అమెరికారు కోతలు కూతలు

ఈ మధ్య అంతర్జాలంలో విహారం చేస్తుంటే, ఒక చిన్న పోస్టింగ్‍ నన్ను ఆకర్షించింది. ఆ విషయాన్ని ఇక్కడ నా మాటల్లో చెబుతాను.
ఒకావిడ రైల్లో వెడుతున్నదిట. ఆవిడకి ఎదురుగా వున్న సీటులో ఒక ఆరవై ఏళ్ళ ఆవిడ, ఆవిడ పక్కనే ఒక ముఫ్ఫై ఏళ్ళ అతను కూర్చుని వున్నారట. అతను కిటికీ పక్కనే కూర్చుని, బయటికి చూస్తూ అవిగో చెట్లు, అవిగో ఆవులు అని సంతోషంగా చప్పట్లు కొడుతున్నాడట. ఆవిడ బహూశా అతని తల్లి కావచ్చు, ఆవిడ ఏదో చెబుతుంటే అతను వింతగా చూస్తూ, పెద్దగా నవ్వుతూ ఆనందిస్తున్నాడట.
ఎదురుగా కూర్చున్న ఆవిడకి ఇదంతా చూస్తుంటే, ఏమిటీ ఈ పిచ్చిమాలోకం, అతనికి బుర్ర లేకపోతే ఆవిడ బుద్ధి ఏమయింది అనుకున్న దిట. అది ఇంకా అలాగే జరుగుతుంటే, ఆవిడ ఇక వుండబట్టలేక, మీరు అతనికి అలా వంత పట్టడమేమిటి? అని.
దానికి ఆవిడ, మా అబ్బాయి పుట్టటమే గుడ్డి వాడిగా పుట్టాడు. ఇన్నేళ్ళ జీవితంలో ఏదీ కళ్ళతో చూడలేకపోయాడు. పోయిన వారమే అతనికి పెద్ద కంటి ఆపరేషన్‍ చేశారు. తన జీవితంలో మొట్టమొదటిసారిగా అన్నీ చూడగలుగుతున్నాడు. ఇప్పుడే వాడి చీకటి జీవితానికి వెలుగు వచ్చింది. నేను అవన్నీ అవన్నీ చూపించి ఏమిటో చెబు తుంటే, మొదటిసారిగా చూసి సంతోషపడు తున్నాడు అన్నది, అతని తల మీద ప్రేమగా నిమురుతూ.ఇక్కడ జరిగిందేమిటంటే, మనలో చాలామంది ఎవరినయినా చూస్తే ఇతను ఇలాంటివాడు లేదా అలాంటి ఆవిడ అనే నిర్ణయానికి వచ్చేస్తాం. దాన్నే అమెరికాలో •జీ••స్త్రఱఅస్త్ర •ష్ట్రవ జూవశీజూశ్రీవ్ణ అంటారు. అలా మన నిర్ణయాలు చేయటానికి ముఖ్యమైన కారణం, కేవలం మన భావాలతో, మన కోణం నించీ చూడటం. అవతలి వ్యక్తి గురించి మనకేమీ తెలియదు కనుక, వారి భావాల కోణం నించీ చూడలేక, మన భావాలతో ఊహాగానం చేసి ఆలోచించటం. నూటికి తొంభై పాళ్ళు ఈ ఊహా గానాలు అపోహాగానాలు అయే అవకాశం వుంది.ఇక్కడ ఒక చిన్న సంఘటన, మా ఇంటి దగ్గర జరిగినదే, చెబుతాను. ఆమధ్య భారతదేశంనుంచి కొత్తగా వచ్చిన ఒక సాఫ్ట్వేర్‍ ఉద్యోగస్తుడు ఒక వారాంతం మా ఇంటికి అతిథి•గా వచ్చాడు. వాతావరణం చాల బాగుంది కనుక, ఆరుబయట వాకిట్లో నుంచుని మాట్లాడు కుంటున్నాం. అప్పుడే మా ఎదురింటి ఆయన, కారు దిగి ఇంట్లోకి వెడుతూ, నవ్వుతూ చేయి పైకెత్తి పలకరించాడు.
