రుచీక మహర్షి
పూర్వం కృతవీర్యుడు అనే మహారాజు భృగు వంశంలోని బ్రాహ్మణుల్ని కుల గురువులుగా పెట్టుకుని, వాళ్లకు చాలా సిరిసంపదలు ఇస్తాడు. దీంతో ఆయన పిల్లలు భృగు వంశంలోని బ్రహ్మణుల మీద చాలా ఈర్ష్యగా ఉండేది. తమ సంపదంతా వారే తినేస్తున్నారని వారిని ద్వేషించే వారు. ఈ కారణంగా భృగువులను చాలా కష్టాలు పెట్టేవారు. వారి ఆడవాళ్లను తరిమి తరిమి కొట్టేవారు.
అప్రవాస మహర్షి భార్య రుచి గర్భవతి. ఆమె మహారాజు సంతానం నుంచి కలుగుతున్న ప్రాణభయంతో ఒకనాడు పారిపోసాగింది. ఆ సమయంలోనే ఒక గొప్ప తేజస్సు నిండిన కొడుకును ప్రసవించింది. ఆ తేజస్సుకు రాజకుమారుల కళ్లు పోయాయి. వాళ్ల మీద దయతో వాళ్లకు కళ్లు వచ్చేలా చేయాలని కొడుకుకు చెప్పింది రుచి. రాజకుమారులు క్షమించాలని కోరడంతో ఆ బిడ్డ వాళ్లకు కళ్లు వచ్చేలా చేస్తాడు. అలా రుచి ప్రసవించిన బిడ్డ పేరు ఔర్వుడు.
ఔర్వుడు పెళ్లి చేసుకోకుండా తన తపశ్శక్తితో ఒక కొడుకును, ఒక కుమార్తెను పొందుతాడు. అలా పొందిన కొడుకు పేరు రుచీక మహర్షి.
రుచీక మహర్షి బ్రహ్మచారిగా ఉండి గొప్ప తపశ్శక్తిని సంపాదిస్తాడు. ఒకనాడు గాధి అనే రాజు కూతురు సత్యవతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకుని గాధి రాజు వద్దకు వెళ్లి తన కోరిక చెబుతాడు.
కానీ, గాధి రాజుకు.. రుచీక మహర్షికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలంటే బాధగా అనిపించింది. కానీ, ఏం చేస్తాడు? మహర్షే అడగడానికి వచ్చాడంటే అదేదో భగవంతుడే సంకల్పించి ఉండాటని భావించి, ఎందుకయినా మంచిదని ఆ వివాహానికి అంగీకరిస్తాయి. అయితే, అందుకు ఒక షరతు విధిస్తాడు.
‘మహర్షీ! నువ్వు వాయువేగంతో సమానమైన వేగం ఉన్నవీ, నల్లని చెవులు, తెల్లని శరీరాలు ఉన్న వెయ్యి గుర్రాలు తీసుకుని రా! అప్పుడు నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేయిస్తాను’ అంటాడు గాధి రాజు.
రుచీక మహర్షి సరేనని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
రుచీక మహర్షి గాధి రాజు చెప్పినటువంటి గుర్రాలు ఎక్కడ ఉంటాయో తెలియక తిరిగి, తిరిగి అవి వరుణదేవుడి వద్ద ఉన్నాయని తెలుసుకుంటాడు. వెంటనే తన తపశ్శక్తితో వరుణ లోకానికి వెళ్లి వరుణుడికి తాను వచ్చిన విషయం చెప్పాడు. వరుణ దేవుడు రుచీక మహర్షికి నమస్కారం చేసి, కబురు చేస్తే తానే పంపించే వాడిని కదా అంటాడు. అనంతరం మహర్షి చేత తురంగ తీర్ఘంలో స్నానం చేయించి, ఆయనకు వెయ్యి గుర్రాలను ఇచ్చి పంపివేస్తాడు.
వెయ్యి గుర్రాలను తీసుకుని గాధి మహారాజుకు ఇచ్చి, అతని కుమార్తె సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు రుచీక మహర్షి.
రుచీక మహర్షి భార్య సత్యవతిని తీసుకుని ఒక ఆశ్రమంలో ఉంటూ సంతానం కలగడానికి వేదమంత్రాలతో అగ్నిదేవుడికి ఆహుతి చేయడానికి తయారు చేసిన అన్నం తన భార్యకు తినిపించాలని అనుకుంటాడు రుచీక మహర్షి
‘స్వామీ! నా తల్లికి కూడా ఒక కొడుకును ప్రసాదించండి’ అంటుంది సత్యవతి. ఆ అన్నం తామిద్దరం తింటామని అంటుంది. రుచీక మహర్షి ఇదదరికీ విడిగా అన్నం పెట్టి. పండ్లు తెచ్చుకోవడానికి అడవికి వెళ్లాడు.
అప్పుడు సత్యవతి తల్లి` ‘అమ్మా! నీ మొగుడు నీకే మంచి అబ్బాయి పుట్టాలని నీకు ఇచ్చిన అన్నం మీద పవిత్రమైన మంత్రజలం చల్లాడు. నా అన్నం మీద మామూలు మంత్రజలం చల్లాడు. అందుకే మనమిద్దరం అన్నాన్ని మార్చుకుందాం’ అంటుంది.
అలా ఇద్దరూ తమకిచ్చిన అన్నాన్ని మార్చుకుని తింటారు.
రుచీక మహర్షి ఆశ్రమానికి వచ్చాక, జరిగింది తెలుసుకుని భార్యను పిలిచి మంత్రజలం చల్లిన అన్నాన్ని, తాను చెప్పినట్టు కాకుండా మార్చుకుని తిన్నారు కాబట్టి నీకు క్షత్రియ ధర్మాలున్న కొడుకు, నీ తల్లికి వేదాంతవేది, మహా తపస్సంపన్నుడు అయిన కొడుకు పుడతాడని చెబుతాడు.
సత్యవతి భయపడి క్షమించాలని భర్తను వేడుకుంటుంది. రుచీక మహర్షి జరగవలసింది జరిగిపోయింది కాబట్టి, పైగా అది దైవ నిర్ణయానుసారం జరిగింది కాబట్టి ఇక చేయగలిగింది ఏమీ లేదని అంటారు.
కొంతకాలానికి సత్యవతికి జమదగ్ని అనే కుమారుడు, ఆమె తల్లికి విశ్వామిత్రుడు అనే కుమారుడు పుట్టారు. రుచీక మహర్షి సంసారం వదిలి పెట్టి, భగవంతుడిలో చేరిపోవడానికి బయలుదేరుతాడు. వెళ్తూ వెళ్తూ సత్యవతికి శాశ్వతంగా నదీ రూపంలో ఉండేలా వరం ఇస్తాడు. ఆ నదే కౌశికీ నది. అది గొప్ప పుణ్య తీర్థంగా నిలిచిపోయింది.
ఇదీ రుచీక మహర్షి గాధ. పెద్దవాళ్లు, మహర్షులు చెప్పినట్టు చేయకపోతే ఎన్ని అనర్థాలు కలుగుతాయో అనేందుకు రుచీక మహర్షి కథలోని పాత్రలే నిదర్శనం.
Review రుషి పీఠం.