
మహాభారతంలో ఉద్యోగపర్వంలో కుంతీదేవి తన కుమారుడైన ధర్మరాజుకి శ్రీకృష్ణుని ద్వారా సందేశం పంపుతూ, క్షాత్ర ధర్మాన్ని బోధించే ఓకథ చెప్తుంది. విదులోపాఖ్యానంగా ఇది ప్రసిద్ధి చెందింది. అందులో విదుల అనే క్షత్రియ వనిత యుద్ధం నుండి పారిపోయి వచ్చిన తన కుమా రునితో అన్న మాట ఈ శ్లోకం…
శ్లో।। అలాతం తిన్దుకస్యేవ ముహూర్తమపి విజ్వల।
మా తుషాగ్నిరివానర్చిర్ధూమాయస్వ జిజీవిషుః ।।
శ్లో।। ముహూర్తం జ్వలితం శ్రేయః న చ ధూమా యితం చిరమ్ ।
మా హ స్మ కస్యచిద్ గేహే జనీ రాజ్ఞః ఖరో మృదుః।।
తిందుకం (తునికి చెట్టు) కఱ్ఱ కొరివి వలె నిప్పురవ్వలు చిమ్ముతూ భగ్గుమని ముహూర్తం కాలం పాటైనా జ్వలించు. అంతే కాని, ఊకనిప్పు వలె చాలా సేపు పొగ చిమ్ముతూ జ్వాల లేకుండా, ‘ఎలాగోలాగ జీవిస్తే చాలు’ అన్నట్లు బ్రతకకు. చాలా సేపు పొగ కొట్టుకుంటూ ఉండడం కంటే ఒక ముహూర్తంపాటు వెలుగు, వేడి విరజిమ్మటం నయం.
క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ యుద్ధంలో విజయమో, వీర స్వర్గమో పొందమని ఓ తల్లి తన కుమారుడికి ఇచ్చిన సందేశం. సంజయుడనే తన కుమారుని పిరికితనాన్ని నిరసిస్తూ అతని తల్లి విదుల, ‘‘ఇలాంటి పుత్రుని ఏ తల్లీ కనకుండు గాక!’’ అంటుంది వేదనతో. ఇది వీరమాతలు, వీర నారీమణులు అనుసరించిన మహోన్నత ఆద•ర్శం. ఇలానే, పలనాటి యుద్ధంలో బాల చంద్రుణ్ణి, అతని భార్య మాంచాల ప్రబోధించింది. ఖడ్గతిక్కన చరిత్ర కూడా ఇటువంటిదే. అధర్మమార్గంలో శత్రుసైన్యం మూకుమ్మడిగా మీదపడినప్పటికీ, వెనుకంజ వేయకుండా పోరాడి వీరస్వర్గం అలంకరించిన అభిమన్యుని కీర్తి చిరస్థాయిగా వుంది. భారతదేశ సరిహద్దులో తమ పరాక్రమాన్ని చూపి, శత్రువుల పీచమణచిన పరమవీర సైనికుల వీరగాథలు ఈ శ్లోకంలో చెప్పినట్లు వెలుగుచిమ్మిన వారే. కొద్ది సంవత్స రాలే ఈ పుడమిపై జీవించి శాశ్వతంగా మన హృదయాలలో నిలిచిన జగద్గురు ఆదిశంకరుని వలె, స్వామి వివేకానందుని వలె, సర్దార్ భగత్ సింగ్ వలె జీవించినంత కాలం ఇతరులకు వెలుగు నివ్వాలి. స్వధర్మాచరణ చేయాలి అని సందేశం.
-బి.ఎస్.శర్మ
Review ఓ వెలుగు వెలుగు.