హరికి హరుడి గీతోపదేశం

శ్రీ రాముడికి కర్తవ్య బోధ చేసిన ‘శివగీత’
మన సనాతన సాహిత్యంలో విష్ణుగీత, నారదగీత, దేవీగీత, అష్టావక్ర గీత, వ్యాసగీత, శ్రీరామగీత, గురుగీత, సిద్ధగీత, రుద్రగీత, గణేశగీత, భగవద్గీత.. ఇలా ఎన్నో ‘గీత’లున్నాయి. ఇవన్నీ ఆయా సందర్భాలలో జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం ఆవిర్భవించినవే. అయినప్పటికీ వేటికవే ప్రత్యేకంగా తమ వైవిధ్యాన్ని ఇవి ప్రకటిస్తాయి. అటువంటి వాటిలో శివగీత ఒకటి.
ఆత్మానాత్మ వివేకాన్ని తెలిపే సకల వేదసారం భగవద్గీత.. అర్జునుడికి కర్తవ్యాన్ని బోధిస్తే.. శివుడు వివరించిన గీతాసారం శ్రీరాముడిని కార్యోన్ముఖుడిని చేసింది. అదే శివగీతగా మారింది. భగవద్గీతను నరుడికి నారాయణుడు ఉద్బోధిస్తే.. శివగీతను నారాయణుడికి హరుడు ఉపదేశించాడు.
మహారణ్య మధ్య ప్రాంతంలో నరావతారంలో ఉన్న నారాయణుడైన శ్రీరాముడు ఆవేదనతో కూలబడ్డాడు. సీతా వియోగాన్ని తట్టుకోలేనంటే ఆత్మ తాగ్యానికి సిద్ధపడ్డాడు.
‘అరిషడ్వర్గాలు నా దేహాన్ని దహించి వేస్తున్నాయి. నా కర్తవ్య నిర్వహణకు అవసరమైన మార్గాన్ని ఉపదేశించండి’ అంటూ శివుడిని శ్రీరాముడు ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆవిర్భవించి ఊరడించాడు. రాము డిలో ఆత్మవివేకం కలిగించాడు. అదే ‘శివగీత’.
ఏ యోగంలో ఏముంది?
శివగీతలో మొత్తం 14 అధ్యాయాలు, 779 శ్లోకాలు ఉన్నాయి. ఇందు లోని ప్రతి అధ్యాయం ఒక్కో విషయాన్ని విశదీకరిస్తుంది.
శివభక్తి నిరూపణ యోగం:
భక్తుడి లక్షణాలు, శివభక్తి నిర్ణయం, శివభక్తి ద్వారా భక్తుడు పొందే ఉన్నత స్థానం, శివానుగ్రహం ద్వారా భక్తుడు పొందే ఫలితాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి.
విరజాదీక్ష నిరూపణ యోగం:
పాశుపత దీక్షను ప్రారంభించడానికి అనువైన తిథులు, దీక్షా విధానం, భక్తుడు పాటించాల్సిన నియమాలు ఇందులో ప్రధానాంశాలు.
పంచకోశ వర్ణన యోగం:
మనసును ఏకాగ్రతగా నిలపడం, ఆత్మతత్వ బుద్ధి, పంచభూత తత్త్వాలు, వాటి చేరిక వల్ల వివిధ దశల్లో కలిగే మార్పులు ఈ అధ్యాయంలో ప్రధా నాంశాలు. ఇంద్రియానుభవం, కర్మ ఫలితాలు, వాటి వివరణ ఇందులో ఉంటాయి.
వైరాగ్య యోగం:
మానవ శరీర ఆవిర్భావానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. గర్భంలో ఉండే పిండానికి ఉండే ఆలోచనా విధానం కూడా ఇక్కడ వివరించారు.
ఉపాసనా యోగం:
ఉపాసన విధానాన్ని శివుడు ఈ అధ్యాయంలో ఉపదేశించాడు. వీరశైవ ధర్మాలు, అందుకు అనుగుణంగా శివరాధన తదితర విశేషాలు ఉంటాయి.
