అంగీరసుడికి శ్రద్ధ అనే భార్య వలన ఇద్దరు కుమారులు కలిగారు. వీరిలో పెద్దవాడు ఉతధ్యుడు. రెండవ వాడు బృహస్పతి. కుమారు లిద్దరికీ తండ్రి వివాహం చేశాడు. ఉతధ్యుడి భార్య మమత. బృహస్పతి భార్య తార. ఇద్దరూ గృహస్థాశ్రమంలో సుఖంగా జీవించసాగారు. కాలం గడు స్తోంది. ఒకనాడు మమత భర్తను సమీపించి పుత్రుని ప్రసాదించాలని కోరగా ఉతధ్యుడు ఆమెను భోగించగా గర్భవతి అయ్యింది. భర్తకు సేవ చేస్తూ గర్భాన్ని రక్షించుకుంటూ కాలక్షేపం చేయసాగింది.
ఒకనాడు అన్నను చూడాలనే తలంపుతో బృహస్పతి ఉతధ్యుని ఆశ్రమానికి వచ్చాడు. ఆ సమయంలో ఉతధ్యుడు తీర్థయాత్రల్లో ఉన్నాడు. మమత మరిదికి మర్యాదలు చేసింది. గర్భవతి అయిన మమత సౌందర్యానికి బృహస్పతి చలించి వదిన అని భావించక సిగ్గు విడిచి తన కోరిక తీర్చాలని అడిగాడు. వదిన తల్లితో సమానమని, తల్లిని భోగించడం తగని పని అని మమత నిరాకరించింది. బృహస్పతి దేవర న్యాయమని పలికి కోరిక తీర్చాలని ప్రాథేయపడ్డాడు. మమత ఎంత చెప్పినా అతను వినలేదు. ఏకాంతంగా ఉన్న సమయంలో చివరకు బలాత్కారంగా మమతను సంభోగించి వీర్యాన్ని విడిచిపెట్టాడు. అంతకుముందే మమత గర్భమందున్న బాలుడు ఇది తగదని అనగా, అతనిని అంధుడమై జన్మించాలని బృహస్పతి శపించాడు. మమత గర్భంలో ఉన్న బాలుడు బృహస్పతి వీర్యాన్ని బయటకు గెంటివేశాడు. అది బయటపడింది. ఆ వీర్యం నుంచి ఒక బాలుడు తయారయ్యాడు. ఆ బాలుడిని మమత, బృహస్పతి ఇద్దరూ విడిచిపెట్టి వెళ్లిపోవడంతో అతను ద్వాజుడయ్యాడు. అనంతరం మమత ఒక మగబిడ్డను ప్రసవించింది. అతను శాపవశాత్తూ అంధుడై జన్మించాడు. తన తల్లిని బలాత్కరించిన పినతండ్రిని ‘ఓరీ! నిర్భాగ్యుడా! నా తల్లిని బలాత్కరించిన పాపమునకు నీ భార్యను పరులు రమింతురు. నీవు అవమానాలకు గురయ్యెదవు’ అని శపించాడు.
పుట్టిన బిడ్డకు మరుద్గణం పెంచుతూ భరద్వాడుజనే పేరు పెట్టింది. ఆ సమయంలో భరతుడు రాజ్యం చేస్తున్నాడు. మరుద్గణం భరద్వాజుడిని భరతునికి అప్పగించింది. భరద్వాజుడు భరతునితో అనేక యజ్ఞాలు చేయించాడు. అనంతరం వివాహం చేసుకుని మన్యువనే కుమారుడిని, దేవవర్ణి అనే కుమార్తెను కన్నాడు. దేవవర్ణిని విశ్వబ్రహ్మకు ఇచ్చి వివాహం చేశాడు.
ఆ పిమ్మట భరద్వాజుడు గంగాతీరాన ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేయసాగాడు. ఒకనాడు గంగాజలంలో ఘృతాచి అనే అప్సరస నగ్నంగా స్నానం చేస్తుండగా చూసి కామవశుడై వీర్యాన్ని విడిచిపెట్టాడు. తన వీర్యం అమోఘమైనదని, వృధా కారాదని దానిని తన చేతి ద్రోణమున సంగ్రహించి సంరక్షించగా అందులో నుంచి ద్రోణుడు జన్మించాడు. ద్రోణుడు పెరిగి పెద్దవాడై తన తండ్రి వద్దనే వేదవిద్యను, విలువిద్యను నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తి కాగానే భరద్వాజుడు ద్రోణుడికి కృపి అనే ఆమెతో వివాహం జరిపించాడు.
