ఐదు లక్షణాల మూర్ఖులు

తిలక ధారణ అనే ఆచారం ఎలా ఏర్పడింది? బొట్టు పెట్టుకోవడం శుభానికి సంకేతంగా ఎందుకు భావిస్తారు?

మన హిందూ మతంలో మాత్రమే బొట్టు పెట్టుకునే ఆచారం ఉంది. ప్రపంచంలోని ఏ ఇతర మతాలలోనూ ఈ ఆచారం లేదు.

‘లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే’.

అంటే- బ్రహ్మదేవుడు నుదుట రాసిన గీత తప్పింప ఎవరికీ శక్యం కాదు అని అర్థం. కాని ఎవరు ముఖాన బొట్టు పెట్టుకుంటారో వారు బ్రహ్మదేవుడు రాసిన రాతను చెరిపి మంచి రాతను రాసుకుంటున్నారన్న మాట. ఒక టేపు రికార్డరు మీద ఏదైనా ఉప న్యాసం రికార్డు చేస్తే దానిని చెరిపి మరొకటి రికార్డు చేసినట్టే ఇది కూడా.
ఇక, బ్రహ్మదేవుడి రాతను బొట్టు పెట్టుకోవడం అనే ఆచారం చెరిపి వేస్తుందా అనే సందేహం రావచ్చు. కచ్చితంగా నుదుటి రాతను బొట్టు మారుస్తుంది.
పార్వతీ పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు. పరమేశ్వరుని గుర్తుగా విభూతి, పార్వతీదేవి గుర్తుగా కుంకుమ మనం ధరిస్తాం. ముఖం చూడగానే విభూతి, కుంకుమలు చూస్తే పార్వతీ పరమేశ్వరులు జ్ఞాపకం వస్తారు. అలాగే, ఇతర విధాలైన తిలక ధారణలు కూడా భగవంతుని స్మరింప చేస్తాయి. కాబట్టి హిందువులందరూ ముఖాన బొట్టు పెట్టుకోవడం తప్పనిసరిగా చేయాలి. పిల్లల చేత కూడా పెద్దవారంతా ఈ అలవాటును విధిగా చేయించాలి.
(కంచి పరమాచార్య వారి ‘ప్రబోధ సుధాకరం’ నుంచి సేకరణ)

వయసు పెరిగే కొద్దీ భావజాలం, ఆలోచన విధానం మారతాయా?

అవును. మనిషి పెరిగి పెద్దయ్యే కొద్దీ అతని ఆలోచన విధానం, పరిధి పెరిగి పెద్దవవుతాయి. కాలానుగుణంగా మారతాయి. అర్థం చేసుకుని ఆలోచించే గుణం అలవడుతుంది.
ఉదాహరణకు మీరు సబ్బుతో ముఖం కడుక్కుంటున్నారని అనుకుందాం. పక్కనే ఉన్న మీ అమ్మాయో అబ్బాయో నీళ్ల చెంబు మీకు అందకుండా సరదాకి దాచేశారనుకుందాం. మీరు సబ్బు రుద్దుకున్న ముఖంతో.. కళ్లతో చూడలేక నీళ్ల కోసం వెతుకుతారు. మీ వెతుకులాట చూసి మీ పిల్లలు కిలకిలా నవ్వుతారు. అప్పుడు మీకు అర్థమవుతుంది వారు చెంబు తీసి వారు దాచేశారని. కానీ, మీకు కళ్లు మండిపోతుంటాయి. ఆ విషయం పిల్లలకు తెలియదు. మీరు చెంబు కోసం వెతుకుతుంటే పిల్లలకు అది ఆనందం కలిగిస్తుంది. కొంత కాలానికి మీ పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. మీ కంట్లో నలుసు పడినా వారు చూసి తట్టుకోలేక విలవిల్లాడిపోతారు. ఈ రెండు ఉదంతాల్లోని వ్యత్సాసమల్లా వయసు మాత్రమే. వయసు రీత్యా పరిణితి అలవడటానికి ముందు వెనుక రెండు సందర్భాల్లో ఇద్దరు చెరో విధంగా స్పందించారు.
మరో ఉదాహరణ. శ్రీకృష్ణుడు చిన్నపిల్లాడిలా ఉన్నప్పుడు గోపికల చీరలు దాచిపెట్టి, వారు వాటి కోసం వెతుకుతుంటే, అది చూసి వినోదించే వాడు. అదే కన్నయ్య పెరిగి పెద్దవాడయ్యాక ద్రౌపదికి చీరలు ఇచ్చి కాపాడాడు. ఈ రెండు అంశాల్లోనూ వ్యత్సాసం వయసు మాత్రమే.
అలాగే, కృష్ణుడు బాల్యంలో పక్క ఇళ్లలోకి చేరి దొంగ తనంగా వెన్న తినేవాడు. అమ్మ అడిగినపుడు తాను దొంగతనం చేయలేదని చెప్పే వాడు. అదే చిన్ని కృష్ణుడు పెరిగి పెద్దయ్యాక దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు అని గీతోపదేశం చేశాడు. ఇక్కడ కూడా రెండింటి మధ్య వ్యత్సాసం వయసు మాత్రమే.
వయసుకు తగినట్టు మనల్ని మనం మార్చుకుని మంచి దారిలో వెళ్లాలి.

ఎటువంటి లక్షణాలున్న వారిని మూర్ఖులని అంటారు?

ఎటువంటి లక్షణాలున్న వారిని మూర్ఖులని మనం నిర్ధారించుకోవాలో మన పూర్వీకులు కొంత నిర్దేశం చేశారు. దాని ప్రకారం..
మూర్ఖస్య పంచచిహ్నాని గర్వీ దుర్వచనీ తథా
హఠీ చాప్రియవాదీ చ పరోక్తం నైవ మన్యతే
గర్వం ఎక్కువగా ఉండటం, చెడు మాటలు మాట్లాడటం, మొండి పట్టుదల, అప్రియంగా మాట్లాడటం, ఎదుటి వారు చెప్పిన దానిని కాదనడం.. ఈ ఐదూ మూర్ఖుల లక్షణాలు. ఇటువంటి వారికి దూరంగా ఉండాలి.

Review ఐదు లక్షణాల మూర్ఖులు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top