రామన్‍ ది గ్రేట్

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో ఉంటుంది.

అది బ్రిటిష్‍ కాలం. ఒక పిల్లవాడు స్కూలు నుంచి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ‘స్కూలులో కొందరు పోకిరీ పిల్లలు నన్ను పిలక పంతులూ అని వెక్కిరిస్తున్నారమ్మా.. పిలక తీసేస్తానమ్మా’ అంటూ ఆ పిల్లాడు తల్లి వద్ద బేలగా వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు.
‘చూడు నాన్నా! నీ పిలక వలన వాళ్లకి ఏ నష్టమూ లేదు. పిలక ఉన్నందుకు నువ్వు బాధపడనక్కర లేదు. ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని మన అస్తిత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. వాళ్లు వెక్కిరించారని నువ్వు పిలక తీసేస్తే నీ మీద నీకు గౌరవం లేనట్టే. అవన్నీ పట్టించుకోకుండా చదువు మీద దృష్టి పెట్టు. నీ వలన దేశానికి చాలా ఉపయోగం ఉంది’ అని ధైర్యం చెప్పింది ఆ తల్లి.
కొంత కాలం తరువాత ఆ పిల్లాడు మళ్లీ అమ్మతో- ‘అమ్మా! స్కూళ్లో పిల్లలు నన్ను జంధ్యం మాష్టారూ.. జంధ్యం మాష్టారూ అని వెక్కిరిస్తున్నారు. అస్తమానం జంధ్యం పట్టుకుని లాగుతూ అల్లరి చేస్తున్నారు’ అంటూ మళ్లీ ఏడ్చాడు.
‘నీ జంధ్యం బయటకు రాకుండా చొక్కాలు కుట్టిస్తాను నాయనా! బాధపడకు. వాళ్ల చేతలు, వాళ్ల మాటలు పట్టించుకోకు. నువ్వు గొప్పవాడివి కావాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కుమిలిపోకూడదు. రాళ్లు అడ్డు వచ్చాయని ప్రవాహం ఆగిపోతుందా?’ అని ఆ తల్లి తన చిన్నారిని అనునయించింది.
మరికొంత కాలం గడిచాక ఆ పిల్లాడు ఇంకా పెద్ద చదువులు చదవడానికి దూర ప్రాంతానికి వెళ్లాడు. మళ్లీ అటువంటి సమస్యే అక్కడ కూడా ఎదురైంది.
‘అమ్మా! ఇక్కడి వాళ్లు కోడి గుడ్లు తినాలని నన్ను పోరు పెడుతున్నారు. బెదిరిస్తున్నారు. సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేను తినే భోజనంలో కోడిగుడ్డును కలిపేస్తున్నారు. మనసుకు చాలా కష్టంగా ఉందమ్మా’ అని తన తల్లికి ఉత్తరం రాశాడు.
‘వాళ్లు ఎన్ని రకాల పన్నాగాలు పన్నినా నువ్వు చలించకు. వాళ్లు కాకుల్లా గోల చేస్తే చెయ్యనీ. దోమల వలే రొద పెడితే పెట్టనీ. వాళ్లు అలాగే మిగిలిపోతారు. కానీ నువ్వు దేశ చరిత్రలో మహానుభావుడిలా నిలిచిపోవాలి. ఏకాగ్రతను ఏ క్షణంలోనూ కోల్పోకు. నీ చదువును ఒక తపస్సులా భావించు. ఉదయాన్ని చూడాలంటే చీకటిని భరించాలి. దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్లు’ అని తల్లి ధైర్యం చెబుతూ తన కుమారుడికి ఉత్తరం రాసింది.
తల్లి రాసిన ఉత్తరం చదివిన అతను కొండంత బలంతో చదువు పూర్తి చేశాడు. కేంబ్రిడ్జికి వెళ్లాడు. ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా భారతదేశపు ఖ్యాతిని ఆకాశంలో నిలబెట్టాడు.
అతడే విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్‍ సీవీ రామన్‍.
తన తల్లి చెప్పిన విలువలను, హితోక్తులను ఆయన తన జీవిత కాలం పాటించారు. విదేశాలకు వెళ్లినా, ప్రొఫెసర్‍గా పని చేస్తున్నా, మద్రాస్‍ ఐఐటీకి వైస్‍ చాన్సలర్‍గా పని చేసినా కూడా ఆయన ఎప్పుడూ తన పిలకను తీయలేదు. భారతీయతను వదిలి పెట్టలేదు. అందుకే ఆయన నిరంతరం తలపాగా ధరించేవారు.
నీతి: చాలామంది ఎదుటి వారి కోణంలో ఆలోచిస్తూ.. తమవైన సంప్రదాయాలను వదిలేస్తారు. ఎదుటి వారు ఏదో అన్నారని తమను తాము మార్చుకునే ప్రయత్నం చేస్తారు. మన వేషధారణ, వస్త్రధారణ మన సంప్రదాయాలను బట్టి ఉంటే తప్పేం కాదు. వాటిపై ఎదుటి వారి అభిప్రాయం కోరకూడదు. ఎటొచ్చీ మన సంకల్పం, లక్ష్యం గొప్పవా, కాదా? అనేదే ముఖ్యం. వాటిని సాధించేందుకు లోకుల మాటలను పట్టించుకోకుండా ఏకాగ్రతతో పని చేయాలి.

Review రామన్‍ ది గ్రేట్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top