భరద్వాజుడు ఒకనాడు భృగు మహర్షిని కలిసి సృష్టి రహస్యాలను తెలుసుకున్నాడు. భృగు మహర్షి భరద్వాజునకు అనేక విషయాలు తెలియచేశాడు. అనంతరం ఆ మహర్షి గంగా, యమున సంగమ ప్రదేశాన ఆశ్రమాన్ని నిర్మించుకుని తపోనిష్టలో ఉండిపోయాడు. కొంతకాలానికి రాముడు పితృవాక్య పరిపాలనార్థం సతీసోదర సహితుడై వనవాసం చేస్తూ ఆ ప్రాంతానికి వచ్చాడు. భరద్వాజుడు ఆ ముగ్గురికీ ఆతిథ్యం ఇచ్చాడు. భరతుడు రాముని వెతుకుతూ, భరద్వాజ ఆశ్రమానికి రాగా ఆ మహర్షి విందును ఏర్పాటు చేశాడు. అదే భరద్వాజ విందుగా ప్రసిద్ధికెక్కింది.
భరద్వాజుడు వామదేవునితో కలిసి తీర్థయాత్రలు చేస్తూ బలరామకృష్ణులను సందర్శించి వారిని స్తుతించి యమునలో స్నానం చేసి వెళ్లిపోయాడు. అటు పిమ్మట శర్యాతి యొక్క వంశాన వీతపుష్యుడనే హైషయుడు జన్మించాడు. ఆ హైషయునికి వంద మంది పుత్రులు జన్మించారు. ఆ వంద మంది బలగర్వితులై హర్యశ్వుడనే రాజును యుద్ధానికి ఆహ్వానించారు. వారి చేతులలో అతను ఓడిపోయాడు. అతని పుత్రుడు సుదేవుడు రాజయ్యాడు. ఈ వంద మందీ అతనినీ ఓడించారు. అతని పుత్రుడు దివోదాసు రాజు కాగా, అతనిపై కూడా దండెత్తారు. దివోదాసు ఓడిపోయి భరద్వాజుడి అనుగ్రహ విశేషంతో పుత్రకామేష్ఠి యాగం చేసి మహావీరుడిని కన్నాడు. ఆ వీరుడు భరద్వాజుని వద్ద ధనుర్వేదం నేర్చుకున్నాడు. యువరాజయ్యాడు. హైషయులపై దండెత్తాడు. వారందరినీ సంహరించాడు. ఇదంతా భరద్వాజుని ఆశీర్వాదంతోనే సంభవించింది.
శత్రుంజయుడనే రాజు భరద్వాజుని వద్ద రాజధర్మాన్ని తెలుసుకున్నాడు. ‘‘రాజనే వాడు శత్రువుల పట్ల కోయిల వలే మృదువుగా భాషించాలి. పంది వలే మూలచ్ఛేదం చేయాలి. మేరు పర్వతంలా నిశ్చలంగా ఉండాలి. పర్వ సంపదలు సంపాదించాలి. నానా రూపాలు దాల్చే నటునిగా సంచరించాలి. దొంగలను శిక్షించాలి. ప్రజల సుఖానికై పాటుపడాలి. గద్ద దృష్టి ఉండాలి. కొంగ వినయం ప్రదర్శించాలి. కుక్క విశ్వాసం ఉండాలి. సింహ పరాక్రమం, వాయస సంశయం, పాము నడక ఉండాలి’’ అని భరద్వాజుడు అతనికి రాజధర్మాలు ఉపదేశించాడు. భరద్వాజుడు మహర్షులందరూ తన వద్దకు రాగా వారికి ధర్మశాస్త్రాలను తెలియ చేశాడు. అదియే ‘భరద్వాజ స్మ•తి’గా పేర్గాంచింది.
Review రాజా ధర్మానికి ఆద్యుడు భరద్వాజుడు.