ఈ భక్తులు రాముడు వదిలిన బాణాలు

అయోధ్య వివాదానికి సంబంధించి ఎందరో అవిశ్రాంతంగా అహోరాత్రులు తమ తమ ప్రయత్నాలు చేశారు. కొందరు న్యాయ పోరాటం.. కొందరు ఉద్యమ బాట.. మరికొందరు యాత్ర.. ఇలా తోచిన రూపాల్లో ఉద్యమాన్ని బలంగా హిందువు ల్లోకి తీసుకెళ్లారు. రాముడు సంధించి వదిలిన బాణాల్లా పని చేసిన పరమ వినయ విధేయ రామ భక్తుల పరిచయం..
మూల విరాట్టు నాయర్‍..
రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివా దానికి సంబంధించి మూల విరాట్టు వంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. కె.కె.కె.నాయర్‍ అనే చెప్పాలి. 1949 నాటి ఉద్యమంలో ఈయనది కీలకపాత్ర. ఈయన యూపీ అధికారి. కృష్ణ కుమార్‍ కరుణాకరన్‍ నాయర్‍ పూర్తి పేరు. కేరళ స్వస్థలం. అలెప్పీలో పుట్టి, మద్రాస్‍, అలీగడ్‍ వర్సిటీల్లోనూ లండన్‍లోనూ ఉన్నత విద్య నభ్యసించారు. 1930లో ఇండియన్‍ సివిల్‍ సర్వీ సెస్‍లో చేరారు. ఉత్తరప్రదేశ్‍లో ఆయన వివిధ పదవుల్లో పని చేశారు. 1949లో ఫైజాబాద్‍ జిల్లా మేజిస్ట్రేట్‍గా ఉన్నారు. 1949లో గోరఖ్‍ నాథ్‍ మఠం సభ్యుల రామచరిత మానస్‍ పారా యణం సందర్భంగా బాబ్రీ మసీదులోని ప్రధాన గుమ్మటం లోపల హిందూ దేవతల విగ్రహాలు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాయి. దీనిపై విచారణ జరిపిన నాటి ప్రభుత్వం.. ఈ విగ్రహాలను మసీదులో పెట్టడంలో నాయర్‍ కీలక సూత్రధారి అని నిర్ధారించింది. సంఘటన జరిగిన క్షణా ల్లోనే నాయర్‍ అక్కడకు చేరుకున్నారని, విగ్రహాలు పెట్టి, వ్యవహారమంతా పూర్తయ్యాకే పై అధికారులకు ఏం తెలియనట్టు సమా చారం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. నాటి ప్రధాని నెహ్రూ.. విగ్రహాలను అక్కడి నుంచి తొల గించాలని ఆదేశించారు. నాయర్‍ ఆ పని చేయకపోగా, ఉద్యోగాన్ని వదిలి నేరుగా హిందూ మహాసభలో చేరారు. ఈ చర్యతో హిందూత్వ వాదుల్లో నాయర్‍ హీరోగా మారారు.
మహంత్‍ దిగ్విజయ్‍నాథ్‍
1949లో తొమ్మిది రోజుల పాటు వివాదా స్పద స్థలంలో రామచరిత మానస్‍ పారాయణం జరిగింది. ఈ పారాయణం కార్యక్రమం చేపట్టింది అప్పటి రామ జన్మభూమి ఉద్యమానికి నాయకత్వం వహించిన మహంత్‍ దిగ్విజయ్‍నాథ్‍. పారాయణం చివరిలో హిందూ దేవతల విగ్రహాలు ప్రత్యక్ష మయ్యాయి. ఈ పరిణామాలు దిగ్విజయ్‍నాథ్‍ను హిందూ మహాసభలో తిరుగులేని నాయకుడిగా చేశాయి. ఆ తరువాత ఈయన ప్రత్యక్ష రాజ కీయాల్లోకి వచ్చి 1967లో గోరఖ్‍పూర్‍ ఎంపీ గానూ గెలిచారు. హిందూ మహాసభ సభ్యుడు గాడ్సేను మహాత్మాగాంధీ హత్యకు ఉసిగొల్పారనే ఆరోపణలపై ఈయన తొమ్మిది నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు.
