రామకృష్ణ పరమహంస తన జీవితంలో ఎక్కువ కాలం తీవ్రమైన భక్తుడిగానే జీవించారు. ఆయన కాళిమాత భక్తుడు. ఆయనకు కాళి ఒక దేవత కాదు. సజీవ సత్యం. ఆమె ఆయన ముందు నాట్యమాడేది. ఆయన చేతులతోనే భోజనం ఆరగించేది. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేది. తరువాత ఆయనను పరమానంద అనుభూతిలో వదిలేసేది. మరి, ఇటువంటి పరమ భక్తాగ్రేసరుడైన రామకృష్ణులు తరువాత కాలంలో పరమ యోగిగా ఎలా మారారు? ఇది ఆసక్తికరం. ఫాల్గుణ శుద్ధ విదియ, మార్చి 8, శుక్రవారం (తిథి ప్రకారం మార్చి 10, ఆదివారం) ఆయన జనన తిథి సందర్భంగా ప్రత్యేక కథనం..
రామకృష్ణుల గురించి పైన చెప్పుకున్నదంతా నిజంగానే జరిగేది. అందులో ఊహాతీతమైనది ఒక్క ముక్క కూడా లేదు. ఆయన నిజంగానే కాళికామాతకు అన్నం తినిపించే వాడు. రామ కృషుల చైతన్యం ఎంత స్పష్టమైనదంటే.. ఆయన ఏ రూపం కోరుకుంటే ఆ రూపం ఆయనకు నిజంగా కనిపించేది. ఒక మనిషి ఉండగలిగిన అత్యంత అందమైన స్థితి అది. రామకృష్ణుల యొక్క శరీరం, మనసు మరియు భావోద్వేగాలు పరమానందంతో తడిసిపోతున్నా, ఆయన అస్థిత్వం మాత్రం ఈ పరమానందాన్ని దాటి అవతలికి వెళ్లాలని కోరుకునేది. ఈ పరమానందం కూడా ఒక బంధనమే అని ఎక్కడో ఒక ఎరుక ఉండేది. కానీ, ఆ బంధనాన్ని ఆయన అంత సులువుగా తెంచుకోగలిగిన స్థితిలో ఉండే వారు కాదు.
ఒకరోజు రామకృష్ణులు హుగ్లీ నదీ తీరాన కూర్చుని ఉండగా, తోతాపూరి అనే ఒక గొప్ప యోగి ఆ మార్గంలో వెళ్తున్నారు. ఇలాంటి యోగులు చాలా అరుదు. రామకృష్ణులు ఒక తీవ్రమైన మనిషిగా, జ్ఞానోదయం పొందే అర్హత కలవాడిగా ఆయన గమనించాడు. సమస్య ఏమిటంటే రామకృష్ణులు భక్తిలో చిక్కుకు పోయారు.
చాలా రకాలుగా తోతాపూరి ఉపదేశం చేయబోయారు. కానీ, రామకృష్ణుడు ఆసక్తి చూపలేదు. అదే సమయంలో ఆయన తోతాపూరి సమక్షంలో కూర్చోడానికి ఆసక్తి కనబరిచే వాడు. ఎందుకంటే తోతాపూరి ఉనికి అటువంటిది.
తోతాపూరి ఒకసారి- ‘నువ్వు ఇంకా భక్తికే ఎందుకు అతుక్కుపోయావు? నీకు అంతిమ మెట్టుకు చేరుకునే శక్తి ఉంది’ అని నచ్చచెప్ప బోయారు.
కానీ, రామకృష్ణులు మాత్రం ‘నాకు కాళి కావాలి. అంతే!’ అన్నారు.
