మకర సంక్రాంతి తరువాత ప్రకృతిలో వసంత రుతువు లక్షణాలు కనిపిస్తాయి. చెట్లు చిగురించడం, పూలు విరబూయడం వంటి శుభ సంకేతాలు ఇప్పటి నుంచే ఆరంభమవుతాయి. ఈ సందర్భంలో వసంతుడికి ఆహ్వానం పలుకుతూ
జరుపుకునే పర్వమే వసంత పంచమి. ఇది మాఘ శుద్ధ పంచమి నాడు వస్తుంది.
ఆ తిథి నాడే సరస్వతీ దేవి జన్మించిన రోజుగా భావించి చదువుల తల్లిని పూజించాలని బ్రహ్మవైవర్తన పురాణం చెబుతోంది. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
వసంత పంచమి నాడు సరస్వతీ జయంతి కావడంతో ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అక్షరానికి వాగ్దేవి అధినేత. ప్రణవ స్వరూపిణి, జ్ఞానానంద శక్తి, లౌకిక – అలౌకిక విజ్ఞాన ప్రదాయిని ఆమె. శ్రీశాణి కృప లేకుంటే లోకానికి మనుగడే లేదు. వాగ్దేవి ఉపాసనతోనే వాల్మీకి మహర్షి రామాయణ రచన చేశాడని అంటారు. శారద దీక్షను ఆచరించిన పిమ్మటే వ్యాసుడు వేద విభజన చేసి వేదవ్యాసుడు అయ్యాడని అంటారు. ఆదిశేషువు, బృహస్పతి, ఆదిశంకరులు, యాజ్ఞవల్క్యుడు వంటి ఎందరో శారదానుగ్రహంతోనే జ్ఞాన సంపన్నులయ్యారు. వ్యాసుడు గోదావరీ తీరాన సైకతమూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి చెందింది. ఇది తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
సరస్వతి అనే శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా, హంసవాహినిగా తామర పుష్పం మీద కొలువుదీరి జ్ఞాన క్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
వేదాలు సరస్వతీ మాత నుంచే వెలువడ్డాయని ‘గాయత్రీ హృదయం’ అనే గ్రంథంలో పేర్కొన్నారు. సరస్వతీ దేవి అంతర్వాహినిగా గంగ యమునలతో కలిసి త్రివేణిగా విరాజిల్లింది. దేశ విదేశాల్లో గీర్వాణి ఆరాధనలను అందుకుంటోంది. సరస్వతీ దేవి వద్ద ఆయుధాలు ఉండవు. గ్రీకులు, రోమనులు ఆమెను జ్ఞాన దేవతలగా పూజిస్తారు. ఈ క్రమంలోనే వసంత పంచమి విద్యారంభ దినంగానూ పరిగణిస్తారు.
అక్షరం శ్రీకారం చుట్టుకోవాలన్నా, పుస్తకం తెరవాలన్నా తొలిగా పూజలందుకునేది సరస్వతీ దేవి. అందుకే ఆమె ప్రార్థన శ్లోకం దేశ విదేశాల్లో ప్రసిద్ధి చెందింది.
దీనికి ఇదీ భావం.
వరదే= వరములు నిచ్చుదానా
కామరూపిణి= కోరిన రూపమును ధరించుదానా
సరస్వతి= ఓ సరస్వతీ
నమ:= నమస్కారం
తుభ్యమ్= నీ కొరకు
విద్య= చదువుల యొక్క
ఆరంభం= ప్రారంభమును
కరిష్యామి= చేయబోవుచుంటిని
మే= నాకు
సదా= ఎల్లప్పుడును
సిద్ధి:= విజయమును
భవతు= కలుగు గాక
ఓ సరస్వతీ దేవీ! కోరిన కోరికలు తీర్చుదానా! నీకు నమస్కరించుచూ విద్యను ప్రారంభించుచున్నాను. నాకు విద్య సిద్ధించునట్లు చేయుము. మాఘ శుక్ల పంచమ్యాం
విద్యారంభే దినేపి
చ పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుత: రుచి:
వసంత పంచమి నాడు ప్రాత:కాలంలో సరస్వతీ దేవిని పూజించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. మొదట మహా గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. అనంతరం సరస్వతీ దేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలు, లేఖినులను పూజా పీఠంపై ఉంచి అష్టోత్తరం చదివి, తెల్లని పూలు, సుగంధ ద్రవ్యాలు, చందనంతో మాతను అర్చించి, శుక్ల వస్త్రాన్ని సమర్పించాలి.
Review అక్షర వసంతం.