కె.పరాశరన్‍
అయోధ్య ఉద్యమంలో భాగంగా అవిశ్రాంత న్యాయ పోరాటం జరిపిన హీరో కె.పరాశరన్‍. ఇది పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఈయన న్యాయవాదిగా 1958 నుంచి సుప్రీం కోర్టులో ప్రాక్టీస్‍ ప్రారంభించారు. రెండుసార్లు భారత అటార్నీ జనరల్‍గా ని చేశారు. న్యాయ శాస్త్ర స్రష్ట. హిందూ పవిత్ర గ్రంథాలను ఔపోసన పట్టిన మహా పండితుడు. తనకున్న ఆ అపార పరిజ్ఞానాన్ని వాదనల్లో అద్భుతంగా ప్రతిబింబింప చేశారు. ‘నేను మరణించే లోగా ఈ కేసును పూర్తి చేయాలి. అదే నా అంతిమ కోరిక’ అని ఆయన సుప్రీంకోర్టులోనే ఒక సందర్బంలో పేర్కొన్నారు. 92 సంవత్సరాల వయసులోనూ ఆయన పట్టు వదలకుండా, అలసట అనేదే లేకుండా శ్రీరాముడి కోసం.. ఆ రామ్‍లల్లా విరాజ్‍మాన్‍ కోసం ఇన్నేళ్లుగా వాదించారు. అందువల్లే ఆయన సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రోజున.. తీర్పు ముగిసే వరకు ఓపిగ్గా కోర్టు హాలులోని మొదటి వరుసలో కూర్చున్నారు. తీర్పును ఏకాగ్రతతో విన్నారు. తుది తీర్పు వెలువడగానే న్యాయవాదు లంతా ఆయనను చుట్టుముట్టారు. అభినందనల్లో ముంచెత్తారు. కోర్టు హాలు నుంచి బయటకు రాగానే ఆయనతో పలువురు సెల్ఫీలు తీసుకునేం దుకు పోటీ పడ్డారు. భారత ప్రభుత్వం ఆయనను 2003లో పద్మభూషణ్‍, 2011లో పద్మవిభూషణ్‍ పురస్కారాలతో సత్కరించింది. 2019, అక్టోబరు 16న భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ‘మోస్ట్ ఎమినెంట్‍ సీనియర్‍ సిటిజెన్‍’ అవార్డునూ పరాశరన్‍ అందుకున్నారు.
సంత్‍ రామచంద్ర పరమహంస
అయోధ్యలోని రామ జన్మభూమిలో రామా లయం నిర్మించాలని 1934లోనే ఉద్యమం ప్రారంభించారు సంత్‍ రామచంద్ర పరమహంస. హిందూవాదుల మద్దతుతో మసీదును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు కూడా. తన ఉద్యమం కోసం రామజన్మభూమి న్యాస్‍ను ఏర్పాటు చేశారు. 1949లో మసీదులో రాముడి విగ్రహాలు ప్రత్యక్షం కావడంలోనూ ఈయనదే కీలకపాత్ర అని చెబుతారు. చిన్న చిన్న హిందూ సంఘాల మద్దతుతో ఆయన పలు కార్య క్రమాలు నిర్వహించారు. 2000లో ఈయన కన్ను మూశారు.