రామకృష్ణులు తల్లిని అడిగే పిల్లవాడి వంటి వారు. అటువంటి స్థితిలో ఉన్న వారికి తర్క పరంగా నచ్చచెప్పలేము. అది పూర్తిగా ఒక భిన్నమైన స్థితి. రామకృష్ణుల భక్తీ, ఆసక్తీ కాళీనే. ఆయనలో కాళీతత్వం అధికమైనపుడు ఆయన పరమానందంతో నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఉండేవారు. తోతాపూరి చెప్పే జ్ఞానో దయం లాంటి వాటి గురించి ఆయనకు అసలు ఆసక్తి ఉండేది కాదు.
రామకృష్ణులు ఇలాగే వ్యర్థంగా గడిపేస్తు న్నారని తోతాపూరి గమనించారు. అప్పుడు ‘ఇది చాలా సులభమైనది. ఇప్పుడు నువ్వు నీ భావోద్వేగాలను ప్రబలపరుస్తున్నావు. నీ శరీరాన్ని ప్రబల పరుస్తున్నావు. నీలోని రసాయన వ్యవస్థను ప్రబల పరుస్తున్నావు. కానీ నీలోని ఎరుకను ప్రబల పరచడం లేదు. నీ దగ్గర కావాల్సినంత శక్తి ఉంది. కేవలం నువ్వు నీ ఎరుకను ప్రబలం చేయాలి. అంతే!’ అని మరోసారి నచ్చచెప్ప బోయారు.
రామకృష్ణుడు అంగీకరించారు.
‘సరే. నేను నా ఎరుకను సాధికారపరచి కూర్చుంటాను’ అని అన్నారు.
కానీ, ఆయనకు కాళి రూపం స్ఫురిస్తే మళ్లీ తనని తాను ఆపుకోలేని పరమానంద ప్రేమ స్థితిలోకి జారిపోయే వారు. ఎన్నిసార్లు కూర్చున్నా సరే.. ఒక్కసారి కాళి దృశ్యం కనిపించగానే మనసు ఎటో ఎగిరిపోయేది.
తోలాపూరి- ‘మరోసారి కాళి కనిపిస్తే ఒక ఖడ్గంతో ఆమెను ముక్కలు చేయి’ అన్నారు.
అప్పుడు రామకృష్ణులు- ‘ఖడ్గం ఎక్కడి నుంచి తీసుకురావాలి?’ అని ప్రశ్నించారు.
అందుకు తోతాపూరి- ‘ఎక్కడి నుంచైతే నువ్వు కాళిని తెచ్చుకుంటున్నావో అక్కడి నుంచే. నీకు కాళినే సృష్టించే శక్తి ఉన్నప్పుడు ఒక ఖడ్గాన్ని ఎందుకు సృష్టించలేవు? నువ్వు సృష్టించగలవు. నువ్వు ఒక దేవతను సృష్టించగలిగినపుడు ఆమెను కోయడానికి ఖడ్గాన్ని ఎందుకు సృష్టించలేనని అనుకుంటున్నావు? సిద్ధంగా ఉండు’ అన్నారు.
రామకృష్ణుడు కూర్చున్నారు. ఏ క్షణంలో అయితే కాళి కనిపించిందో ఆ క్షణంలో మళ్లీ పరమానందంలో మునిగిపోయి ఆ ఖడ్గాన్ని, ఎరుకను అంతా మరిచిపోయారు.
ఇప్పుడు తోతాపూరి ఒక గాజుముక్కను తీసుకుని, ఇలా అన్నాడు-
‘ఈసారి నాతో కూర్చో. కాళి వచ్చిన క్షణమే ఈ గాజుముక్కతో నువ్వు ఎక్కడైతే చిక్కుకున్నావో అక్కడ కోసేస్తాను. ఎప్పుడైతే నేను ఆ చోటుని కోస్తానో, నువ్వొక ఖడ్గాన్ని సృష్టించి కాళిని ముక్కలు చెయ్యి’ అన్నారు.
మళ్లీ రామకృష్ణులు కూర్చున్నారు. ఎప్పుడు ఆ పరమానందపు అంచుకు చేరుకున్నారో, ఎప్పుడు కాళి కనిపించిందో, తోతాపూరి ఆ గాజుతో రామకృష్ణుని నుదుట బాగా లోతుగా గాటు పెట్టారు.
