పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి కూడా ఎంతో ఉంటుంది. అటువంటి కొన్ని కథల పరిచయం.
ఎప్పుడో చిన్ననాడు చదువు కున్నాం ‘పులి-ఆవు’ కథ. ఎంత మందికి గుర్తుండి ఉంటుంది? అందుకే ఒకసారి ఈ అద్భుతమైన కథను ఇంకోసారి నెమరు వేసుకుందాం.ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించు కోకుండా, యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూసి దానిపై దూకడానికి సిద్ధ మైంది. ఇక, పంజా విసురుతుందనగా, ఆవు పులిని ఉద్దేశించి ఇలా అంది.
‘పులి రాజా! కొంచెం ఆగు. నేను చెప్పే మాటలు కాస్త ఓపికగా, శాంతంగా విను. ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది. ఆ లేగదూడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా ఇంకా నేర్చుకోలేదు. దానికి ఇంకా లోకం తెలియదు. నేను మేతకు రాగానే రోజూ ఎప్పుడు తిరిగి తన వద్దకు వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు’ అని వేడుకుంది.ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వింది.‘ఆహా ఏమి మాయ మాటలు? ఇంటికి వెళ్లి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవని అనుకోకు. నేనేం వెర్రి దానను కాను’ అంది కోపంగా పులి.‘నీవు అలా భావించడం సరికాదు. నేను అసత్యం పలికే దానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏమి ఉపయోగం? ఒక్కటి మాత్రం నిజం. ఎవరికైనా, ఎప్పటికైనా చావు తప్పదు. నాకు చావు ఇప్పుడే వచ్చిందని అనుకుంటాను. ఆకలిగొన్న నీకు నేను ఆహారం కావడం కంటే నేను బతికి పరులకు చేసే మేలు ఇంకేముంటుంది? ఉపకారం చేసిన దానిని అవు తాను. అయితే, ఒక్కమాట. నాకు చావంటే ఎలాగూ భయం లేదు. నీవు పంజా విసిరినప్పుడే నేను నా ప్రాణాలపై ఆశ వదులుకున్నాను. కానీ, నా పసికూన గురించి ఒక్క క్షణం ఆలోచించు. అది నా కోసం ఈ సమయంలో ఎదురు చూస్తూ ఉంటుంది. రేపటి నుంచి ఎలాగో తన బతుకు తాను బతుకుతుంది. ఈ ఒక్కసారీ కడసారి చూపు తనివితీరా చూసుకోనివ్వు. దానికి మంచి చెడ్డలు చెప్పి, లోకం పోకడ చెప్పి వస్తాను. నీకు ఆహార మవుతాను. నా బిడ్డను చూసి, దాని ఆకలి తీర్చి నీకు ఆహారం కావడానికి నాకు ఎలాంటి అభ్యం తరం లేదు’ అని ఆవు నిజాయితీగా, మిక్కిలి నమ్మకంతో చెప్పింది.
‘ఆహా.. ఊరిలో తిరుగుతూ బతికే జంతువులు మీరు. మీ మాటలు నమ్మేదెలా? అయినా సరే. నువ్వు దీనంగా అడిగావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఊరిలో నివసించే నీలాంటి జంతువులలో నీతి ఎంత ఉందో తెలుసుకుంటాను. కాబట్టి వెళ్లి రా’ అని పులి గంభీరంగా పలికింది.ఆవు గబగబా ఇంటికి వెళ్లింది. దూడకు కడుపు నిండా పాలు ఇచ్చింది. కోడెదూడ శరీరాన్ని ప్రేమా స్పదంగా తనివితీరా స్ప•శించింది. కంటతడి పెట్టుకుంటూ బిడ్డతో తల్లి ఆవు ఇలా అంది..‘నాయనా! బుద్ధిమంతురాలిగా జీవించు. మంచితనంతో బతుకు. తోటి వారితో స్నేహంగా ఉండు. ఇచ్చిన మాట నిలుపుకో. ఎటువంటి పరి స్థితుల్లోనూ అబద్ధాలు ఆడకు. మంచి ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకో’ అని బుద్ధులు నేర్పింది. అనంతరం నేరుగా అడవికి చేరుకుని పులి ఉన్న చోటుకు వచ్చింది. ఆవును చూసిన పులి ఆశ్చర్యపోయింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది. దీనిని చంపితే మహా పాపం అంటుకుంటుంది అనుకుని ఆ ఆవును పులి చంపకుండా వదిలేసింది.
నీతి: ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. సత్యం మాత్రమే గెలిపిస్తుంది.
Review పులి -ఆవు.