అశోక్‍ సింఘాల్‍
‘హిందూ సింహం’గా పేరొందిన ఈయన విశ్వహిందూ పరిషత్‍ (వీహెచ్‍పీ) సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. ఈయన వృత్తిరీత్యా ఇంజినీరు. రామజన్మభూమి ఉద్యమం ఉవ్వెత్తున ఎగియడానికి ఈయనే మూల కారణం. ఎందరో సాధువులను కలిశారు. సంత్‍లను కూడగట్టారు. 1984లో సాధువులతో కలిసి ‘తొలి ధర్మ సంసద్‍’ను నిర్వహించారు. దీని కారణంగానే ఆ రోజుల్లో రామజన్మభూమి ఉద్యమం భారత్‍తో ఊరూవాడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంకా ఈయన చేపట్టిన అనేక కార్యక్రమాలు హిందువులను సంఘటితం చేశాయి. తరువాత కాలంలో వీహెచ్‍పీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. సంత్‍లు, సాధువుల మధ్య సంధానకర్తగా వ్యవహరించారు. రామ మందిర నిర్మాణాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేలా భారతీయ జనతా పార్టీని ఒప్పించడంలో సఫలీకృతులయ్యారు. తీర్పులు, ఇతరత్రా వివాదాలతో నిమిత్తం లేకుండా దశాబ్దాల క్రితమే అయోధ్య సమీపంలో ‘కరసేవక పురం’ పేరుతో రామాలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడంలో ఈయనే కీలకం. 2015లో సింఘాల్‍ పరమ పదించారు.
ఎల్‍కే అద్వానీ
రామజన్మభూమి ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ మద్దతు లభించడంతో ఆ ఉద్యమం స్వరూప స్వభావాలే మారిపోయాయి. దేశ రాజ కీయాలు సైతం కొత్త మలుపు తీసుకున్నాయి. హిందూ – ముస్లింల మధ్య చీలిక వచ్చింది. అయితే రామజన్మభూమి ఉద్యమాన్ని బీజేపీ ఎదుగుదలకు అనువుగా మలచడంలో అగ్రనేత లాల్‍కృష్ణ అద్వానీదే కీలకపాత్ర. ఆయన రామన్మభూమిని రాజకీయ అంశంగా మార్చారు. ఇక, అప్పటి నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనే అంశం భారతదేశంలోని ప్రతి హిందువు అజెండాగా మారిపోయింది. హిందు వుల భావోద్వేగాల సమస్యగా దానిని మలచడంలో అద్వానీ పాత్ర ఇంతని చెప్పలేం. 1986లో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నపుడు పార్టీ సిద్ధాంతాలను అతివాద హిందుత్వం వైపు మళ్లించారు. 1989లో రామ మందిర అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. 1990లో ఈయన చేపట్టిన రామ్‍ రథయాత్ర.. మొత్తం దేశ రాజకీయ స్వరూపాన్నే మార్చేసింది. బీజేపీ విజయ పరంపరకు ఈ యాత్ర బాటలు వేయడమే కాక, హిందుత్వ వాదుల్లో అద్వానీని తిరుగులేని నాయకుడిగా చేసింది. నిజానికి ఆ సమయంలో జరిగిన లోక్‍సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడమే కాక, అద్వానీ ప్రధాని కూడా అయ్యేవారే. అయితే, ఆ సమ యంలో అప్పటి ప్రధాని, కాంగ్రెస్‍ నేత రాజీవ్‍ గాంధీ చెన్నైలో లంక ఉగ్రవాదుల దాడితో హత్యకు గురయ్యారు. ఈ సానుభూతితో నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‍ విజయబావుటా ఎగురవేసింది. నిజానికి ఈ హత్యకు ముందు దశలో జరిగిన స్థానాల్లో కాంగ్రెస్‍ గెలుపొందిన స్థానాలు అరకొరే.. అంటే రాజీవ్‍ హత్యకు గురికాకుండా ఉంటే నాటి ఎన్ని కల్లో బీజేపీ గెలిచి, అద్వానీ వంద శాతం ప్రధానమంత్రి అయ్యే వారని రాజకీయ పరిశీల కులు ఇప్పటికీ అంటుంటారు.
