
జూలై 4, గురువారం
ఆషాఢ శుద్ధ విదియ తిథి నాడు ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర వైభవంగా జరుగుతుంది. ఈ రథయాత్ర జగత్ప్రసిద్ధమైనది. అలాగే, ఈ తిథి శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినమని ప్రతీతి. ఒడిశాలోని పూరీ క్షేత్రానికి ‘పురుషోత్తమ క్షేత్రం’ అని మరో పేరు. వివిధ పురాణాల్లో ఈ క్షేత్ర ప్రశస్తి ఉంది. నారాయణుడు మొదట ఈ సాగర తీరంలోని అరణ్యాల్లో నీల మాధవుడిగా నెలకొని ఉన్నాడని అంటారు. ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు స్వామికి రథయాత్ర జరుగుతుంది. నాటి నుంచి పది రోజులు గుండిచా మందిరంలో కొలువుదీరి సర్వులనూ అనుగ్రహించే దర్శనం ఒక మహా సౌభాగ్యం. ఈ రథయాత్ర ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రధానాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి వెళ్లే విశాల మార్గం (బొడొదండొ) లక్షలాది భక్తులతో కళకళలాడుతుంది. ఉపనిషత్తుల్లో వర్ణించిన విధంగా- శరీర రథంలో పరమాత్మను దర్శించే (కఠోపనిషత్తు) అంతర్ముఖ సాధనకు ఈ యాత్ర ఒక ప్రతీక. శ్రీ క్షేత్రమని కూడా ప్రసిద్ధి పొందిన ఈ మహా స్థలం, ఇక్కడి ధర్మాలు ఒడిశా సంస్క•తిపై ప్రగాఢ ప్రభావం కలిగి ఉండటమే కాక, ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించే సాంస్క•తిక అంశాలుగా మారిపోయాయి. జగన్నాథుని ‘నందిఘోష’ రథం, బలభద్రుడి ‘తాళధ్వజ’ రథం, సుభద్రాదేవి ‘దర్పాదళన’ రథాలను ఏటా దారువులతో నిర్మిస్తుం టారు. వాటి శిల్ప వైఖరి, వాటిలో పరివేష్టించే దేవతలు, ఈ క్షేత్రానికే పరిమితమైన ప్రత్యేకతలు. రథంలో ఉన్న జగన్నాథుడిని, పది రోజులు గుండిచా మండపంలో ఉండే స్వామిని దర్శిస్తే వేయి యాగాలు చేసిన ఫలం లభిస్తుందని స్కంద పురాణం చెబుతోంది. ఆదిశంకరులు ఈ క్షేత్రంలో గోవర్ధన మఠాన్ని స్థాపించి, స్వామిపై అద్భుతమైన స్తోత్రాలు రచించారు. శ్రీరామానుజాచార్య, నింబార్కాచార్య, చైతన్య మహాప్రభు, గురునానక్, తులసీదాస్, వల్లభాచార్య వంటి మహాత్ములు జగన్నాథుని దర్శనంతో పులకించారు. ఆధ్యాత్మిక శక్తికి, చారిత్రక ప్రశస్తికి కేంద్రం ఈ క్షేత్రం.
బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం పూరీ జగన్నాథ రథోత్సవాన్ని చిత్రీకరించేందుకు దాదాపు నెల రోజుల ముందు నుంచే సన్నాహాలు చేసుకుంటాయంటే అంతర్జాతీయంగా ఈ రథయాత్ర ఎంత ప్రసిద్ధమైనదో ఊహించుకోవచ్చు. నేత్రపర్వం చేసే రథోత్సవాన్ని జీవితంలో ఒక్కసారైనా తిలకించాలని భక్తులు భావిస్తారు.
Review జగన్నాథ రథయాత్ర.