అతిథి• నాతో నెమ్మదిగా అన్నాడు, ‘‘ఏమిటి! మీ ఇంటి దగ్గర అందరూ అమెరికన్లు కాదా? నల్లవాళ్ళు కూడా వున్నారా?’’ అని.
ఆ మాటలకు నాకు కొంచెం కోపం వచ్చినా, మర్యాదగానే అన్నాను. ఆయన ఇక్కడే పుట్టి పెరిగిన అమెరికన్‍. కొన్ని తరాలుగా వాళ్ళు అమెరికన్సే! నేను ఇక్కడ మూడున్నర దశాబ్దాలుగా వున్నా, ఆయన నాకన్నా ఎక్కువ అమెరికన్‍! అంతెకాదు, నీలాగా విదేశస్థుడు కాదు.
అతిథి• కొంచెం ఖంగుతిని, ‘‘అంటే ఇక్కడ నల్ల వాళ్ళు కూడా వున్నారా’’ అని అని మళ్ళీ నసిగాడు, అటూ ఇటూ వున్న పెద్ద పెద్ద ఇళ్ళు చూస్తూ. ఈసారి నవ్వుతూ అన్నాను, ‘‘అమెరికాలో మన భారతదేశంలోలా మాలపల్లెలు లేవు మరి.
ఉంటే ఆ నల్లవాళ్ళతో పాటూ, నిన్నూ నన్నూ కూడా అక్కడే వుండమనే వారు!’’ అతిథి మళ్ళీ కొంచెం ఖంగుతిని, ‘‘అదికాదు.. ఇక్కడ ఇలాటి వాళ్ళు వుంటే, మరి సేఫ్టీ వుంటుందా అని..’’ అని మళ్ళీ నసిగాడు.
‘‘ఆయన ఎవరనుకుంటున్నావ్‍? ఇక్కడ ఒక పెద్ద చర్చిలో పాస్టర్‍. అంటే మన శ్రీవెంక టేశ్వరస్వామి వారి గుడిలో పూజారిలాటివాడు. అంతేకాదు, ఆ పక్క ఇంట్లోనే వుంటాడు మైకేల్‍ అనే ఇంకో ఆయన. ఆయనా నల్లవాడే! ఇక్కడ ఒక పెద్ద కంప్యూటర్‍ కంపెనీలో వైస్‍ ప్రెసిడెంట్‍ ఆఫ్‍ ఆపరేషన్స్’’ అన్నాను.
ఇది చాలామంది మానవమాత్రులు చేసేదే. కానీ తొందరపడి అలా ఒకళ్ళ గురించి అలా జడ్జిమెంట్‍ ఇవ్వటం మంచిదికాదు. వాళ్ళు మనలాగా లేరు కనుక, మంచివాళ్ళు కారు అను కోవటం తప్పు. మనలాగా మాట్లాడరు కనుక, అది వాళ్ళ తప్పు అనటం తప్పున్నర.
ముళ్ళపూడిగారి కథలో, తన అందమైన ముక్కుని చిటపటలాడిస్తున్న భామని, గోపాళం అదేమిటి, అలా చేస్తావ్‍? అని ప్రశ్నిస్తే, నా ముక్కు, నా ఇష్టం! అంటుంది భామ. ఎవరి ఇష్టం వారిది. ఎవరి సంభాషణా చాతుర్యం వారిది. ఎవరి జీవన శైలి వారిది. నువ్వు నాలాగానే మాట్లాడు. నాలా గానే వుండు అనటం చాలా పెద్ద తప్పు. ఎవరి లాగా వాళ్ళు వుండటం ఎంతో అవసరం. సహజం.