ముఖ్యంగా బీజేపీ తరపున కార్యక్రమాలు చేపడుతూనే, వాటన్నిటిలోనూ సంఘ్‍ పరివార్‍ను భాగస్వామ్యం చేయడం ద్వారా రామజన్మభూమి ఉద్యమాన్ని అద్వానీ మరో ఎత్తుకు తీసుకెళ్లారు.
మురళీ మనోహర్‍ జోషి
భారతీయ జనతా పార్టీ అగ్రనేతల్లో మురళీ మనోహర్‍ జోషి ఒకరు. అయోధ్య ఉద్యమంలో ఈయనదీ ప్రముఖ పాత్రే. అద్వానీ మాదిరిగానే ఈ ఉద్యమాన్ని ప్రజల చెంతకు తీసుకు వెళ్లడంలో ఈయన సఫలీకృతులయ్యారు. హిందువుల్లో భావోద్వేగాలను కలిగించారు. పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‍గా.. రామజన్మభూమి అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చడంలో కృషి చేశారు.
ఉమా భారతి
రామజన్మభూమి ఉద్యమంతోనే ఉమాభారతి ప్రముఖ నాయకురాలిగా ఎదిగారు. అద్వానీ పక్కనే నిల్చుని ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తూ అందరినీ ఆకర్షించారు. రామ మందిరం నిర్మాణంపై బీజేపీ పట్టు సడలించకూడదన్నది ఆమె ప్రగాఢ విశ్వాసం.
ప్రవీణ్‍ తొగాడియా
విశ్వహిందూ పరిషత్‍ అధినేత అశోక్‍ సింఘాల్‍ అనారోగ్యానికి గురైనపుడు.. ఈయనే వీహెచ్‍పీ బాధ్యతలను చేపట్టారు. ఆవేశపూరిత ప్రసంగాలు చేయడంలో, భావోద్వేగాలను సృష్టిం చడంలో ఈయన ప్రత్యేకతే వేరు. నాడు ఈయన ప్రతి ప్రసంగంలోనూ రామమందిర నిర్మాణమే ముఖ్యాంశంగా ఉండేది. సింఘాల్‍కు ఏమాత్రం తీసిపోకుండా ఈయన రామజన్మభూమి ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్లారు.
గోరఖ్‍నాథ్‍ మఠం
గోరఖ్‍నాథ్‍ మఠం ఉత్తరప్రదేశ్‍లోని గోరఖ్‍ పూర్‍లో ఉంది. హిందూత్వ వాదానికి ఈ ప్రాంతం గొప్ప ఆయువుపట్టు. 11వ శతాబ్దం ఆరంభంలో హిందూ యోగి, సాధువు యోగి గోరఖ్‍నాథ్‍ ఈ మఠానికి బీజం వేశారు. అటు రాజకీయాల్లోనూ, ఇటు ఆధ్యాత్మికంగానూ చైతన్య వంతమైన పాత్రను ఈ మఠం పోషించింది. మహంత్‍ దిగ్విజయ్‍నాథ్‍ తరువాత ఆయన వారసుడు మహంత్‍ అవైద్యనాథ్‍ 1962, 67, 69, 74, 77లో మణిరామ్‍ స్వతంత్ర ఎమ్మెల్యేగా, 1970, 89లలో గోరఖ్‍పూర్‍ ఎంపీగానూ ఎన్నికయ్యారు. సంఘ్‍ పరివార్‍ స్వయంగా రామజన్మభూమి ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో అవైద్యనాథ్‍ బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరపున 1991, 96లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదే మఠం నుంచి వచ్చిన ఉత్తరప్రదేశ్‍ ప్రస్తుత ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్‍ 1998 నుంచి గోరఖ్‍ పూర్‍ ఎంపీగా గెలుస్తూవచ్చారు. ఎంపీగా ఉంటూ ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అయ్యారు. బాబ్రీ కూల్చివేతలోనూ యోగి ఆదిత్యనాథ్‍ పాత్ర కీలక మని అంటారు.

Review ఈ భక్తులు రాముడు వదిలిన బాణాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top