ఆదిపరాశక్తి… పూజావిధి

మన సంస్క•తీ సంప్రదాయాలలో వ్రత కథలకు పెద్దపీట వేశారు. ఇవి నిష్టగా ఆచ రించడం వల్ల సంస్కారం, దైవభక్తి, జ్ఞానం, ఆరోగ్యం అలవడుతాయి. కేవలం ఇవి భక్తిదాయకమైనవే కాదు.. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే పక్రియలు. వీటిని ఆచరించడానికి అనువైన విధంగా ఆయా తిథులను నిర్దే శించారు. ఆ సమయంలో ఉండే వాతా వరణానికి తగినట్టు ఆహార నియమాలను పాటిస్తూ, ఈ వ్రతాలను ఆచరించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత పెంపొందు తాయి. అక్టోబరు 19, విజయ దశమి సంద ర్భంగా నాడు ఆచరించాల్సిన పూజావిధి గురించి.

శక్తితో కూడకున్నది- సృష్టి. బ్రహ్మాండం, ప్రపంచం, దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తి- ఇలా దేన్ని తీసుకున్నా శక్తితో నడుస్తున్నదే. శక్తి లేనిదే చలనం ఉండదు. అందుకే ‘సర్వం శక్తిమయం జగత్‍’ అన్నారు. బ్రహ్మకు సృష్టి చేసే శక్తి, విష్ణువుకు వృద్ధి చేసే శక్తి, శివుడికి లయం చేసుకునే శక్తి- ఈ శక్తులన్నీ వారికి ఓ మహాశక్తి నుంచి ప్రసాదితమైనవే. ఆ మహాశక్తే ఆది పరాశక్తి. యోగ నిద్రారూపిణి అయిన మహా మాయ. ఆమెను ఆరాధించడం అన్ని విధాలా శ్రేయస్కరం. శుభకరం.

శక్తి ఉపాసన అనేది ఆనాటిది కాదు. వేద కాలం నుంచీ కొనసాగుతోంది. ఈ సకల సృష్టి, స్థితి, లయకారక మూలశక్తి.. ఆ ఆదిశక్తే. ఆమే దేవి. ఆమెను పూజించడానికి ప్రత్యేకించి కాలమంటూ లేదు. ఎవరు ఎప్పుడైనా ఆరాధించవచ్చు. అయితే, ఆశ్వయుజ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు మాత్రం దేవి (దుర్గ)ను విశేషంగా అర్చిస్తారు. ఎందుకంటే, స్త్రీ పురుష రూపాత్మకం ఈ కాలం. ఛైత్రం మొదలు భాద్రపదం వరకు గల అర్థ భాగం (ఆరు నెలలు) పురుష రూపాత్మకం. రెండో సగ భాగం ఆశ్వయుజం మొదలు ఫాల్గుణ మాసం వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం. ఈ కాలం, ప్రత్యేకించి ఆశ్వయుజం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి ఇత్యాది దేవేరుల పూజకు ఉద్ధిష్టమైనది. ఆశ్వయుజంలో జరిగే నవరాత్రుల ఉత్సవాలను దక్షిణాదిలో దసరా వేడుకలుగా నిర్వహించుకుంటారు. ఉత్తరాదిన రామలీలా ఉత్సవాలు నిర్వహిస్తారు. మహాలయా పితృపక్షం ముగియగానే దేవతారాధన జరపడం అనేది ఆ పితృ దేవతలకు తమను ప్రసాదించిన ఆది పరాశక్తిని కృతజ్ఞతా పూర్వకంగా భక్తితో త్రిమాతా రూపంగా పూజించడం. అది ఒక యోగం. సమస్త జగత్తును పాలించేది ఆది పరాశక్తి. ఆమె త్రివిధాలుగా రూపుదాల్చి లక్ష్మి, సరస్వతి, పార్వతియై లోకాలకు సమస్త సౌభాగ్యాలు, విద్య, శక్తి ప్రసాదిస్తోందని చెబుతారు.

శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటాదేవి, కూష్మాండదేవి, స్కంద మాత, కాత్యాయని, కాళరాత్రి, దేవి, మహాగౌరి, సిద్ధిధాత్రి.. వీరు నవ దుర్గలు. ఈ రూపాల్లో దేవిని శరన్నవ రాత్రుల్లో కొలిచే సంప్రదాయం ఉంది. శక్తి విస్తరణ, వైభవం, లీలలు అనంతమైనవి. ఈ శక్తి వివిధ సందర్భాలలో విభిన్న ప్రయోజనాల కోసం అనేక పేర్లు, రూపాలు ధరిస్తుంది. ప్రకృతిలోని శక్తులన్నీ ఆమె రూపాలే. సృష్టి పోషణ అంతా ఈ శక్తి ద్వారానే సాగుతుంది. ఈ శక్తే త్రిమూర్తులకు జనని అని కొన్ని పురాణాలు చెబుతోంటే, ఈమెనే ‘ముగ్గురమ్మల మూలపుటమ్మ’గా కొన్ని గాథలు చెబుతున్నాయి. దేవి సర్వశక్తి స్వరూపిణి. అనేక సగుణ రూపాలతో, నామాలతో ఆమెను ఆరాధిస్తాం. కానీ, విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ, శ్రీశైల భ్రమరాంబ, ఉజ్జయినీ మహాకాళి, విజయవాడ కనకదుర్గ.. ఇవన్నీ ఆ దేవి రూపాలే. నామాలే. దేవీ క్షేతాల్ విజయవాడ కనకదుర్గా దేవి క్షేత్రం ప్రశస్తమైనది. విష్ణుకుండిన మాధవవర్మ కుమారుడు వేగంగా రథాన్ని తోలాడు. ఈ రథం కిందపడి చింతచిగురు అమ్ము కునే పేదరాలి కుమారుడు మర ణించాడు. ఆమె న్యాయం కోరింది. రాజు తన కుమారుడికి మరణశిక్ష విధించాడు. రాజు నిజాయతీని, ధర్మవర్తనను మెచ్చుకుంటూ దుర్గ కనకవర్షం కురిపించింది. నాటి నుంచి దుర్గ ‘కనకదుర్గ’ అయ్యింది.

మన జీవన నిశీధినులను ప్రదీప్తం చేసే సూర్యదీప్తి ‘దుర్గ’. ఆమె పాదాల అమృత స్పర్శతో జీవన బాధాగ్ని స్పందన మటుమాయం అవుతుంది. సృష్టి అంతటా ఆమె మాధుర్యం పొంగి ప్రవహిస్తుంది. అన్ని వైరుధ్యాలూ సమసిపోతాయి. భువన జీవనం తన దివ్య సామరస్య మంత్ర గీతంగా మారుతుంది. జన్మ జన్మలుగా మనం అన్వేషించే ఆనందం, వెలుగు, అమృతత్వం.. ఆమే.. అమ్మే!.
పవిత్రమైన దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని పది (దశ) రోజుల్లో పది రూపాలలో అలంకరించి కొలవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఏ రోజు ఏ అవతారాన్ని కొలవాలనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయంలో వేర్వేరు చోట్ల వేర్వేరు సంప్రదాయాలు పాటిస్తారు.

Review ఆదిపరాశక్తి… పూజావిధి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top