అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్లో ఒక కాపు. ఆ కాపు తెల్లవారుజామునే లేచి, సంకటి మూట భుజాన వేసుకుని పొలానికి వెళ్లి పని చేస్తుండే వాడు. ఒకరోజున జొన్న పైరు కోసి తెచ్చుకున్న అన్నం తింటున్నాడు. అంతలో చిట్టడివిలో నుంచి ఒక తోడేలు నకనకలాడుతూ వచ్చి, కాపు తింటున్న జొన్న సంకటిని చూసి, ‘మామా! మామా! నాకు కాస్త రుచి చూపించవూ!’ అని అడిగింది.
కాపు దయతలచి దానికి కాస్త పెట్టాడు. తోడేలుకు జొన్న సంకటి ఎంతగానో నచ్చింది.
‘మామా! ఇది ఎలా వస్తుందో నాకు చెప్పవూ?’ అని అడిగింది.
‘పొలం దున్నాలి’ అన్నాడు కాపు.
‘దున్నగానే సంకటి కడుపు నిండా తినొచ్చు కదా!’ అంది తోడేలు.
‘అప్పుడే ఎలా వస్తుంది? జొన్న పైరు పెట్టాలి. ఎదగనివ్వాలి..’ అన్నాడు రైతు.
‘ఎదగంగానే సంకటి వస్తుంది కదూ!’ అని అడిగింది తోడేలు.
‘అంత తొందరపడితే ఎలా? సాంతం చెప్పనీ. ఎదిగి, కంకివేసిన తరువాత మీ బోటి పెద్ద మనుషుల్ని, మీ పరివారాన్ని పైరుకు కొంచెం దూరంగా ఉండేలా కాపలా కాయాలి’ అన్నాడు.
‘ఆ సంగతి నాకు చెప్పాలా? ఈగని కూడా ఆ ఛాయలకు రానియ్యను. అప్పుడు నాకు సంకటి తిన్నంత దొరుకుతుంది కదూ!’ అంది తోడేలు.
‘అప్పుడేనా? విను. జొన్నకంకి బాగా పండిన తరువాత నూర్చి ఆ గింజలు తొక్కి వండాలి. అప్పుడు కాని సంకటి రాదు’ అన్నాడు కాపు.
‘అబ్బో! చాలా చాకిరి ఉందే! అందాక కూర్చుంటే చావవలసిందే. ఆకలి తీర్చుకోవడానికి అంతకంటే తేలిక మార్గం ఏదైనా ఉంటే చెబుదూ!’ అని అడిగింది తోడేలు.
కాపు ఆ తోడేలు తిక్క కుదర్చాలని అనుకున్నాడు.
‘సరే! అలాగైతే అక్కడ గుర్రమూ, పిల్లా ఉన్నాయి. ఆ గుర్రపు పిల్లను తిను’ అని సలహా ఇచ్చాడు.
తోడేలు తిన్నగా గుర్రపు పిల్ల వద్దకు వెళ్లింది. పిల్ల అదిరిపడి ఒక్క గెంతున తల్లి పొట్ట కిందకు దూరింది. తోడేలు దాని వెనుకే వెళ్లి పట్టుకోబోయింది. పెద్ద గుర్రం ఎగిరి వెనుక కాళ్లతో తోడేలు మూతి మీద ఒక్క తన్ను తన్నింది. ఆ తన్ను దెబ్బకు దిమ్మరపోయింది తోడేలు.
ఉసూరుమంటూ మళ్లీ రైతు వద్దకు వచ్చింది. జరిగిన సంగతినంతా చెప్పి, అంతకన్నా తేలికగా తిండి దొరికే ఉపాయం మరొకటి ఏదైనా ఉంటే చెప్పాలని బతిమలాడింది.
కాపు మళ్లీ దాని వంక ఎగాదిగా చూశాడు. ఈసారి అది మళ్లీ ఆకలి మాటెత్తకుండా ఉండాలని లోలోనే యోచించి, ‘సరే, అదిగో ఆ దక్షిణపు బీడులో గొర్రెల మంద మేస్తున్నది. అందులో బాగా బలిసి ఉన్న పొట్టేలు ఉంది. దాన్ని వేటాడి తిను. నీ ఆకలి మొత్తం తీరిపోతుంది’ అని సలహానిచ్చాడు.
తోడేలు ఆ గొర్రెలమంద వద్దకు వెళ్లింది. కొమ్ములు బాగా మెలికలు తిరిగి ఉన్న పొట్టేలును గట్టిగా పట్టుకుంది.
‘కాపు నిన్ను తినడానికి నాకు అనుమతి ఇచ్చాడు’ అంది.
‘అయితే చెప్పేదేముంది? ఆ రైతు చెప్పినట్టే చెయ్యి. అయితే ఒక్కటి మాత్రం మనవి చేస్తాను. నన్ను ముక్కలు ముక్కలుగా కొరికి వేయవద్దు. నా తిత్తి చీల్చవద్దు. నువ్వు నోరు బాగా విప్పుకుంటే నేరుగా నేనే నీ నోట్లోకి దూరిపోతాను. నీకు కూడా మింగే పని ఉండదు. ఏమంటావు?’ అంది పొట్టేలు.
తోడేలు సరేనని తలూపింది.
ముందరి కాళ్లతో గుంట తీసి, అందులో కాళ్లు నిగడదన్ని నోరు పూర్తిగా తెరిచి కూర్చుంది.
పొట్టేలు వేగంగా వెనక్కి వెళ్లి, అంతకుమించిన వేగంతో రయ్యిన దూసుకెళ్లి సరాసరి తోడేలు ముఖ భాగాన్ని ఢీకొట్టింది.
ఆ దెబ్బకు తోడేలు స్ప•హతప్పి పడిపోయింది. చాలాసేపటి వరకు కాని మళ్లీ దానికి మెలకువ రాలేదు. అప్పుడు దానికి చిన్న సందేహం వచ్చింది.
‘ఇంతకూ నేను పొట్టేలును తిన్నానా? లేదా?’ అని.
కాసేపు ఆలోచించి, ‘ఆ.. ఆ.. బహుశా తినే ఉంటాను’ అనుకున్నది.





































































































































































































































































































































































Review తెలివితక్కువ తోడేలు.