ధర్మయ్య పరీక్ష

రామాపురం గ్రామంలో ఉండే ధర్మయ్య గొప్ప స్థితిమంతుడే కాకుండా, పేరుకు తగినట్టు మంచి ధర్మబుద్ధి గలవాడు. ఆయనకు పెళ్లీడుకు వచ్చిన విశ్వం అని ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. విశ్వం రూపవంతుడే కాక, మంచి గుణవంతుడు కూడా. అతడికి తగిన రూపవతి, గుణవతి అయిన కన్య కోసం ధర్మయ్య వెతకసాగాడు.
ధర్మయ్యకు అదే గ్రామంలో వెంకప్ప అని ఒక స్నేహితుడు ఉండేవాడు. వెంకప్ప జరీచీరలను ఇంట్లో మగ్గాల మీద నేయించి, చుట్టపక్కల గ్రామాలకు తీసుకుపోయి అమ్ముతుండే వాడు. వాటిని కాస్త కలిగిన గృహస్తులందరూ కొనేవారు. ఆ కారణంగా వెంకప్పకు చాలా గ్రామాల్లోని ఆస్తిపరుల గురించి బాగా తెలుసు.
ఒకసారి అతడు ధర్మయ్యతో- ‘నువ్వు విశ్వం కోసం పిల్లను వెతుకుతున్నావని తెలిసింది. పేరవరంలోని రాజయ్య గారికి కమల అనే అందమైన అమ్మాయి ఉంది. వీరవరంలోని రామయ్య గారికి సరళ అనే చక్కని కూతురు ఉంది. వీళ్లిద్దరినీ నువ్వూ, విశ్వం ఒకసారి వెళ్లి చూసుకోండి. ఇద్దరికీ• నచ్చిన వారిని ఎన్నుకుంటే నీ కొడుకు పెళ్లి సమస్య తీరిపోతుంది. రాజయ్య, రామయ్య ఇద్దరూ కూడా సంప్రదాయాల్లో, ఆస్తిపాస్తుల్లో నీకు సరితూగగలవారు’ అని చెప్పాడు.
ధర్మయ్య వెంకప్ప చెప్పిన విధంగా కుమారుడైన విశ్వాన్ని వెంటబెట్టుకుని రెండు గ్రామాలకూ వెళ్లి కమల, సరళను చూసి వచ్చాడు. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు అందగత్తెలుగా తోచారు. విశ్వం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని వధువుగా ఎన్నుకునే భారం తండ్రి మీద ఉంచాడు. ధర్మయ్యకు ఆ ఇద్దరిలో ఎవరిని కోడలిగా తెచ్చుకోవాలన్నది పెద్ద సమస్యగా మారింది.
ఒకనాడు ధర్మయ్య వెంకప్పతో- ‘ఈ కోడలిని తెచ్చుకోవడం అనేది పెద్ద సమస్యగా మారింది వెంకప్పా! కమల, సరళ ఇద్దరూ మంచి అందగత్తెలే. కానీ, అందం శాశ్వతం కాదు కదా! అందుకని వాళ్లిద్దరి గుణగణాలకు చిన్న పరీక్ష ఒకటి పెట్టి అందులో నెగ్గిన పిల్లను నా కోడలిగా తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఇందుకు నీ సాయం కావాలి’ అని కోరాడు.
అందుకు వెంకప్ప నవ్వి, ‘నా సాయమా? దానికేం! ధర్మసూక్ష్మాలెన్నో తెలిసిన వాడివని నీకు మంచి పేరుంది. నీలాంటి స్నేహితుడికి సాయపడటం కంటే నాకు కావాల్సిందేముంది?’ అన్నాడు వెంకప్ప. అప్పుడు ధర్మయ్య వెంకప్పకు ఏం చేయాలో వివరించాడు.
వెంకప్ప ధర్మయ్య చెప్పిన విధంగా కొన్ని కొత్త నమూనా జరీ చీరలు తీసుకుని మొదట పేరవరం వెళ్లాడు. కమల వెంకప్పను చూస్తూనే, ‘కొత్త రకం చీరలు ఏమైనా తెచ్చావా?’ అని అడిగింది.

