యోగవిద్యను అవతార పురుషుడైన శ్రీమన్నారాయణుడు పారంపర్యంగా వివస్వంతుడికి, విశ్వదీప్తుడైన ఆ వివస్వంతుడు (సూర్యుడు) మను ప్రజాపతికి, ఆ మహర్షి ఇక్ష్వాకు మహారాజుకు బోధించారు. అలా బ్రహ్మర్షి నుండి రాజర్షి వరకు యోగవిద్య పరంపరగా లభించింది. ఈ విషయాన్ని మహావిష్ణువే కృష్ణావతారంలో అర్జునుడికి కురుక్షేత్రం వద్ద వెల్లడించాడంటోంది గీతామాత. పరమాత్మ/ పరబ్రహ్మ అలా అవతారాలు ధరించడానికి కారణం ఏమిటన్నదే అనేకమంది జిజ్ఞాసువుల హృదయాల్లో ఉదయించే ప్రశ్న
కృష్ణపరమాత్మ బోధను మననం చేసు కోవడం ఒక్కటే దీనికి సమాధానం. ‘సంభవామి యుగే యుగే’ అని భగవాన్ ఉవాచ. ఆ పని చేయడానికి ఆయనే దిగిరావాల్సిన అవసరం ఏముంది? ఆయన ప్రతినిధులుగా ఎందరో మహర్షులు, మహానుభావులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, అర విందులు అలాంటివారి ద్వారా పనిని ఆయన చక్కబెట్టి ఉండవచ్చు. కానీ మానవుడిలో దాగి ఉన్న దైవత్వాన్ని, మేలుకొలిపేందుకు ఆ మాధవుడు తప్పక రావాల్సిందే. పరమాత్మ జీవాత్మగా అవతరించడమనేది జీవుణ్ని ఉద్ధ రించడానికే! ఇదీ అసలు అవతార రహస్యం.
మానవుడిలో మాధవుడు ఉన్నాడన్న నోటి మాట ఒక్కటే చాలదు. రుజువు చేసేందుకు ఆ దైవం నామ రూప గుణాలతో దిగిరాక తప్పడం లేదు. అందుకే మానవ రూపం ధరించి రాముడయ్యాడు. లీలామానుష రూపధారుడైన కృష్ణుడు అర్జునుడి సారథిగా మారి, ఇహ పరాల నడుమ ఒక వారధి నిర్మించాడు. ఇటు మాన వుడు, అటు దివ్య మానవుడు… ఎవరు మెరుగైన వారో తెలుసు కోవడానికి కావాల్సిన జ్ఞాన వైరాగ్య, వివేకాలను మనిషికి దైవమే ప్రసాదించాడు.
మనిషి చేసే ప్రతి పనీ మాధవుడి లీలా విలాసమే! ఆ పని ద్వారా చివరికి అతడు తాను వచ్చిన పనేమిటో గుర్తు చేసుకోగలుగుతాడు. మనిషిగా అతడు చేపట్టిన ప్రతి పనీ అనుకున్న సత్ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అలా అని, అది దై••వత్వంలోని లోపం కాదు మానవుడు ప్రకృతి మాయ వల్ల, మాధవుడు యోగ మాయ వల్ల రూపం ధరించినా అదంతా నిశితంగా అన్వే షించి, చివరికి ఆత్మసంయోగం చెందడానికే! జ్ఞానం మనిషికి ఒక దీపంలా ఉపయోగపడు తుంది. అంతర్గతంగా ఉండే దైవత్వం ఒక కొడిగట్టిన దీపంలా నిరుపయోగం కాకూడదు. జ్ఞాన దీపం వెలిగించడానికి, ఆ పరమ గురువే అవతారమూర్తిగా దిగి రాక తప్పదు.
‘జీవభూతాలన్నీ నా అంశలే’ అని కృష్ణుడు సృష్టీకరించాడు. ప్రకృతి రూపంలో కొంత, వ్యక్తి స్వరూపంలో మరికొంత ఆనందానుభూతి పొందడం పరమాత్మకు ఇష్టమైనవి. కృష్ణ కిశోరుడు బృందావనంలో గోపికల రూపంలో ఉన్న తన భక్తులకు ఆ ఆత్మానంద రసాన్ని ధారాళంగా పంచిపెట్టాడు. మాయా ప్రకృతి సైతం అంతే ఆసక్తితో ఆ పరమాత్మ పైన తానూ ఒక చెరగని ముద్ర వేసింది. సృష్టి, స్థితి, లయలకు అస్తిత్వం, గుర్తింపు అవసరమవు తాయి. మనిషి ఒక మహర్షిగా, ఒక మహా మనీషిగా పరిణతి చెందాలంటే క్రమ పరి ణామమే శరణ్యం. అంచెలంచెలుగా అందుకో దగ్గదే మోక్షం!
శ్రీకృష్ణ పరమాత్మ అవతారమూర్తి. అవతారం అనేది దివ్య మానవ స్వరూపాల మేలు కలయిక. సందేశాత్మకమైన పరమాత్మ రూపవిలాసం అది. వజ్రాన్ని వజ్రంతోనే ఛేదించాలి. పరమాత్మను ఆత్మతోనే దర్శించాలి. ఆదిదేవుడి సంకల్పం వల్లనే అన్ని రూపాలూ ఉత్పన్నమవుతున్నాయి. ప్రకృతిలోని కొండ, కోనలు, పశు పక్ష్యాదులు అన్నీ పరమ పురుష రూపాలే! ఈ సత్యం తెలిసే దాకా ముందుకు సాగడమే మానవుడి విధి. పొట్టుపోగా ధాన్యాన్ని తూర్పారపడితే పొల్లుపోగా, దక్కేది గుప్పెడు గింజలే. బీజ స్వరూపుడైన ఆ పరమాత్మను దర్శించగల మనోనేత్ర వికాసం జరిగినప్పుడే, మనిషి తన గమ్యానికి చేరువ కాగలడు. అప్పుడు అతడి జీవనమే ఒక యోగం కాగలదు!
Review అంతర్యామి.