రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించి ఉన్నాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనం రావణ ప్రోక్త న్యాస పక్రియలోనిది. దీనినే శివ పంచానన స్తోత్రం అనీ అంటారు. మార్చి 4, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మహాదేవుని శ్లోకార్థ తాత్పర్యం.
తత్పురుషణ ముఖ ధ్యానమ్
సంపర్తాగ్ని తటిప్రదీప్త కనక ప్రస్పర్థితేజోమయం
గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన ప్రోద్భాసితామ్రాధరం
అర్థేందుద్యుతిలోలపింగలజటా భార ప్రబద్ధోరగం
వందే సిద్ధ సురాసురేంద్రనమితం పూర్వం ముఖం శూలిన:
ప్రళయ కాలమందలి అగ్ని తేజముతోనూ, మెరుపుల తేజముతోనూ, బాగా కరిగిన బంగారు కాంతిలోనూ పోటీపడే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిళితం కావడంతో పాటు భయంకరమైన అగ్ని వలే ప్రకాశిస్తూ ఎర్రని పెదవి కలది, చంద్రఖండ కాంతితో చకచకా మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలది, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడే, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమునకు నమస్కరించుచున్నాను (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతించారు).
అఘోర ముఖ ధ్యానమ్
కాలాభభ్రమరాంజనద్యుతినిభం వ్యావృత్తపింగేక్షణం
కర్ణోద్భాసిత భోగిమస్తకమణి ప్రోద్భిన్న దంష్ట్రాంకురం
సర్పప్రోత కపాలశుక్తి శకల వ్యాకీర్ణ సంచారగం
వందే దక్షిణమీశ్వరస్య కుటి భ్రూభంగ రౌద్రం ముఖం
నల్లని మేఘాలు, తుమ్మెదల కాటుక- వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించేది, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగళి వర్ణపు కన్నులు కలది, చెవుల యందు మిక్కిలి ప్రకాశించే సర్ప శిరోత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలది, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలముతోనూ, ఎగుడుదిగుడు అగుచున్న నడకను పొందినదీ, వంకరలుగా ఉన్న కనుబొమ్మల ముడులతో భయంకరముగా ఉన్న ఈశ్వరుని దక్షిణ ముఖమునకు నమస్కరించుచున్నాను (తమో గుణ ప్రధాన లయకర్త తత్త్వము ఇక్కడ స్తుతించారు).
సద్యోజాత ముఖ ధ్యానం
ప్రాలేయాచల చంద్రకుంద ధవళం గోక్షీరఫేన ప్రభం
భస్మాభ్యక్తమనంగదేహ దహన జ్వాలావళీలోచనం
బ్రహ్మేంద్రాది మరుద్గుణై స్తుతి పరై రభ్యర్చితం యోగిభి
వందేహం సకలం కళంకరహితం స్థాణోర్ముఖం పశ్చిమం
హిమవత్పర్వతం, చంద్రుడు, మొల్లపూవు.. వీటి వలే తెల్లనిది, ఆవు పాల మీద నురుగు వలే తెల్లని కాంతి కలది, విభూతి పూయబడినదీ, మన్మథుని శరీరాన్ని దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలది, స్తోత్రం చేయుచున్న బ్రహ్మేన్ద్రాది దేవ సమూహాల చేత, యోగుల చేత శ్రద్ధతో అర్చింపబడుతున్నదీ, నిర్మలమైన నిండు వదనముతో కనబడుచున్నదీ అయిన శివుని పశ్చిమ ముఖమును నమస్కరించుచున్నాను (సత్వ గుణ ప్రధాన రక్షణకర్త తత్త్వమును ఈ శ్లోకంలో స్తుతించారు).
వామదేవ ముఖ ధ్యానమ్
గౌరం కుంకుమ పంకిలం సుతిలకం వ్యాపాండు గండ స్థలం
భ్రూ విక్షేప కటాక్ష వీక్షణలసత్ సంసక్త కర్ణోత్పలం
స్నిగ్ధం బింబ ఫలాధర ప్రహసితం నీలాల కాలం కృతం
వందే పూర్ణ శశాంకమండల నిభం వక్త్రం హరస్యోత్తరం
గౌర (ఎరుపుతో కలిసిన తెలుపు) వర్ణం కలదీ, కుంకుమపూవు పూతతో దిద్దినదీ, అందమైన తిలకం కలదీ, విశేషంగా తెల్లదనం గల చెక్కిళ్లు కలదీ, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించడంతో పాటు చెవికి అలంకారంగా ఉన్న తెల్ల కలువపూవు కలది, నున్నని దొండపండును పోలు ఎర్రని కింద పెదవిపై స్పష్టమైన నవ్వు కలది, నల్లని మున్గుతులచే అలంకరించిన, నిండు చంద్రుని మండలాన్ని పోలుతూ ప్రకాశించేదీ అయిన శివుని ఉత్తరాముఖమును స్తుతిస్తున్నాను (గుణత్రయ మిశ్రమమైన ఈశ్వర తత్వం ఇక్కడ వర్ణించారు).
ఈశాన ముఖ ధ్యానమ్
వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం శట్త్రింశతత్వాత్మకం
తస్మాదుత్తర తత్త్వమక్షరమతి ధ్యేయం సదా యోగిభి
వందే తామస వర్ణితం త్రినయనం సూక్ష్మాతి సూక్ష్మాత్పరం
శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖవ్యాపి తేజోమయం
వ్యక్తం, అవ్యక్తం అనే రెండు లక్షణాల కంటే ఇతరమైన లక్షణం కలది, 36 తత్వాల రూపాన పరిణమించునది, సకల తత్వాల కంటే ఉన్నతమైనది అయిన అనుత్తరము అనే అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడు యోగులతో ధ్యానించ•డేది, తమో గుణ రహితమై మూడు కన్నులు కలది, సూక్ష్మాతిసూక్ష్మమైన దాని కంటే గొప్పది, ఆకాశామంతా వ్యాపించు తేజమే తన రూపముగా కలది అయిన ఈశ్వరుని ముఖమునకు నమస్కరిస్తున్నాను.
Review శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాల.