మూల శ్లోకం మేటి భావం

మన సనాతన ధర్మానికి సంస్క•త వాక్యాలే మూల శ్లోకాలుగా నిలుస్తున్నాయి. మనం తరచుగా వినే మూల వాక్యాల్లో కొన్ని- ‘‘ ధర్మో రక్షతి రక్షిత:, సత్యమేవ జయతే, అహింసా పరమోధర్మ:, ధనం మూలమిదం జగత్‍, జననీ జన్మ భూమిశ్చ సర్వర్గాదపీ గరీయసి, కృషితో నాస్తి దుర్భిక్షమ్‍, బ్రాహ్మణానా మనేకత్వం, యథారాజా తథా ప్రజా, పుస్తకం వనితా విత్తం, పర హస్తం గతం గత:, శత శ్లోకేన పండిత, శతం విహాయ భోక్తవ్యం, అతి సర్వత్ర వర్జయేత్‍, బుద్ధి: కర్మానుసారిణీ, వినాశ కాలే విపరీత బుద్ధి, భార్య రూపవతీ శత్రు, స్త్రీ బుద్ధి ప్రళయాంతక, వృద్ధనారీ పతివ్రతా, అతి వినయం ధూర్త లక్షణమ్‍, ఆలస్యం అమృతం విషమ్‍, దండం దశ గుణం భవేత్‍.. ’’ వీటిని చాలా సందర్భాల్లో వింటుంటాం. కానీ వీటికి మూలమైన శ్లోకాలు ఉన్నాయి. వాటిలో నుంచి పై వాక్యాలను తీసుకుని వివిధ సందర్భాలలో ప్రయోగించడం కద్దు. ఇప్పుడు ఆ మూల శ్లోకాలేమిటో, వాటి భావమేమిటో తెలుసుకుందాం

