ఒకసారి ఒక పేదవాడు బుద్ధుడి వద్దకు వచ్చాడు. అతను బుద్ధుడిని ఇలా అడిగాడు
‘అయ్యా! నేను ఎందుకు పేదవాడిగా పుట్టాను? నేనే ఎందుకిలా పుట్టాలి? నేనెందుకు పేదవాడను?’.
బుద్ధుడు అతనికి శాంతంగా ఇలా సమాధానం చెప్పాడు.
‘మీరు ఎందుకు పేదవారు అంటే మీరు ఎటు వంటి ఔదార్యం కలిగి లేరు. మీ జీవితంలో దాన ధర్మాలు చేసి ఎరుగరు. అందుకే ఇలా పేదవాడిగా పుట్టారు’.
‘నిజమే! నేను దాన ధర్మాలు చేయలేదు. కానీ, చేయడానికి నా వద్ద ఏమున్నది? నేను ఏమైనా కలిగి ఉంటే కదా.. ఇతరులకు దానం చేయ గలుగుతాను?’ అని ఆ పేదవాడు బుద్ధుడిని ప్రశ్నిం చాడు.
‘నిజమే. మీరేమీ కలిగి లేరని మీరు భావిం చడం నిజమే. కానీ, మీరు ఇతరులతో పంచుకో గల ఐదు నిధులను మీలో కలిగి ఉన్నారు. అయినా వాటిని గుర్తించక మీకు మీరు పేదవాడిగా భావిస్తూ బతుకీడుస్తున్నారు’ అని బుద్ధుడు ఆ పేద వాడికి బదులిచ్చాడు.
‘అయితే అవేమిటో నాకు చెప్పండి. తెలుసు కుంటాను’ అని పేదవాడు తిరిగి అడిగాడు.
అప్పుడు బుద్ధుడు ఆ పేదవాడికి వివరంగా ఇలా చెప్పడం ప్రారంభించాడు.
‘మొదట మీ ముఖం ఉంది. మీరు ఇతరులతో మీ ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు. అది ఉచితం. మీ ముఖంపై చిరునవ్వు ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుందనే విషయం మీకు తెలుసా?.
రెండవది- మీ కళ్లు. వాటి సాయంతో మీరు ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు. ఇది నిజం. మీరు లక్షలాది మందిని మీ కళ్లతో ప్రభావితం చేయవచ్చు. వాటితో మంచి మధుర అనుభూతిని పొందవచ్చు.
మూడవది- మీ నోరు. మీకు ఉన్న ఆ నోటితో ఇతరులకు మంచి విషయాలు బోధించవచ్చు. మంచి విషయాలు పంచుకోవచ్చు. మంచి విషయాల గురించి చర్చించవచ్చు. నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు, ప్రతి మాట విలువైనదిగా భావించి, ఆ నోటిని పొదుపుగా వాడాలి. అది ఇతరులను ఆనందింప చేసే మాటలనే మాట్లా డాలి. తద్వారా ఆనందం, సానుకూలత, మంచి తనం అనేవి అందరిలో వ్యాప్తి చెందుతాయి.
నాలుగవది- మీ గుండె. మీకు గుండె ఉంది కదా! దాని నిండా ప్రేమను నింపుకోండి. అప్పుడు అది దయ గల హృదయం అవుతుంది. మీ ప్రేమ గల హృదయంతో మీరు ఇతరుల శ్రేయస్సును కోరుకోవచ్చు. ఇతరులయొక్క ఆనందాన్ని కోరుకో వచ్చు. ‘ఎల్లప్పుడు నాకు, నా చుట్టూ ఉన్న ఇతరులకు మంచి కలగాలి’ అని ఆకాంక్షించవచ్చు. ఇతరుల భావోద్వేగాలను మీ హృదయంతో ఆస్వా దించి మీరూ అనుభూతి చెందవచ్చు. ఇతరుల జీవితాలను ప్రేమ కలిగిన మీ హృదయంతో తాకితే అది వారి జీవితాల్లో ఎంతో మార్పును తెస్తుంది. ఆ విధంగా మీ దయ గల హృదయంతో ఇతరుల జీవితాలను తాకవచ్చు.
ఇక ఐదవది, చివరిది- మీ శరీరం. ఇది ఒక సంపద వంటిది. ఈ శరీరం సాయంతో మీరు ఇతరులకు అనేక సహాయకరమైన పనులు చేయగలరు. అనేకమైన మంచి పనులు చేయ గలరు. ఈ శరీరాన్ని మంచిగా ఉపయోగించు కుంటే మంచి పనులకు వినియోగిస్తే ఎన్నో జీవి తాల్లో వెలుగులు నిండుతాయి. ‘పరోపకారం ఇదం శరీరం’ అని కదా ఆర్యోక్తి. అందుకే ఈ శరీరాన్ని ఇతరులకు, అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగించాలి.
సహాయం చేయడానికి ధనమే అవసరం లేదు. అందుకు ధనవంతుడై ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి మీరు పేదవారా? వెలకట్టలేని సంపదను ‘మీ’ రూపంలో కలిగి ఉన్నారు. దానిని అమూల్యమైన జీవితాలను సృజించడానికి వినియోగించండి. వెలకట్టలేని కీర్తిని పొందుతారు’ అని బుద్ధుడు ఆ పేదవాడికి సవివరంగా బోధించాడు.
నీతి: ఒక చిన్న శ్రద్ధ, సంజ్ఞలు అంధకార బంధురమైన జీవితాలలో మార్గదర్శకమైన ఆశాజ్యోతిని వెలిగించగలవు. భగవంతుడు మనకు ఇచ్చిన జీవితం.. విలువైనది. కల కానిదీ సర్వోత్తమ మైనదీ. ప్రతి క్షణం ఆనందంగా ఉంటూ, పది మందికీ సహాయపడుతూ, జన్మను సార్థకం చేసు కోవడమే మానవజన్మ పరమార్థం.
Review ఎవరు పేద.