వెంకప్ప చీరల మూటలు విప్పుతూ, ‘కొత్త రకం చీరలు ఏవైనా నేయగానే మొదట చూపేది మీకే కదమ్మా’ అని చీరలను కమల ముందుంచాడు.

కమల వాటిని చూసి చాలా ముచ్చట పడింది. వెంకప్ప వాటిలోంచి ఒక చీర తీసి కమలకు ఇస్తూ, ‘ఇది తీసుకోండి అమ్మాయి గారూ! మీకు చాలా బాగా నప్పుతుంది. జరీ నేత కూడా దట్టంగా ఉంది. కట్టుకు చూశాక నా ఎన్నికను మీరు తప్పకుండా మెచ్చుకుంటారు’ అన్నాడు.
కమల చీర తీసుకుని, ‘మరి ఈసారి రవిక ముక్కలు తెచ్చినట్టు లేదే! తెచ్చి ఉంటే చీరకు తగిన రవిక కూడా తీసుకునే దానిని కదా!’ అంది.

దానికి వెంకప్ప తల గోక్కుని, ‘అవును మరి! కాని రవికకు పనికొచ్చే గుడ్డ మగ్గం మీద ఉంది. వారం పది రోజుల్లో తప్పక తెచ్చిస్తాను’ అని చీర ఖరీదు తీసుకుని అక్కడి నుంచి వీరవరం వెళ్లాడు.

అక్కడ రామయ్య కూతురు సరళకు కూడా వెంకప్ప తెచ్చిన జరీ చీరలు బాగా నచ్చినాయి.

అతడు ఆమెకు ఒక చీర ఇచ్చి, ‘అమ్మాయి గారూ! దీనికి తగిన రవిక గుడ్డ వారం రోజుల్లో తెస్తాను. ఈలోగా తొందరపడి ఎవరి దగ్గరా కొనకండి. ఈ చీరకు నప్పే రవిక గుడ్డ మగ్గం మీద ఉంది’ అని చెప్పాడు. సరళ డబ్బులిచ్చి చీర కొన్నది. వెంకప్ప స్వగ్రామం చేరుకున్నాడు. రెండు వారాలు ఆగి, ధర్మయ్య చెప్పిన మీదట కమల, సరళల చీరలకు తగిన రవిక గుడ్డలు తీసుకుని బయల్దేరాడు.
మొదట కమల వద్దకు వెళ్లి, ‘అమ్మాయి గారూ! మీరు కొన్న చీరకు తగిన రవిక గుడ్డ తెచ్చాను. చూడండి’ అన్నాడు.

అయితే కమల అతడితో, ‘అక్కర్లేదులే. రవిక గుడ్డ మరొకరి దగ్గర కొన్నాను వెంకప్పా’ అన్నది.

