంకరాచార్యుడు, కాలభైరవుడు, గణపతి, లక్ష్మీ గణపతి విగ్రహాలు ఉన్నాయి. గర్భగుడిలో ఒక మీటరు ఎత్తు శివలింగం ప్రతిష్ఠితమై ఉంటుంది.

సోమసూత్రం లేని ఏకైక శివాలయం
ఈ శివలింగానికి పై భాగాన పొక్కులు ఉంటాయి. ఎందుకంటే చోళ రాజుల కాలంలో కందకం తవ్విస్తుండగా ఈ శివలింగం బయటపడిందట. అలా తవ్వేటపుడు గునపాలు, పారల దెబ్బలు తగలగా పడిన గాట్లే ఇవని, అవే కాలక్రమంలో పొక్కులు కట్టాయని ఇక్కడి పూజారులు చెబుతారు. ఈ ఆలయానికి సోమసూత్రం లేదు. లింగాన్ని ఎంత అభిషేకించినా అది మునగదు. నీరంతా గర్భాలయంలోనే ఇంకిపోతుంది. ఇలా సోమసూత్రం లేని ఈశ్వరాలయం భారతదేశంలో మరెక్కడా లేదు. అంతేగాకుండా జగన్మోహినీ దేవాలయం ఎదురుగా శివాలయం కూడా భారతదేశంలో మరెక్కడా లేదు. గర్భగుడికి కుడివైపున నవగ్రహాలయం, శనీశ్వరాలయం ఉన్నాయి. వీటికి ఎదురుగా కుమారస్వామి ఆలయం ఉంటుంది.

భక్తిముక్తిదాయకం..
ర్యాలీ ఆలయ సందర్శనం

ఇలా ఈ రెండు దేవాలయాలు చరిత్రలో ఎంతో ప్రసిద్ధికెక్కాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు సమస్తమైన కోరికలను అనుగ్రహించే ముక్తిదాయక క్షేత్రంగా ఇది ప్రతీతి పొందింది.
పండుగలు, పర్వదినాల సందర్భంలో ఆలయశోభ మరింత నేత్రపర్వం చేస్తుంది. ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు, అభిషేకాలలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తజనంతో ఈ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది.
జాతీయ రహదారిపై ఉన్న రావులపాలెం పట్టణానికి రవాణా సౌకర్యాలు విరివిగా ఉన్నాయి. ప్రధానంగా రోడ్డు మార్గం ద్వారా ఎక్కడి నుంచైనా ఇక్కడికి తేలికగా చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో గల ర్యాలీ గ్రామంలో కొలువైన శ్రీ జగన్మోహినీ కేశవస్వామి, ఉమా కమండలేశ్వర స్వామి వార్ల ఆలయాలకు చేరుకోవడానికి స్థానికంగా బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లోనూ సులువుగానే చేరుకోవచ్చు.

Review సమ్మోహనం.. జగన్మోహనం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top