ధర్మ ఏవో హతో హంతి । ధర్మో రక్షతి రక్షిత:
తస్మా ధర్మో న హంతవ్యో । మానో ధర్మో హ్రతోప్రదీత్‍
ధర్మాన్ని మనం ధ్వసం చేస్తే అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే (ధర్మాన్ని ఆచరిస్తే) అది మనల్ని రక్షిస్తుంది. అందుచేత ధర్మాన్ని నాశనం చేయకూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించిపోవాలని కోరుకోరు కదా!
సత్యమేవ జయతే నా నృతం । సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం రుషయో యస్త్వ కామా । యత్ర త త్సత్యస్య సరమం నిధానమ్‍
సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేనివారై ఈశ్వరుడిని పొందగలుగుతున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.
అహింసా పరమో ధర్మ: । తథా హింసా పరం తప:
అహింసా పరమం జ్ఞానం । అహింసా పరమార్జనమ్‍
అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి జ్ఞానం. గొప్ప సాధన.
ధనమార్జయ కాకుత్స్థ । ధన మూల మిదం జగత్‍
అంతరం నాభి జానామి । నిర్ధనస్య మృతస్య చ
ఓ రామా! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో ముడిపడే లోకమంతా ఉంది. ఈ విషయంలోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.
అపి స్వర్ణ మయీ లంకా । న మే రోచతి లక్ష్మణ
జననీ జన్మ భూమిశ్చ । స్వర్గాదపీ గరీయసి
సోదరా లక్ష్మణా! ఈ లంక బంగారుమయమై నప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండలేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటే గొప్పవి కదా!
కృషితో నాస్తి దుర్భిక్షమ్‍ । జపతో నాస్తి పాతకమ్‍
మౌనేన కలహం నాస్తి । నాస్తి జాగరతో భయం
చక్కగా వ్యవసాయం చేస్తే కరువు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగరూకతతో ఉంటే దేనికీ భయపడే పనిలేదు.
గజానాం మంద బుద్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్‍
ఏనుగుల మంద బుద్ధితనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణుల్లో అనైక్యత.. వీటి వల్ల లోకోపకారం జరుగుతోంది కదా!
రాజ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా:సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా
రాజు ధర్మపరుడైతే రాజ్యం ధర్మపథంలో నడు స్తుంది. పాపవర్తనుడైతే రాజ్యం పాప పంకిలం అవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజెలా ఉంటే ప్రజలూ అలాగే ఉంటారు.
పుస్తకం వనితా విత్తం । పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి । జీర్ణం భ్రష్ఠా చ ఖండశ
పుస్తకం, స్త్రీ, ధనం ఇవి మన వద్ద ఉన్నం• •సేపే. ఇతరుల చేతిలో పడితే వాటి పని అంతే. తిరిగి వస్తాయని అనుకోవద్దు. ఒకవేళ వచ్చినా, సర్వనాశనమైపోయిన స్థితిలో మనకు తిరిగి దక్కుతాయి సుమీ! (స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలని అనే భావం ఇక్కడ గ్రహించాలి).
శత నిష్కో ధనాఢ్యశ్చ । శత గ్రామేణ భూపతి
శతాశ్వ: క్షత్రియో రాజా । శత శ్లోకేన పండిత:
వంద నిష్కలు (ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించుకుంటాడు వంద గ్రామా లకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుర్రాలు కలవాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండి తుడు.
విద్వత్త్వం నృపత్వం చ । నైవ తుల్యం కదాచన
స్వదేశే పూజ్యతే రాజా । విద్వాన్‍ సర్వత్ర పూజ్యతే
పండితుడికీ, రాజుకీ పోలికే లేదు. ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింపబడ తాడు. కానీ, పండితుడు లోకమంతా గౌరవించ బడతాడు.
శతం విహాయ భోక్తవ్యం । సహస్రం స్నాన మాచరేత్‍
లక్షం విహాయ దాతవ్యం । కోటిం త్యక్త్వా హరిం భజేత్‍
వంద మందిని విడిచిపెట్టి అయినా భుజిం చాలి. వేయి మందిని విడిచిపెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాకపోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా హరిని సేవించాలి.
అతి దానాత్‍ హత: కర్ణ । అతి లోభాత్‍ సుయోధన:
అతి కామాత్‍ దశగ్రీవో । అతి సర్వత్ర వర్జయేత్‍
(ఇది మరో విధంగా కూడా ఉంది)
విచ్చలవిడి దానం వలన కర్ణుడు చెడాడు. మిక్కిలి స్వార్థగుణం చేత దుర్యోధనుడు చెడాడు. అతి కామంతో రావణుడు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచిపెట్టాడు. ఎప్పుడూ అతి పనికి రాదు.
సత్యాను సారిణి లక్ష్మీ । కీర్తి: త్యాగాను సారిణి
అభ్యాసాను సారిణీ విద్యా । బుద్ధి: కర్మాను సారిణీ
లక్ష్మీదేవి ఎప్పుడూ సత్యాన్ని అనుసరించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. కీర్తి త్యాగాన్ని అను సరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్టలు రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవినిదే చదువు ఎలా వస్తుంది? అభ్యాసం కూసు విద్య కదా! ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడిపోయే రాత మనకు రాసి ఉంటే మన బుద్ధి చెడుతోవ లోనూ, బాగుపడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోనూ నడుస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా!.
న నిర్మితో వై నచ దృష్ట పూర్వో । న శ్రూయతే హేమ మయం కురంగ:
తథాపి తృష్ణా రఘు నందనస్య । వినాశ కాలే విపరీత బుద్ధి
బంగారు లేడి ఉందని ఎన్నడయినా విన్నామా? ఎక్కడైనా, ఎవరైనా చూశారా? కానీ, రాముడు తన చెలి కోరిందని ముందు వెనుక ఆలోచించకుండా బంగారులేడిని తెస్తానని వెళ్లాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చినపుడు తర్కం పని చేయదు. బుద్ధి మందగిస్తుంది.
రుణ కర్తా పితా శత్రు । మాతా చ వ్యభిచారిణి
భార్యా రూపవతీ శత్రు । పుత్ర: శత్రుర పండిత:
అప్పుచేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకు శత్రువుతో సమానం. వ్యబిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.
ఆత్మబుద్ధి సుఖం చైవ । గురు బుద్ధిర్వశేషత
పరబుద్ధిర్వినాశాయ । స్త్రీ బుద్ధి: ప్రళయాంతక
మనకు తోచింది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడుచుకోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువు) ఆలోచనల మేరకు నడుచుకోవడం నాశనం కొని తెచ్చుకోవ డమే. ఇక, ఆడవారి ఆలోచనలను బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా!.
అసమర్థస్య సాధూనాం । నిర్ధనస్య జితేంద్రియ
వార్ధక్యో దేవతా భక్తి । వృద్ధ నారీ పతివ్రతా
అసమర్థుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలితనంలో దైవ భక్తి, వయసుడిగిన ఆడదాని ప్రాతివత్యం ఒక్క లాంటివే.
ముఖం పద్మ దళాకారం। వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం । అతి వినయం ధూర్త లక్షణమ్‍
ముఖమేమో పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలే చల్లగా ఉంటాయి. కానీ, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్ట వంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా.
సిద్ధమన్నం ఫలం పక్వం – నారీ ప్రథమ యవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం । ఆలస్యం అమృతం విషమ్‍
వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యవ్వనవతి అయిన భార్య పొందును స్వీకరించడానికి ఆలస్యం చేయరాదు సుమా! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్లిపోవడం, యవ్వనం తరిగిపోతాయి.
విశ్వామాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్‍
పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు.. వీటిని అదుపు చేయడానికి వరుసగా బురదలో, నీటిలో, చీకటిలో, గుడ్డితనంలో, ముసలితనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందువల్ల దండానికి (కర్రకు) దశ గుణాలు

Review మూల శ్లోకం మేటి భావం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top