అవతలివారి భావాలనీ, వారిజీవన శైలినీ పరిశీలించి, అర్ధం చేసుకుని, వారితో మాట్లాడే టప్పుడు వారి కోణం నించీ కూడా చూడటం ఎంతో అవసరం. కొన్నేళ్ళక్రితం ఒక సెమినార్‍కి వెళ్ళాను. అది ‘పర్సెప్షస్‍ వర్సెస్‍ రియాలిటీ’ గురించి. అంటే ‘ఇది ఇలాటిది’ అనుకోవటానికీ, ‘ఇది నిజంగా ఇది’ అని తెలుసుకోవటానికీ వున్న తేడా. ఇది ఇలాటిది అనుకున్నదానికీ, ‘ఇది నిజంగా ఇది’ అని తెలిసినదీ ఒకటే అయినప్పుడు ఇబ్బంది లేదు. అవి పరస్పర విరుద్ధం అయినప్పుడు మనలో ఆ అపోహలు ఎంతగా పాతుకుపోయాయో చూపించి కళ్ళు తెరిపించే సెమినార్‍ అది. ఆ సెమినార్‍కి కావాలనే రకరకాల వ్యక్తుల్ని- తెల్లవాళ్ళనీ, నల్లవాళ్ళనీ, నాలాటి మీలాటి బ్రౌన్‍ దొరలనీ, కొంతమంది ఇతర దేశాల వారినీ, ఆడవారినీ, మగవారినీ.. మా కంపెనీలో పనిచేసే ఇలాటి ఎందరినో పిలిచారు.
ఈ సెమినార్లో ఇన్‍స్ట్రక్టర్‍ తెరమీద ఒక బొమ్మని చూపిస్తాడు. మనకి సరిగ్గా పది సెకండ్ల సమయం ఇస్తారు. ఆ బొమ్మ చూడగానే, చటుక్కున మీ మనసుకి తట్టినది ఒక చిన్న స్టిక్కర్‍ మీద వ్రాసి పక్కన పెట్టాలి. ఆలోచనకి సమయం వుండదు కనుక, మీరు వ్రాసేది మీ మనసులో స్ఫురించిన ఊహ (పర్సెప్షస్‍) అయే అవకాశం ఎక్కువ. ఆ స్టిక్కర్‍ మీద మన పేరు వ్రాయకూడదు. అంటే మన జవాబు గుప్తంగా వుంచుతారన్నమాట. అలా పదిహేను, ఇరవై మంది మనుష్యుల, ప్రదేశాల ఫొటోలు చూపించి, మనం వ్రాసిన స్టిక్కర్లు అన్నీ తీసుకువెళ్ళి, అక్కడ గోడ మీద ఆ ఫొటోలు పెట్టి, ఆయా ఫొటోల క్రింద వాటి జవాబుల స్టిక్కర్లు పెడతారు. ఇప్పుడే మొదలవు తుంది అసలు కథ.
ఆరోజు సెమినార్‍ ఎన్నో విషయాలమీద సీరి యస్‍గా జదిగింది. మేమందరం ఇచ్చిన జవా బులు, అసలు నిజాలతో కలిపి చూస్తే, నిజంగా ఇంత వ్యత్యాసం వుందా అనిపిస్తుంది. మనిషి మనసు ఆడే ఆటలు చూసి, ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఈ వ్యాసంలో ఒకటి రెండు ఉదాహరణ లుగా చెబుతాను. ఒక నల్లతని ఫొటో చూపించి నప్పుడు వచ్చిన కొన్ని జవాబులు ఇలా వున్నాయి. బాస్కెట్‍ బాల్‍ బాగా ఆడతాడు, మంచి గాయ కుడు, దొంగ, జాజ్‍ మ్యుజీషియన్‍, హంతకుడు, బానిస, మంచి డాన్సర్‍.. ఇలా ఎన్నో… అలాగే చైనీస్‍ వారినీ, మెక్సికన్లనీ, ఒక తెల్ల అమ్మాయినీ, ముస్లిమునీ, ఒక రాజకీయ నాయకుడినీ, ఫుట్‍బాల్‍ ఆటగాడినీ, తాజ్‍ మహల్నీ, ఐ ఆఫ్‍ లండన్నీ చూపించినప్పుడు జవాబులు రకరకాలుగా వుంటాయి. ఈ జవాబుల్లో వ్రాసినవారి అభి ప్రాయాలు, భావాలు కనిపిస్తాయి. కొన్ని పూర్తిగా అబద్ధాలు కావచ్చు, కొన్ని కాకపోవచ్చు. కొన్ని కొంతవరకే నిజం కావచ్చు. కొన్ని పూర్తిగా నిజం కావచ్చు. ప్రతి ప్రశ్నకీ వచ్చిన జవాబులన్నీ వ్రాసి, ప్రతిదానికీ ఎంతమంది అలా జవాబిచ్చారో కూడా వ్రాస్తారు. దాని పక్కనే ముందే సేకరించిన నిజమైన నెంబర్లు (స్టాటిస్టిక్స్) వ్రాస్తారు. అమెరికన్‍ జనాభాలో ప్రతి అభిప్రాయం, నిజంలో ఎంత శాతం అని చూపిస్తారు. మన అపోహలు ఒక్కసారిగా తేటతెల్లమవుతాయి. ఉదాహరణకి అమెరికాలో నల్లవారికన్నా, ఎక్కువగా నేరాలు చేసేది తెల్లవాళ్ళు, కొంతమంది ఇతర దేశీయులు అని చూస్తుంటే మన అపోహ లెంత అర్ధహీనమో తెలుస్తుంది. ఆమధ్య పదమూడు సంవత్సరాల వయసు ఆడ పిల్లలతో న్యాయ విరుద్ధంగా సెక్స్ సంబంధాల కోసం వెళ్ళి, టెక్సాస్‍లో పట్టుబడ్డ పదహారు మందిలో, నలుగురు భారతీయులు, అందులో ముగ్గురు మన హైద్రాబాదువారు అని తెలిస్తే తొందరగా నమ్మలేం! అందులో నల్లవాళ్ళు ఒక్కరు కూడా లేరు.
ఇలాంటి విషయాల్లో కూడా వివిధరకాల మనుష్యుల్నీ, వారి సంస్క •తినీ, జీవన విధానాన్నీ విస్మరిస్తూ, వారిని మనవేపు నించే చూస్తూ, మన స్వంత అపోహాగానాలు చేయటం సాధారణంగా చూస్తూవుంటాము.
ఎదుటివారిని మన భావాలతో కాక, వారి కోణం నించీ చూడటం ఎంతో అవసరం.
నేను ఈమధ్యనే ఫుల్‍ టైమ్‍ ఉద్యోగంలో రిటైర్‍ అయి, కన్సల్టింగ్‍ చేస్తున్నాను. దానిలో హ్యూమన్‍ రిసోర్సెస్‍ ఒకటి. నేను ఇచ్చే ట్రైనింగ్‍ కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైన విషయం గురించి చెబుతాను.
ఇది ఇంటర్వ్యూ చేసి కొత్తగా ఇచ్చే విధానం మీద. అంటే హైరింగ్‍ ప్రాసెస్‍ మీద అన్నమాట.
మేనేజర్లు, డైరెక్టర్లు, వైస్‍ ప్రెసిడెంట్లు మామూలుగా కొత్త ఉద్యోగులని తీసుకునే పద్ధతి, అసలు తీసుకోవలసిన పద్ధతికి ఎంతో విరుద్ధంగా వుంటుందంటే ఆశ్చర్యంగా వుంటుంది.
ఇక్కడ కూడా ఇంటర్వ్యూ చేస్తున్న మీరు, మీలాటివారినే ఇష్టపడటం సాధారణంగా జరుగు తుంది. మీలాగా మాట్లాడుతూ, మీ భావాలతో ఏకీభవిస్తూ, ఎక్కడా వైవిధ్యం చూపించకుండా అన్ని రకాలా మీలాగానే వుంటే, అతన్ని లేదా ఆమెని మీరు ఆ ఉద్యోగానికి సరైన వ్యక్తిగా నిర్ణయం తీసుకోవటం ఎక్కువగా చూస్తుంటాం.