విశ్వరూప సందర్శన యోగం:
రామచంద్రమూర్తికి శివుడు విశ్వరూపాన్ని ప్రదర్శించడం, ఈ రూపాన్ని చూడటానికి రాముడికి శివుడు జ్ఞాన నేత్రాలు ప్రసాదించడం వంటివి ఇందులో ఉంటాయి.
జీవగతి నిరూపణ యోగం:
స్థూల, సూక్ష్మ శరీరాలు, వాటి భేదాలు, లక్ష ణాల గురించి ఉంటుంది. కర్మ భేదాల కారణంగా మనుషుడు పొందే జన్మ భేదాల వివరణ ఇందులో ముఖ్యాంశం.
వైరాగ్యోపదేశ యోగం:
భార్యా వియోగం ద్వారా తాను అనుభవిస్తున్న మానసిక వ్యథను శ్రీరాముడు అగస్త్య మహర్షికి నివేదిస్తాడు. మహర్షి ఆయనకు కర్తవ్యాన్ని బోధిస్తారు. మనిషి పడుతున్న బాధలు, అందుకు మార్గాలు, జీవధారణ విధానాలు ఇందులో ఉన్నాయి.
ఈశ్వర ప్రత్యక్ష యోగం:
రాముడు గోదావరీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించడం, రాముడు విరజాదీక్షను పాటించడం ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. రాముడు తపస్సు చేసిన విధానం, రాముడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షం కావడం, ప్రమథ గణాలతో ఉన్న శివ స్వరూప వర్ణన ఇందులో ఉంటాయి.
విభూతి యోగం:
పరమేశ్వరుడిని రాముడు అనేక ప్రశ్నలు అడగడం ఇందులో ముఖ్యాంశం. తన సర్వతోముఖత్వాన్ని, సర్వ వ్యాపకత్వాన్ని పరమేశ్వరుడు ఇందులో రాముడికి వివరిస్తాడు.
జీవ స్వరూప యోగం:
అన్ని ప్రాణుల్లో అదృశ్యంగా ఉండే పరమాత్మ స్వరూప వర్ణన ఇందులో ఉంటుంది. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థల్లో జీవుడి వేదన, శైశవదశ నుంచి వృద్ధాప్యం వరకు మానవుడి జీవన పరిణామ క్రమ విశేషాలు ఈ అధ్యాయంలో వర్ణించారు.
రామాస్త్ర ప్రధాన యోగం:
రాముడికి శివుడు ధనుస్సు, అమ్ములపొదిని ప్రసాదించడం, పరమేశ్వరుడి ఆజ్ఞతో దేవతలు రాముడికి తమ అస్త్రాలు ప్రసాదించడం, వీరశైవుల లక్షణాలు ఇందులోని ప్రధానాంశాలు. రావణ సంహారానికి సంబంధించిన విషయాలను భవిష్య దర్శనంతో పరమేశ్వరుడు వివరించడం కూడా ఇందులో ఉంది.
కైవల్య ముక్తి నిరూపణ యోగం:
ముక్తి లక్షణాలు, పుణ్యపాప కర్మలు, విశేషాలు ఈ అధ్యాయంలో ఉంటాయి. జితేంద్రియత్వం గురించి వివరణ కూడా ఇందులో ఉంది.
శరీర నిరూపణ యోగం:
దేహ స్వరూప వర్ణన ఇందులో ఉంది. సత్వ, రజో, తమో గుణాల వివరణ, పంచభూతాలకు, త్రిగుణాలకు సంబంధం, పంచకోశ వివరణ ఇందులో ఉంటాయి. గర్భంలో ఉండే పిండంలో జరిగే మార్పులు, జీవుడు పడే వేదన, లౌకిక మాయలోకి జీవుడు ప్రవేశించే విధానం గురించి ఇందులో సవివరంగా ఉంది.
