‘నాన్నా! భగవంతుని సేవ, భజనలో గడప డానికి మనమంతా ఆలయానికి వస్తున్నాం. కానీ ఇక్కడ అందరూ భగవంతుని ధ్యాస తప్ప తమ పనుల్లో తాము ఉన్నవారే వస్తున్నట్టు కనిపిస్తోంది. దేవాలయంలో కూడా మాటి మాటికీ మొబైల్ ఫోన్లు చూసుకోవడం, సెల్ఫీలు దిగడం, ఫోన్లలో మాట్లాడటం చేస్తున్నారు. వాళ్ల దృష్టి, మనసు, ఏకాగ్రత అంతా సెల్‍ఫోన్లపైనే నిమగ్నమై ఉంది. దేవాలయానికి వెళ్లేదే మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన కోసం అని మాకు తరగతుల్లో ఉపాధ్యాయులు చెబుతున్నారు. కానీ ఇటువంటి వాళ్లంతా ఎందుకు ఇక్కడకు వస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వీళ్లందరినీ చూసి నేను కూడా వాళ్లలా ఎక్కడ మారిపోతానోనని భయంగా ఉంది. అందుకే ఇకపై ఆలయానికి రాకూడదని అనిపిస్తోంది’.
‘సరే.. నీ నిర్ణయం నువ్వు తీసుకో. కానీ, ఆ నిర్ణయం తీసుకునే ముందు నా కోసం నువ్వు చిన్న పని చేయగలవా?’ అని తండ్రి తన కుమార్తెను అడిగాడు.
‘చెప్పండి నాన్నా! ఏమిటది?’ అని ఆమె అడి గింది.
‘దయచేసి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకుని ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి రాగలవా? కానీ నీ చుట్టూ రకరకాల మంది భక్తులు ఉంటారు. వాళ్ల మధ్య నుంచి నడుస్తూ.. నీ చేతిలోని గ్లాసులో నుంచి చుక్క నీరు కూడా కిందకు ఒలకకుండా తిరగాలి సుమా!’ అని ఆ తండ్రి షరతు పెట్టాడు.
ఆ చిన్నారి రెట్టించిన ఉత్సాహంతో ‘తప్పకుండా నాన్నా! చేసి చూపిస్తాను’ అని పోటీకి సిద్ధమైంది.
చేతిలోని గాజు గ్లాసు నుంచి ఏమాత్రం నీళ్లు తొణకకుండా, బొట్టు కూడా కింద పడకుండా అత్యంత ఏకాగ్రతతో ఆ బాలిక గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసింది.
‘చూశారా నాన్నా! గ్లాజు ఇంకా నిండుగానే ఉంది. చుక్క కూడా ఒలకలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేశాను’ అని అంది తండ్రితో ఆ బాలిక.
అప్పుడు తండ్రి కుమార్తెను అభినందిస్తూ ఆమెను మూడు ప్రశ్నలు అడిగాడు.
‘1. నువ్వు నీ పనిలో ఉండగా, నీ చుట్టూ ఉన్న భక్తుల్లో ఎవరైనా ఫోన్ మాట్లాడుతుండగా చూశావా?
2. ఎవరైనా ఆలయ ఆవరణలో కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, నీ చెవిన పడ్డాయా?
3. ఎవరైనా పవిత్రమైన దేవాలయంలో యథార్థత లేకుండా కపటంగా జీవిస్తున్నట్టు కనిపించారా?’
తండ్రి ప్రశ్నలు పూర్తి కాగానే ఆ బాలిక ఇలా బదులిచ్చింది-
‘నేను మీరు అడిగిన ఎటువంటి మనుషుల్ని చూడలేదు. నేను నా దృష్టి గ్లాసు మరియు దానిలో ఉన్న నీటిపైనే నిలిపాను. నీళ్లు ఒక్క చుక్క కూడా ఒలికిపోలేదు. ఈ ప్రయత్నంపై నేను పూర్తి స్థాయిలో ఏకాగ్రత చూపిన కారణంగా నా చుట్టూ ఎటువంటి భక్తులు ఉన్నారు? వారేం చేస్తున్నారు? అనేది కించిత్తు కూడా గమనించలేదు’.
అప్పుడు ఆ తండ్రి ఇలా వివరించాడు-
‘చూశావా!. నువ్వు దేవాలయానికి వెళ్లినప్పుడు సరిగ్గా చేయవలసింది, చూపవలసింది ఇటువంటి ఏకాగ్రతనే. నువ్వు కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి, ఆయన గురించే చింతిస్తూ, ఆయనతో మమేకం కావడానికి ప్రయత్నిస్తూ నీ గ్లాసులోని నీరు ఒలికిపోకుండా విజయవంతంగా ప్రదక్షిణలు పూర్తి చేయగలిగావు. కాబట్టి దేవాలయానికి వచ్చినపుడు కూడా నువ్వు భగవంతునితో మమేకం అయ్యేలా నీ దృష్టి నిలిపితే ఇతరులు ఎవ్వరూ నీ మనసులోకి రారు. అటువంటి వారెవరూ నీ కంటబడరు. పైగా నీ వంటి వారిని చూసి మిగతా వారు కూడా క్రమంగా మారవచ్చు. అచంచలమైన భక్తి, నిరంతర ఏకాగ్రతా సాధన మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి. జీవితంలో ఉన్నత పథంలో నడిపిస్తాయి’.
దేవాలయంలో ఎలా గడపాలో తెలిపినందుకు తండ్రికి కుమార్తె కృతజ్ఞతలు తెలిపింది.
Review ‘ఆలయ దర్శన’ ధర్మం.