వెంకప్ప సరేనని బయల్దేరి సరళ ఇంటికి వెళ్లాడు. సరళ అతడిని అంత దూరం నుంచి చూస్తూనే ‘రవిక గుడ్డ తెచ్చినట్టున్నావు. అవునా?’ అని అడిగింది. ‘అవును అమ్మాయి గారూ! తెచ్చాను. కాస్త ఆలస్యమైంది. మీరు మరోచోట రవిక గుడ్డ కొనలేదు కదా?’ అని అడిగాడు వెంకప్ప.
సరళ నవ్వుతూ, ‘ఇంత మతిమరుపు మనిషివేమయ్యా నువ్వు. చీరలోనే రవికగుడ్డ కూడా మడత వేసి ఉంది. నువ్వు వెళ్లాక చీర మడతలన్నీ విప్పుతుంటే రవిక గుడ్డ కిందపడింది. ఇదుగో చూడు’ అంటూ గదిలోకి వెళ్లి రవిక గుడ్డ తెచ్చి చూపించి, ‘ ఆరోజున నీకు చీర ఖరీదే ఇచ్చాను. ఈ రవిక ముక్క ఖరీదెంతో చెప్పు ఇచ్చేస్తాను’ అంది.
వెంకప్ప తల గోక్కుంటూ ‘మరిచిపోయానమ్మ గారూ! పెద్దవాడిని అయిపోతున్నాను కదా’ అంటూ రవిక గుడ్డ ఖరీదు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. వెంకప్ప తిరిగి వస్తూనే నేరుగా ధర్మయ్య వద్దకు వెళ్లాడు. జరిగినదంతా అతడికి వివరంగా చెప్పాడు. వెంకప్ప చెప్పిదనదంతా విన్న ధర్మయ్య తృప్తిగా తలాడించి, ‘నాకు కాబోయే కోడలెవరో తేలిపోయింది వెంకప్పా! మంచి ముహూర్తం చూసుకుని తాంబూలాలు మార్చుకోవడానికి బయల్దేరాలి’ అన్నాడు.
వెంకప్ప, ‘ఇంతకూ నువ్వు ఏ అమ్మాయిని కోడలిగా చేసుకోబోతున్నావో నాకు అంతుబట్టడం లేదు’ అన్నాడు. అప్పుడు ధర్మయ్య, ‘నువ్వు మొదట నేను ఇవ్వమన్న చీరలకు కమలకు ఒకటీ, సరళకు ఒకటీ ఇచ్చావు కదా?’ అన్నాడు.
‘అవును. నువ్వు ఇవ్వమన్న చీరలనే వాళ్లకు వాటిని గురించి కాస్త గొప్పగా చెబుతూ ఇచ్చి వచ్చాను’ అన్నాడు వెంకప్ప.

‘ఆ రెండు చీరల్లోనూ మనం వాటికి నప్పే రవిక ముక్కలను కూడా ఉంచి మడత వేసిన సంగతి నీకు గుర్తుంది కదా?’ అని అడిగాడు ధర్మయ్య.

వెంకప్ప ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, ‘ఆ.. ఇప్పుడు తెలిసింది. నీకు కాబోయే కోడలు సరళ అన్నమాట!’అన్నాడు.

‘బాగా గ్రహించావు వెంకప్పా! సరళకు ఉన్న నిజాయితీ కమల వద్ద కొరవడింది. కమల చీర మడతల్లో ఉన్న రవిక ముక్కను చూసి కూడా దాచుకున్నది. అందువల్లనే నువ్వు రవిక ముక్కను అమ్మడానికి వెళ్లినపుడు చీరలోనే రవిక ముక్క ఉందనే సంగతిని దాచి, తాను మరొకరి వద్ద రవిక కొన్నానని అబద్ధం చెప్పింది. ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనే మనుషుల అసలు బుద్ధులు బయటపడుతుంటాయి. సరే. కమలకు ఇచ్చిన రవిక గుడ్డ ఖరీదు ఎంతో చెప్పు. ఇచ్చేస్తాను’ అన్నాడు ధర్మయ్య.
వెంకప్ప సంతోషంగా, ‘భలేవాడివి ధర్మయ్యా! దాని ఖరీదు నాకు ఇస్తావా? నీ మనసుకు నచ్చిన కోడలు దొరకడానికి ఉడతాభక్తిగా నేనేదో చిన్న సాయం చేశానన్న తృప్తి నాకు మిగలనివ్వు. అది నాకు చాలు’ అన్నాడు. ఆ తరువాత ధర్మయ్య కొడుకు విశ్వానికీ, సరళకూ వైభవంగా వివాహం జరిగింది.

Review ధర్మయ్య పరీక్ష.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top