మంచికీ చెడుకీ మధ్య తేడా తెలియని పశువులు చేసే తప్పులనూ, అన్నీ తెలిసిన మానవులు మానవీయ విలువల్ని మరిచి చేస్తూ కావాలని పశుత్వానికి వశులైపోవడం ఎంత శోచనీయం? ఎదుటి వాడి మీద ఆక్రమణ చేసి దోచుకుని దాచుకునే బుద్ధి నేటికీ అలాగే కనబడుతోందంటే- వేల ఏళ్ల నాటి ఆటవికత ప్రత్యక్షంగా పునరావృతం అవుతున్నట్టే కదా! ఇది వాంఛనీయమా? అనుసరణీయమా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రితవత్సలుడు, అచ్యుతుడు, అనంతుడు అయిన సర్వాంతర్యామి ఆ పరమేశ్వరుడే. అయితే, ఆ పరమేశ్వరుడు ఎవరు? ఎలా ఉంటాడు? ఎప్పుడు అవతరిస్తాడు? ఎటువంటి వారిని తరింప చేస్తాడు? ఆయన దేనికి వశుడు? ఎవరికి ఆప్తుడు?- ఇటువంటి ప్రశ్నలకు విభిన్న దృక్పథాల నుంచి వివిధ రకాల సమాధానాలు వస్తుంటాయి. ఒక పువ్వును శాస్త్రజ్ఞుడు, వేదాంతి, కవి, కళాకారుడు వేర్వేరు పార్శ్వాలు, కోణాల నుంచి అధ్యయనం చేసి వారి వారి దృక్కోణాల్లో విశ్లేషిస్తుంటారు. తమ కళ్లతో అనుభూతి చెందిన దానిని వేర్వేరుగా అభివర్ణిస్తారు. అలాగే, పరమేశ్వరుడినీ భక్తులు, యోగులు, మహర్షులు, పౌరాణికులు, ఆర్తులు, విరాగులు తమ తమ ఆలోచనల పరిధిని బట్టి వర్ణిస్తుంటారు. ఒకటి మాత్రం వాస్తవం. పరమేశ్వరుడు త్రిగుణాతీతుడు. వర్ణనాతీతుడు.
నేతినేతి..
అందుకే దైవజ్ఞులు ‘నేతినేతి’ (న + ఇతి) అని చెబుతారు. ‘ఇది కాదు.. ఇదే కాదు.. ఇంకా ఏదో ఉంది.. ఎక్కడో ఉంది.. ఎలాగో ఉంది’.. ఇదే భగవతత్త్వం. ఆ అవ్యక్తతత్త్వాన్ని వర్ణించ యత్నించి, కీర్తించ ప్రయత్నించి అలసిపోయారు ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థులు, జ్ఞానులు.. అందరూ అలసిపోయారు. అలసిపోయినా వారి ప్రయత్నం, అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. అదే ఇష్టం పరమాత్మకు. ఆ ఉత్సుకత, ఆతురత, తపన కలిగిన భక్తులనే ప్రేమిస్తాడు పరమాత్మ. సాధకుడు గమ్యం చేరకపోయినా, లక్ష్యం సాధించలేకపోయినా, సత్యాన్వేషణ చేస్తూ పోతుంటే చాలు, అటువంటి సాధకుడంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి. ఎందుకంటే- కృషి, దీక్ష, ఆత్మవిశ్వాసం కలిగిన సాధకుడికి సాధించలేనిదంటూ ఏమీ లేదు.
భగవంతుడు లేనిదెక్కడ?
ప్రతి అవతారానికీ వేదాల్లో ఒక వర్ణన ఉంది. ‘ఈ అవతార పురుషుడు ఫలానా రూపంలో అవతరిస్తాడు.. ఇలా వ్యవహరిస్తాడు’ అని. ఇది వేదం అభివర్ణించే పద్ధతి. భగవంతుడు సర్వత్రా పరివ్యాప్తమై ఉన్నాడు. అణువణువులోనూ నిక్షిప్తమై ఉన్నాడు. అటువంటప్పుడు ప్రతి మనిషి అంతరాత్మలో పరమాత్మ ఉన్నాడనేగా అర్థం. మనం మన తృప్తి కోసం, నిత్యమూ చలించే ఏకాగ్రత కోసం వేదనను, ఆవేదనను చల్లార్చుకుని, కొంతసేపు ఊరట చెందడం కోసం ‘కలడు కలండనెడి వాడు కలడో లేడో’ అన్న సంకుచింతమైన సందేహాన్ని దూరంగా ఉంచడం కోసం కాసేపు ఏ బొమ్మనో, చిత్రాన్నో చూసుకుంటాం. లేదా ఏమైనా వ్రతం చేసుకుంటాం. లేదా దర్శనమో, యాత్రో సంకల్పించుకుంటాం. పద్యమో పురాణమో పఠించుకుంటాం.
పరమేశ్వరుడు ఎవరు?