ఆ క్షణం రామకృష్ణులు ఖడ్గాన్ని సృష్టించి, కాళిని నరికేశారు. తద్వారా తల్లి నుంచి, ఆ పరమానందం నుంచి విముక్తుడు అయ్యారు. ఆ సమయంలోనే ఆయన నిజంగా ‘పరమ హంస’ అయ్యారు. పూర్తి జ్ఞానోదయం పొందారు. అప్పటి వరకూ ఆయన ఒక ప్రేమి కుడు. ఒక భక్తుడు. ఆయనే సృష్టించుకున్న మాతృదేవత యొక్క పుత్రుడు.
రామకృష్ణుల
ముఖ్య ప్రవచనాలు
జ్ఞానం ఐకమత్యానికి, అజ్ఞానం కలహానికి దారి తీస్తాయి.
మానవుడు ఆలోచనతోనే మనిషిగా మారతాడు.
భగవంతుడిని దర్శించడం అందరికీ సాధ్యమే. గృహస్థులు ఈ ప్రపంచాన్ని వదిలి వేయనక్కరలేదు. వారు శ్రద్ధగా ప్రార్థించాలి. శాశ్వతమైన వస్తువులకు క్షణికమైన
వస్తువులకు తేడా గమనించే వివేకం కావాలి. బంధాలను తగ్గించుకోవాలి.
దేవుడు శ్రద్ధగా చేసే ప్రార్థనలను వింటాడు. భగవంతుని గురించి తీవ్ర వ్యాకులత ఆధ్యాత్మిక జీవితానికి రహస్యము.
కామం, అసూయ దేవుని దర్శనానికి రెండు ముఖ్య శత్రువులు.
రామకృష్ణుల జననం.. విశేషాలు
రామకృష్ణ పరమహంస ఫిబ్రవరి 18, 1836న పశ్చిమబెంగాల్ రాష్ట్రం హుగ్లీ జిల్లా కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. క్షుదీరామ్, చంద్రమణి దేవి తల్లిదండ్రులు. పేద బ్రాహ్మణులు. రామకృష్ణుని చిన్ననాటి పేరు గాదధరుడు. మంచి అందగాడు. బాల్యంలోనే లలితకళలు, చిత్రలేఖనంలో ప్రవేశం ఉండేది.
అయితే, చదువు మీద కానీ, డబ్బు సంపాదన మీద కానీ ఆసక్తి చూపేవారు కాదు. ప్రకృతిని ప్రేమిస్తూ, ఊరి బయట పండ్ల తోటలలో స్నేహితులతో కలిసి సమయం గడిపేవారు. దీంతో చదువు అబ్బలేదు. ఆ ఊరి మీదుగా ఎందరో సాధువులు వెళ్తుండే వారు. వారి బోధనలను ఆసక్తిగా, శ్రద్ధగా వినేవారు.
అలా తోతాపూరి అనే యోగితో కలిగిన పరిచయమే రామకృష్ణుడిని పరమహంసను చేసింది. భారతీయ సంప్రదాయంలో గొప్ప ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్ట మొదటిసారిగా ప్రపంచానికి చాటింది ఈయనే.
19వ శతాబ్దపు బెంగాల్ సాంస్క•తిక పునరుజ్జీవనంలో రామకృష్ణుల ప్రభావం చాలా ఉంది. ఈయనకు గల అనేకానేక శిష్య ప్రముఖుల్లో స్వామీ వివేకానంద ఒకరు. రామకృష్ణుల సమకాలికులలో కేశవచంద్రసేన్, పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ముఖ్యులు. 1886, ఆగస్టు 16న రామకృష్ణులు మహా సమాధి పొందారు.
Review భక్తిని తెంచి.. ముక్తిని పొంది.