ఆదిశంకరుని మూడు దోషాలు

ఆదిశంకరులు ఒకసారి శిష్యులతో కలిసి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.గంగా నదిలో స్నానం చేసి, దర్శనానికి ఆలయం లోపలికి వెళ్లి, విశ్వేశ్వరుని ఎదుట నిలిచి ఇలా ప్రార్థించారు-
‘స్వామీ! నేను మూడు దోషములు (పాపాలు) చేశాను. నన్ను క్షమించండి’. ఈ విధంగా శివుడిని వేడుకున్నారు.
ఇది విన్న శిష్యులు- ‘ఆచార్యుల వారు ఏం పాపాలు చేశారని పరమశివుని ఎదుట ప్రాయశ్చిత్త మడుగుతున్నారు?’ అని అనుకున్నారు.
ఒక శిష్యుడు మాత్రం, ఆది శంకరుల వారు ఏం పాపం చేశారో ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుని ఆయననే ఈ విషయం అడిగాడు. అందుకు శంకరులు ఆ శిష్యునికి ఇలా సమాధానం చెప్పారు.
‘1. నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడటానికి మటుకు కాశి నగరానికి వచ్చాను. అంటే మనసా, వాచా, కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేకపోయాను. అది నేను చేసిన మొదటి దోషము.
2. తైత్తిరీయ ఉపనిషత్తులో ‘యతో వాచో నివర్తన్తే, మనసా స:’ అని ఉంది. అంటే- భగవంతుడు మన బుద్ధికి, ఆలోచనకు అందని వాడని అర్థం. ఇది తెలిసి కూడా శ్రీ కాశీ విశ్వనాథ అష్టకం రచించాను. ఇది నేను చేసిన రెండో తప్పు.
3. నిర్వాణ శతకంలో ‘న పుణ్యం న పాపం, న సౌఖ్యం, న దుఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూపం శివోహం శివోహం’ అని రాశాను. దీనికి అర్థం- నాకు పాప పుణ్యములు సుఖ దు:ఖములు లేవు. మంత్ర జపములు, తీర్థ సేవలు, వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థం, భోజనం, భోక్త (భుజించేవాడే) నేను కాదు. చిదానంద స్వరూపుడను. శివుడను. శివుడను’.
ఇంత రాసి కూడా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను. అంటే నేను రాసినవి, చెప్పినవి నేనే పాటించడం లేదు. అందుకనే నేను చేసిన ఈ మూడు తప్పులను మన్నించాలని ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను’ అని శంకరులు ఆ శిష్యుడికి వివరించి చెప్పారు.
ఆదిశంకరులు సామాన్యులు కారు. ఆయన జగద్గురువు. ఆయన ఈ కథ ద్వారా మనకు చెప్పే నీతి ఏమిటంటే- మన ఆలోచన, తీరు, మాట అన్నీ ఒకేలా ఉండాలి. బయట ప్రపంచం మన పనితీరును మటుకే చూస్తుంది. భగవంతుడు మాత్రం మన పని వెనుక సంకల్పాన్ని, ఉద్దేశాన్ని కూడా చూస్తాడు.
‘మనస్‍ ఏకం, వచస్‍ ఏకం, కర్మణ్యేకం’
ఈ సూక్తి ఆదిశంకరుల వంటి వారెందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధిగా ఆచరించి మనకు చూపించిన యధార్థమైన మార్గం.

Review ఆదిశంకరుని మూడు దోషాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top