పరమేశ్వరుడు ఎవరంటే ఎలా చెప్పగలం? మహామహులకే సమాధానం చెప్పడం సాధ్యం కాదు. కాకపోతే, సామాన్యులకు అందుబాటైన స్థాయిలో విశ్లేషించుకోవాలంటే- మంచితనానికి మరో పేరే పరమేశ్వరుడు. సత్యం, అహింస, ప్రేమ, పరోపకారం, నిస్వార్థం, నైర్మల్యం, సేవా భావం వంటి సద్గుణాలే పరమేశ్వరుడికి ప్రతీకలు. ఈ సుగుణాలను మన హృదయం లోకి, మన జీవితంలోకి ఆహ్వానించి, ఆచరణలో పెడితే పరమేశ్వరుడిని గురించి తెలుసు కోవడంలో కొంత సాఫల్యం లభించినట్టే.
మంచితనమే మానవత్వం..
ఈ జగత్తంతా ఈశావాస్యం. మానవులంతా భగవత్ స్వరూపులే. మానవుడి శరీరంలోని జీవుడు, ఈశ్వరుడు వేర్వేరు కాదు. ఆత్మ, పరమాత్మలు అవిభాజ్యాలు. ఈ వాస్తవాన్ని ఉపనిషత్తుల్లోని వాక్యాలెన్నో నిరూపిస్తున్నాయి. మన్ను ఒక్కటే.. భాండాలెన్నో! సువర్ణం ఒక్కటే.. ఆభరణాలెన్నెన్నో! అలాగే, దేవుడు ఒక్కడే. లీలలు మాత్రం అనంతం. మనిషిలోని మంచితనమే మానవత్వం. ఆ మానవత్వమే దైవత్వానికి ప్రతిరూపం. అంటే పరమేశ్వరతత్వం మనిషి మనిషిలోనూ ఉందని భావం. ఈ యథార్థాన్ని గ్రహించి ఎదుటి మనిషిలో ఈశ్వరుడిని దర్శించే సంస్కారం పెంచుకుంటే విశ్వమంతా సుఖశాంతులతో విరాజిల్లుతుంది. అప్పుడు ‘పరమేశ్వరుడు ఎవరు?’ అనే ప్రశ్నే ఉదయించదు.
భగవంతుని దర్శించాలంటే..
ఆధ్యాత్మికపరంగా చూసినపుడు సత్యాన్వేషణకు అర్హత ధీరత్వం కలిగి ఉండటమే. భారతీయ సనాతన ధర్మం బోధించే మొట్టమొదటి పాఠం ధైర్యమే. ధైర్యవంతుల మనసు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ‘క్షుద్రం హృదయం దౌర్బల్యం’ అని కృష్ణుడు కురు క్షేత్రంలో అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. భయం అప్పమానస లక్షణం. భయం వల్ల అంతర్గత సామరస్యం నశిస్తుంది. భయం వల్ల సంశయం, సంశయం వల్ల ద్వేషం, ద్వేషం కారణంగా పతనం సంభవిస్తాయి. దైవానుగ్రహం కావాలంటే ‘నేను భక్తుడిని’ అని గొప్పగా చెప్పుకుంటే సరిపోదు. ‘నేను ధైర్యవంతుడిని’ అని కూడా చాటుకోగలగాలి. భగవంతుడి సాక్షాత్కారం పొందాలని ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది. కానీ, అందుకు చేసే ప్రయత్నంలోనే ధైర్యం లోపిస్తుంది. నిజంగా దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఎటువంటి వారికి దర్శనం ఇస్తాడు?, ఎంతకాలానికి దర్శనమిస్తాడు?, భగవంతుడి దర్శనం కావాలంటే ఎంత కాలం వేచి ఉండాలి? వంటి ప్రశ్నలన్నీ పిరికివాళ్లను చుట్టుముడతాయి. ఇటువంటి వారు మానసిక దౌర్బల్యం ఆరణంగా బలహీనత అనే అధైర్యం బారిన పడతారు.
ఉన్నచోటనే స్థైర్యంగా ఉండండి..
షిర్డీ సాయినాథుడు భక్తులకు చేసిన అనేక ఉపదేశాల్లో ధైర్యం గురించి కూడా ప్రస్తావన ఉంది. ‘ప్రపంచం తల్లకిందులైపోయినా మీరు చలించకండి. ఉన్నచోటనే స్థైర్యంగా ఉండి మీ ముందు జరుగుతున్న నాటకాన్ని చూస్తుండండి’ అని బాబా ఒక సందర్భంలో భక్తులకు ధైర్యాన్ని నూరిపోస్తారు. పిరికివాళ్లకు, పిసినారితనంతో ఉండే వారికి ఆత్మసాక్షాత్కారం కలగదని, వారు బ్రహ్మజ్ఞానాన్ని పొందలేరని, సందేహ మనస్కుల హృదయంలో భగవంతుడు నివాసం ఉండడని కూడా బాబా చెప్పారు. కాబట్టి భగవంతుడిని చూడాలంటే విశ్వాసంతో కూడిన ధైర్యం కావాలి. పిరికివాళ్లు, బలహీనులు మాత్రమే పాపాలు చేస్తారు. ధైర్యవంతులు ఎల్లవేళలా నీతిని పాటిస్తారు. నిజాయతీని ప్రేమిస్తారు. అంకితభావానికి కట్టుబడి ఉంటారు. ధైర్యంగా ఉండటం వల్లే మనో నిశ్చయం కలుగుతుంది. దాని ద్వారానే కార్యసాధన శక్తి ఇనుమడిస్తుంది. చివరకు ఫలితం సిద్ధిస్తుంది.
Review నీవే దైవం… నీలోనే దైవత్వం.