శివగీత ఆవిర్భావం ఇలా..
వేదవ్యాస మహర్షి రచించిన పద్మ పురాణం, ఉత్తర ఖండంలో శివగీత ఆవిర్భావం గురించిన వర్ణన ఉంది. అందులో వివరించిన ప్రకారం-
సీత కోసం అన్వేషించి.. విసిగి వేసారిన శ్రీరాముడు ఎంతో ఆవేదన చెందాడు. సీత తోడు లేకుండా జీవించడం వ్యర్థమని భావించి ఆత్మ త్యాగంతో జీవితాన్ని ముగించాలని అనుకున్నాడు. ఇంతలో అక్కడకు అగస్త్య మహర్షి వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకుని రాముడిని ఊరడించాడు. మోహాన్ని విడిచి పెట్టాలని చెబుతూ, పాశుపత దీక్షను ఉపదేశించాడు. దీనినే విరజా దీక్ష అని కూడా అంటారు. రాముడు తదేక దీక్షతో శివార్చన చేస్తూ తపస్సులో లీనమయ్యాడు. ఆ తీవ్ర తపస్సుకు మెచ్చిన శివుడు ప్రమథ గణాలతో సహా ప్రత్యక్షమయ్యాడు. భీకరమైన ప్రమథ గణాల శబ్దాలకు కలవరపడిన రాముడు.. అదంతా రాక్షస మాయ అని అనుకుని తన చాపాన్ని ఎక్కుపెట్టాడు. శస్తాస్త్రాలను ప్రయో గించాడు. విచిత్రంగా అవన్నీ ఓ మహా తేజస్సులో ఐక్యమయ్యాయి. చివరకు రాముడి చేతి నుంచి కోదండం కూడా జారిపోతుంది. అమ్ములపొది శరీరం నుంచి తనంతట తానుగా విడిపోతుంది. ఈ హఠాత్పరిణామానికి రాముడు నివ్వెరపోతాడు. దీంతో ఆ మహా తేజస్సు ముందు మోకరిల్లాడు. పరమేశ్వరుడు అక్కడ పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై.. రాముడికి దివ్యమైన ఆయుధాలు ప్రసాదించాడు. శివ ప్రసాదంగా వీటన్నిటినీ స్వీకరిస్తూనే తన సందేహాలను నేరుగా శివుడినే అడిగాడు రాముడు. మరింత దయతో వాటిన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు శివుడు. ఇలా రాముడు- శివుడు మధ్య జరిగిన సంభాషణే ‘శివగీత’గా ఆవిర్భవించింది.
శివగీతాసారం
హృదయానికి మధ్య భాగంలో జ్యోతి స్వరూపంగా పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు. యోగ సాధకులు మాత్రమే ఈ హృదయాకాశంలో ఉన్న జ్యోతి స్వరూపుడైన ప•రమేశ్వరుడిని దర్శించగలుగుతారు.
జాగృత, స్వప్న అవస్థల్లో జీవుడు అరిషడ్వర్గాలతో బంధితుడై ఉంటాడు. సుషుప్తి అవస్థలో మాత్రం జీవుడే శివుడవుతాడు.
జీవుల్లో ఉండే ఆత్మశక్తిని పరమాత్మ అంశగా గుర్తించాలి. జీవుడు తాను చేసిన కర్మలను బట్టి స్థావర, జంగమ దేహాలను పొందుతారు.
మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే నాలుగు అంశాలతో అంత:కరణంలో ప్రతిబింబించే శివాంశే జీవి.
దుమ్మూధూళి అంటుకున్న కారణంగా అద్దం ఏ విధంగా అయితే ప్రతిబింబాన్ని సరిగా చూపించలేదో, దుష్ట భావనల కారణంగా మకిలిపట్టిన మనసు తనలోనే ఉన్న ఆత్మ స్వరూపమైన దైవాన్ని దర్శించలేదు

Review హరికి హరుడి గీతోపదేశం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top