‘దసరా’.. నిజానికి ఈ పదం అసలు పేరు ‘దశహరా’. క్రమంగా ‘దసరా’గా రూపాంతరం చెందింది. ఈ పేరు వెనుక పలు భావాలు ఉన్నాయి. ఈ పది రోజుల పండుగ పది రకాల పాపాలను హరిస్తుందని శాస్త్రోక్తి. దేహశుద్ధి కోసం నిత్య స్నానం, అడపాదడపా అభ్యంగం లాగానే చిత్తశుద్ధి కోసం, దివ్యత్వ సిద్ధి కోసం నిత్య పూజలతో పాటు సర్వపూజలు ఉన్నాయి. మానవుడు త్రికరణాల్లో ప్రధానంగా పది రకాలైన పాపాలను చేస్తాడు.
అవి-
1. శారీరక పాపాలు.
2. మానసిక పాపాలు.
3. వాచిక పాపాలు.
వీటిలో కూడా మళ్లీ రకాలు ఉన్నాయి.
శారీరక పాపాలు: వీటిలో మళ్లీ మూడు రకాల పాపాలు ఉన్నాయి. ఇతరుల ద్రవ్యాలను దొంగిలించడం (చౌర్యం), ఇతరులను హింసిం చడం, పరస్త్రీ సంగమం.
మానసిక పాపాలు: ఇవి కూడా మూడు రకాలు. పరద్రవ్యాలపై అభిలాష, పరులకు కీడు తలపెట్టడం, అహంకారం.
వాచిక పాపాలు: ఇవి నాలుగు రకాలు. ఇతరులతో పరుషంగా మాట్లాడటం, అస త్యాలు పలకడం, పరనింద, అసంబద్ధంగా మాట్లాడటం.
పై మూడు రకాల పాపాలన్నీ కలిపి మొత్తంగా పది రకాల పాపాలు మనిషి నిత్యం తెలిసో, తెలియకో చేస్తుంటాడు. ఈ పది పాపాల దోషాలను పోగొట్టుకుంటేనే చిత్తశుద్ధి, పశ్చాత్తాపం కలుగుతాయి. ఈ దోషాల ప్రభావం నుంచి బయటపడటానికి ‘దశహరా’ వ్రతాలు ఆచ రించాలి. వాటిలో ఒకటి- దేవీ నవరాత్రుల వ్రతం. దశవిధ పాపాలను హరించే ఈ వ్రతమే ‘దశహరా’ అని మన హైందవ సంప్రదాయం చెబుతోంది.
మానవ జీవితం నాలుగు దశలు- బాల్య, కౌమార, యవ్వన, వార్థక్యాలు. ఈ దశలో అన్ని జన్మల్లోనూ ఉంటాయని, ఈ జన్మపరంపర లేని స్థితి ‘మోక్షం’ అని వ్యవహారం. మోక్షమంటే ఏమో తెలుసుకుని, అమ్మ వారిని ఆరాధించే వారికి జన్మరాహిత్యమే. అంటే, పై నాలుగు దశలూ లేని కైవల్యమే. ‘దశ’లను హరించి మోక్షమిచ్చే వ్రతం కనుక ‘దశహరా’ అని శాస్త్రాలు చెప్పిన మరో నిర్వచనం.
అందరి జాతకంలో మహ‘ర్దశ’లు, దు‘ర్దశ’లు ఉంటాయి. సర్వ గ్రహాలను తన కనుసైగలతో నడిపే విశ్వనియామక ‘శక్తి’ని ఆరాధించి, గ్రహాల ప్రభావాల దు‘ర్దశ’లను హరించే అనువైన ఉపాయంగా శాస్త్రాలు నవరాత్రి వ్రతాన్ని నిర్దే శించాయి. కనుకనే దీనిని దు‘ర్దశ హరా’ అని భావించవచ్చు. ఎన్నో దివ్య భావాల కలబోతగా జరుపుకునే ఈ పర్వాల ప్రభావం చేత దేశ సౌభాగ్యం, మానవుల హృదయ సౌందర్యం ఇనుమడించాలని, వర్థిల్లాలని జగదంబను ప్రార్థిద్దాం
Review దశను మార్చే దసరా.