మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి
తెలుసుకుందాం
పంజరంలో పెట్టినా కాకి చిలుక పలుకులు పలకదు
కొందరు ఇళ్లలో చిలుకలను పంజరాల్లో పెట్టి పెంచుకుంటూ ఉంటారు. కొంచెం నేర్పిస్తే చిలుకలు ముద్దు ముద్దుగా పలుకులు పలుకు తాయి కూడా. వెనకటికి ఒక అతి తెలివి మనిషి చిలుక అలా పలకడానికి కారణం పంజరమేనని అనుకున్నాడు. పంజరంలో పెట్టినప్పుడు చిలుక పలకగా లేనిది.. కాకిని పంజరంలో పెడితే ఆ మాత్రం పలుకులు పలకలేదా అని భావించాడు. వెంటనే ఒక కాకిని తెచ్చి పంజరంలో ఉంచి, దానిని సాకడం ఆరంభించాడు. ఎన్నాళ్లు సాకినా ఆ కాకి తనకు అలవాటైన ‘కావు కావు’ అనే గోల చేస్తూ విసుగు పుట్టించిందే తప్ప చిలుకలా పలకలేకపోయింది.
చిలుకను మంచి వారికి ఉదాహరణగా, కాకిని దుర్మార్గులకు ఉదాహరణగా, పంజరాన్ని శిక్షణ కేంద్రానికి ఉదాహరణగా పోల్చి చెప్పిన జాతీయం ఇది.
చక్కని శిక్షణ కేంద్రంలో చేరిన వారికి సహజంగా శ్రద్ధాసక్తులు ఉంటే రాణిస్తారు కానీ, దుర్మార్గపు పనులు చేసేవారు శిక్షణ కేంద్రంలో చేరినా వారిలో ఎటువంటి మార్పు ఉండదు.
అలాగే, మరో సందర్భంలోకి వస్తే- ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి ఆ జీవికి సంబం ధించిన సహజ ధర్మాలు కొన్ని ఉంటాయి. వాటిని మరొకరు అనుకరించగలరేమో కానీ, అందులో సహజత్వం ఉండదు. అందులో కృత్రిమం విసుగు పుట్టిస్తుంది.
ఈ సృష్టిలో ఎవరికి ఉద్దేశించిన పనులు వారు మాత్రమే చేయాలి. చిలుక పనులు కాకి చేయలేదు. కాకి పనులు చిలుక చేయదు. బల వంతంగా చేయించినా.. చివరకు అది విక టిస్తుంది.
ఇటువంటి సందర్భాల్లోనే పై జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు.
చేపల చెరువుకు కొంగ కాపలా
చేపల చెరువుకు కొంగను ఎవరైనా కాపలా పెడతారా? పెడితే ఆ చెరువులో చేపలు మిగులు తాయా? రక్షణ అవసరం ఉన్న చోట కోరి మరీ శత్రువులకు అవకాశం కల్పించే అసంబద్ధ నిర్ణయా లను ఎద్దేవా చేయడానికి ఈ జాతీయాన్ని ప్రయో గిస్తుంటారు.
కొంగ సాధారణంగా చేపలను తిని బతుకు తుంటుంది. చేపలు దాని సహజ ఆహారం. చేపల చెరువు వద్దకు కొంగలు రాకుండా రైతులు నానా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అటువంటిది చేపల చెరువుకు కొంగనే కాపలాగా పెడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఉహించలేనివి కావు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు తెలిసీ తెలియక శత్రువులకు చోటు ఇచ్చి దెబ్బతింటూ ఉంటారు. అటువంటి సందర్భాలలో ఈ జాతీ యాన్ని ఉపయోగిస్తారు.
ఛీ కుక్కా అంటే ఏమక్కా అన్నట్టు..
ఎదుటి వారు నిందించినా కొందరు ఏమాత్రం తొణకరు, బెణకరు. అనవసరంగా ఆవేశపడరు. తెలివిగా, నర్మగర్భంగా వారికి తగిన చురకలం టిస్తారు. కయ్యానికి సిద్ధపడుతున్నట్టుగా కాకుండా, తెలవిగా ఇలా మాటకు మాట బదులివ్వడం ఒక కళ. కొందరు ఇలాంటి కళలో ఆరితేరి ఉంటారు.
ఒక ఊళ్లో ఇరుగుపొరుగున ఇద్దరమ్మలక్కలు ఉండేవారు. ఒకామెకు రెండో ఆమెపై ఎందుకో అక్కసు కలిగింది. కోపం పట్టలేక ఆమెను- ‘ఛీ కుక్కా..’ అని తిట్టింది.
రెండో ఆమె దానికి ఏమాత్రం తొణకకుండా చిరునవ్వుతో ‘ఏమక్కా పిలిచావు?’ అని బదులు పలికిందట. కుక్కకు అక్క కుక్క కాకుండా మరేమ వుతుంది? అనవసరంగా నోరుజారి, ‘ఛీ కుక్కా’ అని తిట్టినామె సిగ్గుతో తలదించుకుంది. చాలా తెలివిగా మాటకు మాట బదులివ్వడానికి ఉద హరిస్తూ ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.
Review పలుకు బడి.