అవును, దాన్లో తప్పేముంది? అలా అయితే మనకి ఉద్యోగులతో ఏమీ ఇబ్బందులు రాకుండా వుంటాయి కదా! అని అడిగేవాళ్ళు చాలామంది వున్నారు.
ఎంత పెద్ద మేనేజర్లు, డైరెక్టర్లు, వైస్‍ ప్రెసిడెంట్లు అయినా వాళ్ళూ మానవమాత్రులే. కొన్ని చోట్ల సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం, కొన్ని చోట్ల పూర్తిగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం జరుగుతూనే వుంటుంది. అదే పరిధిలో, అదే విధంగా ఆలోచించే ఆ ఉద్యోగులు కూడా, ఆ తప్పు నిర్ణయాన్నే సమర్ధించే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అందరూ ఒక తానులోని గుడ్డముక్కలే కనుక. దానివల్ల ప్రాజెక్టులు తప్పుదారి పట్టటం, ఆలస్యం అవటం, ఎంతో ధన నష్టం అవటం, కష్టమర్లు కష్టపెట్టుకోవటం.. ఇలాటివి ఆ నిర్ణయ ప్రమాణాన్నిబట్టి వుండే అవకాశం వుంది. అదే కనుక ఇంకొంచెం స్వతంత్రంగా (ఔట్సైడ్‍ ది బాక్స్) ఆలోచించి, దాని బదులు మనం ఇంకోరకంగా చేస్తే ఫలానా లాభాలు వుంటాయి అని చెప్పే ఉద్యోగులు ఆ గ్రూపులో వుంటే, ఇలా ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువ. దీనికి ఉదాహరణలు, మనం కొంచెం ఆలోచిస్తే ఎన్నో కనిపిస్తాయి.
‘నా దగ్గర పనిచేసే ఉద్యోగులు కూడా నాలాంటి వారే అయితే, వాళ్ళు నాకెందుకు? నేను వున్నానుగా. అలాకాక కొంచెం వైవిధ్యం తీసుకు వచ్చి, అన్ని కోణాలనించీ ఆలోచించి, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి నాకు’ అనే మేనేజర్లు, తమ ఉద్యోగాల్లో విజయవంతమవటం కూడా జరుగుతున్నదే!
మన ఇళ్ళల్లో కూడా, మనం ఎన్నో విషయాల మీద రకరకాల అభిప్రాయాలు చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటాం. ఇదీ అంతే! భార్యాభర్తల్లో కూడా వైవిధ్యం వుండటంలో తప్పులేదు. చాలా విషయాల్లో మంచి నిర్ణయాలకి అది తోడ్పడుతుంది. వారి మధ్య పోట్లాటలు వచ్చి, విడాకుల దాకా పోకుండా వుంటే, అది అవసరం కూడా!
ఇంతకి చెప్పేదేమిటంటే, మనలాగా లేరని ఇతరులని వేరుగా చూడటం, దూరంగా వుంచటం, వారి గురించి అపోహగానాలు చేయటం మంచి లక్షణం కాదు.
మనం మనలాగా వుందాం! ఎదుటి వాళ్ళని వాళ్ళలాగానే వున్నందుకు, గౌరవిద్దాం!
ఎన్నో రుచులు వున్న మన ఉగాది పచ్చడి చెప్పేది కూడా, జీవితంలో ఆ వైవిధ్యం వుండా లనే!
కులం, మతం, నలుపూ తెలుపూ, ఆడా మగా, నువ్వూ నేనూ, గొప్పా గోడూ మొదలైన మనుష్యుల అంతరాలని చూపించే మన రంగుటద్దాలని, ఎవరి బీరువాలో వాళ్ళం దాచిపెట్టేద్దాం!

Review అమెరికారు కోతలు కూతలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top