చాతుర్మాస్య వ్రతం….అందరికీ విధాయకృత్యం

‘చాతుర్మాస్య’మనగా నాలుగు నెలల కృత్యం. రుతువులు మూడు. అవి- వర్ష రుతువు, హేమంతం, వసంతం. వైదిక కాలంలో ఒక్కో రుతువు కాల వ్యవధి నాలుగు నెలలు. వానకారు తోనే సంవత్సరం ఆరంభం అవుతుంది. అందుకే సంవత్సరాన్ని ‘వర్ష’ అని కూడా అంటారు. ప్రతి రుతువు ప్రారంభంలో ప్రత్యేక యాగాలు కూడా ఆరంభమవుతాయి. ఈ పద్ధతి ప్రకారం- ఫాల్గుణ పూర్ణిమ నుంచి వైశ్య దేవ యజ్ఞం, ఆషాఢ పూర్ణిమ నుంచి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుంచి సాకమేథ యజ్ఞం నిర్వహించాలని శతపథ బ్రాహ్మణం అనే గ్రంథంలో ఉంది. ఈ వరుస క్రమంలో వర్ష రుతువును చాతుర్మాస్యం నిర్వహించుకోవడం ఆచారంగా వస్తోంది.

ఏడాది పాపాలు పటాపంచలు..

చాతుర్మాస్యం ఆషాఢ శుక్ల (శుద్ధ) ఏకాదశితో ప్రారంభమై కార్తీక శుక్ల ద్వాదశితో సమాప్తం అవుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి సంవత్సరానికి ప్రథమ ఏకాదశి. ఈ ఏకాదశినాడు విష్ణువు క్షీర సముద్రంలో శేష పానుపుపై శయనిస్తాడని పురాణ ప్రతీతి. ఈ వ్రతమును ఏకాదశి నుంచి కానీ, కటక సంక్రాంతి దినం నుంచి కానీ, ఆషాఢ పూర్ణిమ నుంచి కానీ ఆరంభించవచ్చు. చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం వల్ల సంవత్సరకృత్య పాపాలన్నీ నశిస్తాయని భారత వచనం.

పాత ఉసిరిక వెతికి మరీ తినాలి..

చాతుర్మాస్య వ్రత విధానం గురించి స్కాంద, భవిష్యోత్తర పురా ణాల్లో విపులంగా ఉంది. శ్రావణ మాసంలో కూరలను, భాద్ర పదాన పెరుగును, ఆశ్వయుజాన పాలును, కార్తీక మాసాన పప్పు పదార్థాలను వదిలిపెట్టి భుజించాలని వాటిలో ఉంది. ఇంకా నిమ్మ, ముల్లంగి, ఎర్రముల్లంగి, గుమ్మడి, చెరుకు, కొత్త ఉసిరిక, చింత మొదలైన వాటిని త్యజించాలని స్కాంద పురాణంలో ఉంది. పాత ఉసిరిక ఎక్కడ దొరికినా, దానిని సంపాదించి తినాలని అందులో పేర్కొన్నారు.
పై ఆహార పదార్థాల నిషేధాన్ని బట్టి వర్షాకాలంలో అపథ్య ఆహారాన్ని మానిపించి, ఆరోగ్య పరిరక్షణమే ఈ వ్రత పరమార్థమని స్పష్టమవుతోంది. వర్షా కాలం క్రిమికీటకాలకు పుట్టినిల్లు. కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఈ వ్రతం అపథ్య ఆహారాన్ని త్యజించిందని భావించాలి.

ఆశ్రమవాసులకు మరీ ముఖ్యమైన వ్రతం..

భీష్ముడు శేషధర్మంలో చాతుర్మాస్యం స్త్రీలకే ముఖ్యమైనదని పేర్కొన్నాడు. అయినా ఇది అందరూ ఆచరించదగిన వ్రతం. ముఖ్యంగా ఆశ్రమవాసులకు ఇది ముఖ్యమైన వ్రతమని పురాణాల్లో ఉంది. ఇక, బుద్ధుడు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్టు జాతక కథల్లో పలుచోట్ల ఉంది. ఈ వ్రతాన్ని ఆ కథల్లో ‘కత్తిక నక్ఖత్త’, ‘కత్తికరత్తి’, ‘కత్తికఛన’ అని వర్ణించారు. రాజగృహం, అవంతి, వారణాసి తదితర మహా నగరాల్లో ఈ చాతుర్మాస్య సమాప్యుప్త ఉత్సవాల సప్తాహం అత్యంత వైభవంగా నిర్వహించే వారు. జైనులు ఇప్పటికీ చాతుర్మాస్య కాలంలో అత్యంత నిష్టగా అహింసా వ్రతాన్ని ఆచరిస్తారు.
వర్ష (ఏడాది) కాలంలో అపథ్య ఆహారం మాన్పించే ఆరోగ్య పరిరక్షణ సూత్రంగా ఈ వ్రతం రూపుదాల్చిందని అంటారు. సంప్రదాయ ధార్మిక భావనలు, ఆరోగ్య పరిరక్షణ నియమాల సమ్మేళనమే ఈ వ్రతాచరణ సంకల్పంగా భావించవచ్చు. అందుకే మహిళలకు చాతుర్మాస్య వ్రతం అత్యంత ప్రీతకరమైనది.

Review చాతుర్మాస్య వ్రతం….అందరికీ విధాయకృత్యం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top