విద్యా దానమే దానం

అన్నదానం, విద్యాదానం రెండూ శ్రేష్ఠమైనవే. ఆ రెంటి మధ్య అంతరాలను విశ్లేషించిన శ్లోకం. విద్యాదాన మహత్త్వం తెలిపే సుభాషితం ఇది. పేదలకు ప్రభుత్వం అందించే ఉచిత పథకాలు తాత్కాలిక ప్రయోజనాల్ని మాత్రమే అందిస్తాయి. వృత్తి విద్యలలో శిక్షణనిచ్చి, వారి నైపుణ్యాన్ని పెంచి, వారు సొంత కాళ్లపై నిలబడేలా చేస్తే, శాశ్వత ఫలితాలు ఉంటాయని అంతరార్థం. విద్యావ్యాప్తికి పెద్దపీట వేసే భారతదేశంలో అన్ని దానాలలో విద్యాదానం గొప్పదనే విషయం విదితమే.
శ్లో।। అన్నదానం మహాదానం విద్యాదానమ్‍ అతః పరమ్‍।
అన్నేన క్షణికా తృప్తిః యావజ్జీవం తు విద్యయా ।।
అన్ని దానవ•ల కన్న అన్న దానవ• గొప్ప. విద్యాదానం దాని కన్నా గొప్పది. అన్న దానం కొద్ది గంటలే తృప్తినిస్తుంది. కానీ విద్యాదానం పొందిన వారు జీవితాంతం తృప్తిని (లాభం) పొందుతారు.
‘‘అన్నేన సదృశం దానం న భూతం న భవిష్యతి’’ అంటారు మహాభారతంలో. ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని ఇచ్చి కడుపునింపడం గొప్ప పనే కానీ… కొంతసేపటి తర్వాత ఆ ‘దానం’ పొందిన వ్యక్తికి మళ్ళీ ఆకలేస్తుంది. విద్యాదానం అలా కాదు. పొందినవారికీ, ఇచ్చినవారికీ జీవితాంతం తృప్తినిస్తుంది. అందుకే ఒక ప్రసిద్ధ సూక్తి ఇలా చెప్తుంది. ‘‘చేపని దానంగా ఇస్తే ఆ వ్యక్తి ఓ పూట తింటాడేమో కానీ… చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం తింటాడు’’.
విద్యాదానం గొప్పతనాన్ని తెలిపే ఓ కథ. పూనే నగరంలో ఆ రోజు పీష్వాగారి జన్మదినం జరుగుతోంది. ఆయనిచ్చే కానుకల కోసం బారులు తీరి ప్రజలు నిలబడ్డారు. ధనం, బట్టలు ఇతర సామాగ్రి దానాలుగా పొందుతున్నారు. ఓ బాలుడు కూడా పీష్వా గారి ముందు నిలబడ్డాడు. ‘‘శాశ్వతమైన వస్తువు నాకు దానంగా ఇవ్వండి-ఇవి వద్దు’’ అన్నాడు ధైర్యంగా. ‘‘న చోరహార్యం’’ అంటూ శ్లోకాన్ని చదివాడు – ‘‘విద్యాధనం సర్వధన ప్రధానం’’ అని గ్రహించిన పీష్వాగారు ఆ బాలుని కాశీకి పంపారు. అతనే తదుపరి కాలంలో ప్రసిద్ధ న్యాయమూర్తి శ్రీ రామశాస్త్రిగా పేరు పొందాడు. అందుకే శాశ్వత తృప్తినిచ్చే దానం విద్యాదానంగా ఋషులు పేర్కొన్నారు.

-బి.స్.శర్మ

Review విద్యా దానమే దానం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top